Saturday, December 27, 2014

తత్తులకు పరత్తులు మెలికతో పరంబైనప్పుడు తత్పరాత్పర సంధియగునని.....

తత్పరత.
అదొక జాడ్యం.
అదొక రోగం.
మంచి రోగం.
అంటుకున్న మనిషికి మంచి చేసే రోగం.

అసలు ఈ తత్పరత అంటే ఏవిటి ?
దాని పుట్టుపూర్వోత్తరాలేవిటి ?

తత్ (తత్వం, సారం, మూలం, బ్రహ్మం...బ్లా..బ్లా..) + పరత్ (వరద, ఆసక్తి ...బ్లా...బ్లా...) కలిసి తత్పరత అయ్యిందని చిన్నపిల్లవాడు కానివాడిక్కూడా తెలుసు. మహావ్యాకరణవేత్త, మహారాజశ్రీ తత్త మహాముని రాసిన వ్యాకరణ సూత్రాలు ఔపోశన పట్టిన వారికి ఈ లోకంలోని భాషల్లోని సంగతులు అన్నీ కర, తల, అమలకమే.

పోతే, తత్తులకు పరత్తులు మెలికతో పరంబైనప్పుడు తత్పరాత్పర సంధియగునని జిత్తులమారి వ్యాకరణంలో ఉన్నది.

ఈ తత్తులలో పరత్తులు రకరకాలు.
అందులో ముఖ్యమైనవి మూడు.

భక్తి, సేవ, జలుబు.

భక్తి తత్పరత ఉత్తమం.
సేవా తత్పరత మధ్యమం.
జలుబు తత్పరత అధమం.

ఒకటో పరత్తు రెండో పరత్తుతో కలిసినప్పుడు గొడవ లేదు.
మూడో పరత్తు పై రెండిట్లో దేనితో కలిసినా ప్రమాదమే.

అందునా రెండో పరత్తుతో కలిసినప్పుడు ప్రకాశం బారేజి మీద 900 నంబరు ప్రమాద హెచ్చరిక ఎగరవేసినంత పని.
భక్తితో కలిసినప్పుడు వాడింటో ఉన్నాడనుకోండి. ఫరవాలా. గుళ్ళో ఉన్నాడనుకోండి. ఫరవాలా కాస్తా ప్రమాదం కింద మారుతుంది.

సేవతో కలిసినప్పుడు మాత్రం అంతా ప్రమాదమే. ఎల్లవేళలా ప్రమాదమే. తుమ్ముల తత్తులోని క్రిముల పరత్తులు ఏ పదార్థమ్మీదకు ఎక్కించాడో తెలవదు. అవి ఎంత బీభత్సానికి కారణమవుతాయో వాడికి తెలవదు. కొన్ని పదుల కుటుంబాల ఆరోగ్యం నాశనమైపోతుంది. అయినా ఆ సేవా భ్రాంతి వాడిని కూర్చోనివ్వదు. అదే మాయ. జగన్మాయ.
ఆ సేవ పరత్తును గుళ్ళోకి భక్తెక్కువై పాకించాడనుకోండి, తుకారాం మట్టిసుద్దలు తొక్కే సీను గ్యాపకం ఉన్నదా? అంత ప్రమాదకరం.

అలాటి సేవాతత్పరుడు, భక్తితత్పరుడు ఒహాయన జలుబు తత్పరతతో ఈవేళ గుళ్ళోకొచ్చి ప్రమాద ఘంటికలు మోగించడంతో, వారినీ, వారి కళ్ళెను కళ్ళెము పట్టుకొని తరిమి వేయవలసివచ్చినందుకు చింతిన్స్తూ....

ఈ తత్పరత గురించి ఒక దీర్ఘ వ్యాసం రాయలని ఉన్నది...తీరిగ్గా కొద్దిరోజుల్లో...అప్పటిదాకా...

ఓం తత్ సత్!

Friday, December 19, 2014

చచ్చు పుచ్చు పీఠికలు, కొండముచ్చు ముందుమాటలు!

అన్నెం పున్నెం ఎరుగని ఒక రచయిత వద్దకు చప్పట్ల, పొగడ్తల, వెన్ను చరుపుల, భుజం తట్టుల యాచన నిమిత్తము ఒక స్వీయ బిరుదాంకిత గొప్ప పీఠికాసురుడు, ఆయనకు తోడుగా ఒక ముందుమాటాసురుడు వచ్చెను. ఆ శబ్దములు వారికివారు పెట్టుకొన్నవే కాని ముందుమాటలు, పీఠికలు వచ్చిగాదు.

ఆ రచయిత వద్దకు అంతకుముందే ఒక పాఠకసార్వభౌముడు వచ్చి యున్నాడని తెలియని ఆ ఇద్దరూ "ఒరే రచయితా మేము వమనపీఠికాశాస్త్రములో పండితులము. ముందుమాటలో హాలాహల చక్రవర్తులము. మేము రాసినది నీ పుస్తకములో వేసుకొనితివంటే, నీకు, నీ పుస్తకము చదివినవారికి ఈ ప్రపంచంలో దిక్కులు తెలీకుండా పోతాయన్న సంగతి కూడా తెలియకుండా చేసెదము. ఆలోచించే అవసరం తగ్గిపోవును, ఆ తర్వాత నిన్ను, ఆ చదివినవాడిని బాగుచేసేందుకు ఆ బ్రహ్మ తరం కూడా కాదు" అని డోక్గ్రల్భాలు పలికినారు.

ఆ అమాయక రచయిత, అయ్యా నాకంత శక్తి లేదు. మీరు ఏదన్నా మాటలాడాలనుకుంటే ఈ పాఠకాగ్రేసరునితో మాట్లాడుడి, వీరు అన్నిమాటలు చదువుటలో తలపండినవారేనని అందరూ చెప్పుచుంటిరి అని ఒకరినొకరికి పరిచయము చేసినాడు.

ఇది యేమొ వింతగా ఉన్నదనుకొని సకల పాఠక ప్రపంచము, రచయితలు , దేవ దేవతలు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వచ్చి చుట్టూ మూగినారు.

అంత పాఠకులవారు వీరిద్దరూ నిజముగా పండితులనుకొని, అయ్యా మీరు పీఠికలు, ముందుమాటలు రాస్తారని తెలిసినది. ఇప్పుడు వాని గురించి వాదింతము. మీరు పీఠికపూర్వపక్షము చేయుదురా? ముందుమాటసిద్ధాంతము చేయుదురా? అని అడిగెను.

ముందుమాటాసురునికి వాదము అనిన మాట వినపడినంతనే మూర్ఛ వచ్చెను. నేలకు గోడమీద బల్లివలె కరుచుకొనిపోయినాడు. పీఠికాసురుడు బీరముగా వాని జన్మలో ఈ పూర్వపక్షము, సిద్ధాంతము వంటి మాటలెన్నడు విని ఉండకపోవుట చేతను, ఈ మాటలు నోరుతిరగకపోవుట చేతనూ - మీరు అది ెయ్యండి, నేను ఇది చేస్తానూ అనినాడు. అది విని చకితుడైన పాఠకులవారు వాదము ఆరంభింపదలచి - 'అథాతో పీఠికాజిజ్ఞాసా' అని పఠనసూత్రములోని మొదటి సూత్రము చదివి దానిని పూర్వపక్షము చేసి - "ముందుమాట సిద్ధాంతము చేయుమ" ని వీడిని అడిగెను.

పీఠికాసురునకు కళ్ళు ఒకసారి తిరిగినను సంభాళించుకొని, గొంతెత్తి "అథాతో వాంతి జిజ్ఞాసా, మాట జిజ్ఞాసా, రాత జిజ్ఞాసా, మామాట జిజ్ఞాసా, సమాధి జిజ్ఞాసా, శవం జిజ్ఞాసా, ఏరు జిజ్ఞాసా, పారు జిజ్ఞాసా, చిందు జిజ్ఞాసా, పంచె జిజ్ఞాసా, గోడమీద బల్లి జిజ్ఞాసా, బుర్రబద్దలు జిజ్ఞాసా, ఊళ్ళో చెరువు జిజ్ఞాసా, చేతిలో చెంబు జిజ్ఞాసా" అని గుక్క తిరగకుండా వాడు సూత్రములు అనుకొన్న రెండు వందల యాభై ఆరు సూత్రములు అరుపులు, గావుకేకలు వేస్తూ చదివినాడు.

వాడి మాటలకు పాఠకుడు, చెట్టు, చేమ, గడ్డి, గాదం, ఆవు, దూడ, పిల్లి, కుక్క రోదనానందభరితులై రిచ్చపడితిరి. ఆ పిదప అతడు అట్లనుటకు, అరుచుటకు కారణము ఎరుగ కోరి, పాఠకుడు - "ఎందులకు అరుచుచున్నారు, మీరన్న దానికి అర్థమేమి" అని అడుగుటకు నిశ్చయించుకుని "ఎందులకు" అని అనెను.

ఆ మాట ఇంకా పూర్తి కాకమునుపే, సగములో పావు వినీ వినగానే వాడు తారాజువ్వవలె లేచి " ఎందులకు, ఎందులకు పందులకు, పందులకు సందులకు, సందులకు చిందులకు, చిందులకు ముందుమాటలకు, ముందుమాటలకు పీఠికలకు " అని ఏమేమో అనుచు మరింత బిగ్గరగా అరిచెను.

అంతే, దానితో అందరూ, దేవతలతో త్రిమూర్తులతో సహా ఒక్క పెట్టున మూర్ఛపోయితిరి.

కొసమెరుపు - ఆ అరుపులకు బడబాగ్ని జనించి దానితో ప్రపంచము, పాఠక ప్రపంచము, ఆ ప్రపంచమునకావల ఉన్న లోకములు అన్ని తగులపడిపోయినవి. పీఠికాసురుడు, ముందుమాటాసురుడు మటుకు మిగిలినారు బూడిద మీద పీఠికలు, ముందుమాటలు రాసుకుంటూ.

-- అయ్యా, ఈ మధ్య ప్రింటయిన కొన్ని పుస్తకములు చదివి, అందులోని చచ్చు పుచ్చు పీఠికలు, కొండముచ్చు ముందుమాటలు చదివి, ఒకానొకప్పుడు వచనకవాసురుల మీద రాసుకున్న దాన్ని కొద్దిగా మార్చి ఇక్కడ వేస్తిని.
-- ఏమా పుస్తకములు, ఏమా సంగతి అని అడగవద్దు.
-- మీరు అడగావద్దు, నేను చెప్పావద్దు.
-- జై ఏక్ నిరంజన్

Tuesday, December 2, 2014

సమాధానం తెలిశి చెప్పకపొయ్యారో!!

ప్రశ్న, ఛాలెంజి - మీకేనండి...
మిమ్మల్నే అడుగుతా!
చెప్పండి...
ఏం?

ఖాండవ దహనం ముందు అగ్ని వచ్చాడు .

ఎక్కడికి ? కృష్ణార్జునుల దగ్గరికి.

ఎందుకు ?

తిన్నదరక్క.

అదేవిటీ ?

దూర్వాసుడు ఋత్విజుడిగా సత్త్రయాగం చేసిన శ్వేతకి పోసిన నెయ్యి వల్ల అజీర్ణమెత్తిపొయ్యింది మన వాడికి.

దగ్గర్లో ఏవిటుందా అని వెతికాడు.

ఖాండవ వనమొక్కటే కనపడ్డది పచ్చగా నవనవలాడుతూ.

అజీర్ణం పోగొట్టే మూలికలు ఔషధాలూ ఉండటంతో ఇంకా ఎక్కువ్వయ్యింది మనవాడికి.

బాబూ, అయ్యా సాయం చెయ్యండి తిన్నదరగటానికి అన్నాడు.

అర్జును ఆ గోలకు తట్టుకోలేక, పోరా నాయనా పో! నేను ఈయనా చూసుకుంటాంలే అన్నాడు.

ఇంకేవుందీ? సంబరపడ్డాడు.

దోస్తు వరుణ్ ని పిలిచాడు.

అదేనండీ - వానలూ అవీ కురిపిస్తూ ఉంటాడే ఆ వరుణ్.

వరుణ్, నీ దగ్గర ఉన్నవి ఇచ్చెయ్ వీళ్ళకు అన్నాడు.

వరుణుడికి బోల్డు మొహమాటం.

ఇదెక్కడి గొడవ నా దగ్గరున్నవన్నీ ఇచ్చెయ్ అంటావ్ అని అందామనుకున్నాడు అగ్నితో.

ఇంతలో అగ్ని దొస్తు సెంటిమెంటు ఫిటింగు పెట్టాడు.

గొణిగాడు. నా దగ్గర బోల్డున్నాయిరా, ఏవిటివ్వాలి అందులో అని.

అప్పుడు అగ్ని - "ప్రతిపక్షసంక్షయకరంబు లయిన యక్షయబాణంబులు గల తూణీరంబులును వివిధాయుధభరితంబై సింహలాంగూలకపిధ్వజ విరాజమానంబై మహాంబుధరద్వానబంధురంబై మనోవాయువేగసితవాహవాహ్యమానంబై రణితరమణీయమణికింకిణీకలాపాలంకృతంబై సకలదిగ్విజయాధిష్ఠానంబై యొప్పుచున్న దివ్యరథంబు" అంటూ ఇంతబారున చదవటం మొదలుపెట్టాడు.

వరుణుడన్నాడు - కాస్త తెలుగులో చెప్పు నాయనా అని కన్నీరు మొదలెట్టగా - స్థూలంగా ఇదీనేనన్నదీ అని చెప్పాడు - "సోముడు నీకిచ్చిన గాండీవం, దానికి బ్రదర్ అయిన అక్ష్యతూణీరం, ఇవి కాక ఇంకా నీ దగ్గరున్న గాంధర్వ గుర్రాలమర్చిన రథం ఇవన్నీ ఆ అర్జునుడికిచ్చెయ్"

ఒరోరి అగ్ని, అవి సోముడు బోల్డు కష్టపడి బ్రహ్మ దగ్గరినుంచి ఎత్తుకొచ్చాడు వరం రూపంలో. అవి నేనెత్తుకొచ్చాను ఇంకో రూపంలో. అవి ఇవ్వమంటావేవిట్రానని.

అదంతే నువ్వివాల్సిందే, లేపోతే నా కడుపు బద్దలైపోతుంది. పగిలిపోయిన ఆ పొట్ట చూసి నువ్వేడుస్తావ్ అని సెంటిమెంటేసాడు వరుణుడి మీదకి.

సర్లే నాయనా, నీ కడుపు నా ఆయుధాలకొచ్చింది అని అవి రెండూ అర్జునుడికిచ్చేసాడు.

సరే నే పోతున్నా ఇంక అన్నాడు.

ఆగు, ఎక్కడికి పోతా. ఇక్కడా ఇంకో ఆయన ఉన్నాడు. ఆయనకి కూడా ఇవ్వొద్దూ ? అన్నడు అగ్ని

అనుకున్నా. ఇలా చేస్తావని అనుకున్నా. నా దగ్గరున్నవన్నీ ఊడ్చాలని ప్లానులో ఉన్నావని చిటికెనివేలి మబ్బులోంచి కన్నీళ్ళు కార్చాడు.

ఏడుపు తర్వాత కానీ, ఆ ముక్కు తుడుచుకొని నీ దగ్గరున్న చక్రం, గద ఇచ్చెయ్ ఆ పక్కనున్నాయనకు అన్నాడు.
ఇప్పుడు వేళ్ళల్లో ఉన్న అన్ని మబ్బులూ ధారగా కరుస్తూ సుదర్శనాన్ని, కౌమోదకిని కిష్టప్పకిచ్చేసి నా దగ్గరింకేవీ లేవంటూ బలుసాకును పెంచుకుంటా నీళ్ళతోనని పారిపోయాడాయన.

అవ్వన్నీ వచ్చాక ఇంకేవిటుందీ ?

అగ్ని ఖాండవాన్ని దహించెయ్యటం.

వీళ్ళిద్దరూ ఇంద్రుడితో పోట్టాట్టం....గట్రా గట్రా

ఇప్పుడు ప్రశ్నల్లోకి - సమాధానం తెలిశి చెప్పకపొయ్యారో, మీ పొట్టలో సత్రయాగం నెయ్యి నిండిపోనూ అని వరం ఒసంగబడుతుంది.

1) చక్రం వచ్చేసింది కాబట్టి, శంఖం రావాలి. అదెప్పుడు వచ్చింది కిష్టప్ప దగ్గరికి ? ఒకదాన్ని ముందు పంపించి రెండో దాన్ని ఎనకమాల ఎందుకు తెచ్చుకున్నాడాయన?
2) బ్రహ్మ గాండీవాన్ని నిర్మించి మొట్టమొదటిగా ఎవరికిచ్చాడు.
3) అది సోముడి దగ్గరకెట్లా చేరింది ?
4) సోముడి దగ్గరి నుంచి వరుణబ్బాయ్ దగ్గరికెట్లా వచ్చింది ?
5) తక్షకుడు తప్పించుకుని తర్వాతేంజేశాడు?
6) ఇంద్రుడు గోవర్ధనం దగ్గర కిష్టప్పతో ఓడిపొయ్యి, ఆయన్ని ఓడించటం వల్లకాదనీ తెలిసీ మళ్ళా ఇక్కడున్నది ఆయనేనని తెలిసీ వచ్చి ఎందుకు పోట్టాడి తన్నులు తిన్నాడు ?
7) పైగా కొడుకుతో యుద్ధమేవిటి ?
8) వీళ్ళందరిలో ఎవరు గొప్ప మీ పెకారం?
9) అగ్ని గొప్పా, సోముడు గొప్పా, బెమ్మ గొప్పా, వరుణుడు గొప్పా, అర్జునుడు గొప్పా, గాండీవం గొప్పా. ?
10) ఇవన్నీ కాక కిష్టప్ప గొప్పా?

Monday, December 1, 2014

కూతురు మీద చెయ్యేస్తే ఏ తండ్రి ఊరకుంటాడు ?

కిష్ట పరమాత్మ జాంబవంతుడితో పోట్టాడాడు.

ఎందుకు ? నెత్తికొచ్చిన శమంతకమణి గొడవ వదిలించుకోడానికి.

జాంబవంతుడు బోల్డు దెబ్బలు తిన్నాడు.

దడదడలాడాడు.రామా కృష్ణా అన్నాడు.

అదంతా ఎందుక్క్కానీ సంగతి చెప్పు అన్నాడు కిష్టప్ప.

సంగతేమీ లేదు కానీ, జాంబవతినిస్తా పెళ్ళిచేసుకొని తీసుకుపో అన్నాడు.

సరేనని కిష్టప్ప జాంబవతిని పెళ్ళి చేసుకుని తీసుకుపోయ్యాడు.

పెళ్ళి చేసుకున్నాక పిల్లలు, వాళ్ళ ఆటపాటలు మామూలే.

అలా సాంబుడు పుట్టాక, వాణ్ణి బోల్డు ముద్దు చెయ్యటంతో వాడు, ఆ కుర్రోడు కొరకరాని కొయ్యైపోయాడు.


సాంబుడుకి యవ్వనం వచ్చింది.

యవ్వనం దాటిపోతూండగా, దుర్యోధనుడి కూతురు లక్షణ కనపడ్డది.

ఇహనేం ? అయినవాళ్ళమ్మాయేగా అని ఎత్తుకొచ్చాడు.

ఎత్తుకొచ్చాడంటే ఎత్తుకురాలా.

దానికో కతుంది.

పెద్దదెందుకు గాని, చిన్నగా చెప్పుకుందాం.

స్వయంవరం ఏర్పాటు చేసారు కౌరవులు, పెద్ద అన్నగారు లేకుండా.

దానికి సాంబుడొచ్చాట్ట.

ఎలా వచ్చాడు ?

"అంబుజోదరపుత్రు డతిరథోత్తముడు జాంబవతేయుండు సాంబుడు ఘనూదు" అని ఒహ పద్యంలో చెప్పించాడు కూడాను.

వచ్చాడు. అసలే గారాబాల పట్టి.

నాకేవిటి ఎదురు ? నాకెవడు ఎదురు అనుకుంటూ వచ్చాట్ట,

నూనూగు మీసాల మీద చెయ్యేసి తిప్పుతున్నాట్ట.

యవ్వనం దాటాక కూడా ఇంకా నూనూగు మీసాలే ఉన్నై మనవాడికి.

పైగా జాంబవతి కొడుకు. తాతగారు భల్లూకచక్రవర్తి.

అమ్మాయిని చూచాడు.

బాగుందిరా అబ్బాయ్, తీసుకెళ్ళిపోదాం, మనకు స్వయంవరమేమిటి ? పైగా వీళ్ళంతా తెలిసినవాళ్ళే అని, ఆవిడ్ని రథం ఎక్కించేసాడు.

వీరుడు. కిష్టప్ప కొడుకు.

జాంబవంతుడి మనవడు.

కొద్దిగా వీరం ఉంటుందిగా?

అడ్డమొచ్చిన వాళ్ళను తైతక్కలాడించాడు.

గుర్రాలని పరుగెత్తించాడు.

గొల్లుమంటూ కౌరవులంతా పొయ్యి పెద్ద అన్నగారికి సంగతి జెప్పారు.

"కోరి దుర్యోధను గూతు లక్షణను వారణవురి స్వయంవరమునందునను తానే వరియించి కొనిపోవ వారలందరును గురుపతి కెరిగింప" అంటూ ఇంకో పద్యం చెప్పించాడు.

సుయోధనుడు ఊరుకుంటాడు ?

అందునా కూతురు మీద చెయ్యేస్తే ఏ తండ్రి ఊరకుంటాడు ?

ఠాట్, యాదవులేవిటి, కౌరవుల పిల్లను ఎత్తుకునిపోటమేవిటి ? అవమానం, ఘోరావమానం అన్నాడు. అనుకున్నాడు.

అంతే, కర్ణున్ని, తమ్ముళ్ళను వెంటేసుకొచ్చి వీణ్ణి వాయగొట్టి తీసుకుపొయ్యాడు.

తీసుకుపొయ్యి ఒక గుర్రాలశాలలో కట్టేసాడు.

అది వీడికి అవమానైపోయింది.

గుర్రాలశాలలో కట్టెయ్యటమేవిటి అని.
 
ఎత్తుకొచ్చింది మర్చిపొయ్యాడు.

అందునా ఆడపిల్లను.

అవమానంతో కుతకుతలాడుతున్నాట్ట.

వాడు, ఆ కుర్రవాడు, సాంబుడు అక్కడ కుతకుతలాట్టం పెదనాన్నగారికి వినపడ్డదిట.

భుజాన నాగలేసుకొని బయల్దేరి వచ్చేసాడు.

ఎక్కడికి ?

ఆ వారణాపురికి.

వచ్చి ముందు మామూలుగానే మాట్టాడాడు

"కోరి మా మేనత్త కొడుకులు మీరు, ఆరూఢి మీకు మేనల్లుడుగాన దన మేనమరదలి దరళాతాక్షి జనవున గొనిపోయె సాంబుడు" అంటూ మీకు నాకు గొడవలొద్దు అన్నాట్ట.

అది విని సుయోధనుడు నవ్వాడు.

నవ్వుతావా అని ఈయనకు ఇంత బారు కోపం వచ్చింది.

హలం దించాడు.

హలం అంటే ఏవిటి ?

దున్నిపారేసేది.

భూమిలోకి దించి పారేసి జర్రున ఆ ఊరు చుట్టు ఓ చుట్టేసాట్ట ఆయన.

అంతే, కందకం లోతున ఆ ఊరు చుట్టంతా గొయ్యి పడిపోయింది.

ఆ పడిపోయిన గొయ్యిలో ఓ చోట ఇంకా లోపలికి గుచ్చేసి, ఓ వైపు లేపాట్ట.

అసలే అనంతుడి ప్రతిరూపం.

ఇంకేమన్నా ఉందీ ?

అనంతుడికి కోపం వస్తే ఇంకేవన్నా ఉందీ ?

"తామంట తలంపం దలలట , యేంమట పాదుకల మంట గణింపంగ రాజ్యశ్రీ మదమున నిట్లాడిన,యీ మనుజాధముని" అంటూ భీషణభాషణాలాడినాడు.

ఆతర్వాత భూమి, ఆ ఊరు అన్నీ పైకి లేవటం మొదలుపెట్టాయిట.

ఇదంతా విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పటమేవిటి ? ఆయన పరుగెత్తుకురావటమేవిటి ?

రావటం రావటం పద్యాలు, స్తోత్రాలు పాట్టమేవిటి? ప్రసన్నుణ్ణి చేసుకోటమేమిటి ! అన్నీ వరసాగ్గా జరిగిపోయినై.
ఆయన శాంతించాడు.

ఇటు సుయోధనుడికి మొట్టికాయలు పడటంతో ఆయనా శాంతించాడు.

వాణ్ణి, ఆ కుర్రవాణ్ణి, సాంబుణ్ణి వదిలేసాడు. పెళ్ళికి ఒప్పుకున్నాడు.

ఇక్కడికి సుఖాంతం అయ్యింది.

పోతే కత వ్యాసభారతంలో లేదు కానీ భాగవతంలో కనపడుతుంది.
అది మరి పోతనయ్య రాసిందేనో, ఇంకెవరన్నా ఇరికించిందో తెలియదు కానీ!

-- అయ్యా అదీ సంగతి
-- దీన్నే తర్వాత పొడిగిస్తే సాత్యకి, కృతవర్మని నరికెయ్యటం, ఆ తర్వాత ముసలం పుట్టటం, అలా అలా....
-- అందులో సాంబుడి పాత్ర కూడా ఉన్నది..
-- అది తర్వాత తీరిగ్గా ఎప్పుడైనా