Friday, November 14, 2014

ఇంతకీ సంగతి ఏవిటంటే?

దీనివల్ల ఎవడైనా బాగుపడతాడేమో తెలియదు కానీ, మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలిగా, అందుకూ అన్నమాట ఈ పోష్టు. పోతే తెలుగుదేశంలో ఉన్నవాళ్ళకు సంబంధించింది కాదు కావున, తమరికి ఆవేశమో, కావేశమో వస్తే కాస్త అటేపెళ్ళి దించుకొని రండి. ఇది ఫక్తుగా అమెరికలో నివసిస్తున్న తెలుగువారికి, ఇక్కడి తెలుగు సంఘాలకి సంబంధించిన విషయం మాత్రమే! ఇక్కడివారికీ ఆవేశకావేశాలు రావొచ్చు గాక, అయితేనేం నే చూసిన జంత్ర తంత్రాల ముందు మీ ఆవేశకావేశాలెంత? అయ్యా! అదీ సంగతి కాబట్టిన్నూ, ఇదంతా నా స్వానుభవాలతో రాసింది, మీ అనుభవాలు వేరుగా ఉండవచ్చును కాబట్టిన్నూ, నాకు మీ అనుభవాలతో సంబంధం లేదు కాబట్టిన్నూ తమరు చిత్తగించవచ్చు (చదివో, చదవకో, వాహ్యాళికో, పలాయనానికో - తమ తమ ఇష్టానుసారం!) 

ఇంతకీ సంగతి ఏవిటంటే [సంగతి అనగా టాపిక్కు అని అర్థము] - తెలుగు వారు, తెలుగు సంఘాలు

సరే సంఘాల్లోకెళ్ళబోయేముందు ఒహసారి మనుషుల గురించి టూకీగా మాటాడుకుందాం. ఇక్కడి తెలుగువారికి, సౌకర్యాలు, డబ్బులు అలవాటు అయినై కానీ, విధి , విధానం , ప్రవర్తన అలవాటు కాలా. పుటక బుద్ధులు పాడెతోనే సరి అని మనవాళ్ళు ఊరకే అనలా. సరే ఆ అలవాట్లు, అనగా ఇక్కడి అలవాట్లు, విధీ విధానం నాగరీకం అనుకుందాం కాసేపు. నాగరీక దేశానికొచ్చామని డప్పులు, ఢంకాలు, బాజాలు, భజంత్రీలు మనకు మనమే కొట్టుకుంటూ ఉంటాం కాబట్టి, అందుకు ఎవరికీ అభ్యంతరం ఉండకూడదనే అనుకోలు. మరి ఆ అలవాట్లు అలవాటు కాపోతే నాగరీకానికి ఎదురుగా బోదురు కప్పలా నిలబడ్డ దాన్ని అనాగరీకం అని పిలవటంలో తప్పు లేదేమో. ఆ అనాగారీకాన్ని పాటించేవారిని అనాగరీకులు అనవచ్చునేమో. అలాటి అనాగరీకులు చాలా మంది తెలుసు నాకు. ఇక్కడ ఒహటి చెప్పాలె. మాయరోగం ఒహటి అంటుకోకూడదు కానీ, అంటుకుంటే ఒహదాని తర్వాత ఇంకొహటి అలా అలవడుతూనే ఉంటై. ఆ మాయరోగాలేవిటో కాస్త అలా అలా చూసినవాడిగా, వాటికి మందులేవన్నా ఉన్నయ్యేమో కనుక్కుందామని చేస్తున్నదీ ప్రయత్నం.

ఇహ రంగంలోకి దిగుతూ, వారి వారి ప్రవర్తన గురించి మాటాడుకుంటూ పోతే ఈ ఫేసుబుక్కు సరిపోదు కానీ, ఆ ప్రవర్తన సమస్యకు తరుణోపాయంగా తెలుగు సంఘాలు చెయ్యవలసిన పనులు ఇవి - [చెయ్యాల్సినవి అంటే వేరే ఏదో అనుకునేరు, ఇందులో ఆలోచనలు, ఊహలు అన్నీ వున్నవి, వుంటవి]

1) ఆడిటోరియంలోకి ప్రవేశం నిషిద్ధం. ఎప్పుడు ? ఐదు నిముషాలు ఆలస్యం గరిష్ఠంగా. పిల్లలతో వచ్చేవారికి 10 నిముషాలు. పది నిముషాల తర్వాత దర్వాజాలు, తలుపు, కిటికీలు అన్నీ మూసివెయ్యటమే. ఆడిటోరియముల్లో కాక, వనాల్లోనూ ఇతర చిట్టడువుల్లోనూ, కారడవుల్లోనూ కోతికొమ్మచ్చి కార్యక్రమాలు పెట్టుకునే సంఘాలకు ఈ పైది వర్తించదు.

2) ప్రవేశ ద్వారం పక్కనే ఒక క్లోకు రూము లాటిది పెట్టి, వచ్చిన అతిథుల దగ్గరున్న జేబురుమాలాలు, చిన్నవా పెద్దవ అన్న సంబంధం లేకుండా అన్ని తుండుగుడ్డలు, వీలైతే కోట్లు. ఎందుకా ? ఎర్రబస్సులో గుడ్డలు పరిచిన అలవాట్లు వదల్చాటానికి.

3) పిల్లలతో వచ్చిన కుటుంబాలకు ఆడిటోరియంలో ఆ చివరన, పై భాగంలో ఉన్న నాలుగు కాకపోతే ఐదు వరసల సీట్లు కేటాయించాలె. ఎందుకు ? ప్రతి ఇరవై సెకన్లకు పిల్లలను జబ్బలు పట్టుకొని బాతురూముకని ఈడ్చుకొనిపోయే తలిదండ్రులంతా ఒకే చోట గుంపుగా పడిఉంటారు. మధ్యలోనో, ముందో చేరి లేస్తూ పడుతూ అందరి కాళ్ళు తొక్కుతూ, భారీకాయాలతో అప్పుడప్పుడు ఉన్న కారణానికి, లేని కారణానికి స్థాణువులైపోయి వెనకమాల ఉన్నవారికి స్టేజీ మీద ఏవిటి జరుగుతోంది అన్నది కనపడకుండా చేసే అసౌకర్యపు బుద్ధులు కొంత తగ్గు ముఖం పట్టే అవకాశం ఉన్నది.

4) ఫోన్లతో ఆడిటోరియంలోకి రావాలనుకునేవారికి టికెటు రేటు ఒక్కొక్కరికి 400 డాలర్లు పెట్టాలె. కుదరదంటే ట్రింగనిపించిన మనిషి ఫోటో ఒకటి తీసుకొని, వీలుంటే ఇతర వివరాలు తెలుసుకొని, స్టేజి మీద "ట్రింగు రంగడు" అన్న బిరుదుల కార్యక్రమంలో వారికి స్థానం కల్పించి, స్టేజీ మీదకు ఆహ్వానించాలె.

5) భోజనాల సమయం వచ్చినప్పుడు, కాకి సంతర్పణలా అంతా పొలోమని ఆడిటోరియంలోంచి బయటకు పరుగులు పెట్టి చిందరవందర చేస్తారు కాబట్టి, భోజన సమయమయ్యిందని బయటకు చెప్పకుండా, రెండు వరసలు ఒహసారి లేచి వెళ్ళేట్టు చూసేందుకు ఒక వాలంటీరు చొప్పున పెట్టుకొని జనాలను పంపిస్తే బాగుంటుంది. ఇందులో మళ్ళీ పిల్లలున్న వారందరికీ ఒహ మూలనో , ఒహ పక్కనో స్థలం చేసి వాళ్ళందరినీ అక్కడకు పంపించేస్తే మిగిలిన వారందరికీ మనఃశ్శాంతి.

6) భోజనాలనగానే కక్కుర్తి పడీ ఆర్రోజుల నుండి తిండికి మొహం వాచిపోయినట్టు, పిలిచిన వరసల్లో నుండి కాకుండా వేరే వరసలో నుంచి ముందుకు దూసుకొచ్చిన వీరులందరికి ఒక బాసికం బిళ్ళ కట్టి, భోజనాల సర్వింగు టేబులు దగ్గర నిలబెట్టి సర్వింగు అనే సోషలు సర్వీసు చేయించాలె.

7) వడ్డించేప్పుడు ప్రతి కుటుంబానికి ఒక కారీ అవుట్ బాక్స్ ఇచ్చి, తినని పదార్థాలు అందులో కుక్కుకొని తీసుకుపొమ్మని హెచ్చరించాలె.

8) ఆహ్వాన పత్రాల్లో అచ్చతెలుగు భోజనం, పిచ్చ ఆంధ్రా భోజనం అని అడ్వర్టైసుమెంటు వేసి, తెలిసిన రెష్టారెంటు వాడు ఫ్రీగా పాచిపోయిన పావ్ భాజీ, మురిగిపోయిన మిర్చీకా సాలన్ పెట్టి కక్కుర్తి పబ్బం గడుపుకోకుండా, ఏది తెలుగు భోజనమో తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలె. ఆ తర్వాత అడ్వర్టైసుమెంటు డప్పులు కొట్టాలె. ఆ పైన నిజమైన భోజనం పెట్టాలె. తిన్నవాడి ఆశీర్వాదాలు పొందాలె. డబ్బులు లాక్కున్నది కాక, ఇంటికెళ్ళి పక్కెక్కే విధానంగానో, ఆ దరిద్రం తినలేక అర్థాకలితో వెళ్ళే విధంగానో ఉంటే అలాటి పాపకార్యం చేసినందుకు గాను, ఆ సంఘాధికారులంతా ఈ జనమలోనే గ్రామసింహమై జన్మించాలని శాపాలు పెట్టబడతవి.

9) ప్రెసిడెంటులు, కార్యదర్శులు, కోశాధికారులు, సమస్త సంఘాధికారులు, వాళ్ళ పెళ్ళాలు స్టేజి మీదకెక్కి సినిమా పాటలకు నడ్డూపుడు డాన్సులు చెయ్యటం మానెయ్యాలె. ఎందుకంటే పరువుకు సంబంధించిన సంగతి కాబట్టి. వయసొచ్చినా మనసులో నేనింకా కుర్రకారనుకోటంలో తప్పులేదు, కానీ మీ మీ కుర్రతనం అంతా మీ ఇంటికి పరిమితం చేసుకుంటే బాగుంటుంది. ఆ కుర్రతనం అంతా ఈవెంటుకు సంబంధించిన ప్రోగ్రాములు సరిగ్గా నడవటానికి, శ్రేష్ఠంగా ఉండటానికి ఉపయోగించండి. అంతే కానీ ప్రజల్లోకొచ్చి హుందాగా లేకుండగా పిచ్చి డ్రెస్సులు, పిచ్చి డాన్సులు ఆడుతూ హింసిస్తే సభికాగ్రహం చవిచూడవలసి వస్తుంది.పోతే, వారి పిల్లలకు మినహాయింపు ఉన్నది, పిల్లలు కాబట్టి.

10) సినిమా పాటల కార్యక్రమాలన్నీ చిట్టచివరిలో పెట్టాలె. ముందు సంప్రదాయానికి సంబంధించినవి పూర్తికానిస్తే ఇవి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఇష్టమున్నవి చివరన ఉన్నయ్ కాబట్టి చచ్చినట్టు చివరైదాకా ఉంటారు. ఆడిటోరియము ఫుల్లుగా ఉంటుంది.

11) ఆం"ఖరులు" తెలుగులో కాకుండా ఇంగ్లీషులోనూ, నాలిక మడతేసుకుని మాట్లాడే మొద్దబ్బాయిలా అమెరికను విన్యాసాలు చూపించకుండగా - చక్కగా తెలుగులో మాటాడేవారై వుండాలి అని ఒక నియమం పెట్టుకోవాలె. కావాలంటే ముందు పూర్తిగా తెలుగులో మాట్లాడేసి, ఆ తర్వాత ఆ కార్యక్రమానికి సంబంధించిన సంగతులు ఇంగ్లీషులో చెప్పవచ్చు. దానివల్ల పాలు, కల్లు కలవకుండా దూరం దూరంగా ఉంటవి. ఆయాంఖరులు దొరకకపోతే ప్రెసిడెంటుకు శిక్ష ఏమనగా, ఆ ప్రెసిడెంటే అచ్చతెలుగులో ఆంఖరము చెయ్యవలె.

12) నార్తు కొరియా వాళ్ళు టి.వి.ల్లో తమ ప్రజల్ని చూపించేప్పుడు ప్రతి చిన్నదానికి హోరాహోరిగా చప్పట్లు కొడతారని, ఆనందభాష్పాలు కారుస్తారని జగమెరిగిన సత్యం. అంత దౌర్భాగ్యానికి కాకపోయినా, కర్టెను పడ్డ ప్రతిసారి ఆడిటోరియం అంతా దద్దరిల్లేలా, కప్పు లేచిపోయేలా చప్పట్లు, ఈలలు, ఊళలు వేసే ఒక గుంపును అద్దెకు తెచ్చుకోవటమో, వచ్చే సభికుల్లో అలాటి నిర్మాణాత్మక వైఖరికి సోపానాలెయ్యటానికి ప్రయత్నిచటమో - ఇవి చెయ్యటానికి ప్రత్యేకంగా ఒక అధికారిని సంఘంలో నియమించుకొని పని కానివ్వాలె. దాని వల్ల ఏమవుతుందంటే, నిజమైన కళాకారులకు ప్రోత్సాహం దక్కుతుంది. చెత్తకు కూడా చప్పట్లు దొరుకుతాయి కానీ, ఫరవాల. పదిమందిలో ఖచ్చితంగా ఒకరో ఇద్దరో బ్రహ్మాండంగా తమ వంతు ప్రయత్నం సిన్సియరుగా చేస్తారు. వాళ్ళకూ, మీ చప్పట్లు, ఈలలు. అయ్యా అదీ సంగతి. దద్దరిల్లిపోవాలె అంతే. ఇంకో మాట లేదు.

13) కుటుంబ సభ్యులను తమ సంఘానికి, అనగా అందులో అధికారానికి వీలైనంత దూరంగా పెట్టాలె. దాని వల్ల, అది నచ్చనివాళ్ళు చేసే రాజకీయాలు తగ్గుతవి. కుటుంబసభ్యులను సంఘం యొక్క మీటింగులకు దూరంగా పెట్టాలె. అనవసరంగా వేళ్ళు కాళ్ళు మూతి పెట్టి కంపు చేయకుండా ఉండటానికి. ఒకవేళ కుటుంబ సభ్యులను చేర్చాలనుకుంటే, ఇంట్లో ఎలాగూ గారాబాలు చూపించుకుంటున్నారు కాబట్టి ఆ గారాబాలు ఇంటిదగ్గరే వదిలేసి రావాలి. అనవసరంగా ఇతరుల పనుల్లో కల్పిచ్చుకోవద్దు అని గట్టి హెచ్చరికలు చేసుకోవాలె.

14) చుట్టూ చెత్త జనాభాను పోగుచేసుకొని కూర్చోకుండా, నిజంగా ఆసక్తి ఉన్నవాళ్ళను సంఘానికి, సభికులకు ఉపయోగపడే వాళ్ళను సంఘంలోకి తీసుకొని పనులు కానిచ్చుకోవాలె. వాళ్ళకు ఆసక్తి ఉన్నదా లేదా అన్నది ఇట్టే పట్టెయ్యవచ్చు, మీకు గనక ఆసక్తి, ఆ శక్తి ఉంటే.

15) ఆఫీసులో పార్టీ పెడితే తెల్లవాళ్ళు తినలేని ఉప్పులు, కారాలు, వడియాలు, తర్పణాలు వేసి తీసుకెళ్ళి, మన బుద్ధి ఈలాటిది అని చూపిచ్చుకుని ఆ తర్వాత వాళ్ళు తినలేక ఒక చెంచా వేసుకుని వదిలేసిన సంగచ్చూసి చంకలు గుద్దుకొని ఆ పదార్థాలన్నీ నోరారా మనమే మెక్కుతామో, అలా కాకుండా - మీ ఊరికి సంబంధించిన కాంగిరేసు మాను, అసెంబులీ మాను, మేయరు - ఇలాటోళ్ళందరిని పిల్చి మన ప్రోగ్రాములు చూపిచ్చాలె. భాగస్వాములను చెయ్యాలె. ఓ సారి చూసాక మన ప్రోగ్రాములు సరుకుతో నిండి ఉంటే రెండో సారి వాళ్ళే కాళ్ళకు బలపాలు కట్టుకుని మన బడికి వచ్చేస్తారు.

16) ప్రోగ్రాముల్లో పాల్గొన్న పిల్లల్లో సంఘాధికారుల పిల్లలెవరన్నా ఉంటే మొదటి మూడు ప్రైజులు వాళ్ళకు ఇవ్వటం నిషిద్ధం చేసుకోవాలె. దానివల్ల ఇతర పిల్లలకు కనీసం అవకాశం దక్కుతుంది. అది కాదు కానీ ఇంకో మాట చెప్పు అంటే, ప్రోగ్రాములకు సంఘాధికారుల బంధుమిత్రసపరివారకపీశ్వరాలకు సంబంధించని జడ్జీలను పెట్టుకొని, ఆయా జడ్జీలతో వోటింగు చేయించి అప్పుడు ప్రైజులు ఇవ్వాలె. ఆ జడ్జి తెలుగు తెలియనివాడైతే గొడవ వదిలిపోయి అందరూ ప్రశాంతంగా ఉండవచ్చుట.

17) కార్యక్రమాలు ఖచ్చితంగా అనుకున్న, ప్రింటు చేసిన సమయానికి ప్రారంభించకుండా అలవాటుగా ఆరుగంటల ఇరవై నిముషాల తర్వాత మొదలెడితే సభికులందరూ సంఘాన్ని కోర్టుకీడ్చి భారీమొత్తంలో జరిమానా వేసేందుకు వీలు, అవకాశం, వెసులుబాటు ఉండాలె. టికెట్ల పైసలన్నీ వాపసు చెయ్యాలె. ఆ సంఘానికి ప్రెసిడెంటును ఆ పోష్టు నుంచి ఊష్టు చెయ్యాలె.

18) ఈవెంటు ప్రోగ్రాములు అయిపోయే ముందు, అనగా ఒహ ఐదు నిముషాల్లో అయిపోతుందనగా, గాలిప్రయాణం చేసేవాళ్ళకు ఇమిగ్రేషను సర్వీసు వారు ఐ-94 కాగితం ఇచ్చినట్టు, ఒహ కాగితమ్మీద కార్యక్రమాల వివరాలు ప్రింటు చేసి, పక్కనే ఒక బాగుందా బాగులేదా ఫరవాలేద అన్న ఆప్షనులు ఇచ్చి టిక్కులు పెట్టి బయటకెళ్లే తలుపు బయట, ఒహ బిన్ను పెట్టి ఈ బన్నీలను అందులో వేయమని చెపితే - ఆ డాటా అంతా చూసుకున్నాక, వచ్చే సంవచ్చరం ఏ ప్రోగ్రాము చెయ్యకూడదు అన్నది తెలుస్తుంది. టిక్కులు చేసినవారి, కామంట్లు రాసిన వారి వివరాలు ఇవ్వమని ఆ కాగితంలో అడగకుండా ఉంటే మరీ మంచిది.

- అయ్యా ఈ భాగం, మొదటి భాగం, ఇంతటితో సమాప్తసశేషం.

1 comment:

 1. Super !!
  You read my mind. Thats exactly what I think.
  I can not express any better.
  If you agree can I share, please ?

  Thanks,
  Surabhi

  ReplyDelete