Sunday, July 20, 2014

"గొప్పాల" జోలికి ఎందుకు పోతావూ ?

చలం గొప్పా, విశ్వనాథ గొప్పా, కుటుంబరావు గొప్పా, శ్రీ శ్రీ గొప్పా, వారు గొప్పా, వీరు గొప్పా...

తమరి శ్రాద్ధము గొప్ప! తమరి సమాధి గొప్ప!

పైవారంతా మహాపండితులండి. భాష వచ్చిన వాళ్ళండి. కథ ఎలా రాయాలో తెలిసిన వారండి. ఒక్కొక్కరు ఒక్కో పర్వతం. అందరి సంగతి వదిలి ఒక్క ఇద్దరి ఉదాహరణ తీసుకుని మాటాడితే అర్థమవుతుందేమోనని ఓ రెండు ముక్కల.

చలం రాసింది చదివి తమరికి అర్థమయ్యుంటేనూ, విశ్వనాథ రాసింది చదివి తమరికి అర్థమయ్యుంటేనూ - "గొప్పాల" జోలికి ఎందుకు పోతావూ ?

రెండూ రెండు నగాలు. దేని గొప్ప దానిదే! ఆ పర్వతాల శిఖరాలకు తాళ్ళేసి ఇటేపో అటేపో తల వంచుదామని చూస్తే తమరి చేతులు ఊడొచ్చి ఆ ఖండాలు కాకులకు గద్దలకు ఆహరమవ్వటం తప్పితే మిగిలేదీ ఏదీ లేదని తెలుస్కోరా పిచ్చినాయనా!

అయినా వాళ్ళతోనే సాహిత్యం అంతమైపోలేదుగా, ఆ నగాలను వొదిలిపెడితే ఇంకా మిగిలిన వారెంతమందో ఉన్నారు. వారి గురించి మాట్లాడవే ? నామోషీనా, నామర్దానా?

నగాలు దిశానిర్దేశానికే, ఆ శిఖరాలకు చేరుకోవాలని బాటలేసిన వారు ఎంతో మంది. ఆ బాటల్లో పూపొదలు, పొదరిళ్ళు, అందమైన కథలు ఎన్నో ఉన్నవి. అవొదిలేసి నగాల మీదే దృష్టిపెడితే బాట తప్పి ముళ్ళపొదల్లోకి పడతావు. అందువల్ల "గొప్పాల" నొదిలి, గప్పాలు కొట్టకుండా, ఎందరో పరచిన బాటెంబడి పోతూ, వారి రచనలు చదువుకుంటూ ప్రశాంతమైన జీవితం గడుపుకో ఏం?

లేకుంటే మృత్తికాచమే, గిరయశ్చమే, పర్వతాశ్చమే!

కాదూ దున్నపోతు మీద వానే అంటావూ ? అదీ మంచిదే ఎవడో ఒకడు చింతబరికె తెచ్చి వాయించి పాలు పితుకుతాడు ?

అడిగావా? దున్నపోతుకు పాలేవిటని ?

నీకు బుర్రుందన్నమాట. శుభం

Tuesday, July 8, 2014

నాకెందుకులే ఆ పితలాటకం !

2006 వ సంవత్సరం.
ఫిబ్రవరి 19.
ఒక అందమైన సాయంత్రం.
ఒక చందమైన పెళ్ళి.
బోలెడు మంది అతిథులు.
అతిథుల్లో ప్రముఖులు.
పెళ్ళి కాబట్టి బహుమానాలు.
ఆ బహుమానాల్లో రకరకాలు.
ఆశీర్వచనాలు, అభినందనలు.

కట్ చేస్తే -
2014 వ సంవత్సరం.
జులై 6.
ఒక అందమైన ఆదివారం.
ఒక చందమైన ఆబిడ్స్ గల్లీ.
బోలెడు పుస్తకాలు.
ఆకర్షించిన ఒక పుస్తకం.
ఎంత అని కొట్టువాడికి ప్రశ్న.
బోణీ తుమ్హారా హై సాబ్, పాంచ్ రూపయ్ దో!
ఐదు రూపాయలు ఇచ్చుకోలు.
పుస్తకం పుచ్చుకోలు.

కట్ చేస్తే -
ఆ పుస్తకం మొదటి పేజీ.
ఒక అందమన చేతిరాత.
ఒక చందమైన సంతకం.
అది ఒక స్వర సుధాకరుడిది.
రేడియో అభిమానుల చంద్రుడిది.
ఆశీర్వచనాలు, అభినఅందనలతో కూడుకున్నది.

ఆ పెళ్ళి చేసుకున్నాయనకు ఆ సంతకం విలువ తెలుసో తెలియదో కానీ, ఆ అందమైన, అపురూపమైన చేతి సంతకంతో కూడుకున్న ఆ పుస్తకం ఆబిడ్సు రోడ్డు మీదకు వచ్చి, ఆ తర్వాత ఐదు రూపాయలకు నా వశం అయ్యింది.

అయ్యా అదీ సంతోషం.

ఇహ విచారమైన ప్రశ్నలేమనగా -

బహుమానానికి విలువ ఎలా కట్టాలన్నది ప్రశ్న.!
అది చిన్నదా పెద్దదా అన్నది చూడవలెనా?
ఎంత ఆప్యాయతతో, ప్రేమతో ఇచ్చారన్నది చూడవలెనా?
మనకు నచ్చకపోతే రోడ్డు మీదకు గిరవాటు వెయ్యటమా?

ఇలా రకరకాల ప్రశ్నలు.

ఏమోలే!

సరే ఇంతకీ ఆ సంతకం ఎవరిదా?

ఆకాశవాణి ప్రముఖులు శ్రీ ఏడిద గోపాలరావు గారిది.

పుస్తకం పేరు - ఐదు దశాబ్దాలుగా నేనూ నా నాటక రంగం.

అయ్యా ఇంతే సంగతులు చిత్తగించవలెను.

PS: అక్కడే, ఆ ఫుట్పాతు మీదే పుస్తకాల పేర్లు గుర్తుకులేవు కానీ "ఉమా ఇయ్యుణ్ణి" "వంగూరి చిట్టెన్ రాజు" "గొర్తి సాయి బ్రహ్మానందం" "ద్వా నా శాస్త్రి" - ఇలా రకరకాల పుస్తకాలు, నానారకాల రచయితలవి పదుల సంఖ్యలో పడి ఉన్నవి...అయ్యా - ఉచితంగా, అప్పనంగా ఇస్తే, అపాత్ర దానం అవుతుందేమో చూసుకోండి అని చెప్పాలని ఉన్నా, నాకెందుకులే ఆ పితలాటకం అని ఊరకుంటున్నా..