Monday, August 12, 2013

1962 నవంబరు 1 న....బాలాంత్రపు రజనీకాంతరావు

ఓరాజా, కవిరాజా
శశికళాసౌమ్యతేజ
ఓ అడవి బాపిరాజ
అందుకోవయ్య, నాదుగేయపూజ || ఓ రాజా||

ఒకకేల కుంచెవంచి
పెరకేల కలమునుంచి
అలవోక నాంధ్రజగలి
వెలలేని వర్ణరాశిని వెలయించితే || ఓ రాజా||

నీచూపు చొరని లోతులు
నీవూహపోని ఎత్తులు
భావంపు పరువుచేరని దూరాలు
లేవయ్య నీవుకానని అందాలు || ఓ రాజా||

ప్రతియెడద దివ్వెవెలుగు
ప్రతిమనస్సు మప్పుతావి
వెలిగించెనీ యెడంద స్నేహరసము
విరయించెనే మనస్సు మనోరజము || ఓ రాజా||

' ఎండీమియాను ' నీవే
' ఎడొనీసు ' ప్రేమనీవే
ఎనలేని ప్రణయగీత శిల్పినీవే
ఆ ' ఆర్ఫియస్సు ' అమరవీణనీవే || ఓ రాజా||

నీ గీతల వంపులలో
నీరంగుల ఎంపికలో
నీమాటల సొంపులలో
నీపాటల ఫణితులలో
సకలకళా సమ్మిశ్రిత భరతనాట్య రంగము
సృష్టికి ప్రతిసృష్టి, అమరలోక యక్షగానము


ఓరాజా, కవిరాజా
శశికళాసౌమ్యతేజ
ఓ అడవి బాపిరాజ
అందుకోవయ్య, నాదుగేయపూజ


 - బాలాంత్రపు రజనీకాంతరావు
 - చుక్కాని పక్షపత్రికలో 1962 నవంబరు 1 న...