Thursday, May 22, 2014

మీరు జడ్జి అనుకోండి, తీర్పు ఏం చెప్తార్?

చిక్కు విప్పవయ్యా చేతనైతే!

శాలివాహన శకం (-3219)
అనగనగా ఒక ఊరు.
ఆ ఊళ్ళో వంద మంది అబ్బాయిలు.
అదే ఊళ్ళో ఎనభై మంది అమ్మాయిలు.
ఆ వందలో కథానాయకులు ఓ ముగ్గురు కుర్రాళ్ళు.
ఆ ఎనభైలో కథానాయిక ఒక అమ్మాయి.
అవును, ఒక అమ్మాయే. ఒకే ఒక అమ్మాయి.

ముగ్గురు నాయకులు. ఒకే ఒక నాయిక.
తెలిసో తెలీకో ముగ్గురూ ఆ ఒకే ఒక నాయిక మీద మనసు పారేసుకున్నారు.
ఆ ఒకే ఒక్క నాయికకు కూడా బాద్షాల్లా ఉన్న ముగ్గురు నాయకులు నచ్చారు.
ఇంతలో అమ్మాయి వాళ్ళ నాన్న ఎంటర్ ది డ్రాగన్.
ఛీ ఛీ ముగ్గురు మొగుళ్ళా, నా కడుపున చెడబుట్టావని నాన్న కోపాలు తాపాలు.
అమ్మాయి భోరు భోరున ఏడుపులు రాగాలు.
డ్రాగన్ మంటలు ఆ భోరులో చల్లపడ్డై.

డ్రాగన్ ఆలోచన చేయగా చేయగా ఒక ఉపాయం తట్టె.
ముగ్గురు కుర్రాళ్ళను పిలిచి, ఓ సంవత్సరం పాటు కష్టపడి రమ్మని ఆదేశం.
నాయకులు దిగాలు పడి, ఆ తర్వాత ఆవేశపడి ఎందుకు ఎందుకు అని కుములే కుములు.
డ్రాగన్ అన్నాడు - నా కూతురికి అతి విలువైన వస్తువేదైన తీసుకొచ్చినవాడికే కట్టపెడతానని.
నాయకులు పొలోమని పరిగెత్తకుండా విలువైనది ఆల్రెడీ ఇచ్చేసాం, మా మనసు అని గోల.
డ్రాగను భగ భగగా బుసలు. త్రినాయకులకు ఠారు. ఇప్పుడు పొలోమని నిజంగా పరుగులు
.
సంవచ్చరం గడిచె.
ఏక నాయకుడు అద్దం తెచ్చె.
ఆ అద్దం మాయా అద్దం.
ఏది కావాలంటే అది కనపడుతుంది.
ఎక్కడుందో చెపుతుంది.
వెళ్ళి చక్కగా తెచ్చేసుకోవచ్చు.
ద్వి నాయకుడు చాప తెచ్చె.
ఆ చాప మాయా చాప.
ఎంతమందినైనా ఎక్కించుకుంటుంది.
ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకుపోతుంది.
త్రి నాయకుడు ఓ దానిమ్మకాయ తెచ్చె.
ఆ దానిమ్మకాయ మాయా దానిమ్మకాయ.
బోలెడు సువాసన. ఎప్పుడైనా కోస్తే సంజీవిని.

ఎంటర్ ద డ్రాగన్ దగ్గరికి వెళ్ళే సమయం.
త్రినాయకులు ఓ చోట.
కుశలోపరులు సమాప్తం.
అద్దం గొప్పలు చెప్పె.
చాప గొప్పలు చెప్పె.
దానిమ్మ గొప్పలు చెప్పె.

ఈ అద్దమేంది, దీని గోలేంది, పని చెయ్యదు పాడు చెయ్యదు పరీక్ష చెయ్యాలనె ద్వి, త్రి నాయకులు.

ఈ చాపేంది, దీని గోలేంది, పని చెయ్యదు చావదు పరీక్ష చెయ్యాలనె ఏక, త్రి నాయకులు.

ఈ దానిమ్మేంది, ఇది సంజీవనేంది, ఇదంతా పెద్ద సొల్లు మాట పరీక్ష చెయ్యాలనె ఏక, ద్వి నాయకులు.

పరీక్ష మొదలు.
ఎంటర్ ద డ్రాగన్ లేకుండా నాయికను చూడాలె అని త్రినాయకులు అద్దం వద్ద గుస గుస.
నాయిక కనపడె.
త్రినాయకుల హాహాకారాలు.
అమ్మాయి ఆ ఊళ్ళో లేదు.
అమ్మాయి దేశం కాని దేశంలో ఉన్నది.
అమ్మాయి దిగులుతో చిక్కి ఎముకల గూడు అయిపోయె.
ఏందిరా ఇది ఈ ఎముకల నాయికను ఎట్లా పెళ్ళి చేసుకోవాలె అని బాధ.
అయితే అప్పుడెప్పుడో ఇచ్చేసిన మనసు గోల పెట్టె.
హాహాకారాలు సద్దుకున్నై.

దేశం కాని దేశం ఎట్లా వెళ్ళాలె అని ప్రశ్న.
ద్వి నాయకుడు అనే - యెహా, చప్పున ఛాప ఎక్కండి, పోదాం అక్కడికి.
చాపకు ఆ మూల ఒకడు, ఈ మూల ఒకడు, ఇంకో మూల ఇంకోడు. ఇంకో మూల అద్దం.
దేశం కాని దేశం వచ్చె.

ఎంటర్ ద డ్రాగన్ లేకపోయె.
త్రినాయకులు ఏకనాయిక ఒకళ్ళనొకళ్ళు చూసుకొని ఏరంత భాష్పాలు.
నీళ్ళు ఆగిపోయాక, నాయిక నీరసాన కళ్ళు తిరిగి కింద పడె.
యమభటులు కనపడె ఆమెకు.
మెడకు ఓ తాడు కట్టి స్ట్రాటోస్ఫియరు దాకా తీసుకుపోత.
ఇంతలో త్రినాయక దానిమ్మ కాయ పరపర కోసి వాసన చూపిచ్చె.
నాయిక ఆ వాసన అతి కష్టమ్మీద తాడుసందులోంచి పీల్చి లేచె.
ఆ వాసన తట్టుకోలేని యమభటులు పారిపోయె.

ఎంటర్ ద డ్రాగన్ వచ్చె.
ఏందిరా ఇది ఏం చేసారు మా అమ్మాయిని అనె.
బతికిచ్చా కాబట్టి నాకిచ్చి పెళ్ళి చెయ్యమనె త్రినాయక
అద్దం లేకపోతే అసలు నాయిక లేదు, దానిమ్మ లేదు అనె ఏక నాయక
చాప లేకపోతే అసలు అద్దం ఎందుకు పనికొచ్చె, దానిమ్మ నెత్తికెసి కొట్టుకోవచ్చె అనె ద్వి నాయక.

ఎంటర్ ద డ్రాగన్ మంటలు చల్లాగా చల్లారిపోయె.
జడ్జి దగ్గరకు తీసుకుపోయె ఈ కేసును.

కథ ఇక్కడికాపేస్తే - మీరు జడ్జి అనుకోండి, తీర్పు ఏం చెప్తార్?

వినాలని త్రినాయాక్స్, ఏక నాయిక, ఎంటర్ ద డ్రాగన్ అందరూ వేచి ఉన్నార్!

Wednesday, May 21, 2014

ఈ చిన్న ఫోటో వెనకాల ఓ పేద్ద కథ ఉన్నది!
ఈ చిన్న ఫోటో వెనకాల ఓ పేద్ద కథ ఉన్నది. ఒక్కోసారి అనుకోకుండా ఎక్కడికైనా వెళ్ళటం వల్ల చాలా లాభిస్తుంది. కథేమనగా - మొన్నా మధ్య చిన్నపిల్లల నాట్య ప్రదర్శన ఉన్నదంటే వెళ్ళా. అక్కడ కొన్ని బిట్లు అయ్యాక ఉన్నట్టుండి ఒళ్ళంతా గగుర్పొడిచింది. కారణం ఆ సమయానికి పిల్లలు చేస్తున్న నృత్యానికి ఉపయోగించిన పాట.

"గంగాధరవర శృంగా
వృషభ తురంగా
మదన విభంగా
నటన భుజంగా
......"

అలా శ్రీశైలనాథా హరా అని. భీమేశలింగా హరా అని ఐదు చరణాలతో ముగిసింది. ఆ పాట అయిపోయేప్పటికి ఓ రెణ్ణిముషాలు స్తబ్దుగా ఉండిపోయా. అనుభూతి కోసం. సరే అదలా పక్కనబెడితే ఇంటికొచ్చాక ఆ పాట వివరాల కోసం హార్డు డ్రైవుని, అంతర్జాలాన్ని వడపోత చేస్తే పిప్పి మిగిలింది కానీ సరుకు కనపడలా. అందువల్ల "శివ కైవారం" గురించిన వివరాలు ఏమన్నా ఉన్నవా? అని శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారిని ఇబ్బంది పెట్టగా అందిన వివరాలు ఈ క్రింద.

******

'కైవారము' అన్నది స్తోత్రరూపంలో రచితమైన లఘుకృతివిశేషం. ఇది మొదట గద్యరూపంలో వెలసి, ఆ తర్వాత గీతప్రబంధంగా రూపుదిద్దుకొన్నది. 'కైవార గద్య' అన్నపేరిట ఈ లఘుకృతి క్రీస్తుశకం 13-వ శతాబి నాటికే ఆంధ్రదేశంలో ప్రచారంలో ఉన్నట్లున్నది. నాచన సోమన ఉత్తర హరివంశంలో "హరసఖవీరభటశార్దూలుండును, సురరాజశూరపరివారవారివాహపవనుండును నను కైవారంబులు సెలంగ నరకాసురుండు" (1-49) అని వర్ణించాడు. శ్రీనాథ పోతనల కాలందాకా ఇది తెలుగులో తత్సమపదంగా వాడబడినప్పటికీ, సంస్కృతంలో దీని వాడుక లేదు. రచన గద్యరూపంలో ఉన్నప్పటికీ రాగయుక్తంగా పాడటం వల్ల అదొక సంగీత కృతి అన్న భావన కలుగుతుంది. బిరుదు గద్య లాగా దీర్ఘసమాసభూయిష్ఠమైన భాషలో గంభీరంగా సాగుతుంది.

తెలంగాణంలో పేరిణి నృత్య కళాకారులు ఈ కైవార గద్యలను ఇటీవల ప్రచారంలోకి తీసికొనివచ్చారు. ప్రతిపదాన్నీ భావయుక్తంగా అభినయిస్తూ పేరిణి నృత కళాకారులు దీనిని ప్రబంధగీత విశేషంగా పరిణమింపజేశారు.

శ్రీ నటరాజ రామకృష్ణ గారు దీనిని వివరిస్తూ వ్రాసిన వ్యాసభాగం, మరికొన్ని విశేషాలు అంతర్జాలంలో ఉన్నాయి, చూడండి:

http://gurugeetha.blogspot.in/2010/04/blog-post.html

http://te.wikisource.org/wiki/పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/205

http://namasthetelangaana.com/sunday/story.asp?category=10subCategory%3D9ContentId%3D212550

http://telugubhagavatam.org/products.php?pg=2cntstart%3D0psid%3D891


ఈ చివరి లంకెను కేవలం పోతనగారి భాగవతంలో తత్సమంగా ప్రయోగింపబడినందుకు ఉదాహరణగా మాత్రమే ఇచ్చాను. అంతకంటె అందులో విశేషాలు లేవు.

***********

ఆ తర్వాత కామేశ్వరరావుగారు మరింత దయతో అందించిన వివరాలు ఈ క్రింద...

************

జాయసేనాని విరచిత నృత్తరత్నావళి - రాళ్ళపల్లి అనంతరామకృష్ణ శర్మ

ప్రేరణాంగాని పంచస్యుః నృత్త కైవార ఘర్ఘరాః
వికటం గీతమిత్యేషాం క్రమాల్లక్ష్మప్రచక్ష్మహే - నృత్తరత్నావళి 7-43

ప్రేరణమునకు అంగములైదు. నృత్తము, కైవారము, ఘర్ఘరము, వికటము గీతము. వానిలక్షణము క్రమముగా వచింతుము.
( కైవారము - దీనినే కవి చారకః అని సం రత్నా. (7-1303) . కైవారము దీని ప్రాకృత భవము . సాంకేతిక పదము కనుక కైవార పదమును సంస్కృతము గానే ప్రాచీనులు గ్రహించిరి - రాళ్ళపల్లి అనంత రామకృష్ణ శర్మ)

ఇతివృత్త ప్రవిఖ్యాత చక్రవర్తి ధరాధిపాన్
గుణైః శౌర్యాదిభిః స్తుత్వాతైస్తైరేవ సభాపతేః
స్తుతిర్వితన్యతే యస్మిన్ కైవారో2త్ర స కీర్తితః 7-45

చరిత్రములందు ప్రసిద్ధులైన చక్రవర్తులగు రాజులను, శౌర్యము మున్నగు గుణములచే పొగడి వానిచేతనే సభాపతిని స్తుతి చేయుట కైవారమనబడును.

===
పేరిణి తాండవ నృత్య వికాసం - శ్రీ కళాకృష్ణ
కవివారకము లేదా కైవారము : రెండూ కూడా సమానార్థమిచ్చే పదాలే.రెండిటి నిర్వచనం ఒకటే ఆయారాజుల కీర్తి శౌర్య ప్రతాపములను గానీ లేదా దేవతా స్తోత్రములను గానీ ఆటపాటల ద్వారా ప్రదర్శించడమే కవివారము లేక కైవారము. ఇవి నృత్యమునకు సంబంఢించిన అంశములు. ఈ అంశాన్ని నటరాజు (రామకృష్ణ) గారు పేరిణిలో క్లుప్తంగా వినియోగించారు. గణపతి దేవచక్రవర్తిని పొగుడుచూ మరియు స్వయంభూ లింగమూర్తిని పొగుడుచూ నృత్యాన్ని కూర్చారు. - పుట -51

కైవారము : నేడు ప్రదర్శిస్తున్న పేరిణిలో ముఖ్యమైనది కైవారము. ప్రారంభములో కాకతీయ ప్రభులలో ఈ కళను పోషించిన గణపతి దేవ చక్రవర్తిని కీర్తిస్తూ కైవారము పాడి ఆ తరువాత పంచభూత స్వరూపుడైన శివుని పంచలింగములకు కైవారములు పాడబడుతాయి. ఈ కైవారములకు నృత్యము కూర్చ లేదు నతరాజుగారు. పృథ్వి , జల తేజో వాయు ఆకాశలింగాలే పంచలింగాలు. పంచభూతాల తత్వాన్ని బట్టి ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రత్యేకమైన మృదంగ శబ్దములతో జతులను కూర్చారు. ఈ మృదంగశబ్దాలు నందికేశుడు సూచించినవే అయినా సమకూర్చడములో మృదంగ కళాకారుని నైపుణ్యము పాండిత్యం ప్రస్ఫుటమౌతుంది. ఈ జతుల కూర్పులో ధూపం సూర్యలింగం గారి పాండిత్యం, నాదోత్పత్తి అద్వితీయంగా ఉండేది. ఆయన మృదంగం కట్టుకొని సిద్ధమై మృదంగము యొక్క కుడిప్రక్కను తన చేతితో తట్టినపుడు ఓంకారనాదము తప్ప మరేమీ వినిపించేది కాదు. ఎన్ని రకాల శబ్దాలను పలికించినా ఓంకారనాద ప్రతిధ్వనే హాలంతా వ్యాపించేది. అంతటి గొప్ప కళాకారులు వారు.

పేరిణి పునరుద్ధరణలో నటరాజుగారి కృషి ఎంత ఉన్నదో సమానమైన కృషి సూర్యలింగముగారిది ఉన్నది.

భూమి గ్రీష్మ వర్ష ఋతువులలో ఎలాంటి తత్వాన్ని కలిగి ఉంటుందో అలాంటి శబ్దాలతో పృధ్వి లింగాన్ని అలాగే జలతరంగాల శబ్దాలను చినుకుల నుండి వచ్చే శబ్దాలను అన్నింటిని కూర్చి జలలింగముగా , దీపం ప్రకాశిస్తూ ఎలా పైకి వెళ్ళిన కొలది ఏ రూపములో ఉంటుందో దాని తత్వము గ్రహించి శబ్దాల కూర్పును చేర్చి ఆ కూర్పుకు తగినట్లే నర్తనాన్ని కూర్చి తేజోలింగమును రూపొందించారు. వాయుతత్వాన్ని ఉఢృతమైన గాలి తరంగ శబ్దాలు, పిల్ల వాయువు శబ్దాలు మొదలగువాటికి మృదంగ శబ్దాలను చేర్చి శివుడు తాండవ మూర్తి గనుక తాండవలక్షణాలతో కూడిన వాయుతత్వాన్ని, ఆట క్రమాన్ని వాయులింగముగా ప్రదర్శించేశారు. ఆకాశ లింగ తత్వములో నటరాజమూర్తి స్వరూపాన్ని సాక్షాత్కరింపచేశారు. ఒక్కొక జతి ఒక్కొక ఆణిముత్యంలా ఉంటాయి. అయిదు జతులు పంచాక్షరిలా ఓం నమఃశివాయ అన్నట్లు ఉంటాయి. ఐదు విభిన్న నర్తనలతో గూడి శరీరాన్ని గగుర్పాటు కొల్పుతూ శివుని పంచ భూత తత్వాన్ని కనులకు కట్టేట్లు చేస్తాయి.

చివరిలో పంచభూత సమీకరణ జతితో కైవారము ముగించబడుతుంది. దీనిలో శుక్రాచార్యుని వీరభద్ర కవచము కూడా స్తోత్రంగా పాడబడుతుంది. శువుడు పంచభూత స్వరూపుడు కనుక కొందరు దీనినే పంచముఖ శబ్దాలు అంటారు. కానీ అది సరియైనది కాదు. శివపంచముఖ శబ్దాలు వేరు. ఇవి పేరిణిలోని కైవారములోకి రావు . అన్వయించుకుంటే తప్ప. 


నటరాజ రామకృష్ణ గారు పేరిణి పంచాంగములలో గర్ఘరము కైవారములను కొంత విషయం మాత్రమే రూపొందించగలిగారు. - పుట 57-58

ఇక పేరిణిలోని కైవారాన్ని పరిశీలించినట్లైతే దేవనర్తకి ఆయా దేవుళ్ళను స్తోత్రం చేస్తూ గుణకీర్తనను ప్రదర్శిస్తుంది. అలాగే రాజనర్తకి ఆయారాజుల ప్రభువుల వీర శౌర్య దయా దానగుణాలను కీర్తిస్తూ నృత్తముతో పాటు పాఠ్యములోని అర్థానికి ఆంగికాభినయ నృత్యాన్ని కూడా ప్రదర్శిస్తుంది. నేటి కాలములో శబ్దము, సలాంజతి, జోహార్ గీతాలు వీటికి ఉదాహరణలు. -పుట 70 (స్త్రీలు ప్రదర్శించే పేరిణి)

*********

అయ్యా ఈ చిన్న ఫుటో వెనకాల అంత పెద్ద కథ ఉన్నది.

Thanks to Sri Elchuri and Sri Kameswara Rao

Tuesday, May 20, 2014

నాకు తట్టలే!

నాకు తట్టలే!

తమోరి చుచ్చుఱుకుగా వుండె. ఉద్దరి మీదంగ చేలికలు దొబ్బిచ్చి బుడ్డగోషి ఎగ్గట్టి తలకంల మున్క ఏస్తి. నీరు చల్లగడ్డలెక్కుండి బుత్తి బుత్తి ఆయె. తడాకం తమ్మిపూలతో తమాముగుండె. గా తమ్మిపూలన్ని తిమిరారి సామొంక చూసుడు జూశి ఉసులే ఉసులు.

తెప్పాకుళంల నే దిగిన కాడ్నే దొందంగా ఎనుములు దిగబడి బుడుకల్ జేస్తున్నయ్. ఎండల వాండ్ల నిగారం చూడ శాతనైతల్లే. కాని, అయి మలీమసంగ, తెవులుగున్నట్టు నాకైతే అనిపిస్తలేదు.

ఎడగడ్డమీన బీఱబుఱ్రగా ఒక చలపత్రం పులాకి ఉండె. కింద మడిమంచంలెక్కున్న బుఱ్ఱగాడు కూలబడి ఓపాలి తెప్పాకుళం వొంకల జూస్కొని ఎనుములకు కేకేసిండు. ఎనుములు ఆని మాట ఎందుకినలేదో నాకు తట్టలే!

బోదడు పులాకికి ఆన్కోని కూరుకు బోతుండు. ఎనుములు తోల్కపోక ఆడెందుకు గుడాకల బడిండో నాకు తట్టలే!

బురకడి లాగరిమీన కంతిరీగ గీమని ఱంతు జేస్తుండె. ఆడు కంతిరీగను తోల్తుండు. చలపత్రం పత్తిరి రాల్తుండె. ఆటినీ తోల్తుండు. నా మున్కలైనై. నేటుగ జూస్తే నాది నీరుపోరేనా? ఎనుములు బుడుకల్ దీసే చుంగుడు నీట్లనే నా మున్కలైనైలే అని నాకు తట్టలే!

బురకడు మళ్ళ ఎనుములను రమ్మని పిలిస్తుండె. ఆని పిలుసుడుకు పత్తిరి రాలె గాని ఎనుములు సూడలే. ఆడు అర్సి అర్సి బీఱువాఱు పడిండు. ఆ బురకడు గంత ఈచవడిండెందుకో, సాలెకు పోక ఈ ఎనుములు తోలుడేందో నాకు తట్టలే !

-- Wrote ఏప్రిల్ 2010

-- Unicodified May 2014