Tuesday, June 17, 2014

కవిత్వం - నరాల్ని, నాడులని ఎలా ప్రభావితం చేస్తుంది?

మీరేం చేస్తుంటారండి ?

నరాలు, నాడులు ఎలా పనిచేస్తయ్యో పరిశోధిస్తూ ఉంటానండి.

పరిశోధక విద్యార్థి అన్నమాట. బాగుంది. ఫలవంతంగా ఉన్నదా?

పరిశోధన ఫలించినా ఫలించకపోయినా బలంగా బలవంతంగా నాకొచ్చిన కవిత్వం నేను రాస్తూ ఉంటానండి.

మీరు కవి కూడానా? బాగుంది. దేనిమీద రాస్తూ ఉంటారు ?

చెప్పాను కదండీ నరాల మీద నాడుల మీద అని.

అది పరిశోధన అన్నారుగా! ఆ మాట విని మీరు డాక్టరేటు వారేమో అనుకున్నా.

భలేవారండి మీరు. కవిత్వంలో కాలేసారు. కవిత్వం, నరాల్ని, నాడులని ఎలా ప్రభావితం చేస్తుంది అన్నది నా పరిశోధన!

ఇదేదో విచిత్రమూ కాక సామాన్యమూ కాక ఇంకేదోగా ఉన్నది.

అంటే మీ నరాలు మీ స్వాధీనంలో లేవన్నమాట.

ఏవిట్రా, నిన్ను తగలెయ్య, నాకు నరాల జబ్బు ఉందంటావా?

ఇంతలోనే అండి నుంచి ఒరేనా. ఇదేనండి, నరాలు స్వాధీనంలో లేకపోటమంటే. నా కవిత ఒక్కటి కూడా చదవలేదు మీరు. అప్పుడే, ఇలా నాడీనరం కోల్పోయి....

మాటలు జాగ్రత్తగా రానీ. తోలు తీసి ఆమూలగా ఒకటి, ఈమూలగా ఒకటి, ఐమూలగా ఒకటి నీ నెత్తికి గడ్డపారతో కుట్టేస్తా.

ఊర్కోండి, నా తలకి ఐమూల ఎక్కడుంది.

ఏదో ఒక మూల, ఇంతకీ ఏవిటంటారు మీరు.

అదీ అలా రండి. ఒరే నుంచి మీరుకు వచ్చేసారు. బాగుంది

సంగతేమిటో చెప్పండి. సోదెందుకు ?

కవిత్వానికి బ్రహ్మాండమైన శక్తి ఉందండి.

శక్తా, సున్నమా! ఏదీ ఒకటి వినిపించు

అదేమిటి మీ కంఠనాళాలు అన్నీ అలా ఉబ్బినాయి?

యెహా ఏదో ఒక ఉబ్బు. ఏదైతే ఏమిటి ?

ఆ ఏమిటి లోనే అంతా ఉంది. నాడీ నాడీ నడుమ నరాలు అంటా నేను.

ఆపండి మహప్రభో మీ నరాల జపం. అసలు కవిత ఏదైనా ఒకటి వినిపించండి.

సరే ఇదిగోండి మీ ఉబ్బిన నరాల కోసం ఒకటి

గుడ్డలేని రోడ్డు
ఐమూలగా కుళ్ళు కాల్వ
పందులతో నీరసరసం
ఐమూలగా మాయమైపోయింది


వీపులేని ఆకాశం
ఐమూలగా మడి మబ్బు
ఏడుస్తూ ఎండుగడ్డి
ఐమూలగా మాయమైపోయింది 


నల్లటి వల్లకాడు
ఐమూలగా శవాలు
ఏడుస్తూ నిద్రలేమి
ఐమూలగా మాయమైపోయింది 


గోటు లేని చోట
ఐమూలగా తీట
రాణివాసపు పేట
ఐమూలగా మాయమైపోయింది

ఆపెయ్! ఆపెయ్! మహాప్రభో ఇది కవితా. అహా! ఏమి సృజన. ఏమి వాత. ఎంత అదృష్టం. నరాలకు అగ్గి పుట్టింది.

చెప్పాను కదండీ, పరిశోధక విద్యార్థినని. నా పనే అగ్గి రాజెయ్యటం. ఆర్పుకోవటం వారి వారి ఇష్టం.*******************


Part 1
originally written in oct 2012.
Unicoded June 2014

This period of 2009 to 2012 was very interesting writing wise. When I am looking at the content in those tonnes of notepads/papers, now, I feel different.

I should start writing once again, on papers, that is. It is fun - the strikings, the rewrites - it's quite intriguing. Anyways...Thanks for your time. Cheers

Monday, June 9, 2014

దేవుడూ అంతే - కావాలంటే వున్నాడు. అఖ్కర్లేక పోతే లేడు !

పాఠకుడు : ఎవరూ ? యాతుడా?

కాలుడు : అవును.

పాఠకుడు : ఉన్నావా ? లేవనుకున్నాను.

కాలుడు : అనుకోలేదు. అనుకున్నాననుకున్నావు.

పాఠకుడు : అన్ని రకాల పాఠకులూ ఇక్కడికి రావలసిందేనా?

కాలుడు : సాహిత్యంలో సౌరత్యం ఉన్నవాళ్ళు

పాఠకుడు : తక్కిన వాళ్ళూ ?

కాలుడు : వాళ్ళ నమ్మకం ప్రకారం

పాఠకుడు : అసలు సాహిత్యంలో నమ్మకం లేక పోతే ?

కాలుడు : ఏమీ లేదు. దేంట్లోనూ నమ్మకం లేని వాళ్ళకి, ఏమిటీ వుండేది?

పాఠకుడు : పఠనం తరవాత జీవితంలోనే నమ్మకం లేకపోతే ?

కాలుడు : పఠనం తోనే ఆఖరు !

పాఠకుడు : నాకూ నమ్మకం లేదే ! చాలా మందికి లేదు ఇప్పుడు.

కాలుడు : లేదంటే చాలదు. నిజంగా, నిస్సందేహంగా లేక పోవాలి. లేని వాళ్ళ జీవితమే వేరు. మృగాలకి లేదు. వాటికి పఠనము, సాహిత్యమూ లేవు. మృత్యువు తోనే అంతం. పఠనంతో నిజంగా సాహిత్యాంతమనుకునే పాఠకుడికి జీవితంపైన ఆ పట్టు ఉండనే ఉండదు. అ రాతలు, ఆ వాదాలూ, ఆ భజనలూ, ద్వేషాలూ నిలచి పని చెయ్యవు. నువ్వు చెప్పేదే నిజమని నీ నమ్మకం. అవన్నీ ఏమిటి ? ఏదీ నిలవక ప్రతి నిముషం బూడిదై పొయ్యే ప్రపంచం లో సత్యమనేది, సాహిత్యమనేది ఎక్కడ వుంది ?

పాఠకుడు : కానీ పాఠక జాతి అభివృద్ధి, సత్యానికి, సాహిత్యానికి కళ్ళు తెరవగల...

కాలుడు : ఏం పాఠకజాతి ? పదేళ్ళ తరవాత ఈ ప్రపంచం వుంటుందని ఆ విశ్వాసమేమిటి ? సత్యమేదో, సాహిత్యమేదో తెలుసుకుంటుందని ఆ ఆశ ఏవిటీ ?

పాఠకుడు : అట్లా అయితే ఈ రచనల్లో విశ్వాసాలేం లేకుండా స్వార్ధంగా బతికేవాడికి ఇక లోకం లేదన్న మాట !

కాలుడు : స్వార్ధంగా బతికే పాఠకుడికి వుంది. వాడు దేనికో బతుకుతున్నాడు గనుక.

పాఠకుడు : మరి ఎవరికి లేదూ ?

కాలుడు : అంటే అందరికీ వుంది. కాని అనేక విధాలుగా వుంది.

పాఠకుడు : నాకు కాలుడు అనే వాడిలో ఎన్నడూ నమ్మకంలేదు.

కాలుడు : అయితే యాతుడివా అని నన్నెందుకు అడిగావు ? యాతుడని నన్నెందుకు అనుకున్నావు ?

పాఠకుడు : అవునేమో, అనుకున్నాను.

కాలుడు : అందుకనే అయినాను.

పాఠకుడు : అనుకోకపోతే ?

కాలుడు : యముణ్ణి కాను.

పాఠకుడు : అప్పుడు ఎవరు ?

కాలుడు : నువ్వెవరని అనుమానిస్తే వాణ్ణి.

పాఠకుడు : తరవాత ?

కాలుడు : తరువాత నువ్వేమని అనుకుంటున్నావో, అది !

పాఠకుడు : ఏమీ అనుకోవటం లేదు.

కాలుడు : అబద్ధమాడకు. నేను చెప్పనా ? సాహిత్యం స్వర్గమా, నరకమా? అనుకుంటున్నావు . అవునా ?

పాఠకుడు : నాకు స్వర్గనరకాలలో నమ్మకం లేదు.

కాలుడు : అదంతా సరేలే. అది భూలోకంలో. పుస్తకాలలో. పఠనంలో.ఇక్కడ నన్ను చూసి అనుకున్నావా లేదా ?

పాఠకుడు : మరి కాలుడు గనక తరవాత అంతేకదా నేను అనుకోవలసింది !

కాలుడు : అవును. అంతే కదా. అదే నిజం !

పాఠకుడు : సరే, ఇది స్వర్గమా, నరకమా ?

కాలుడు : నేను కాలుణ్ణయినప్పుడు, నరకమే గా నీకు ?

పాఠకుడు : నాకు నరకం లో ఎప్పుడూ నమ్మకం లేదు.

కాలుడు : లేదు. కాని నీ ఊహలూ, పఠనాలు, పనులూ, సాహిత్య ప్రపంచం లో ఏ మార్పు తెస్తాయనుకున్నావో ? సాహిత్య ప్రపంచం లోని వాడివేగా నువ్వూను ? నీలో అవి తెచ్చే ఫలితమే నరకం.

పాఠకుడు : స్వర్గం కాకూడదా ?

కాలుడు : కావచ్చు. కాని నరకాన్ని ఏరుకున్నావు.

పాఠకుడు : ఎప్పుడు ?

కాలుడు : అప్పుడే, ఇప్పుడే, నువ్వు పుస్తకం ముట్టినప్పుడే. అంటే నీ జీవితమంతా అన్నమాట!

పాఠకుడు : అంటే ?

కాలుడు : సాహిత్యం ఊహా ప్రపంచం. ఆ సాహిత్యప్రపంచం ఎప్పుడూ పఠనం అనే దాని పర్యవసానం. ఏ రచనకైనా ఫలితంవుంటుంది అనే నమ్మకం వుంటే, మరి ఫలితం వుండకుండా వుండదు. ఫలితం వుండదనే నమ్మకం వుంటే, మరి ఫలితం వుండకుండా వుండదు.

పాఠకుడు : ఆ నమ్మకం లేకపోతే?

కాలుడు : అటూ ఇటూ కాకుండా మిగిలిపోయిన ఫలితాలు అక్కడే ఆ సాహిత్యప్రపంచంలోనే అనుభవించాలి. అప్పుడు స్వర్గం లేదు, నరకం లేదు. కాని ఫలితం కలగదని పనులు చేసే వాళ్ళెవరు ?

పాఠకుడు : నువ్వు యముడవనీ, ఈ సాహిత్య ప్రపంచం నరకమనీ ఎందుకు అనుకున్నానంటే, ఒకప్పటి భయాలూ, అలవాట్లూ వొదలక. అంతే కానీ నమ్మకం వుండి కాదు.

కాలుడు : మరి ఏం విశ్వసించావు ?

పాఠకుడు : నాకేం తెలీదన్నాను.

కాలుడు : సరే, ఇప్పుడు నేర్చుకుంటావు.

పాఠకుడు : ఏం నేర్చుకుంటాను ?

కాలుడు : ఏం నేర్చుకోవాలని వుంటే అదే !

పాఠకుడు : ఏమీ లేదనా!

కాలుడు : అదే నేర్చుకుంటావు. నరకం లో.

పాఠకుడు : మరి ఈ శిక్ష ఎందుకు ?

కాలుడు : నీ సాహిత్యావినీతి కార్యాల ఫలితంగా.

పాఠకుడు : అట్లా రండి. సాహిత్యంలో నీతి అంటే ఏమిటి ? అవినీతి అంటే ఏమిటి ?

కాలుడు : నీకు తెలుసా ?

పాఠకుడు : నాకు తెలీదు. తెలుసునన్నవాళ్ళతో వాదిస్తాను.

కాలుడు : నీ వాదాలు నాకు తెలుసు.

పాఠకుడు : సాహిత్యప్రపంచంలోని పుస్తకాలు చదివారా ?

కాలుడు : నిన్ను చదువుతున్నానుగా ఇప్పుడు !

పాఠకుడు : నేను చాలా సార్లు మారాను.

కాలుడు : అన్ని మార్పులతోటీ స్పష్టంగా నిన్ను చదువుతున్నాను.

పాఠకుడు : మరి చెప్పండి పాఠకనీతి అంటే ఏమిటో ?

కాలుడు : నువ్వేమంటే అదే !

పాఠకుడు : అయితే నాకు శిక్ష ఎందుకు ?

కాలుడు : నువ్వనే పాఠకనీతికే నువ్వు విరుద్ధంగా చాలాసార్లు ప్రవర్తించావు గనక. కాదా ?

పాఠకుడు : అవును. కానీ నా ఆదర్శం చాలా ఉన్నతం.

కాలుడు : కాని, నీ నీతి కీ, నీ ఆదర్శానికీ నువ్వు అపకారం చేసుకున్నావు. దానికి పరిశాంతి ఈ నరకం !

పాఠకుడు : అసలు ఏ ఆదర్శం లేకుండా పుస్తకాల్లోదీ, తోటి పాఠకులనేదీ నీతిగా తీసుకుని బతికే వారికి నీతి గా వుండడం సులభం.

కాలుడు : అవును.

పాఠకుడు : మరి వాళ్ళకి ?

కాలుడు : స్వర్గం

పాఠకుడు : స్వర్గమా ? ఎందుకు ?

కాలుడు : నీతి గా బతికారు గనక. వాళ్ళ మనసులో సాహిత్యావినీతి చేశామనే నేరభావంలేదు గనక.

పాఠకుడు : నేరభావం లేక పోతే చాలునన్న మాట. ఇక నేరమనేది లేదా?

కాలుడు : అదేగా చదివావు ఇన్నాళ్ళూ? సాహిత్యంలో పాప పుణ్యాలు లేవనీ, చదివిన ఊహలను బట్టి మనసు కల్పించుకుంటోదనీ, ఎవరి అంతరాత్మ వారికి ధర్మకర్త అనీ!

పాఠకుడు : అంటే సాహిత్యంలో స్వర్గ నరకాలకి మనసులే ఆధారమా ?

కాలుడు : అవును. అంతే. నువ్వు చదివిన పుస్తకాలే. అందులోని మాటలే. కాని నీకు నమ్మకం లేదన్న మాట.

పాఠకుడు : మరి ఇదంతా నిర్ణయించే దెవరు ?

కాలుడు : నువ్వే !

పాఠకుడు : తక్కినవాళ్ళనీ ?

కాలుడు : వాళ్ళే !

పాఠకుడు : మరి నువ్వూ !

కాలుడు : నువ్వు వున్నావంటే వున్నాను అని చెప్పాను కదూ !

పాఠకుడు : చాలా అన్యాయంగా వుంది వ్యవహారం.

కాలుడు : ఏమిటి ?

పాఠకుడు : చదవలేని సాహిత్యంలో నమ్మకముంచితే, స్వర్గమా ?

కాలుడు : ఆ !

పాఠకుడు : నేను చూసిన దొంగ పాఠకులకీ, మూఢులకీ, పురుగుల్లాంటి రచయితలకీ ?

కాలుడు : వాళ్ళకీ అట్లాంటి స్వర్గమే. అంటే, వాళ్ళు కోరుకునేలాంటి స్వర్గం. వారు ఆరాధించే రచయితా.

పాఠకుడు : ఎంత బుద్ధి హీనుణ్ణి ! నేనూ ఓ రచయితని నమ్మితే …

కాలుడు : ఏం లాభం ? నువ్వు నమ్మలేవు. అయినా ఇప్పుడైనా మించిపోయిందేమీ లేదు. గట్టిగా కోరుకుంటే సాహిత్యవైకుంఠానికి వెళ్ళవచ్చు. కాని నీకెప్పుడూ నరకానికి పోవాలనేగా కోరిక.

పాఠకుడు : మరి వీటిని నిర్ణయించే దేవుడు ?

కాలుడు : దేవుడూ అంతే. కావాలంటే వున్నాడు. అఖ్కర్లేక పోతే లేడు ! 

(Part 1 Complete - Based On Chalam's Writings
Original Write Up in December 2009
Unicoded June 2014)

Part 2 - When ever the typing is done.. :)