Friday, August 15, 2014

ఇవి చదివి నేను బతికుండడం దండగ అంటున్న ......!!

సూతుడు: శౌనకా, ఒక సందేహం. సరస్వతీ నది అంతర్ధానం ఎట్లా అయ్యిందో నీకు తెలుసని నాకు తెలిసినది. ఆ వివరము ఈ పోష్టు చదివేవారందరికి తెలియచెయ్యవలసిందిగా ప్రార్థన.

శౌనక: నీతో ఉన్న స్నేహం వల్ల, అడిగావు కాబట్టి ఇదిగో తాళపత్రం మీద రాసిపెట్టిన ఈ రాత చదువుకో. ఇంతలో నేనెళ్ళి తినేసొస్తా!

(ఇలా అంటూ శౌనకుల వారు భోజనమునకు అరిగిరి. సూతుల వారు చదివిరి)

ప్రథమ చివరాఖరి రంగము - సరస్వతీ నదీతీరము
(చేతిలో చించేసిన చెత్త కవితల ముక్కలతో కొందరు పాఠకుల ప్రవేశము)

అందరు కలిసి పాట

ఏడుపావతి రాగం - కోపపు తాళం

భాగీరధి మా తల్లి!
కరుణోదధి కల్పవల్లి
భాగీరధి మా తల్లి!
వేగ మా కైతంబుల
వేలార్పుము ధృతిబేర్పుము
భాగీరధి మా తల్లి!
అఖిలదోషములు నీవే
యణంపగల పావనివని
నిఖిలభారము నీయెడ
నిలిపితిమో దీనావని
భాగీరధి మా తల్లి!


(సరస్వతీ జలమునందు ఆ చెత్త కవితల చిత్తుకాగితములు అర్ఘ్యము వదలి ఒకే ఒక్క మునకతో స్నానము ముగించి పరుగు పరుగున నిష్క్రమణ)

అశరీరవాణి: కర్మ ప్రభావం కంటె కవి ప్రభావం తీవ్రమైనది. కర్మ ప్రభావం ఏడు జన్మల తరువాత దాని మీద దానికే విసుగు పుట్టి అంతమవుతుంది. కవి ప్రభావము ఏడేడును ఏడేడుతో హెచ్చవేసి దానిని మరొక ఏడుతో గుణిస్తే ఎన్ని జన్మలొస్తవో అన్ని జనమల వరకూ వదలదు. కవిప్రభావ శక్తిని తప్పించుకొని ఈ భూలోకంలో నడిచిన ఘనుడు, ఘనాపాఠీ ఒక్కడైనా ఈరోజు వరకు కనిపించలేదు. కనిపించాడన్న మాట ఆకాశవాణికి వినిపించలేదు. నరులు తెలిసి తెలియక చేసే సామాన్యమైన పనుల కర్మ చింతలకు గురిచేస్తే, కవి తెలిసో తెలియకో చేసే అసామాన్యమైన కవితల కర్మ అష్టదరిద్రాలకు, అష్టకష్టాలకు కారణమై పాఠకుడిని అష్టదరిద్రాలతో తైతక్కలాడమని నెత్తిన శఠగోపం పెడుతుంది. ఈ రోజు సరస్వతీదేవి నెత్తిన ఆ శఠగోపము వచ్చి చేరినది. ఇహ ఆవిడను రక్షించువారు ఎవరు ?

(గలగలలాడుతూ సరస్వతి నదీదేవి ప్రవేశం)

సరస్వతి నదీదేవి: ఏమి ఈ కాగితములు ? తెల్లని బంతి పూలవలె తేలుతున్నై. వాటి మీద ఏవో రాతలున్నవే. ఫిరానా మీనములారా కాస్త ఆ ముక్కలు పట్టుకొని తీసుకొని రండి

ఫిరానా మీనములు: అమ్మా, ఎకసక్కాలు కాకపోతే, ఎంత పాషాణహృదయాధిదేవతవైతే నువ్వు ఆ మాట అనగలవమ్మా?

సరస్వతి నదీదేవి: ఏమిరా? ఏమయినది మీకు ?

ఫిరానా మీనములు: వాని మీద ఆ చెత్త కవిగారి రాతలున్నవమ్మా. వాటి జోలికి వెళితే మా పళ్ళన్నీ ఊడి పుసుక్కున రాలి ఊరుకుంటాయి

సరస్వతి నదీదేవి: ఆశ్చర్యముగా ఉన్నదే. అరివీరభయంకమైన ఫిరానా చేపలే అంత భయపడితే ఎట్లా? ఆ మొసళ్లని ఇలా పిలువండి

మొసళ్లు: అమ్మా. ఆ పని ఒక్కటి తక్క ఏదన్నా చెప్పు చేస్తాం. గజేంద్రుణ్ణి పట్టుకుని విష్ణుమూర్తిచేతిలో మళ్ళీ చచ్చూరుకుంటాం కానీ, ఆ కాగితాల దగ్గరికి మటుకు వెళ్ళం.

సరస్వతి నదీదేవి: హతవిధీ! మీరు కూడా? సరే వాటి సంగతి ఏమిటో నేనే చూస్తా. ఆ హంసలను ఇలా పిలవండి. రథం కట్టుకొని రమ్మని చెప్పండి. నెమ్మదిగా అలా అలా ఓ సారి వాహ్యాళికి వెళ్ళొచ్చినట్టు ఆ కాగితాల సంగతి చూస్తా.

హంసలు: (గుటకలు వేస్తూ) అమ్మా సరస్వతీదేవి. వాహ్యాళికి తీసుకెళ్తాం కానీ ఆ కాగితాల దగ్గరికి మాత్రం తీసుకెళ్ళలేం. మమ్మల్ని కాకులుగా పుట్టమని శపించినా సరే, అలా నాలుగొందల తొంభై జన్మలు కావు కావు మంటూ అరుచుకుంటూ బతుకుతాం కానీ...

సరస్వతి నదీదేవి: అరే! ఆశ్చర్యం.

హంసలు: అవునమ్మా. ఆ కాగితాలు నీళ్ళల్లో వదిలి పరిగెత్తిన వారి పరుగు మీరు చూడలేదు. అవి చూసుంటే మీకు పాఠం పూర్తిగా అర్థమైపోయేది..

సరస్వతి నదీదేవి: సరే, ఆ తెల్లటి నురగలను పిలవండి. అలా అలా తేలిస్తూ నాదగ్గరికి తీసుకురమ్మనండి

నురగలు: అమ్మా మా నోట్టొ కాస్త కవికూట విషం పోస్తే నురగలు కక్కుకుంటూ చస్తాం కానీ, ఆ కాగితాలను తెమ్మని మటుక్కు అడక్కమ్మా.

సరస్వతి నదీదేవి: ఏమి ఈ విచిత్రం. సరే నేనే వెళ్ళి వాటి సంగతేంటో చూస్తా.
(అంటూ హొయలు పోతూ, నెమ్మదిగా నింపాదిగా, నిమ్మళంగా పారుకుంటూ వెళ్ళి ఆ కాయితాలు అందుకొన్నది)

ఆవిడ అవి చదివిన తరువాత, కాసేపు తుఫానుకు ముందు కానవచ్చే, వినవచ్చే నిశ్శబ్దం

సరస్వతి నదీదేవి స్వగతం: ఇది చదివాక నాకు ఇహ దారిలేదు. "గంగలో కలవటం తప్ప". ఈ కవితలు చదివిన పాపానికి నాకు నిష్కృతి లేదు. సోదరీ నన్ను నీలో ఐక్యం చేసుకో. ఇలా వీళ్ళ చిత్తు, చెత్త రాతలన్నీ నదుల్లోకి వదిలితే, నదులన్నీ నీలోనో వాళ్ళ అక్కల్లోనో, చెల్లెళ్ళోనో ఐక్యమైపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయినా సరే, పాపం నా కన్నబిడ్డల బతుకు ఏమైపోతుందోననన్న దిగులు కూడా లేకుండా నీ దగ్గరికి వచ్చేస్తున్నా! ఇవి చదివి నేను బతికుండడం దండగ. ఈ శిరోభారం, శిరోవేదన, హృదయవేదన ఆ పరమశివుడు కూడా తగ్గించలేడు. కలుపుకో, కలుపుకో, నన్ను నీలో కలిపేసుకో

(అంటూ సరస్వతీ నది అలా గంగలో కలిసిపోయింది)

పఠకులారా, సరస్వతీ నది అంతర్థానం గురించిన ఈ వివరమైన పోష్టు చదివిన వారు, ఇతరులకు తెలిపిన వారు సకల ఐశ్వర్యాలతో తులతూగుతారని సరస్వతీఅంతర్ధాన పురాణం ముప్ఫై కాండంలో వివరించబడి ఉంది. కావున ఓం తత్ సత్!

No comments:

Post a Comment