Tuesday, August 12, 2014

నా అద్దంలో బొద్దింకలు, వాటి పిల్లలు చాలా అందంగా ఉన్నాయ్!

అయ్యా పాఠకులారా, అప్పుడెప్పుడో నేను, నా పెన్ను రాసుకున్న-  చుక్కల మధ్యలో ఉన్న చంద్రుడి లాటి వాక్యాలు చదివి వెన్నెల లాంటి మీ అభిప్రాయాన్ని చెబుతే నాలోని సముద్రుడికి ఆటుపోటు తెప్పిస్తా!

*******************************************

వయసు మళ్ళినా అచ్చుకాని కథ నా అద్దంలో ముక్కలైనట్టుంది. నేను తెచ్చిన ఎడిటర్ల తాహతు సరిగ్గా లేదని ఆ సంబంధం వద్దంది. ఎవరో ఎడిటర్ తన అచ్చు సంగతి నిర్ణయించడం మంచిది కాదుట. నేను చేసిన తప్పేమిటో నాకర్థం కాలేదు. కథ మొండితనం చూస్తే చాలా చిరాకుగా ఉంది. ఏం బావుకుంటుందనీ ఇలా పాఠక ప్రపంచంలోకి రాకుండా? పెళ్ళికాని పిల్లలా అలా మిగిలిపోవాలని ఉంది కావాలు. ముదిరిపోయిన ములక్కాడను చూసి ఎంతపని చేసావే ములక్కాడా అంటూ మునగచెట్టు ఏడ్చినట్టు ఏడవాల్సి వస్తోంది. అంతా స్వయంకృతం. కాని దానికేం పట్టినట్టు లేదు. హుషారుగానే ఉంది ఆ బోషాణం దగ్గరి బల్ల మీద.

ఇంతకూ నాకెక్కడ జ్ఞానపీఠం వచ్చేస్తుందేమోనని ఈర్ష్య కావాలు. అచ్చులోకి రాకుండా ఉంటే జ్ఞానపీఠమూ లేదు, పద్మభూషణూ లేదు. నాకు పంగనామాలు చుట్టాలని దానికి బాగా కోరికగా ఉంది అనుకుంటా. అందుకే ఆ కథ నా బల్ల మీద ఉన్న అద్దంలో వికృతంగా కనిపిస్తుంది. 


పేపార్లు కొంటాం అంటూ చిత్తుకాగితాల వాడొచ్చాడు. పేపారు లేదు నా తలకాయా లేదు పొమ్మన్నాను వాణ్ణి. అన్ని పేపర్లు అలా బల్ల మీద పెట్టుకొని పాపం వాడి పొట్ట కొడతారేమిటని కళత్రం నిలదీస్తోంది. పాపం దానికేం తెలుసు, ఎన్ని నెలలు మోసి ఆ పేపరు మీద కన్నానో?

పేపారు వాడు ఈతకాయ ఇచ్చి తాటికాయ లాగుదామని చూస్తాడు ఎప్పుడు చూసినా. నన్ను, నా కాగితాలను దగాచేసి బల్లకేం మిగలకుండా ఉన్నదంతా లాగెయ్యాలని వాడి కుతంత్రం. అందుకే నా అద్దంలో పేపారు వాడు
వికృతంగా కనిపిస్తాడు.వాడి గోల, మా ఆవీడ గోల పడలేక అట్టపెట్టెలోకి ఎక్కించి అటక మీద పారేసా కాయితాల్ని. కాలం గడుస్తూ ఉంది. అటక ఎక్కిన కాగితలను చూస్తూ ఆ దిగుల్లో మరిన్ని కథలు మరిన్ని కాగితాల మీద పిల్లలు పెట్టసాగాయ్. గోవిందా! గోవిందా!

కావాలంటే నేనే పదివేలిస్తా, ఆ పేపర్లన్నీ నాకిచ్చెయ్ అంటాడు పేపార్ వాడు. ఆ పదివేలు నష్టమే, కాగితాలు నష్టమే. అయినా ఫరవాలేదు. కాగితాలను మటుకు అమ్మే ప్రసక్తే లేదన్నాను. అమ్మకపోతే పోలీసు కేసు పెడతానని, జైల్లో తోయిస్తానని ఇంటిముందు కూర్చొని అరుస్తున్న వాడిని చూస్తే నాకొళ్ళు మండింది. ఇంతకుముందు ఎన్ని టన్నులు టన్నులు పుస్తకాలు ఇచ్చానని వాడికి. కృతజ్ఞత లేని వాళ్ళని చూస్తే నాకసహ్యం. నా అద్దంలో వాడి మొహం ఆరేశి కళ్ళతో, మూడేసి ముక్కులతో చాలా వికారంగా కనిపించింది.

ఇంతకీ అచ్చుకిస్తే ఆ ఎడిటరుకు, పబ్లిషరుకు ఎంత సొమ్ము వస్తుందో ఏమిటో ! అందులో నాకేవిటన్నా ఇస్తారో లేదో. ఎడీటర్లు, పబ్లిషర్ల లోకమంతా నా అద్దంలో వికృతకారంలో కనిపిస్తోంది.సంవత్సరాలు గడిచాయ్. చేతికి ఊతకర్ర వచ్చింది. ఓ రోజు చెత్తకథలన్నీ ఎడాపెడా వేసుకునే ఓ పేరు మోసిన ఎడీటరు వచ్చాడు ఇంటికి. దగ్గర వున్న కాయితాలు, కథలు అన్నీ చూపించమన్నాడు. అటక మీద అట్టపెట్టిలన్నీ కిందికి దింపించాడు. దుమ్ము పట్టిన పెట్టెలు అతికష్టం మీద దులిపి మూత తెరిచాడు.

అట్టపెట్టెలనిండా పురుగులు, చెదలు, బొద్దింకలు. కాగితాలు అందులోని కథలు తిని బాగా బలిసి కుప్పలు తెప్పలుగా సంతానాన్ని వృద్ధి చేసుకున్నాయ్. కాయితాలనన్నిటినీ పిప్పి చేసిపారేశాయ్. ఒక్క కాయితమైనా మిగలలేదు. పెట్టంతా కాగితపు పొడి.
ఎడీటరు మొహం వేలాడిపోయింది. మంచి పనయ్యింది. కావాలంటే బొద్దింకల్నీ, చెదపురుగుల్ని తీసుకెళ్ళి అచ్చు వేసుకోమను.

బొద్దింకలు ఇల్లంతా పరుగెత్తుతున్నాయ్. నా అద్దంలో అవీ, వాటి పిల్లలు చాలా అందంగా ఉన్నాయ్. 


*******************************

-- సెప్టెంబరు 2010

No comments:

Post a Comment