Monday, August 18, 2014

మీరు అ, ఆ, అం, అః రాయగలరా? అయితే ఇదే మా ఆహ్వానం!

సాహిత్యాభిమానులారా, మీకో సువర్ణావకాశం

మీరు అ, ఆ, అం, అః రాయగలరా? అయితే ఇదే మా ఆహ్వానం.

మీరు చేయవలసిందల్లా కొన్ని వ్యాసాలు, విమర్శలు రాసి పంపించటమే.

ఇంత పొడుగు, ఇంత పొట్టి, ఇంత అడ్డం అని తేడాలేవీ లేవు.

మీరు ఎంతది రాసినా ఎవరికీ అభ్యంతరం లేదు. ముఖ్యంగా సంపాదకులకు, గౌరవ సంఫాదకులకు, విశిష్ట సంపాదకులకు, వగైరా సంపాదకులకు.

మీరు రాసిన దానిని మీ మీ అభీష్టం మేరకు కావాలంటే పీర్ రివ్యూ చేయించటం జరుగుతుంది.

ఆ పీర్ రివ్యూ అభిప్రాయాలు భేషజం లేకుండా మీ రచనతో పాటు ప్రచురించబడతాయి.

మీ రచన మీద వచ్చే కామెంట్లు చఫ్ఫట్లు కొట్టేవి, మరియు భేషైనవి మటుకే అప్రూవ్ చెయ్యబడతాయి.

మీ రచనను తిప్పి కొట్టటానికి కొన్ని అరాచక శక్తులు ప్రయత్నిస్తాయి కానీ, మేము అనగా సంపాదక వర్గ సభ్యులు, గౌరవ సభ్యులు కలిసికట్టుగా వాటి పని పడతాం. అందువల్ల మీరు ఏ భయం లేకుండా మీరు రాయాలనుకున్నది రాసెయ్యవచ్చు.

పోతే - మీ రచనలో వ్యక్తిగత రిఫరెన్సులు లేకుండా ఉండాలి. సబ్జెక్టు మీదనే మాట్లాడాలె.

మీరు రాయవలసిన సబ్జెక్టు ఏమనగా - "నేటి వచన కవిత్వం, వాని కవులు."

వాని మీద కవితలైనా ఫరవాలేదు. కథలైనా ఫరవాలేదు. నవలలైనా ఫరవాలేదు. చిన్న కథలైనా ఫరవాలేదు. గల్పికలైనా ఫరవాలేదు.

ఒక్కో విభాగానికి ఈ క్రింది విధంగా బహుమతులు వుంటవి.

అత్యుత్తమ రచనకు వెయ్యి నూట పదహారు డాలర్లు విలువ కల చప్పట్లు, భుజం మీద తట్టులు.

ద్వితీయ ఉత్తమ రచనకు ఐదు వందల నూట పదహారు డాలర్లు విలువ కల చప్పట్లు, భుజం మీద తట్టులు.

తృతీయ ఉత్తమ రచనకు ఒక వెండి పతకం, విలువ కల చప్పట్లు, భుజం మీద తట్టులు.

మీ రచనలు ప్రచురణలో లేని ప్రముఖ అభూత కల్పన మాసపత్రిక "దునుమాడు"లో ప్రచురించబడతాయి.

మీ రచనలు ఇంతకుముందు ఎక్కడా ప్రచురించబడలేదని మీ కీబోర్డు మీద ప్రమాణం చేసిన పత్రం ఒకటి జతపరచవలసి ఉంటుంది. నమూనా కొరకు రాయండి దునుమాడు అట్ దునుమాడు డాట్ కాం.

పాళీ భాషలోకానీ, కవిత్వం భాషలో కానీ రాసిన వాటికి ప్రత్యేక బహుమతులు కలవు.

ఆఖరు తేదీ అంటూ ఏమీ లేదు. మీ ఇష్టం వచ్చినప్పుడు పంపించవచ్చు. మీ మీ రచనలు తిప్పి పంపబడవు. బాగున్నవి, బాగోలేనివి అని తేడా లేకుండా వచ్చిన ప్రతిదానికి ప్రచురణలో స్థానం కల్పించబడుతుంది.

అభూతమైన, అద్భూతమైన "దునుమాడు" పత్రిక - పాఠకుల, కవుల కర్మ వశాన ఒక వేళ ఎప్పుడన్నా నిజంగా ప్రచురించబడితే ఆరోజు రచనలు పంపిన ప్రతివారికి ఒక వజ్రపుటుంగరం ప్రదానం చేయబడుతుంది. ఆ వజ్రపుటుంగరం మీకు చేరాలంటే తప్పనిసరిగా హామీపత్రంతో పాటుగా మీ మీ అడ్రసులు జతపరచవలసి ఉంటుంది. ఫోనులో సంప్రదించబడాలనుకునేవారు ఫోను నంబర్లు కూడ జతపరచవలసి ఉంటుంది.

ప్రదానోత్సవం కనీ వినీ ఎరుగని రీతిలో - రాయల్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ గోండ్వానా లాండు, సింగారం ఫవుండేషన్ ఆఫ్ సౌత్ అమెరికా వారి సంయుక్త ఆధ్వర్యంలో జరపబడుతుంది. ఈ ఒక్క ప్రదానోత్స్వంలో బద్దలయ్యే రికార్డులు రికార్డు చేసేందుకు గిన్నెసు బుక్కు వారు భయపడతారని మీకు హామీ ఇస్తూ, ఆ ప్రపంచ సభల స్థాయిలో జరుపుటకు మీరు మీ ఇల్లు గుడ్డలు అమ్ముకొని చందాలు జతపరచవలసి ఉంటుందన్న మనవితో ఈ ఆహ్వానానికి ముగింపు పలుకుతున్నాం

ఇహ మీదే ఆలస్యం.

ఓం తత్ సత్!

3 comments:

  1. మాగంటివారూ, మీ ఈ ఆహ్వానాన్ని 'వదంతి', 'దండోరా' పత్రికలలోకూడా అచ్చు వేయించండి. 'ప్రేతాత్మగీతం' పత్రికవాళ్ళు బ్రతికున్నవాళ్ళ రచనలేవీ వేయరు కాబట్టి వారిని మీ ఆహ్వానం అచ్చువేయమని అడగనవుసరం లేదు.

    ReplyDelete
  2. నిజంగా తప్పట్ల వేయిన్నూట పదహారు డాలర్లు బహుమతిగా ఇస్తారు అనుకొన్నాను సుమా ...... ఓ మాట రాసేత్తే పోయేదేముందనుకొన్నాను....

    ReplyDelete