Tuesday, October 28, 2014

అలాగే భాషా , మాటలు - మన పిల్లవాళ్ళకు కొనుక్కుంటున్నాం!

చంద్రలత గారితో చర్చ - రెండో భాగం.

ఆవిడతో జరిపిన చర్చ వల్ల, నేను ఆ క్లాసులు అవీ చెప్పటం మానేసిన సమయంలో ఇనుము వేడిగా కాలిపోతూ ఉండగా రాసుకున్న ఒకానొక అసంపూర్తి వ్యాసం. మనవాళ్ళకు మన భాషంటేనూ, మన మాటంటేనూ ఎంత చులకనైపోయిందిరా అనుకుంటూ రాసుకున్న వ్యాసం.

దీన్ని పొడిగిద్దామనుకునే పోనీ వాళ్ళ చావు వాళ్ళే చస్తారులే. మన పూర్తి ప్రయత్నం మనం చేసామన్న తృప్తితో వదిలేసిన భాగం ఇది...మళ్ళీ చంద్రలత గారి పుణ్యమా అని ఎక్కడో పడి ఉన్నదాన్ని మళ్ళీ బయటకు తీస్తిని. ఇక్కడ వేస్తిని. దీన్ని పూర్తి చేసే ఉద్దేశం ఇప్పటికైతే లేదు కానీ అయ్యలు, అమ్మలూ - చదువుకుని ఎవరికి తోచిన అర్థం వాళ్ళు తీసుకొనవచ్చునూ, వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి నా అర్థమూ తీసుకొనవచ్చును...

ఇంకొద్ది లోపలిగా వెళ్ళి వెతికితే మూడో భాగం, నాల్గో భాగం కూడా రావొచ్చును. కానీ ప్రస్తుతానికి ఇది మాత్రం.... ఓం తత్ సత్!

ఈ గ్యాపకాలన్నిటినీ ఒక ఈమెయిలుతో, ఒక మెసేజితో తోడి బయటకు తెప్పిస్తున్న చంద్రలత గారికి ధన్యవాదాలతో!

***************************

పుటుకూ పుటుకూ దారం
తెగిపోతే ఎవ్వడిదీ నేరం
తలిదండ్రుల సంతంతా అంతే
పిల్లవాండ్ల బతుకంతా సంతే
మాటంతా చౌడు మన్నే
భాషంతా గుండు సున్నే

-- అన్న తీరులో ఉన్నదండి

తల్లికీ తండ్రికి ఉండే సహజ లక్షణం ఏవిటి ? పిల్లల మీద ప్రేమ. బందరు లడ్డూలు, జిలేబీలు, పూతరేకులు, తాండ్రలు ఇవ్వన్నీ బావున్నై కదాని, దొరికిందే అదనుగా గుటకాయస్వాహా చెయ్యకుండా పిల్లవాళ్ళకు అట్టిపెడతారు. అదే మాట, భాష దగ్గరికొచ్చేప్పటికి తీపి లేదు, పిల్లవాళ్ళు లేదు, దయ్యమూ లేదు, దైవమూ లేదు. సహజలక్షణాన్ని మర్చిపోతున్నారు. చేతిలో ఉన్న సున్నాలను, గోడకు పూస్తున్నారు. ఆతర్వాత ఆ సున్నం తాంబూలంలోకి పనికొస్తుందా అని ఆలోచిస్తున్నారు. గోడను గీకుతున్నారు. ఓ సారి గోడెక్కాక అదెందుకు పనికొస్తుంది ?

కుండ పచ్చిగా ఉన్నప్పుడు సవర్దీయాలె. కాల్చేసి సారిగ్గా రాలేదంటే ఏవిటి లాభం ? మంచి విత్తనాలు మనమే వెయ్యాలె. మనమే నీళ్ళు పొయ్యాలె. మనమే పెంచుకోవాలె. చచ్చే దాకా ఓ డప్పులు ఢంకాలు మోగించి, పోయాక సవుండేదిరా అంటే వినపడదుగా!

 A B C D లు వేదాలు. అ ఆ ఇ ఈ లు చిత్తు కాయితాలు అయిపోయినై ఈవేళ. చదివేవాడు బ్రాహ్మడైనా కాకపోయినా...ఎవరి పిల్లల్ని వాళ్ళు బాగుచేసుకుంటే, భాష చెప్పుకుంటే చాలు. అదే జీవితంలో అతిపెద్ద ఉద్యోగం...మన ఉద్యోగ ధర్మం మనం సరిగ్గా నిర్వహించాక కూడా విజయం దక్కలేదా, మంచిది. నీ ధర్మం నువ్వు నిర్వర్తిచావన్న సంతృప్తి అన్నా మిగులుతుంది.

నల్ల పిల్లిని తెల్ల పిల్లిగా చెయ్యాలని చూస్తే బొచ్చు ఊడి చేతిలోకి రావటం తప్పితే మిగిలేదేమీ లేదు. వదిలేస్తే పూర్తిగా వదిలెయ్యండి. తెల్ల పిల్లులైపోనివ్వండి. కాదంటారా? నల్ల పిల్లిగానే ఉండనివ్వండి. అంతే కానీ అటో కాలు ఇటో కాలు వేసి గవద బిళ్ళల్లా అన్నీ వాపు చేయించుకుంటే ఎట్లా?

కళ్ళు పోయాక సూర్యనమస్కారాలకు పాకులాడినట్టు పాకులాడితే సూర్యమూ కనపడ్డు, నమస్కారమూ చెయ్యలేము. మన పిల్లలు కొబ్బరి కాయలైతే నీళ్ళు వాటంతటవే వస్తై. మనం చొప్పించక్ఖరలా. అప్పుడు కొబ్బరికాయెందుకవుతుందీ అది ? గుడ్డి కంటే మెల్లే నయం అంటారేమో. అదీ నిజవే! కానీ అందరూ మెల్లైతే ఎవడెటు చూస్తున్నాడో వాడికీ తెలవదు, వాణ్ణి చూస్తున్న ప్రపంచానికీ తెలవదు. అంతా అయోమయంగా అయిపోదూ ?

మంచి బట్ట కట్టుకుంటే పోయిందా, ఇల్లంతా ఈగలు, దొడ్డంతా దోమలూ ఉండగా? ముప్పాతిక శాతం ఈ భాషారుపులు అరిచేవాళ్ళవి అర్భాటాలు, పెడబొబ్బలే కానీ ఒంటికి, బుద్ధికి పనికొచ్చే సంగీతం కాదు.

పెదాలకు బెల్లం పూసుకుని హలో హనీ అంటే సరిపోతుందా? అసలు హనీ మనసులో ఉండొద్దూ ? ఈ చదువూ, భాషా ఆ బెల్లాలైపోయినై అందరికీ.

ఎప్పుడో పోతావని తిండి మానేశామా? బట్ట మానేశామా? తిరగటం మానేశామా? ఏవిటీ మానేశాం? మరి మాటాడుకునే భాషెందుకు మానేశాం ? పశువులూ తింటున్నై, మనవూ తింటున్నాం. వాటికీ మనకూ తేడా ఉందిగా. కనీసం అవి అంబా అని కొన్ని వేల సంవచ్చరాల నుంచి ఒకటే భాష మాటాడుకుంటున్నై. మన దరిద్రానికే వచ్చినై తిప్పలన్నీ.

యెద్దు చస్తే యెముకలన్నా మిగిలె. మనిషి పోతే మాటలన్నీ పోయె. భాషంతా పోయె. బుద్ధి తెచ్చుకో నాయనా! బుద్ధి తెచ్చుకో!

పుణ్యాలన్నీ గొడుగులండీ. పాపాలన్నీ పిడుగులు. భాష నిలబెడితే మనకే గొడుగు. మాట పడిపోతే భాషకే పిడుగు. ఎన్ని పిడుగులు పడ్డా ఇంకా బతికే ఉన్నాం మనం. అదీ విచిత్రం. అదీ గొడుగు గొప్పతనం. కానీ ఆ గొడుగు ఎంతకాలం తట్టుకుంటుందీ. చివికిపోతొంది. చిల్లులు పడిపోయినై. బాగుచేసుకోవాల్సింది మనవే! మనవే!

వెన్న పారేసి వేళ్ళు నాక్కుంటున్నారు. ఖర్మ కాపోతే ఏవిటండీ ఇది ?

తింటూ దవడలు కొరుక్కొని, వచ్చే రక్తం అంతా తాగుతూ అహా ఇదేదో చాలా రుచిగా ఉందే అనుకునే రకాలుగా తయారయ్యాం.

పాలు కొనుక్కుంటున్నాం, బియ్యం కొనుక్కుంటున్నాం, అలాగే భాషా , మాటలు మన పిల్లవాళ్ళకు కొనుక్కుంటున్నాం డబ్బులిచ్చి. మన పని మనం చెయ్యలేక ఎదురు డబ్బులిచ్చి తెలుగు నేర్పించే స్కూళ్ళల్లో చేర్పిస్తున్నాం!

కారు సీట్లో కూర్చోబెట్టటానికి నవ్వుతూనే నానా కష్టాలు పడతావ్! అంతెత్తు అవసరం లేని పీటల మీద, మాటల పీటల మీద కూర్చోబెట్టటానికి ఆయాసమూ, అలసట రొప్పు, రోదన.

ప్రాణాలు పోతున్నైరా దేవుడా అని పెళ్ళాం పక్క్టెముకలు ఎగరేస్తుంటే, ఇదే సందని చక్కిలిగింతలు పెట్టటం ప్రారంభించాట్ట మొగుడు - అలాగుంది మన వాళ్ళ సంగతి.

కంబారు మంచాల రోజులే భాషకు బాగున్నై. దూది పరుపులెక్కాక వొంటికి, బుద్ధికి సుఖాలకొవ్వు అలవాటయ్యింది.

పాచిపోయిన అన్నమూ కూరా బాగుచెయ్యడం ఎవ్వడి తరమూ కాదు. అవి పాచిపోకుండా చూసుకోవటమే మార్గం.

మొండి చేతివాడికి వేరుశంక్కాయలిచ్చి తిను, తిని చూసాక ఎట్టా ఉందో చెప్పు అని బాదినట్టు మన పిల్లల పరిస్థితి అచ్చంగా అదే. పాపం వారి తప్పేమీ లేదయ్యా. మొండిచెయ్యి చేసింది మనమే. బాత్తున్నదీ మనమే.

అయినా నాకెందుకు బొడ్డూడని బిడ్డతో వాదం చేసి లాభమేవిటి. పిచ్చోడితో చదరంగం ఆడితే ఉపయోగవేవిటీ... ప్చ్..

*****************************************

Chandra Latha gaaru - an extension / second part comes out here, though not related to the teaching topic per se. But it just is letting me go deep into my memories and writings too...Since this was incomplete, I have never posted this anywhere. But it comes out today. Thanks to you and the conversation with you! (y)

Monday, October 27, 2014

మీ పిల్లలకు తెలుగు నేర్పిచ్చటమే దండగ!

ఆసక్తికరమైన విషయాలు మాటాడుకున్నప్పుడు, బుర్రకు పని పడుతుంది. మాటాడుకోడం అయిపోయినాక కూడా సాన తన పని తను చేస్తూనే ఉంటుంది. అదీ ఆ ఆసక్తి యొక్క శక్తి. నిన్న అలాటి ఆసక్తికరమైన అంశం రచయిత్రి, ఉపాధ్యాయురాలు అయిన శ్రీమతి చంద్రలత గారితో చర్చించడం జరిగింది. నెమరు సమయంలో, సరే ఆ తొలుస్తున్న దాని గురించి రాసేస్తే ఓ పని అయిపోతుందని మొదలుపెట్టిన పోష్టిది. పూర్తైతే సంతోషం. పూర్తి కాపోతే మీకు మళ్ళీ ఇంకో పోష్టు చదివే అదృష్టం. ఎలాగైనా మీరు అదృష్టవంతులేనని నా నమ్మకం.

సరే సంగతిలోకొస్తే, అసలు వదిలి కొసరు గురించే మాటాడుకుందాం. ఆ కొసరేమంటే, నేను కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడి పిల్లలకు తెలుగు కళాసులు ఉచితంగా చెప్పేవాణ్ణి. నా బోధనా విధానమేమిటి? నేను పడ్డ కష్టాలేవిటి ? నాకు మిగిలిన సంతృప్తి ఏవిటి ? ఇలా ఒక్కోటి కాస్త వివరంగా రాద్దామని ప్రయత్నం. అయ్యా అదీ సంగతి.

ఇహ మైదానంలోకి -

బోధనా విధానం - ఉపోద్ఘాతం, నేనవలంబించిన పద్ధతి

-- అందరు పిల్లలు ఒకలా ఉండరు. ఒకరు చురుకు. ఒకరు మధ్యమం. ఒకరు మందం.
-- పిల్లవాడికి జొరం రాగానే బిళ్ళలేస్తే తగ్గిపోటానికి భాషేమీ క్రోసిను బిళ్ళ కాదు.
-- వచ్చిన పిల్ల/పిల్లగాడు తో ఓ పది నిముషాలు కుర్చొని వాళ్ళ ప్రస్తుత భాషాసామర్థ్య వజను ఎంత అన్నది తెలుసుకోవాలె.
-- వజను తెలుసుకున్నాక తెలుగు మాటాడగలిగినవాళ్ళను ఓ గుంపు చెయ్యాలె, ఇంగ్లీషు తెలుగు మాటాడేవాళ్ళను ఒక గుంపు చెయ్యాలె, తెలుగు రాని వాళ్ళనో గుంపు చెయ్యాలె. వాళ్ళకు విడివిడిగా కలాసులు చెప్పాలె.
-- క్లాసుకొచ్చాక, అందరినీ చుట్టూ గుంపుగా కూర్చోపెట్టుకోవాలె సైజుల వారీగా. పొడుగోళ్ళంతా కుడిచేతి పక్కన. పొట్టోళ్ళంతా ఎడమ చెయ్యి పక్కన.ఎందుకు ? కూర్చోపెట్టుకున్నాక తెలుస్తుంది.
-- తెలుగు మాటాడేవాళ్ళతో మాటలన్నీ తెలుగులోనే, చెప్పటమంతా తెలుగులోనే. ఇంగ్లీషు మాటే వద్దు. మిగిలిన రెండు గుంపులకీ ఇదే విధానం పాటించాలె. అనగా సగం ఇంగ్లీషు, పూర్తి ఇంగ్లీషు లో మొదలుపెట్టి తరువాత తెలుగు ముగ్గులోకి దింపాలె. ఒకటే సారి ముగ్గేస్తే మీకు చుక్కలు కనపడతయ్యి.
-- ముందు తెలుగు మాటాడేవాల్లకి చెప్పిన విధానం చూద్దాం.అ, ఆ, ఇ, ఈ ..అం, అః లు అందరికీ ఒకటే. రూళ్ళ పేపరు, కాంపోజిషను - మొదటి మూడు వారాలు. రాయనివాళ్ళను, రాయలేని వాళ్ళను పక్కన కూర్చోబెట్టుకోని రాయించాలె. అమ్మా నాయనలను ఒకటోసారి హెచ్చరించాలె.
-- క చ ట త ప లు - అ, ఆ లొచ్చేసినై కాబట్టి ఇక్కడ రూటు మార్చాలె. ఒక్కో లైనుకి ఒక వారం, కుదరదంటే రెండు వారాలు. రూళ్ళ పేపరు, కాంపోజిషను - క..జ్ఞా తో పాటు అ, ఆ లు తిరగ రాయించటం. రాయనివాళ్ళను, రాయలేని వాళ్ళను పక్కన కూర్చోబెట్టుకోని రాయించాలె. రాయటం వచ్చేసిన వాళ్ళను అ, క లైన్ల నుంచి అచ్చరాలు కలిపి రాయమనటం. వాళ్ళను కొన్ని ఊహించి కలాసులో చెప్పమనటం. చప్పట్లు కొట్టించటం. ఇతర పిల్లవాళ్లకు మనం కూడా చప్పట్లు కొట్టించుకోవాలె అన్న ఆసక్తి పెంచటం.
-- రెణ్ణెల్లు పోయాక, [రెణ్ణెల్లంటే ఓ ఎంతో అనుకునేరు, నాలుగు రెళ్ళు ఎనిమిది వారాలే, ఎనిమిది క్లాసులే] ఆ తర్వాత వచ్చే ప్రతి నెలలో ఒహ వారం కథల వారం. కథలేందంటే, ఒహ ఐదారు పదాలు వాళ్ళను ఇమ్మని చెప్పి, అవి తీస్కోని (ఒక, ఈక, ఓడ, ఊక, అల - ఇట్లా కొన్ని తీస్కొని ఓ చిన్న కథ చెప్పటం. అనగనగా "ఒక" "ఓడ" "ఊక", "ఈక" తీసుకొని "అల" మీద వెళుతోంది..అప్పుడు...ఇహ దీనికి మీరేది కలుపుకున్నా ఫరవాలా.)
-- ఇహ ఇప్పుడు క కా కీ కీ కు కూ కాంపోజిషను మొదలు. అవ్వొచ్చాక పైన చెప్పిన పదాల, కథ సృష్టి పద్ధతి మళ్ళా రిపీటు.
-- ఆ తర్వాత వొత్తులు, మళ్ళీ పదాల, కథ సృష్టి పద్ధతి రిపీటు.
-- అవ్వొచ్చేసినాక ప్రతివారం బొమ్మల కార్డులో, కాయితాలో ఇవ్వటం. ఆ బొమ్మల పక్కన పేర్లు రాసుకొని రమ్మనటం. దాని మీద ఒహ 3 నిముషాల కథో, కాకరకాయో చెప్పమనటం. ఉన్న భాషా సంపదతోనేలేండి. అలా రాపోతే అమ్మా నాన్నలకు రెండో ప్రమాద హెచ్చరిక.
-- రాయని వాళ్ళకు పనిష్మెంటేందయ్యా అంటే, వాళ్లందరిని ఓ గుంపు కింద పెట్టి రూములోనే ఓహ కార్నరులో "రీడింగు కార్నరు, రైటింగు కార్నరు" తయారు చేస్కొని, అక్కడ కూర్చోపెట్టి పదిహేన్నిముషాల్లో పూర్తి చెయ్యమనటం. అలారము పెట్టటం. అలారము మోగక ముందు పూర్తి చేసినవాళ్ళకు చప్పట్లు. అమ్మా నాన్నలకు చీవాట్లు, ఇంట్లో ఏం చేస్తున్నారు రాయించకుండా అని.
-- సమయం గడిచే కొద్దీ, నానా రకాల పద్ధతల్లో కొత్త కొత్తగా చెప్పటం. అవన్నిటి గురించి రాయాలంటే కుదిరే పనీ కాదు, ఓపికా లేదు కానీ ఒహట్రెండు చెపుతా.
  •   -- రామయ్య, సోమయ్య సంగతులు, కథలు మానేసి కొత్త కొత్తగా పేర్లెట్టి చెప్పాలె వాళ్ళకు సంగతులు.
  •  -- చిన్న పద్యాలు చెప్పాలె, భట్టీయం వేయించాలె. పునశ్చరణ చేయించాలె.
  •  -- చిన్న చిన్న పాటలు చెప్పాలె, పాడించాలె.
  •  -- కలగాపులగంగా అక్షరాలు ఇవ్వాలె. అందులోనుండి పదాలు తయారు చెయ్యమనాలె.
-- తెలుగు రాని వాళ్లకు, ఇంగ్లీష్త్తెలుగు మాట్లాడేవాళ్ళకు - మొదట్లో రెండు భాషల్లోనూ చెప్పాలె, రాయించాలె. తర్వాత తర్వాత ఇంగ్లీషు ఊడగొట్టి వెనకమాల పడెయ్యాలె.
-- పిల్లల్లో ఎంతో కొంత ఆర్టొచ్చిన వాళ్లుంటారు. వాళ్ళ చేత పేర్లు రాయని బొమ్మలేయించి, క్లాసులో ఆ బొమ్మలు చూపించి వాటికి పేర్లు తెలుగులో రాయించాలె. చప్పట్లు కొట్టించాలె.
-- పరీక్షలు పెట్టటం, ఫస్టు నుంచి ఐదు దాకా నిలబడ్డ పిల్లోళ్ళకు చిన్న చిన్న ప్రైజులివ్వటం - ఇవన్నీ మామూలే
-- ఫీజులు గట్రా లేకుండా పూర్తి ఫ్రీగా చెప్పటం.


నేను పడ్డ కష్టాలేవిటి ?

-- పడ్డ కష్టాలు అన్నీ తలిదండ్రులతోనే.
-- దాదాపు 80 శాతం మంది పిల్లలకు భాష నేర్పిద్దామన్న ఉద్దేశంతో కాకుండా, ఇంట్లో కూర్చోటమెందుకు ఆ క్లాసులో పారేస్తే మనకు కస్త ఊసుపోక సమయం చిక్కుతుంది, ఓ గంటన్నర రెండు గంటలు మొత్తంగా గాలితిరుగుడికి ఖాళీ దొరుకుతుంది అనే ఉద్దేశమే నాకు కనపడ్డది. ముందు దాన్ని ఎదుర్కోటానికే ఎక్కువ సమయం పట్టింది.
-- పెద్దవాళ్లకు పిల్లలను కూర్చోబెట్టుకొని హోం వర్కు, పునశ్చరణ చెయ్యించే ఓపికల్లేకపోటం చూసి రౌద్రాకారం దాల్చటం. [చప్పట్లు కొట్టించుకోవాలనుకున్న పిల్లవాళ్ళకు చెప్పనక్కరలా, చక్కగా ఇచ్చిన హోము వర్కు తిప్పలు పడి చేసుకొచ్చేవాళ్ళు.]
-- ఇంకే కొత్త పద్ధతుల్లో చెప్పవచ్చు అన్న ఆలోచనతో ఉన్న నాలుగు వెంట్రుకల్లో మూడు ఊడినై.
-- ప్రతి రెండోవారమో ,మూడోవారమో అబ్బా తొక్కలో తెలుగేగా, పైగా ఫ్రీ కూడానూ అని క్లాసులు కుంటి సాకులతో ఎగ్గొట్టేవాళ్లను చుసి రక్తపోటు పెంచుకోవటం.మూడో ప్రమాద హెచ్చరిక ఎగరవెయ్యటం.

ఇలా ఇంకొన్ని చాంతాడంత కాపోయినా మోచేత్తాడంత ఉన్నయ్...పైన చెపిన విధంగానే వాటన్నిటి గురించి రాసే ఓపిక లేదు.

నాకు మిగిలిన సంతృప్తి ఏవిటి ?

-- పద్ధెనిమిది మంది పిల్లల్లో, తెలివిని బట్టి సానపెట్టగా పెట్టగా, అమ్మానాన్నల పని పట్టగా పట్టగా, పదహారు మందికి లక్షణమైన తెలుగు రావటం.
-- చురుకైన పిల్లవాళ్లు నా దగ్గర కాపోయినా ఎవరి దగ్గరికెళ్ళినా, ఎక్కడైనా ఇట్టే పట్టుకుంటారు. మన ప్రెతాపానికి గీటురాయి ఏవిటంటే, ఆ చురుకుదనం లోపించిన పిల్లలకు నువ్వెలా చెప్పావ్, వాళ్లెంత నేర్చుకున్నారు అన్నదే. అలా ఆరుగురు చురుకు లేని పిల్లలను చురుకు ఉన్న పిల్లలతో సమానంగా తీసుకొచ్చేసా. అదో సంతృప్తి.
-- డ్రైవుకెళ్ళినప్పుడల్లా పిల్లవాళ్ళకు ఐఫోన్లిచ్చి / డి.వి.డు లు పెట్టి దరిద్రం చెయ్యకుండా, నా మాట విని కార్లో ఓహ బుక్కు, పెన్నో/పెనసిలో పెట్టుకొని, పిల్లవాళ్లతో భాషకు సంబంధించిన ఎక్సర్సైజులు చేయించిన కొంత మంది తలిదండ్రులను చూసి తృప్తిగా ఆ రోజు నిద్దరోవటం.
-- ఆ పద్ధెనిమిది మంది పిల్లలూ, ఈరోజుకి ఎక్కడ కనపడ్డా, ఒహ ఇద్దరు తప్ప నాతో అంతా చక్కగా తెలుగులోనే మాట్టాడ్డం ఆనందం కలిగించే విషయం.

అయ్యా అవీ - విధానాలు, కష్టాలు, సంతృప్తులు, ఆనందాలు....

మరి ఒహ సంవత్సరన్న చెప్పి ఎందుకు ఆపేసా అని అడుగుతారా ?

ఉచితంగా చెపుతున్నా ఈ తలిదండ్రుల అలసత్వం చూసిన్నూ, ఇంకా మరికొన్ని కారణాల మూలాన్నూ...అవి అన్నీ తర్వాత తీరిగ్గా ఎప్పుడైనా....

చివరిగా ఒహ మాట చెప్పాలె - చెప్పేవాడికి, అంటే టీచరుకు తన దగ్గర నేర్చుకునేవాడి మీద కొన్ని సహజమైన ఆశలు ఉంటాయి. కొన్ని పెట్టుకుంటాడు. అవి నెరవేరినప్పుడు ఇద్దరికీ, వాళ్ళిద్దరితో పాటు పిల్లవాళ్ల అమ్మానాన్నలక్కూడా సంతోషమే. కాపోతే ఆ పిల్లవాళ్ళకు భాష నిజంగా రావాలంటే వాళ్ళకిచ్చిన మెటీరియలొహటే ఉపయోగించుకొనేలా కాకుండా, అమ్మా నాన్న కూడా తమ వంతు ప్రయత్నం చెయ్యాలె, వాళ్ళ భాష పెరిగేందుకు అవకాశమివ్వాలె.  

లేకుంటే అసలు క్లాసులకు తీసుకు రావటమే దండగ. మీ పిల్లలకు తెలుగు నేర్పిచ్చటమే దండగ.

ఓం తత్ సత్!

Sunday, October 26, 2014

Open Invitation! Your Choice And A Big Thank You!

It always surprises me when I look at the statistics of the website. This year was no different than the previous ones. Close to 5 million hits and couple more months to go, it is doing its job to get the cultural, literary content reachable to a wider audience.

Most hits were on, All India Radio content, which was a heart warmer! A big thank you to all of the folks who come in and check the content out. All blessings counted and yes, that credits go to you all, and all the contributors.

Any one else wants to share their treasures, this is an Open Invitation. Please feel free. Please make your stuff available.Please share. Please send me your stuff. It will be made available to all those waiting souls. Your choice of participation will enrich this world.

Let it all be shared. Let people have fun. Let people know their roots. Everyone should share what they have. Everyone should share it right when you have it, then and there. Not once in a while. Knowledge in knowing that something we do not know or something we might have known in the past is out there somewhere is beautiful. It is not a dog-biscuit. Neither should the people wait for those beautiful beasts. Some may dis-agree. But yeah, what about it ?


That aside, checking the blog stats, I have a whopping 1520 posts, eh ? vow, did not even realize that I had that many. While 1156 are made public, what surprised me was that there are 364 in draft mode. When will I get to make those drafts public? Ughh!

Wish the day was 48 hrs instead of 24.

Friday, October 17, 2014

అందువల్ల నువ్వే గొప్ప. నీ రామాయణమే గొప్ప!

అనగనగా ఓ భూలోకం.

అందులో ఓ రామాయణం.

అది రాసిందెవరు ?

వాల్మీకి అనే ఆయన.

గణపతే రాసాడనుకో, అది అప్రస్తుతం.

రాయటం అయ్యింది కాబట్టి జనాల్లోకి వదిలేసాడు.

జనాల్లో విభ్రమం మొదలయ్యింది.

అందరూ సమ్మోహితులైపోయినారు.

అది చూసి తీరిగ్గా కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు.

పై నుంచి అది చూసాడు నారదుడు.

ఆయనకు దురద పుట్టింది.

ఇహనేం ? ఓ రాగం అందుకున్నాడు.

చక్కా బయల్దేరి కిందకొచ్చేసాడు.

పాటలు పాడుతున్నాడు.

మధ్య మధ్యలో నారయణ నారాయణ అంటున్నాడు.

వాల్మీకి కాలు మీది కాలు కిందకి దించి దణ్ణం పెట్టాడు.

ఏవిటీ సంగతి స్వామీ, ఇల్లా వచ్చావ్? అన్నాడు నారదుడితో.

కడుపుబ్బిన నారదుడు ఆ కడుపు పగిలేలా నవ్వాడు.

నవ్వితే నవ్వావ్ గానీ, అలసిపోయుంటావ్, పాలు తాగుతావా? మజ్జిగ తాగుతావా? అని వాల్మీకి బోల్డు పెశ్నలేసాడు.

మజ్జిగా వద్దు, పాలు వద్దు, నా చిడతలూ వద్దు కానీ నీకో సంగతి చెప్పాలన్నాడు నారదుడు.

నా నెత్తికి గడ్డానికీ ఏదో తెచ్చుంటావ్ నువ్వు, గడ్డమా, నెత్తా చెప్పు అన్నాడు వాల్మీకి.

రామాయణం ఎందాకా వచ్చిందన్నాడు నారదుడు.

అయిపోయింది స్వామీ అన్నాడు వాల్మీకి.

అయిపోయిందా? జనాలేమనుకుంటున్నారు దాని గురించి అన్నాడు నారదుడు.

అబ్బో, ఓయబ్బో - ఇంతకన్నా మించింది ఈ ప్రపంచకంలోనే లేదు అంటున్నారన్నాడాయన.

ఓస్! ఓస్! ఆగు, ఆ జాంబవంతుడు కూడా రాసాట్ట రామయణం అన్నాడు నారదుడు.

అవునా నాకు తెలియదే. ఎలా ఉందిట అన్నాడు వాల్మీకి.

అసలు ఏడేడు నలభైతొమ్మిది లోకాల్లో అంత బాగున్న రచన ఇంకోటి లేదని అందరూ అనుకుంటున్నారు అన్నాడు నారదుడు.

ఏవిటీ? అయితే ఇప్పుడే వెళ్ళి దాని సంగతేమిటో చూడాలె అని మూట ముల్లె సద్దుకొని జాంబవంతుడి దగ్గరకు పొయ్యాడు వాల్మీకి.

వాల్మీకెళ్ళేప్పటికి జాంబవంతుడు గోళ్ళు సవరదీసుకుంటూ కూర్చున్నాడు ఇంట్లో ఉన్న గుహలో.

జాంబవంతా, ఓ జాంబవంతా, ఎలా ఉన్నావ్ నాయనా? ఏదీ నీ రామాయణం ఓ సారి చూపించు అన్నాడు వాల్మీకి.

అదిగో ఆ తేనెతుట్టె మీద ఉంది చూసుకో అని జాంబవంతుడు గోళ్ళ గోలలో పడిపొయ్యాడు.

తేనెటీగలు అవ్వీ నన్ను కుట్టి తాట వలుస్తయ్యేమో నాయనా, కాస్త సాయం చెయ్యు అన్నాడు వాల్మీకి.

ఆ తుట్టె ఖాళీది. తేనెటీగలు ఆ రామాయణం తేనెని తిరగతాగేసి బయటికెళ్ళిపోయినై, పొలాల్లోనూ, జనాల్లోనూ పాకించటానికి. నీకేం భయం లేదు అన్నాడు జాంబవంతుడు.

మరి ఈ తుట్టెలో ఎక్కడ ఉన్నవీ తాటాకులు? కనపడవే అన్నాడు వాల్మీకి.

ఆ ఖాళీ తుట్టె గోడల మీద రాసాను చదువుకో అన్నాడు జాంబవంతుడు.

కొంచెం సేపయ్యాక భోరు భోరుమంటూ ఏడుపు వినపడ్డది జాంబవంతుడికి.

ఏవిటీ? ఎవరా ఏడ్చేది అన్నాడు వాల్మీకితో.

నేనే అన్నాడు వాల్మీకి.

ఎందుకూ ఏడవటం, బాగులేదా ఏమిటి అన్నాడు జాంబవంతుడు.

బాగోకపోవటమేమిటీ? తేనె ఎందుకు పనికొస్తుంది నీ రాత ముందు అన్నాడు వాల్మీకి.

మరి ఏడవటం ఎందుకు నాయనా, ఆనందంతోనా ? అన్నాడు జాంబవంతుడు

నా ఏడుపు అది బాగున్నందుకే. నీదింత బాగుంటే నాదెవడు చదువుతాడు బాబూ అన్నాడు వాల్మీకి.

సర్లే నా దార్లోకే వచ్చావ్ నువ్వూనూ? నేనూ ఇలానే ఏడ్చా హనుమ దగ్గర అన్నాడు జాంబవంతుడు.

వాల్మీకి కళ్ళు విచ్చుకొన్నై. ఏడుపు ఆగింది.

ఏవిటీ, ఇంత పెద్దవాడివయ్యుండీ నువ్వు ఏడవటమేమిటి, సంగతి చెప్పు అన్నాడు వాల్మీకి.

హనుమ కూడా ఓ రామాయణం రాసాడు. తెలుసా నీకు? అన్నాడు జాంబవంతుడు.

అవునా, నాకు తెలియదే, అదెలా ఉన్నదో? అన్నడు వాల్మీకి.

నువ్వేడ్చావే నా రామాయణం చూసి, అక్కడికెళ్ళి అదే పని నేను చేసా అన్నాడు జాంబవంతుడు.

అంత బాగుందా? అయితే ఇప్పుడే వెళ్ళి హనుమను చూడాలె, ఎక్కడున్నాడో తెలుసా అని అడిగాడు వాల్మీకి.

నాకు తెలియదు - కదళీ వనంలోనో, దండకారణ్యంలోనో, ఋష్యమూకమ్మీదో ఉంటాడు. అయినా ముందు కదళీ వనంలో చూడు అన్నాడు జాంబవంతుడు.

వెళతా కానీ మరి, మరీ అంటూ చేతులు నలపటం మొదలుపెట్టాడు వాల్మీకి.

ఏవిటయ్యిందీ? దురదగా ఉన్నదా ఏమి? ఇలా రా, నా గోళ్ళతో సవరదీస్తానన్నాడు జాంబవంతుడు.

అది కాదు, మరి నీ రామాయణం ఇంత బాగుంటే నాదెవరూ చదవరు, కాస్త దాని సంగతి చూడవా అని చేతులు నలుపుకోటం ఆపి అడిగాడు వాల్మీకి.

ఓస్ ఇంతేగా! నీకోసం ఏదైనా చేస్తా. ఇదిగో ఇప్పుడే ఆ తుట్టెను ముక్కలు ముక్కలు చేసి భూదేవిలో కలిపేస్తానని మాట నిలుపుకున్నాడు జాంబవంతుడు.

అది చూసి మనసంతా నిండిపోయిన ఆనందంతో, సరే, నే పోతున్నా అనటంతో జాంబవంతుడు వెళ్ళిరా, కానీ హనుమ రామాయణం రాసాడని ఎవరికీ తెలియదు. నేను పొరపాటున నీ ఏడుపు చూసి నోరు జారా. నే చెప్పానని చెప్పబోకు హనుమకు అన్నాడు

అలాగేనని వాల్మీకి కదళీ వనానికి పరుగులు తీసాడు.

వాల్మీకి వెళ్ళేప్పటికి కదళీ వనంలో యథావిథిగా రామ రామ అనుకుంటూ ఓ కదళీవృక్షం కింద జపం చేసుకుంటున్నాడు హనుమ.

నాయనా హనుమా! నేను వాల్మీకిని వచ్చాను. కాస్త కళ్ళు తెరు నాయనా అన్నాడు వాల్మీకి.

హనుమ రామ జపంలోంచి లేవలా.

మళ్ళీ పిలిచాడు హనుమా హనుమా అంటూ వాల్మీకి.

ఈసారి అర్థనిమీలనంగా చూసాడు హనుమ.

భుజం మీద చెయ్యేసి ఊపి నేను వాల్మీకిని, నేను వాల్మీకిని అంటూ జపాలోకం నుంచి ఈలోకంలోకి తీసుకొచ్చాడు హనుమను వాల్మీకి.

ఏవిటి సంగతి అన్నాడు హనుమ.

నాయనా నువ్వేదో రామాయణం రాసావుట, జాంబవంతుడు చెప్పాడు అని నోరు జారాడు వాల్మీకి.

హతవిధీ, ఎవరికీ చెప్పొద్దు తాతా అని చెపితే సంగతి మరచిపోయిన ముసలాయనకు మరుపొచ్చేసిందని కాస్త బాధ పడి, రహస్యం బయటపడ్డందుకు చింతించి, హనుమ - సరే, ఆ పక్కనున్న కదళీ వృక్షం మీద తొమ్మిదాకులు ఉన్నై. దాని మీద రాసాను చదువుకో అని మళ్ళీ రామజపంలో మునిగిపొయ్యాడు.

వాల్మీకి ఆ అరిటాకుల దగ్గరకెళ్ళి రామాయణం చదివి రక్కసితుఫానులో గాలి చప్పుడులా ఏడ్చాడు.

హనుమ అడిగాడు ఏవిటయ్యిందని.

మాట రాలా వాల్మీకి నోటినుంచి.

ఏవిటి పుట్టలో పాము దూరినట్టు, కకావికలైపోతున్నావేమిటి అన్నాడు హనుమ.

పుట్ట మాట వినగానే ఏడుపాపుకొని మళ్ళీ జాంబవంతుడి దగ్గరి కథే చెప్పుకొచ్చాడు హనుమకు, వాల్మీకి.

అది విని ఓస్ ఇంతేనా, ఇదిగో ఆకుల్లేవ్, ఏవిటి లేదు అంటూ ఆకులన్నీ పరపరా చించేసాడు హనుమ.

దాంతో తేరుకున్న వాల్మీకికి, నెమ్మదిగా జ్ఞానోదయం అయ్యింది.

అయ్యి, అడిగాడు హనుమను - హనుమా, నువ్వు, జాంబవంతుడు నా మాట మన్నించి నా రామాయణమే ఈ లోకంలో నిలబెట్టేట్టు చేసారు. అందుకు ఋణం ఎలా తీర్చుకోవాలె తెలియట్లా అని.

హనుమ అన్నాడు - స్వామీ, నీకు ఉన్నది - వచ్చే పేరు గోల, చరిత్రలో నిలచిపొయ్యే దురద గోల. నాకు - రాముడి గోల. నాకొచ్చిన చిన్నపాటి భాషతో, తీరికగా ఉన్నప్పుడు ఏదో రాసుకున్నది. నీకు రామాయణం నిలవాలె. నాకు నా రాముడు నిలవాలె. ఎలాగైతేనేం, నీ వల్ల, నీ ఒక్క రామాయణమే ఈ లోకంలో ఉండటం వల్ల నా రాముడు జనాల్లో లక్షల సంవత్సరాలు నిలిచిపోతాడు. నా రాముడికి అంత భాగ్యం కలిగితే అంతకన్నా ఏం కావాలె నాకు ? ఈ ఆకుల మీద రాసుకున్నది నాకోసం. నువ్వు రాసింది జనాల కోసం. అందువల్ల నువ్వే గొప్ప. నీ రామాయణమే గొప్ప అంటూ అక్కణ్ణుంచి అంతర్థానమైపోయాడు.

వాల్మీకి నోట మాటే రాలా.

******************************

-- అయ్యా, అమృతాన్ని, రామామృతాన్ని తేనెతుట్టెల్లోనూ, అరటి ఆకుల్లోనూ నిలిపి పరుల కోసం త్యాగం చేసిన హనుమలు, జాంబవంతులు మనలో చాలాకొద్ది మందే. వాల్మీకులు బోలెడు మంది.

-- ఇహ మీ మీ ఊహకే వదిలేస్తున్నా, ఊహతో రాసిందే అయినా, దీన్ని దేనికి అన్వయించుకోవచ్చో!! 

-- వాల్మీకిని ఏమాత్రం తక్కువ చేసి చూపిచ్చటం అన్నది ఈ నా ఊహారచన ప్రయోజనం కాదని అర్థం అయ్యిందనుకుంటూ... ఓం తత్ సత్!

-- October 2007 write up, unicoded now.