Friday, September 20, 2013

అయితే అధ్యక్షా!!!

నాకు దీక్షితులు అంటే ఇష్టం ఎందుకో పెరిగిపోతోంది అధ్యక్షా!!

ఎందుకు అధ్యక్షా?

సంస్కృతంలో రాసింది అర్థం కాకా అధ్యక్షా?

సంస్కృతం కొద్దో గొప్పో వచ్చు కాబట్టి పూర్తిగా అర్థమైపోయా అధ్యక్షా ?

ఆయన రాసిన వాటిల్లో ఇమిడే సంగీతపు ఎత్తుపల్లాలా, అనగా గమకాల (ఆరోహణ, అవరోహణ, ఢాలు, కంపితం, స్ఫురితం, ఆహతం, ప్రత్యాహతం, ఆందోళితం, త్రిపుచ్ఛం, మూర్ఛన - ఇల్లాటివన్నమాట) సంగతుల వల్లా అధ్యక్షా ?

ఏమో కానీ, త్యాగయ్య రాసినవాటికన్నా దీక్షితులు రాసినవి నాకు నచ్చుతాయ్ అధ్యక్షా ...టూకీగా అదే సంగతి అధ్యక్షా ....

అయితే అధ్యక్షా , పొద్దున్నే Narayana Swamy (కొత్తపాళీ) ఫేసుబుక్కు గోడ మీద త్యాగరాజుల వారి తీర్థం చూసి ఓ కామెంటు రాసి, తర్వాత తీరిగ్గా గీతముల గూర్చి, సంగీతముల గూర్చి ఆలోచించుతూ అలా ముందుకు పోతుంటే అధ్యక్షా, అసలు ముందారంభప్రథమంగా (అవును ముందు ఆరంభ ప్రథమ సమాసం అది) త్యాగరాజుల కన్నా నాకు దీక్షితులు నచ్చటానికి కారణం కనుక్కోవాలని ఆరాటం కలిగింది అధ్యక్షా.

అప్పుడు అధ్యక్షా, ఒక్కొక్కటిగా కారణం రాసుకున్నానధ్యక్షా. అందులో కొన్ని తీసివేత, కూడిక, భాగింపు, హెచ్చువేత చేసానధ్యక్షా.

అలా చేసింతర్వాత ఈ కిందివి మిగిలాయి అధ్యక్షా. అవి మీ ముందు ఉంచుతున్నానధ్యక్షా. మీకు కళ్ళున్నాయని నాకు తెలుసునధ్యక్షా. మీరు చూడగలరని, చూస్తారని, చదవగలరనీ, చదువుతారనీ, రాస్తారనీ, రాయగలరనీ నాకు తెలుసు అధ్యక్షా. అందువల్ల అధ్యక్షా ఆయా కారణాల మీద మీరు సత్వరమే కామెంటు వేసి చర్య తీసుకోవాలని కోరుతున్నానధ్యక్షా.

ముందు త్యాగయ్య అంటే విముఖత కలగటానికి కారణాలు వివరిస్తానధ్యక్షా -

ఒకటో కారణం అధ్యక్షా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం అధ్యక్షా. ఆయన త్యాగరాజు కృతులను ఖండఖండాలుగా కత్తిరించి అధ్యక్షా, నా చెవుల్లో పోసారనిపించింది అధ్యక్షా....అనిపించిందంతే అధ్యక్షా. అయితే ఆ ఖండాలు గోణ్డ్వానా లాండు విడిపోయినట్టు విడిపోయి నా తల్లో భరించలేని తలకాయనొప్పి పుట్టించాయి అధ్యక్షా. అది మొదలు "త్యా", "ఎస్.పి", "బా" తో మొదలయ్యే పదాలంటే భరించలేని తలనొప్పి వస్తోంది అధ్యక్షా. అమృతాంజనము, టైగరు బాము, ఝండూ బాము, మూడు కలిపి చేసిన ఝమృతాంటై బాము కూడా పనిచేయకుండా పోయినై అధ్యక్షా. అమృతాంజనము తయారీదారు, పంతులు గారు స్వర్గలోక వాసులవ్వటం వల్ల నాకు అక్కడికెళ్ళి వారితో మొరపెట్టుకునే అవకాశం కలగలేనందుకు చింతిస్తున్నానధ్యక్షా. మీరు ఎవరినన్నా అక్కడికి పంపించి వారికి మన, అనగా నా వినతి విన్నవించి వారి సమాధానం ఏమిటో ఇక్కడ సభలో వినిపించాలని కోరుతున్నానధ్యక్షా.

రెండో కారణం అధ్యక్షా - గుడిపూడి శ్రీహరి అధ్యక్షా - 1980ల్లో అధ్యక్షా, త్యాగయ్య అనే సినిమా ఒకటొచ్చింది అధ్యక్షా. అప్పట్లో గుడిపూడి శ్రీహరిగారు ఆ సినిమా గురించి పత్రికల్లో రాయకపోటం మూలాన అధ్యక్షా, ఆ సినిమా సంగతి తెలియక మా నాన్నగారు ఆ త్యాగయ్య సినిమాకు తీసుకెళ్ళారధ్యక్షా. దానితో ఈ నా చిన్నారి జీవితంలో అప్పటిదాకా జాజ్వల్యమానంగా వెలుగుతున్న సజీవ జీవకాంతి కాస్తా కొడిగట్టిన దీపపు కాంతివలె రెపరెపలాడటం మొదలుపెట్టింది అధ్యక్షా. అందువల్ల అధ్యక్షా, వారు ఇప్పుడు ఎక్కడున్నా ఈ సభకు రప్పించి ఇప్పుడన్నా ఆ త్యాగయ్య సినిమా మీద రివ్యూ రాయాలని ఆదేశించాలని కోరుతున్నానధ్యక్షా.

మూడో కారణం అధ్యక్షా - ఆంధ్రదేశానికి పక్కనున్న అరవలు అధ్యక్షా. అసలే అరవలు అధ్యక్షా, చేతికి సంగీతం దొరికింది అధ్యక్షా. దాంతో కొండల మీద గోల మొదలైంది అధ్యక్షా. ఎప్పుడూ, ప్రతిదానికి చేసినట్టే వాళ్లా వాళ్ళ అరవగోల, అరవలగోల చూసుకోకుండా, పొట్ట పూడుస్తే అధ్యక్షా, తెలుగు ముక్కరాని అరవసంగీతకారులంతా అధ్యక్షా, అనవసరంగా తెలుగాయన రాసిన పాటల మీద పడి అధ్యక్షా, రక్తాలొచ్చేట్టు కుత్తుకక్షతాలు (అనగా నఖక్షతాల మాదిరి అధ్యక్షా) "త్యా" కృతుల మీద ప్రయోగించి ఆ కృతులంటే విముఖత కలిగించేట్టు చేసారధ్యక్షా. అందువల్ల అధ్యక్షా, ఈ సభలో తీర్మానం చెయ్యాలధ్యక్షా, తెలుగు వాళ్ళ పాటలు తెలుగువాళ్ళే పాడాలని, అరవవాళ్ళకు తెలుగువాళ్ళ పాటలు పాడాలనిపిస్తే అధ్యక్షా, ముందు తెలుగు చక్కగా నేర్చుకోవాలని ఆ తర్వాత వాళ్ళకు సెంట్రలు తెలుగు సిలబస్సుతో పరీక్షలు పెట్టాలని, అందులో డాక్టరేటు చెయ్యాలని, అలా డాక్టర్లయినవాళ్ళే ఆ "త్యా" పాటలు పాడాలని ఈ సభ తీర్మానించాలి అధ్యక్షా.

నాలుగో కారణం అధ్యక్షా - దీన రసం అధ్యక్షా. ఆయా కృతులన్నీ, పూర్తిగా కాకపోయినా 60 శాతం దీనాతిదీనమైన రసభావనతో ఉండటం అధ్యక్షా. ఎప్పుడు చూసినా నన్ను రక్షించు, నాకు మోక్షం ప్రసాదించు, నన్ను నీలో ఐక్యం చేసుకోమంటూ అధ్యక్షా, దీనంగా ఏడుస్తూ పాడిన పాటలు అధ్యక్షా. దాని ప్రభావంతో మిగిలిన 40 శాతం మంచివి కూడా వినాలనిపించట్లేదు అధ్యక్షా. ఇప్పుడు ఈ సభ తీర్మానించాల్సిదేమిటంటే అధ్యక్షా, ఇక ముందు ఈ దీన రసాన్ని శ్రోతలంతా కలిసి ప్రపంచంలోంచి ఎత్తి అవతలకి నూకాలని, ఆ దీనపు పాటలు ఎవరూ రాయకూడదని నియంతృత్వ తీర్మానం చెయ్యాలధ్యక్షా....అయితే ఇప్పటికే రాసేసినవి అట్లా అట్టిపెట్టి భావితరాలకు పాఠంగా గుణపాఠంగా సిలబస్సులో చేర్చాలని ఒక ప్రొవిజను పెట్టండి అధ్యక్షా...

ఇలా అయిదో కారణం, ఆరో కారణం, నూటపన్నెండో కారణం కూడా ఉన్నాయధ్యక్షా. అయితే ఆ కారణాలన్నీ ఇక్కడ రాస్తే అధ్యక్షా, నాకు గొయ్యి రెడీ చేస్తారధ్యక్షా. మీరు పోలీసు ప్రొటెక్షను, బ్లాక్ కాట్ కమాండోలు, గ్రీన్ బెరెట్స్ రక్షణ కలిగిస్తానని హామీ ఇస్తే అధ్యక్షా అవి అన్నీ తర్వాత రాసి సభకు తీసుకొస్తానధ్యక్షా.

అయితే చివరిగా దీక్షితుల సంగతి చెప్పకుండా వెళ్లిపోతూ అధ్యక్షా, త్యాగయ్య కృతులన్నిటినీ సంస్కృతంలోకి తర్జుమా చెయ్యాలన్న విన్నపం ఈ సభ ముందు పెడుతున్నానధ్యక్షా.

ఎందువల్లనంటే అధ్యక్షా, తెలుగువాడికి సంస్కృతంలో చదివితే చాలా ఆనందం అధ్యక్షా. అర్థమేమిటో తెలియకపోయినా, తెలియకపోవటమేమిటి అధ్యక్షా, అసలు తెలీదు అధ్యక్షా - అలా తెలీనిదాన్ని పొగిడేస్తూ ఉంటారధ్యక్షా, కాబట్టి అధ్యక్షా ఆ విధంగా ఈ సభ, ఈ సంగీత ప్రపంచం ముందుకు పోవాలని అధ్యక్షా, కోరుతున్నానధ్యక్షా...లోపమేమనగా అధ్యక్షా మన "త్యా" కృతులన్నిట్లో బ్రహ్మాండమైన సాహిత్యం ఉంది అధ్యక్షా, అయితేనేం అధ్యక్షా, అది మనవాళ్ళకు అర్థం కాదు అధ్యక్షా...అందువల్ల సంస్కృతమైతే రాజభాషని పేరుంది కనక అధ్యక్షా, పొగుడుతూ ఉంటారని ఆశ అధ్యక్షా...

ఇహ ఉంటానధ్యక్షా....

సర్వేజనా స్సుఖినోభవంతు ....

6 comments:

 1. తెలుగుని సంస్కృతంలో రాస్తే తెలుగువాళ్ళు ఆదరిస్తారు - ఈ ఆక్షేపణలో కొంత నిజం లేకపోలేదు. త్యాగరాజస్వామి సంగీతం సులభంగా అర్ధమవుతుంది, పట్టుబడుతుంది. బహుశా అందుకని కూడా ఆయన మీ దృష్టిలో కొంచెం చులకన అయుండొచ్చు. కానీ ఆయన సాహిత్యం అర్ధం కావాలంటే ఆ దారిలో కొంత సాధన అవసరం.

  ReplyDelete
 2. మీ వ్యంగ్యం‌ బాగుంది కాని, ఎప్పటిలాగే ఔచిత్యపు మోతాదుని మించినట్లు అనిపించింది.

  బాలసుబ్రహ్మణ్యం గొంతులో త్యాగరాజకృతి వినటం అనేది నరకంలో విధించబడే శిక్షల్లో ఒకటని నా ప్రగాఢవిశ్వాసం. అరవగాయకులు గానం చేసిన తెలుగు కీర్తనలు వినిపించటం అనేది అంతకంటే పెద్దదో చిన్నదో తెలియదు కాని, ఆ శిక్షా ఉందట అక్కడ.

  నేను నా చిన్నప్పుడే బాలసుబ్రమణ్యం మీద చెప్పిన చిన్న పద్యం:


  ఘంటసాలవారి గానామృతము విన్న
  చెవులతోడ బాల సుబ్బి గాడి
  పాట వినుట కన్న పాపంబు మరి లేదు
  విశ్వదాభిరామ వినురవేమ


  మరొక ముఖ్యవిషయం మనవి చేయాలి ముగించే ముందు. మీరేదో త్యాగరాజకృతులు తెలుగువారికి ఇంకా అర్థం అవుతున్నాయన్న భ్రమలో ఉండి, సంస్కృతంలోకి అనువాదం చేయాలన్నారు. అంత శ్రమ వద్దు. ఈ‌ తరానికి తెలుగు కొంచెం లీలగానే అర్థం అవుతుంది. రాబోయే తరాలు తెలుగు అస్సలు అర్థం చేసుకోలేరు. కాబట్టి తర్జుమా కోరనవసరం లేదు మీరు. నిశ్చింతగా ఉండండి.

  ReplyDelete
 3. @ నారాయణ స్వామి - చులకన ఏమీ లేదు ఇక్కడ. నచ్చకపోవటం వేరు, చులకన వేరు. చులకన అంటే శ్యామలరావు గారి పద్యంలో "బాల సుబ్బి గాడి" తీరు. అదీ సంగతి...ఇహ మీరన్న సాధన సంగతికొస్తే - సాధన దారులు అందరివీ వేరు వేరు. మీరు సులభం వైపు మొగ్గుతే, నేను కఠినం వైపు మొగ్గొచ్చు. సాహిత్యం గురించి చివరి పేరాలో చెప్పాగా....నాకు దీక్షితులు పాటలు ఎందుకు నచ్చుతవీ మొదట్లోనే నర్మగర్భంగా చెప్పా....అందుకు, ఓ సారి మళ్ళీ చదవండి...:)

  @ శ్యామలరావు గారు - నమస్కారం. ఎప్పట్లానే, పోష్టేదైనా సరే ఔచిత్యం మించిందంటూనే వ్యాఖ్య రాస్తారు. అదీ నా సంతోషం. నేను రాసే తీరు వేరు. ఎప్పట్లానే మీరు అర్థం చేసుకునే తీరు వేరు. అయినా పెద్దవారు, ఇటేపొచ్చి కామెంటుతో పావనం చేసినందుకు ధన్యవాదాలు. తర్జుమా చేసి పెట్టుకుంటే, తర్వాత్తరవాత తెలుగు అర్థం ఎలాగూ కాదు కాబట్టి, అప్పుడు రెండూ వర్షన్లు ఉన్న కృతులు వేరు వేరు అనుకుని, అర్థం కాని ఆ రెండిటినీ లెక్కేసి మా తెలుగాయన ఇన్ని రాసాడని ఆశ్చర్యపోతూ వీర లెవెల్లో పొగుడుతారేమో. అదీ ఒక ఆనందమేగా! ....అర్థమైతే సంతోషం...పోతే "బాల సుబ్బి గాడి" అనే ఔచిత్యం మించిన పదాన్ని మార్చి ఇంకేదన్నా ఇరికించగలరేమో చూడండి...మరొక్కసారి ధన్యవాదాలతో ...

  ReplyDelete
  Replies
  1. మాగంటీ వారు,
   ఆ పద్యంలో ఇంకా వేరే తప్పులూ ఉన్నాయండి.
   అది కుర్రతనంలో వ్రాసిన పద్యం.
   ఎక్కడా వ్రాసి పెట్టుకోలేదు కాని ఇంకా గుర్తుంది.
   ఎప్పుడైనా గుర్తుకు వస్తే నవ్వు వస్తుంది.
   సుబ్రమణ్యానికేం భేషుగ్గా పాడతాడు. అప్పట్లో నచ్చలేదంతే. అసలే సూరేకారం అన్న పేరున్న వాణ్ణి అప్పట్లో
   ఆ పద్యానికి పెద్ద విలువ ఇవ్వకండి.

   Delete
 4. మీరూ నేనూ కలిసి ఒక పార్టీ పెట్టచ్చు. అచ్చంగా ఇలాంటి కారణాలే నావీని. త్యాగయ్యసంగీతవైమనస్యతకు నాకు బాలుతో మరో బలమైన కారణం ఇంకొకటి (డు) ఉన్నాడు. అతను బాపు.

  సదరు బాపు గారు మొన్నామధ్య శ్రీరామరాజ్యం లో "జగదానందకారకా" - అన్న కృతిని ఇళయరాజాతో, బాలుతో, బాలకృష్ణతో, గ్రాఫిక్ జిమ్మిక్కులతో ఖండఖండాలుగా నరికాడు. మిత్రుడు పోయిన బాధలో ఉన్నాడని సరిపెట్టుకున్నాను. అంతకు ముందు అప్పుడెప్పుడో పెళ్ళిపుస్తకం లో మళ్ళీ అదే జగదానందకారకా తో ఓ మోస్తరుగా కొట్టాడు సరే అనుకున్నాను. కానీ నా చిన్నతనంలో త్యాగయ్య సినిమాతో దిమ్మ తిరిగేట్టు కొట్టాడు. అదొక క్షోభ. వర్ణనాతీతం.

  మీ నాలుగో కారణమూ కరెష్టు. మోక్షం కోసం అంతగా దేబిరించాలా? ఇస్తాడులే. పారిపోతాడా? కాస్త ఓపిక పట్టవచ్చు కదా.

  తమిళుల గురించి చెప్పేదేముంది? "ఎందు దాగి ఉన్నావో బృందావిహారీ" - అన్న కృతిని చిన్నప్పుడు "ఎందు తాగి ఉన్నావో బృందావికారీ" అని విని డోక్కొని సెలైన్ ఎక్కించే వరకూ ఆరోగ్యం చెడగొట్టుకున్నాను. అందుకే చిన్నప్పుడే సంగీతాన్ని పక్కనపెట్టవలసి వచ్చింది.

  ReplyDelete
 5. రవి - :)

  నాకున్న 112 కారణాల్లో ఆ బాపు గారు 49వ కారణం. సాక్షి మొదలు వంశవృక్షం దాకా ఏదో ఓ లాగున కొట్టుకొచ్చారాయన....అక్కడిదాకా బాగున్నై.....వంశవృక్షానికే దిమ్మ కొద్దిగా తిరిగింది నాకు, దాంతో ఇహ మానెయ్యొచ్చు ఈయన సినిమాలు చూట్టం అని నిశ్చయించుకున్నా....అయితే మా నాన్నగారి బలవంతం మీద త్యాగయ్య చూడవలసి వచ్చింది....ప్రాణాలు కొడిగట్టుకుపోయినై నాకైతే, గట్టి పిండాన్ని అవ్వటం వల్లా, ఆయుష్షు మిగిలుండటం వల్లా ఎలాగోలా బతికి బయటపడ్డాను. ఆ తర్వాతవేవీ చూడలా కాబట్టి మీరన్న సినిమాల గురించి తెలియదు....

  పోతే.. మిమ్మల్ని డోకేలా చేసి సెలైను బాటిలు దాకా తీసుకొచ్చిన ఆ తమిళుల దౌర్జన్యం నశించాలి అని త్యాగాహారదీక్ష ఒకటి చేస్తా ఎప్పటికైనా....

  ReplyDelete