Friday, October 17, 2014

అందువల్ల నువ్వే గొప్ప. నీ రామాయణమే గొప్ప!

అనగనగా ఓ భూలోకం.

అందులో ఓ రామాయణం.

అది రాసిందెవరు ?

వాల్మీకి అనే ఆయన.

గణపతే రాసాడనుకో, అది అప్రస్తుతం.

రాయటం అయ్యింది కాబట్టి జనాల్లోకి వదిలేసాడు.

జనాల్లో విభ్రమం మొదలయ్యింది.

అందరూ సమ్మోహితులైపోయినారు.

అది చూసి తీరిగ్గా కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు.

పై నుంచి అది చూసాడు నారదుడు.

ఆయనకు దురద పుట్టింది.

ఇహనేం ? ఓ రాగం అందుకున్నాడు.

చక్కా బయల్దేరి కిందకొచ్చేసాడు.

పాటలు పాడుతున్నాడు.

మధ్య మధ్యలో నారయణ నారాయణ అంటున్నాడు.

వాల్మీకి కాలు మీది కాలు కిందకి దించి దణ్ణం పెట్టాడు.

ఏవిటీ సంగతి స్వామీ, ఇల్లా వచ్చావ్? అన్నాడు నారదుడితో.

కడుపుబ్బిన నారదుడు ఆ కడుపు పగిలేలా నవ్వాడు.

నవ్వితే నవ్వావ్ గానీ, అలసిపోయుంటావ్, పాలు తాగుతావా? మజ్జిగ తాగుతావా? అని వాల్మీకి బోల్డు పెశ్నలేసాడు.

మజ్జిగా వద్దు, పాలు వద్దు, నా చిడతలూ వద్దు కానీ నీకో సంగతి చెప్పాలన్నాడు నారదుడు.

నా నెత్తికి గడ్డానికీ ఏదో తెచ్చుంటావ్ నువ్వు, గడ్డమా, నెత్తా చెప్పు అన్నాడు వాల్మీకి.

రామాయణం ఎందాకా వచ్చిందన్నాడు నారదుడు.

అయిపోయింది స్వామీ అన్నాడు వాల్మీకి.

అయిపోయిందా? జనాలేమనుకుంటున్నారు దాని గురించి అన్నాడు నారదుడు.

అబ్బో, ఓయబ్బో - ఇంతకన్నా మించింది ఈ ప్రపంచకంలోనే లేదు అంటున్నారన్నాడాయన.

ఓస్! ఓస్! ఆగు, ఆ జాంబవంతుడు కూడా రాసాట్ట రామయణం అన్నాడు నారదుడు.

అవునా నాకు తెలియదే. ఎలా ఉందిట అన్నాడు వాల్మీకి.

అసలు ఏడేడు నలభైతొమ్మిది లోకాల్లో అంత బాగున్న రచన ఇంకోటి లేదని అందరూ అనుకుంటున్నారు అన్నాడు నారదుడు.

ఏవిటీ? అయితే ఇప్పుడే వెళ్ళి దాని సంగతేమిటో చూడాలె అని మూట ముల్లె సద్దుకొని జాంబవంతుడి దగ్గరకు పొయ్యాడు వాల్మీకి.

వాల్మీకెళ్ళేప్పటికి జాంబవంతుడు గోళ్ళు సవరదీసుకుంటూ కూర్చున్నాడు ఇంట్లో ఉన్న గుహలో.

జాంబవంతా, ఓ జాంబవంతా, ఎలా ఉన్నావ్ నాయనా? ఏదీ నీ రామాయణం ఓ సారి చూపించు అన్నాడు వాల్మీకి.

అదిగో ఆ తేనెతుట్టె మీద ఉంది చూసుకో అని జాంబవంతుడు గోళ్ళ గోలలో పడిపొయ్యాడు.

తేనెటీగలు అవ్వీ నన్ను కుట్టి తాట వలుస్తయ్యేమో నాయనా, కాస్త సాయం చెయ్యు అన్నాడు వాల్మీకి.

ఆ తుట్టె ఖాళీది. తేనెటీగలు ఆ రామాయణం తేనెని తిరగతాగేసి బయటికెళ్ళిపోయినై, పొలాల్లోనూ, జనాల్లోనూ పాకించటానికి. నీకేం భయం లేదు అన్నాడు జాంబవంతుడు.

మరి ఈ తుట్టెలో ఎక్కడ ఉన్నవీ తాటాకులు? కనపడవే అన్నాడు వాల్మీకి.

ఆ ఖాళీ తుట్టె గోడల మీద రాసాను చదువుకో అన్నాడు జాంబవంతుడు.

కొంచెం సేపయ్యాక భోరు భోరుమంటూ ఏడుపు వినపడ్డది జాంబవంతుడికి.

ఏవిటీ? ఎవరా ఏడ్చేది అన్నాడు వాల్మీకితో.

నేనే అన్నాడు వాల్మీకి.

ఎందుకూ ఏడవటం, బాగులేదా ఏమిటి అన్నాడు జాంబవంతుడు.

బాగోకపోవటమేమిటీ? తేనె ఎందుకు పనికొస్తుంది నీ రాత ముందు అన్నాడు వాల్మీకి.

మరి ఏడవటం ఎందుకు నాయనా, ఆనందంతోనా ? అన్నాడు జాంబవంతుడు

నా ఏడుపు అది బాగున్నందుకే. నీదింత బాగుంటే నాదెవడు చదువుతాడు బాబూ అన్నాడు వాల్మీకి.

సర్లే నా దార్లోకే వచ్చావ్ నువ్వూనూ? నేనూ ఇలానే ఏడ్చా హనుమ దగ్గర అన్నాడు జాంబవంతుడు.

వాల్మీకి కళ్ళు విచ్చుకొన్నై. ఏడుపు ఆగింది.

ఏవిటీ, ఇంత పెద్దవాడివయ్యుండీ నువ్వు ఏడవటమేమిటి, సంగతి చెప్పు అన్నాడు వాల్మీకి.

హనుమ కూడా ఓ రామాయణం రాసాడు. తెలుసా నీకు? అన్నాడు జాంబవంతుడు.

అవునా, నాకు తెలియదే, అదెలా ఉన్నదో? అన్నడు వాల్మీకి.

నువ్వేడ్చావే నా రామాయణం చూసి, అక్కడికెళ్ళి అదే పని నేను చేసా అన్నాడు జాంబవంతుడు.

అంత బాగుందా? అయితే ఇప్పుడే వెళ్ళి హనుమను చూడాలె, ఎక్కడున్నాడో తెలుసా అని అడిగాడు వాల్మీకి.

నాకు తెలియదు - కదళీ వనంలోనో, దండకారణ్యంలోనో, ఋష్యమూకమ్మీదో ఉంటాడు. అయినా ముందు కదళీ వనంలో చూడు అన్నాడు జాంబవంతుడు.

వెళతా కానీ మరి, మరీ అంటూ చేతులు నలపటం మొదలుపెట్టాడు వాల్మీకి.

ఏవిటయ్యిందీ? దురదగా ఉన్నదా ఏమి? ఇలా రా, నా గోళ్ళతో సవరదీస్తానన్నాడు జాంబవంతుడు.

అది కాదు, మరి నీ రామాయణం ఇంత బాగుంటే నాదెవరూ చదవరు, కాస్త దాని సంగతి చూడవా అని చేతులు నలుపుకోటం ఆపి అడిగాడు వాల్మీకి.

ఓస్ ఇంతేగా! నీకోసం ఏదైనా చేస్తా. ఇదిగో ఇప్పుడే ఆ తుట్టెను ముక్కలు ముక్కలు చేసి భూదేవిలో కలిపేస్తానని మాట నిలుపుకున్నాడు జాంబవంతుడు.

అది చూసి మనసంతా నిండిపోయిన ఆనందంతో, సరే, నే పోతున్నా అనటంతో జాంబవంతుడు వెళ్ళిరా, కానీ హనుమ రామాయణం రాసాడని ఎవరికీ తెలియదు. నేను పొరపాటున నీ ఏడుపు చూసి నోరు జారా. నే చెప్పానని చెప్పబోకు హనుమకు అన్నాడు

అలాగేనని వాల్మీకి కదళీ వనానికి పరుగులు తీసాడు.

వాల్మీకి వెళ్ళేప్పటికి కదళీ వనంలో యథావిథిగా రామ రామ అనుకుంటూ ఓ కదళీవృక్షం కింద జపం చేసుకుంటున్నాడు హనుమ.

నాయనా హనుమా! నేను వాల్మీకిని వచ్చాను. కాస్త కళ్ళు తెరు నాయనా అన్నాడు వాల్మీకి.

హనుమ రామ జపంలోంచి లేవలా.

మళ్ళీ పిలిచాడు హనుమా హనుమా అంటూ వాల్మీకి.

ఈసారి అర్థనిమీలనంగా చూసాడు హనుమ.

భుజం మీద చెయ్యేసి ఊపి నేను వాల్మీకిని, నేను వాల్మీకిని అంటూ జపాలోకం నుంచి ఈలోకంలోకి తీసుకొచ్చాడు హనుమను వాల్మీకి.

ఏవిటి సంగతి అన్నాడు హనుమ.

నాయనా నువ్వేదో రామాయణం రాసావుట, జాంబవంతుడు చెప్పాడు అని నోరు జారాడు వాల్మీకి.

హతవిధీ, ఎవరికీ చెప్పొద్దు తాతా అని చెపితే సంగతి మరచిపోయిన ముసలాయనకు మరుపొచ్చేసిందని కాస్త బాధ పడి, రహస్యం బయటపడ్డందుకు చింతించి, హనుమ - సరే, ఆ పక్కనున్న కదళీ వృక్షం మీద తొమ్మిదాకులు ఉన్నై. దాని మీద రాసాను చదువుకో అని మళ్ళీ రామజపంలో మునిగిపొయ్యాడు.

వాల్మీకి ఆ అరిటాకుల దగ్గరకెళ్ళి రామాయణం చదివి రక్కసితుఫానులో గాలి చప్పుడులా ఏడ్చాడు.

హనుమ అడిగాడు ఏవిటయ్యిందని.

మాట రాలా వాల్మీకి నోటినుంచి.

ఏవిటి పుట్టలో పాము దూరినట్టు, కకావికలైపోతున్నావేమిటి అన్నాడు హనుమ.

పుట్ట మాట వినగానే ఏడుపాపుకొని మళ్ళీ జాంబవంతుడి దగ్గరి కథే చెప్పుకొచ్చాడు హనుమకు, వాల్మీకి.

అది విని ఓస్ ఇంతేనా, ఇదిగో ఆకుల్లేవ్, ఏవిటి లేదు అంటూ ఆకులన్నీ పరపరా చించేసాడు హనుమ.

దాంతో తేరుకున్న వాల్మీకికి, నెమ్మదిగా జ్ఞానోదయం అయ్యింది.

అయ్యి, అడిగాడు హనుమను - హనుమా, నువ్వు, జాంబవంతుడు నా మాట మన్నించి నా రామాయణమే ఈ లోకంలో నిలబెట్టేట్టు చేసారు. అందుకు ఋణం ఎలా తీర్చుకోవాలె తెలియట్లా అని.

హనుమ అన్నాడు - స్వామీ, నీకు ఉన్నది - వచ్చే పేరు గోల, చరిత్రలో నిలచిపొయ్యే దురద గోల. నాకు - రాముడి గోల. నాకొచ్చిన చిన్నపాటి భాషతో, తీరికగా ఉన్నప్పుడు ఏదో రాసుకున్నది. నీకు రామాయణం నిలవాలె. నాకు నా రాముడు నిలవాలె. ఎలాగైతేనేం, నీ వల్ల, నీ ఒక్క రామాయణమే ఈ లోకంలో ఉండటం వల్ల నా రాముడు జనాల్లో లక్షల సంవత్సరాలు నిలిచిపోతాడు. నా రాముడికి అంత భాగ్యం కలిగితే అంతకన్నా ఏం కావాలె నాకు ? ఈ ఆకుల మీద రాసుకున్నది నాకోసం. నువ్వు రాసింది జనాల కోసం. అందువల్ల నువ్వే గొప్ప. నీ రామాయణమే గొప్ప అంటూ అక్కణ్ణుంచి అంతర్థానమైపోయాడు.

వాల్మీకి నోట మాటే రాలా.

******************************

-- అయ్యా, అమృతాన్ని, రామామృతాన్ని తేనెతుట్టెల్లోనూ, అరటి ఆకుల్లోనూ నిలిపి పరుల కోసం త్యాగం చేసిన హనుమలు, జాంబవంతులు మనలో చాలాకొద్ది మందే. వాల్మీకులు బోలెడు మంది.

-- ఇహ మీ మీ ఊహకే వదిలేస్తున్నా, ఊహతో రాసిందే అయినా, దీన్ని దేనికి అన్వయించుకోవచ్చో!! 

-- వాల్మీకిని ఏమాత్రం తక్కువ చేసి చూపిచ్చటం అన్నది ఈ నా ఊహారచన ప్రయోజనం కాదని అర్థం అయ్యిందనుకుంటూ... ఓం తత్ సత్!

-- October 2007 write up, unicoded now.

2 comments:

  1. మరీ ఇప్పుడు ఎక్కడైనా జాంబవంత, హనుమంతుల రామాయణం దొరుకుతుందా అండి...........

    ReplyDelete