Thursday, August 14, 2014

మిర్చీ బజ్జీ - పానీ పురీ - ముంతమసాల - టిపినీ కాఫీ టీ బండి - బానిసత్వం

మిర్చీ బజ్జీ - పానీ పురీ - ముంతమసాల - టిపినీ కాఫీ టీ బండి - బానిసత్వం

మిర్చి బజ్జీ అనగనే నోట్లో ఊట.

పానీ పురీ అనగానే నోట్లో, వొంట్లో, బుర్రలో ఊట.

ముంతమసాల అనగానే నవరంధ్రాల్లోనూ ఊట.

సాయంకాలమైతే చాలు ఈగల్లా మూగిపోటమే.

అదే మూగటం టిపినీల బండి దగ్గర పొద్దునపుట చూడొచ్చు.

కాపీ టీ బండిల దగ్గర ఇరవైనాలుగ్గంటలూ చూడొచ్చు.

సరే ఊట బాగుంది, మూగటం బాగుంది - మరి ఆ చివర్న బానిసత్వం అని తగలేసావేమిటి ?

వస్తున్నా, అక్కడికే వస్తున్నా.

నాకు బళ్ళ దగ్గర మూగటాలు అట్లాటివి అలవాటు లేకపోయినా, అప్పుడప్పుడు మూగే స్నేహితులతో వెళ్ళటం అన్న అలవాటున్నూ, ఆ స్నేహితుల గుంపు లేనప్పుడు పాతకాలంలో రాజుగారు మారువేషంలో వెళ్ళి రాజ్యాన్ని చుట్టి సమాచారాలు తెలుసుకున్నాట్టు నేనొక్కణ్ణే వెళ్ళి ఆ బళ్ళకు కాస్త దూరంలో నిలబడి అసలు జనాలు రాజకీయాల గురించి ఏమిటి మాటాడుకుంటారు అన్నది వినటంలాటి అలవాటున్నూ ఉండేది. అలాటి అలవాటు ఉన్నది కాబట్టి అదేదో సైకో సినిమాలో ఘట్టాలు ఊహించుకోకండి. నేను మంచివాణ్ణే! దానికి ఢోకా ఏమీ లేదు. ఊరకే అన్నాలెండి. ఒక్కడూ ఎవడైనా వెళ్ళి ఊరకే బండి దగ్గర ఎమీ కొనకుండా నిలబడితే వేడి వేడి నూనె నెత్తినొయ్యరూ ? కాబట్టి అట్లాటిదేమీ లేదని - ఊరకే స్నేహితులతో కలిసి వెళ్ళటమేనని చెప్పటం.

ఈ ప్రపంచకంలో పిల్లలు, డబ్బులు, మందు, మాకు, పెళ్ళాం అన్నీ వదిలిపోతాయ్ కానీ కట్టేలపేళ్ళెక్కాక కూడా అలవాటు అనేదొదలదని నాకున్న ఓ గాట్టి నమ్మకం.

అందువల్ల ఈ సారి కూడా ఎప్పట్లానే, హైదరాబాదు వెళ్ళినప్పుడు మా ఇంటి చుట్టుపక్కల ఈ బళ్ళు దొరకటం కష్టం కాబట్టి అందుబాటులో ఉన్న ఒకరిద్దరు స్నేహితులతో కలిసి కాస్త దూరంలో ఉన్న బాగులింగముపల్లికెళ్ళి అక్కడ ఉన్న మిర్చి బజ్జీ బళ్ళ దగ్గర పానీపురి బళ్ళ దగ్గర ఓ "మాటు" తిరిగి వచ్చా.

పాత ట్రిప్పుల్లో మాట్లకి, ఈసారి మాట్లకి కొద్దిగా తేడా కనపడ్డది. బిందెకు చిల్లులు ఎక్కువైనాయ్.

ఎట్లా ఎట్లా? కాస్త వివరంగా చెప్పు.

చెపుతానండి - అంత తొందరైతే ఎలా ?

మిర్చి బజ్జీల బండి దగ్గర డబ్బులిచ్చి వాయనాలు పుచ్చుకున్న సువాసినీ పుత్రులు బజ్జీల కొంగు చేత్తో పుచ్చుకొని సిగ్గుపడుతూ చిన్న ముక్కలు, పెద్ద ముక్కలు, చింతపండు తొక్కులు, ఉల్లిపాయ రేకలు ఆ బండి వాడు ప్లేటులోనో, పళ్ళెంలోనో చిలకరించిన సాసులో అపురూపంగా ముక్కల కన్నా సాసెక్కువ తింటూ, ముందు సాసు ఖతం చేసి , సాసు అయిపోయినందుకు దీనావేశ భరితులై బండి వాడి దగ్గరకు అడుగులో అడుగులు వేసుకుంటూ వెళ్ళి చేతులూ పళ్ళెమూ నులిమి కొద్దిగా గొంతు సవరించుకొని చిన్నగా అన్నా సాస్ ఏస్తావా అని అడుక్కోటం, అడుక్కున్నాడు కదాని బండివాడు అది వినపడనట్టు నటించటం, వీడు కాస్త గొంతు పెంచి మళ్ళీ అడగటం, బండివాడు ఏమిటీ అని ప్రశ్న వెయ్యటం, వీడు మళ్ళీ సాస్ ఎయ్యన్నా అని చెయ్యీ చేతిలో పళ్ళెం సాచటం, అది చూసి బెట్టుతో వాడు సాసు కొద్దిగా చిలకరించటం, ఆ చిలకరించింది చాలదేమోనన్న బెదురుతో తక్కుతూ తారుతూ వీడు పక్కకు వెళ్ళి ఆ చిలకరింపును ముద్దుగా మిగిలి ఉన్న ముక్కలతో పలకరించి మొత్తానికి పని కానిచ్చటం.


 బండివాడు గట్టోడైతే సాసు ఏమన్నా ఊరకే వస్తుందా తమ్మీ అని ఓ ఎటకారం మాట అనటం కూడా కద్దు. అయితేనేం మనకు సిగ్గా ఎగ్గా. దులుపుకుని మళ్ళీ అడుక్కోటమే. అదీ అడుక్కోటంలో ఒక కళ, ఒక విభాగం, కొండొకచో బానిసత్వంలో అవిభాజ్య భాగం.

దాని బదులు వాడి మొహాన ఓ రూపాయి, రెండు రూపాయలు కొట్టి సాస్ ఎయ్యరా అని దర్జాగా అడిగావనుకో వాడు చేతులు కట్టుకొంటాడు నీ ముందు. అదీ తేడా. ఆ రూపాయ్ లేనప్పుడు, అడుక్కోకు. ఉన్న సాస్తోనే ఆత్మాభిమానానికి సద్దిచెప్పుకో. పెద్దపెద్ద వారంతా అడుక్కోకుండా మంచినీళ్ళు తాగి పస్తులుండే పెద్దవారయ్యార్రా పిచ్చివాడా. బజ్జీల సాసు అడుక్కోటం ఏమిటి నిన్ను తగలెయ్య.

దాదాపు ఇదే సీను పానీపురీ బండి దగ్గర టిపినీల బడి దగ్గరా కళ్ళున్నవారంతా చూడవచ్చు. ఎబ్బే మా లెవిలు వేరు బాబూ, మేము బళ్ళ దగ్గరకెళ్ళం, సరోవరు హోటలుకెళతాం, దసపల్లాలో దూకుతాం అంటే మటుకు ఇది నువ్వు చదవాల్సింది కాదు బాబూ.

ఏతా వాతా ఏమిటయ్యా అంటే బండి వాడు బ్రిటిషరు - తినేవాడు భారతీయుడు. తేడా ఏమిటంటే వాడు మన దేశానికొచ్చాడు, ఇక్కడేమో మనమే బండి దగ్గరకు వెళ్ళాం అంతే కానీ అడుక్కోటంలో, బానిసత్వంలో తేడా లేదని తీర్మానించాలని అందరినీ కోరుతున్నానధ్యక్షా! కోరుతున్నాను

1 comment:

  1. పుఱ్ఱెతోపుట్టీన బుద్ధి...

    ReplyDelete