Thursday, May 22, 2014

మీరు జడ్జి అనుకోండి, తీర్పు ఏం చెప్తార్?

చిక్కు విప్పవయ్యా చేతనైతే!

శాలివాహన శకం (-3219)
అనగనగా ఒక ఊరు.
ఆ ఊళ్ళో వంద మంది అబ్బాయిలు.
అదే ఊళ్ళో ఎనభై మంది అమ్మాయిలు.
ఆ వందలో కథానాయకులు ఓ ముగ్గురు కుర్రాళ్ళు.
ఆ ఎనభైలో కథానాయిక ఒక అమ్మాయి.
అవును, ఒక అమ్మాయే. ఒకే ఒక అమ్మాయి.

ముగ్గురు నాయకులు. ఒకే ఒక నాయిక.
తెలిసో తెలీకో ముగ్గురూ ఆ ఒకే ఒక నాయిక మీద మనసు పారేసుకున్నారు.
ఆ ఒకే ఒక్క నాయికకు కూడా బాద్షాల్లా ఉన్న ముగ్గురు నాయకులు నచ్చారు.
ఇంతలో అమ్మాయి వాళ్ళ నాన్న ఎంటర్ ది డ్రాగన్.
ఛీ ఛీ ముగ్గురు మొగుళ్ళా, నా కడుపున చెడబుట్టావని నాన్న కోపాలు తాపాలు.
అమ్మాయి భోరు భోరున ఏడుపులు రాగాలు.
డ్రాగన్ మంటలు ఆ భోరులో చల్లపడ్డై.

డ్రాగన్ ఆలోచన చేయగా చేయగా ఒక ఉపాయం తట్టె.
ముగ్గురు కుర్రాళ్ళను పిలిచి, ఓ సంవత్సరం పాటు కష్టపడి రమ్మని ఆదేశం.
నాయకులు దిగాలు పడి, ఆ తర్వాత ఆవేశపడి ఎందుకు ఎందుకు అని కుములే కుములు.
డ్రాగన్ అన్నాడు - నా కూతురికి అతి విలువైన వస్తువేదైన తీసుకొచ్చినవాడికే కట్టపెడతానని.
నాయకులు పొలోమని పరిగెత్తకుండా విలువైనది ఆల్రెడీ ఇచ్చేసాం, మా మనసు అని గోల.
డ్రాగను భగ భగగా బుసలు. త్రినాయకులకు ఠారు. ఇప్పుడు పొలోమని నిజంగా పరుగులు
.
సంవచ్చరం గడిచె.
ఏక నాయకుడు అద్దం తెచ్చె.
ఆ అద్దం మాయా అద్దం.
ఏది కావాలంటే అది కనపడుతుంది.
ఎక్కడుందో చెపుతుంది.
వెళ్ళి చక్కగా తెచ్చేసుకోవచ్చు.
ద్వి నాయకుడు చాప తెచ్చె.
ఆ చాప మాయా చాప.
ఎంతమందినైనా ఎక్కించుకుంటుంది.
ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకుపోతుంది.
త్రి నాయకుడు ఓ దానిమ్మకాయ తెచ్చె.
ఆ దానిమ్మకాయ మాయా దానిమ్మకాయ.
బోలెడు సువాసన. ఎప్పుడైనా కోస్తే సంజీవిని.

ఎంటర్ ద డ్రాగన్ దగ్గరికి వెళ్ళే సమయం.
త్రినాయకులు ఓ చోట.
కుశలోపరులు సమాప్తం.
అద్దం గొప్పలు చెప్పె.
చాప గొప్పలు చెప్పె.
దానిమ్మ గొప్పలు చెప్పె.

ఈ అద్దమేంది, దీని గోలేంది, పని చెయ్యదు పాడు చెయ్యదు పరీక్ష చెయ్యాలనె ద్వి, త్రి నాయకులు.

ఈ చాపేంది, దీని గోలేంది, పని చెయ్యదు చావదు పరీక్ష చెయ్యాలనె ఏక, త్రి నాయకులు.

ఈ దానిమ్మేంది, ఇది సంజీవనేంది, ఇదంతా పెద్ద సొల్లు మాట పరీక్ష చెయ్యాలనె ఏక, ద్వి నాయకులు.

పరీక్ష మొదలు.
ఎంటర్ ద డ్రాగన్ లేకుండా నాయికను చూడాలె అని త్రినాయకులు అద్దం వద్ద గుస గుస.
నాయిక కనపడె.
త్రినాయకుల హాహాకారాలు.
అమ్మాయి ఆ ఊళ్ళో లేదు.
అమ్మాయి దేశం కాని దేశంలో ఉన్నది.
అమ్మాయి దిగులుతో చిక్కి ఎముకల గూడు అయిపోయె.
ఏందిరా ఇది ఈ ఎముకల నాయికను ఎట్లా పెళ్ళి చేసుకోవాలె అని బాధ.
అయితే అప్పుడెప్పుడో ఇచ్చేసిన మనసు గోల పెట్టె.
హాహాకారాలు సద్దుకున్నై.

దేశం కాని దేశం ఎట్లా వెళ్ళాలె అని ప్రశ్న.
ద్వి నాయకుడు అనే - యెహా, చప్పున ఛాప ఎక్కండి, పోదాం అక్కడికి.
చాపకు ఆ మూల ఒకడు, ఈ మూల ఒకడు, ఇంకో మూల ఇంకోడు. ఇంకో మూల అద్దం.
దేశం కాని దేశం వచ్చె.

ఎంటర్ ద డ్రాగన్ లేకపోయె.
త్రినాయకులు ఏకనాయిక ఒకళ్ళనొకళ్ళు చూసుకొని ఏరంత భాష్పాలు.
నీళ్ళు ఆగిపోయాక, నాయిక నీరసాన కళ్ళు తిరిగి కింద పడె.
యమభటులు కనపడె ఆమెకు.
మెడకు ఓ తాడు కట్టి స్ట్రాటోస్ఫియరు దాకా తీసుకుపోత.
ఇంతలో త్రినాయక దానిమ్మ కాయ పరపర కోసి వాసన చూపిచ్చె.
నాయిక ఆ వాసన అతి కష్టమ్మీద తాడుసందులోంచి పీల్చి లేచె.
ఆ వాసన తట్టుకోలేని యమభటులు పారిపోయె.

ఎంటర్ ద డ్రాగన్ వచ్చె.
ఏందిరా ఇది ఏం చేసారు మా అమ్మాయిని అనె.
బతికిచ్చా కాబట్టి నాకిచ్చి పెళ్ళి చెయ్యమనె త్రినాయక
అద్దం లేకపోతే అసలు నాయిక లేదు, దానిమ్మ లేదు అనె ఏక నాయక
చాప లేకపోతే అసలు అద్దం ఎందుకు పనికొచ్చె, దానిమ్మ నెత్తికెసి కొట్టుకోవచ్చె అనె ద్వి నాయక.

ఎంటర్ ద డ్రాగన్ మంటలు చల్లాగా చల్లారిపోయె.
జడ్జి దగ్గరకు తీసుకుపోయె ఈ కేసును.

కథ ఇక్కడికాపేస్తే - మీరు జడ్జి అనుకోండి, తీర్పు ఏం చెప్తార్?

వినాలని త్రినాయాక్స్, ఏక నాయిక, ఎంటర్ ద డ్రాగన్ అందరూ వేచి ఉన్నార్!

No comments:

Post a Comment