Sunday, August 17, 2014

కథలంటే ఇవీ !

గుండెలు పిండెయ్యటం అంటే తెలుసు కానీ జ్ఞాపకాలు పిండెయ్యటం అంటే ఏమిటో తెలుసా? పిండి ఆరబొయ్యటం అంటే తెలుసు కానీ జ్ఞాపకాలు ఆరబొయ్యటం అంటే ఏమిటో తెలుసా? నీట్లో వెలగాల్సిన కార్తీక దీపాలు గుండెల్లో వెలగటం అంటే ఏమిటో తెలుసా? తెలీదా అయితే ఈ కథలు చదవాల్సిందే. పిండేసుకోవాల్సిందే. ఆరబోసుకోవాల్సిందే. పట్టణాల్లో పెరిగిన పట్నం బాబులకు కాదు కానీ పట్నం వాసన సోకకుండా పెరిగిన పిల్లలు, సగం పట్నం సగం పల్లె జీవులు, మాలాటి వారు మళ్ళీ మళ్ళీ చదువుకోవాల్సిన కథలు అవి.

పట్నం బాబులకు పల్లెవాతావరణం ఏమిటో తెలీచెప్పే కథలవి. ఆ పల్లెల్లోని మనుషుల మనసులు తెలియచెప్పే కథలవి. ఎసట్లో ఉడుకుతున్న వడ్ల గింజ మీద, బియ్యపు గింజ మీద, మరిగే నీటి కుత కుతల మీద లక్షలాది పిండివంటలు చెక్కేసిన కథలవి. పిడికెడు మట్టిలో యశోదమ్మకు భువనాలు చూపించాడు ఆ కిష్టప్ప, ఈ కథలు రాసినప్ప పిడికెడు అక్షరాల్లో ఆ అనంతమైన భువనాలు మీద నాట్యమాడే భావాలు చూపించాడు. ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో, సరస్వతీ అమ్మవారి కరుణతో మన భాషామ తల్లికి తల దువ్వి బొట్టు పెట్టి చేతికి అద్దమిచ్చాడు. ఆ అద్దంలో ఆవిడను ఆవిడే చూసుకుని ఎంతలా మురిసిపోయుంటుందో.

మన్నూ మిన్నూ ఏకమైతే ఎట్లా ఉంటుందో తెలియదు కానీ, ఈ కథల ప్రవాహంలో పడితే ఆ మిన్నులోనుంచి కురిసిన తొలకరివాన జల్లుతో విరబూసిన సన్నజాజుల్లా, పొన్నాగ పూలలా, పారిజాత పుష్పాల్లా గుండెలోకి జారిపోతూ, ఆ మిన్నురిమిన తొలివానజల్లుకు బయటపడి మత్తెక్కించే మన్ను వాసనను, ఈ కథల జ్ఞాపకాలను మర్చిపోవటం అసాధ్యం.

ఆయన ఆ కథలకోసం రాసిన మాటలు భూచక్రాలు. చక్కగా నేల మీదే ఉంటవి. గిర్రున తిరుగుతవి. మనల్నీ హత్తుకొని తిప్పుతవి. రంగు రంగుల కాంతులు వెదజల్లుతవి. ఒక్కోటి చదువుతుంటే జోరున కొట్టే వానజల్లులో తడిసి ముద్దైపోతున్నా, ఎప్పటికీ ఈ వాన ఆగకూడదయ్యా అనిపించే కథలివి.

అంత మధురంగా రాయటం ఎట్లా చేతనయ్యిందయ్యా నీకు? పేరులోనే ఆ మహాదేవుణ్ణి పెట్టుకున్నావనా, ఆయనే స్వయంగా అక్కడినుంచి దిగేసి వచ్చి నీచేత ఈ కథలు రాయించాడు? ఏదైతేనేమయ్యా - ఈ జన్మ, ఈ జీవితం, ఈ జ్ఞాపకాలు అన్నీ నీ కథలకు ఋణపడిపోయాయయ్యా! ఋణపడిపోయాయ్! ఋణపడిపోయాయ్!

ఒక్కో కథ ఎన్నిసార్లు చదివానని? ఒక్కో జ్ఞాపకాన్ని ఎన్నిసార్లు తవ్వుకున్నానని? ఒక్కో మనిషిని ఎంతలా గుర్తుకుచేసుకున్నానని ? నేనే నీ కథల్లో ఎన్నిసార్లు ఒక పాత్రనైపోయానని? శేషతల్పం మీద పడుకున్న విష్ణుమూర్తి సౌఖ్యం కన్నా ఈ కథల్లో పడుకున్న నా సౌఖ్యమే గొప్పదయ్యా! నా సౌఖ్యమే గొప్పది.

అర్జునుడికి అక్షయతూణీరం ఉంటే ఉన్నది, నీకు అక్షరతూణీరం ఇచ్చి మా మీదకి వదిలేసాడయ్య ఆ మహాదేవుడు. వదిలేసాడు. ఇంతకన్నా ఇహ మాటలు రావట్లా స్వామీ. రావట్లా. ఒకటా రెండా ఏకంగా ఒక వంద. ఆ వందలో కదిలించేవి 90 పైనే. కదిలించనివి నాలుగో ఐదో. ఆ నాలుగైదు ఉండటం నా దురదృష్టమే. అదీ ఎందుకంటే ఆ కథల్లోని పాత్రలు, ఆ అనుభవం నాకెదురుకాక. వస్తున్నా మళ్ళీ నీ ఆ కథల్లో లీనమవ్వటానికి. ఆ మాటల్లో లీనమవ్వటానికి. ఆ జ్ఞాపకాల్లో లీనమవ్వటానికి. శంభో శంకరా, ఆ కథాసాగరంలో మునిగిన ఈ అభాగ్యుణ్ణి తేల్చి ఈ ఒడ్డున పడెయ్యవయ్యా. ఎందుకా? మళ్ళీ ఆ జ్ఞాపకాల్ని ఇంకోసారి చదువుకోటానికి. ఆ ముత్యాలని తనివితీరా తడుముకోటానికి.

*****శ్రీ శంకరమంచి సత్యం గారి అమరావతి కథలు, నూటా యాభయ్యోసారి చదివిన తర్వాత కలిగిన ఆనందానికి అక్షరరూపం ఈ పోష్టు.No comments:

Post a Comment