Sunday, September 22, 2013

Inverted / Stitched Skyline Of San Francisco - Take a look!!

సాన్ ఫ్రాన్సిస్కో లోని "స్కై లైన్" ని తిరగేసి, కుట్టేసి, కలిపేస్తే ఇలా వచ్చాయి. ఒరిజినల్ ఫోటోలు అన్ని జూన్ 30వ తారీకున తీసాను. original ఫోటొలు రేపు వేస్తాను ఇక్కడ. అందాకా సస్పెన్సు కాకపోయిన, అలాటిదే అనుకోండి...

SFO's skyline beauty. Well....It is the stitched beauty of the standing skyline and flipped vertically / horizontally which ever way I liked, using just another image of the original. All Original Photos captured June 30th 2013.

By the way, there is nothing much to it. No photoshop effects or nothing. Here is how I did it. Make a copy of the original one. Open it in basic MS paint or any other image edit software. Copy the original, extend the canvas, paste the copy and flip horizontal or vertical as you like. Voila - there it is!... 

It's the same process for the other photos I have used in this series. If I can do it, you can do it too. Only thing you need is a good photo to begin with. 

Will post the original ones tomorrow.

Thanks for your time.
Friday, September 20, 2013

అయితే అధ్యక్షా!!!

నాకు దీక్షితులు అంటే ఇష్టం ఎందుకో పెరిగిపోతోంది అధ్యక్షా!!

ఎందుకు అధ్యక్షా?

సంస్కృతంలో రాసింది అర్థం కాకా అధ్యక్షా?

సంస్కృతం కొద్దో గొప్పో వచ్చు కాబట్టి పూర్తిగా అర్థమైపోయా అధ్యక్షా ?

ఆయన రాసిన వాటిల్లో ఇమిడే సంగీతపు ఎత్తుపల్లాలా, అనగా గమకాల (ఆరోహణ, అవరోహణ, ఢాలు, కంపితం, స్ఫురితం, ఆహతం, ప్రత్యాహతం, ఆందోళితం, త్రిపుచ్ఛం, మూర్ఛన - ఇల్లాటివన్నమాట) సంగతుల వల్లా అధ్యక్షా ?

ఏమో కానీ, త్యాగయ్య రాసినవాటికన్నా దీక్షితులు రాసినవి నాకు నచ్చుతాయ్ అధ్యక్షా ...టూకీగా అదే సంగతి అధ్యక్షా ....

అయితే అధ్యక్షా , పొద్దున్నే Narayana Swamy (కొత్తపాళీ) ఫేసుబుక్కు గోడ మీద త్యాగరాజుల వారి తీర్థం చూసి ఓ కామెంటు రాసి, తర్వాత తీరిగ్గా గీతముల గూర్చి, సంగీతముల గూర్చి ఆలోచించుతూ అలా ముందుకు పోతుంటే అధ్యక్షా, అసలు ముందారంభప్రథమంగా (అవును ముందు ఆరంభ ప్రథమ సమాసం అది) త్యాగరాజుల కన్నా నాకు దీక్షితులు నచ్చటానికి కారణం కనుక్కోవాలని ఆరాటం కలిగింది అధ్యక్షా.

అప్పుడు అధ్యక్షా, ఒక్కొక్కటిగా కారణం రాసుకున్నానధ్యక్షా. అందులో కొన్ని తీసివేత, కూడిక, భాగింపు, హెచ్చువేత చేసానధ్యక్షా.

అలా చేసింతర్వాత ఈ కిందివి మిగిలాయి అధ్యక్షా. అవి మీ ముందు ఉంచుతున్నానధ్యక్షా. మీకు కళ్ళున్నాయని నాకు తెలుసునధ్యక్షా. మీరు చూడగలరని, చూస్తారని, చదవగలరనీ, చదువుతారనీ, రాస్తారనీ, రాయగలరనీ నాకు తెలుసు అధ్యక్షా. అందువల్ల అధ్యక్షా ఆయా కారణాల మీద మీరు సత్వరమే కామెంటు వేసి చర్య తీసుకోవాలని కోరుతున్నానధ్యక్షా.

ముందు త్యాగయ్య అంటే విముఖత కలగటానికి కారణాలు వివరిస్తానధ్యక్షా -

ఒకటో కారణం అధ్యక్షా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం అధ్యక్షా. ఆయన త్యాగరాజు కృతులను ఖండఖండాలుగా కత్తిరించి అధ్యక్షా, నా చెవుల్లో పోసారనిపించింది అధ్యక్షా....అనిపించిందంతే అధ్యక్షా. అయితే ఆ ఖండాలు గోణ్డ్వానా లాండు విడిపోయినట్టు విడిపోయి నా తల్లో భరించలేని తలకాయనొప్పి పుట్టించాయి అధ్యక్షా. అది మొదలు "త్యా", "ఎస్.పి", "బా" తో మొదలయ్యే పదాలంటే భరించలేని తలనొప్పి వస్తోంది అధ్యక్షా. అమృతాంజనము, టైగరు బాము, ఝండూ బాము, మూడు కలిపి చేసిన ఝమృతాంటై బాము కూడా పనిచేయకుండా పోయినై అధ్యక్షా. అమృతాంజనము తయారీదారు, పంతులు గారు స్వర్గలోక వాసులవ్వటం వల్ల నాకు అక్కడికెళ్ళి వారితో మొరపెట్టుకునే అవకాశం కలగలేనందుకు చింతిస్తున్నానధ్యక్షా. మీరు ఎవరినన్నా అక్కడికి పంపించి వారికి మన, అనగా నా వినతి విన్నవించి వారి సమాధానం ఏమిటో ఇక్కడ సభలో వినిపించాలని కోరుతున్నానధ్యక్షా.

రెండో కారణం అధ్యక్షా - గుడిపూడి శ్రీహరి అధ్యక్షా - 1980ల్లో అధ్యక్షా, త్యాగయ్య అనే సినిమా ఒకటొచ్చింది అధ్యక్షా. అప్పట్లో గుడిపూడి శ్రీహరిగారు ఆ సినిమా గురించి పత్రికల్లో రాయకపోటం మూలాన అధ్యక్షా, ఆ సినిమా సంగతి తెలియక మా నాన్నగారు ఆ త్యాగయ్య సినిమాకు తీసుకెళ్ళారధ్యక్షా. దానితో ఈ నా చిన్నారి జీవితంలో అప్పటిదాకా జాజ్వల్యమానంగా వెలుగుతున్న సజీవ జీవకాంతి కాస్తా కొడిగట్టిన దీపపు కాంతివలె రెపరెపలాడటం మొదలుపెట్టింది అధ్యక్షా. అందువల్ల అధ్యక్షా, వారు ఇప్పుడు ఎక్కడున్నా ఈ సభకు రప్పించి ఇప్పుడన్నా ఆ త్యాగయ్య సినిమా మీద రివ్యూ రాయాలని ఆదేశించాలని కోరుతున్నానధ్యక్షా.

మూడో కారణం అధ్యక్షా - ఆంధ్రదేశానికి పక్కనున్న అరవలు అధ్యక్షా. అసలే అరవలు అధ్యక్షా, చేతికి సంగీతం దొరికింది అధ్యక్షా. దాంతో కొండల మీద గోల మొదలైంది అధ్యక్షా. ఎప్పుడూ, ప్రతిదానికి చేసినట్టే వాళ్లా వాళ్ళ అరవగోల, అరవలగోల చూసుకోకుండా, పొట్ట పూడుస్తే అధ్యక్షా, తెలుగు ముక్కరాని అరవసంగీతకారులంతా అధ్యక్షా, అనవసరంగా తెలుగాయన రాసిన పాటల మీద పడి అధ్యక్షా, రక్తాలొచ్చేట్టు కుత్తుకక్షతాలు (అనగా నఖక్షతాల మాదిరి అధ్యక్షా) "త్యా" కృతుల మీద ప్రయోగించి ఆ కృతులంటే విముఖత కలిగించేట్టు చేసారధ్యక్షా. అందువల్ల అధ్యక్షా, ఈ సభలో తీర్మానం చెయ్యాలధ్యక్షా, తెలుగు వాళ్ళ పాటలు తెలుగువాళ్ళే పాడాలని, అరవవాళ్ళకు తెలుగువాళ్ళ పాటలు పాడాలనిపిస్తే అధ్యక్షా, ముందు తెలుగు చక్కగా నేర్చుకోవాలని ఆ తర్వాత వాళ్ళకు సెంట్రలు తెలుగు సిలబస్సుతో పరీక్షలు పెట్టాలని, అందులో డాక్టరేటు చెయ్యాలని, అలా డాక్టర్లయినవాళ్ళే ఆ "త్యా" పాటలు పాడాలని ఈ సభ తీర్మానించాలి అధ్యక్షా.

నాలుగో కారణం అధ్యక్షా - దీన రసం అధ్యక్షా. ఆయా కృతులన్నీ, పూర్తిగా కాకపోయినా 60 శాతం దీనాతిదీనమైన రసభావనతో ఉండటం అధ్యక్షా. ఎప్పుడు చూసినా నన్ను రక్షించు, నాకు మోక్షం ప్రసాదించు, నన్ను నీలో ఐక్యం చేసుకోమంటూ అధ్యక్షా, దీనంగా ఏడుస్తూ పాడిన పాటలు అధ్యక్షా. దాని ప్రభావంతో మిగిలిన 40 శాతం మంచివి కూడా వినాలనిపించట్లేదు అధ్యక్షా. ఇప్పుడు ఈ సభ తీర్మానించాల్సిదేమిటంటే అధ్యక్షా, ఇక ముందు ఈ దీన రసాన్ని శ్రోతలంతా కలిసి ప్రపంచంలోంచి ఎత్తి అవతలకి నూకాలని, ఆ దీనపు పాటలు ఎవరూ రాయకూడదని నియంతృత్వ తీర్మానం చెయ్యాలధ్యక్షా....అయితే ఇప్పటికే రాసేసినవి అట్లా అట్టిపెట్టి భావితరాలకు పాఠంగా గుణపాఠంగా సిలబస్సులో చేర్చాలని ఒక ప్రొవిజను పెట్టండి అధ్యక్షా...

ఇలా అయిదో కారణం, ఆరో కారణం, నూటపన్నెండో కారణం కూడా ఉన్నాయధ్యక్షా. అయితే ఆ కారణాలన్నీ ఇక్కడ రాస్తే అధ్యక్షా, నాకు గొయ్యి రెడీ చేస్తారధ్యక్షా. మీరు పోలీసు ప్రొటెక్షను, బ్లాక్ కాట్ కమాండోలు, గ్రీన్ బెరెట్స్ రక్షణ కలిగిస్తానని హామీ ఇస్తే అధ్యక్షా అవి అన్నీ తర్వాత రాసి సభకు తీసుకొస్తానధ్యక్షా.

అయితే చివరిగా దీక్షితుల సంగతి చెప్పకుండా వెళ్లిపోతూ అధ్యక్షా, త్యాగయ్య కృతులన్నిటినీ సంస్కృతంలోకి తర్జుమా చెయ్యాలన్న విన్నపం ఈ సభ ముందు పెడుతున్నానధ్యక్షా.

ఎందువల్లనంటే అధ్యక్షా, తెలుగువాడికి సంస్కృతంలో చదివితే చాలా ఆనందం అధ్యక్షా. అర్థమేమిటో తెలియకపోయినా, తెలియకపోవటమేమిటి అధ్యక్షా, అసలు తెలీదు అధ్యక్షా - అలా తెలీనిదాన్ని పొగిడేస్తూ ఉంటారధ్యక్షా, కాబట్టి అధ్యక్షా ఆ విధంగా ఈ సభ, ఈ సంగీత ప్రపంచం ముందుకు పోవాలని అధ్యక్షా, కోరుతున్నానధ్యక్షా...లోపమేమనగా అధ్యక్షా మన "త్యా" కృతులన్నిట్లో బ్రహ్మాండమైన సాహిత్యం ఉంది అధ్యక్షా, అయితేనేం అధ్యక్షా, అది మనవాళ్ళకు అర్థం కాదు అధ్యక్షా...అందువల్ల సంస్కృతమైతే రాజభాషని పేరుంది కనక అధ్యక్షా, పొగుడుతూ ఉంటారని ఆశ అధ్యక్షా...

ఇహ ఉంటానధ్యక్షా....

సర్వేజనా స్సుఖినోభవంతు ....