Wednesday, November 21, 2012

ఈ సంఘటనలు నా జీవితంలో చాలా చాలా తక్కువ!! - విపరీతమైన ఆశ్చర్యం

ఏడ్చిన లేదా కళ్ళూ, మనసు చెమర్చిన సంఘటనలు నా జీవితంలో చాలా చాలా తక్కువ, వేలి గోళ్ళ మీద లెక్కెట్టొచ్చు....

ఎవడన్నా వేళ్ళ మీద అంటాడు, నువ్వేమిటి బాబూ వేలి గోళ్ళంటున్నావు?

ఓ అదా, వెరైటీగా ఉంటుందని వాడాలే!

మొట్టమొదటిసారి ఏడ్చింది, అమ్మమ్మ ఇక లేదు అన్న సంగతి తెలిసినప్పుడు (ఏడ్చా, చాలాసేపు ఏడ్చా), రెండోసారి షిండ్లర్స్ లిష్ట్ సినిమా చివర్లో లియాం నీసన్ ఏడ్చినప్పుడు (చెమర్చా!), మూడోసారి మురారి సినిమాలో లక్ష్మి మాట్లాడుతుంటే మహేశ్ బాబు కిటికీ పక్కన నుంచుని ఏడ్చినప్పుడు (చెమర్చా!), నాలుగోసారి మా ఇంటి పక్క జపానాయన, వాళ్ళ తలిదండ్రులను చూట్టానికి జపాను వెళ్ళీ, సునామీ రాగా అందులో తనవాళ్ళను పోగొట్టుకున్నానని ఫోన్ చేసి చెప్పినప్పుడు (ఏడ్చా!), అయిదోసారి నిన్నరాత్రి ......

పెయింటింగయిపోయాక 9.30 గావాలు పక్కెక్కా, రోజూ జరిగినట్టుగానే ఎక్కటమేమిటి తల దిండు మీద పెట్టటమేమిటి అలా నిద్దర్లోకి జారిపోటమేమిటి శరీరం దాని పని అది చేసుకుపోయింది....12.30కి చెయ్యి మీద నీళ్ళు పడుతున్నట్టు అనుమానం వచ్చి లేచి చూడటానికి ప్రయత్నం....మసక మసకగా ఉన్న కళ్ళు తుడుచుకుని చూస్తే దిండు మీద ఓ చెరువు రూపంలో ధారగా నీళ్ళు, తడుముకుంటే బుగ్గల మీద నీళ్ళు - ఓ నిముషం అర్థం కాలా.....బుఱ్ఱ ఓ దెబ్బేసుకుని అటూ ఇటూ ఊపుకుని ఈ లోకంలోకి నిజంగానే వచ్చి పడి, ఆలోచిద్దును కదా - అంతకుముందు నిముషంలో జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది....ఆ సంఘటనకు ఓ రూపం ఇచ్చే ప్రయత్నం ఈ కింది రెండు మాటలు....

సైకిలు మీద ఓ చిన్న పిల్లనేసుకుని ఉషారుగా ఈలలేసుకుంటూ, వానపడి చిత్తడి చిత్తడిగా ఉన్న ఓ పల్లెటూర్లోని మట్టిరోడ్లమీద యమస్పీడుగా వెళ్తున్న నాకు ఆ ఊళ్ళో ఉన్న గుడి పక్కనే ఉన్న మలుపు తిరగ్గానే, గుడి గోడ వెంబడి ఓ పేద్ద చెక్క మొద్దు- ఓ పదడుగులు ఉంటుందేమో - బంగారు రంగులో మెరిసిపోతూ, కుడి భుజం మీద ఓ పక్కకు తిరిగి పడున్న రూపంలో కనపడింది....సగం చెక్క ఆ చిత్తడి నేలలో మునిగిపోయుంది...

ఏమిటో చూద్దాం అని సైకిలు దిగి చూస్తూంటే ఆ చెక్క నెమ్మదిగా ఓ రూపు సంతరించుకోటం మొదలుపెట్టింది...ముందు ఒక మొహం, ఆ తర్వాత శరీరం కనపడ్డాయి....సరే ఇది తీసుకెళ్ళి మనింట్లో పెట్టుకుందాం అని అతి కష్టం మీద ఆ చెక్కను ఆ చిత్తడినేలలోంచి లేపి పక్కకు తిప్పి (అప్పటికి ఒక మోకాళ్ళ పర్వతం వద్ద ఉండే మెట్లంత ఎత్తున్న ఓ పేద్ద మెట్టు, సుమారు ఆరడుగులుంటుందేమో - దాని మీద ఉన్నా!) ఆ మెట్టు మీదనుంచి దింపి కిందనున్న నేల మీద ఆ చెక్కను నిలబెట్టటానికి చూసా....ఇంతలో శరీర పై భాగం పూర్తయ్యి కాళ్ళొచ్చేసినాయి ఆ చెక్కకు....అయితే అప్పుడే తప్పటడుగులు వేస్తున్న పిల్లాడిలా నిలబడలేక కూలబడిపోయింది ఆ శరీరం....నేను వెంటనే ఆ మోకాళ్ళ పర్వతం మెట్టు నుంచి కిందకు దూకి ఆ శరీరాన్ని లేపి నిలబెట్టటానికి ప్రయత్నిస్తూ తలెత్తి చూస్తే చాక్లెట్ రంగు, ధగ ధగ బంగారం రంగు కలగలిసి ఉన్న మనిషి కనపడ్డాడు.

మెరిసిపోతున్నాడు ఆ వ్యక్తి.....ఎంతందంగా, బలిష్టంగా, అజానుబాహువులా ఉన్నాడో... చాలా చాలా బావున్నాడు.....ఎంతలా అంటే చెప్పలేనంత....

(ఇక్కడేం జరిగిందో గుర్తుకురావట్లేదు, గుర్తులేదనటం కన్నా - చాలా అస్పష్టంగా ఉన్న అనుభవం...ఎలా రాయాలో తెలియదు....)

కట్ చేస్తే

ఆ వ్యక్తి చెయ్యి, చెయ్యి అనటం కన్నా మోచెయ్యికి ఆసరాలా పట్టుకుని ఆ గుడి మెట్లు ఎక్కించా....ఆయన రెండు అడుగులు వేసి వెనక్కి తిరిగి చూసాడు....ఆ రూపం ఎవరిదో అర్థం అవ్వటానికి ఓ నిముషం పట్టింది....అర్థం అవ్వటమేమిటి, పూర్తి స్వరూపం కనపడటమేమిటి - కళ్ళల్లో నీళ్ళు ధారగా, విపరీతమైన ధారలు....కళ్ళు మూస్కుని చేతులు కట్టుకుని కూలబడిపోయా......ధార ఆగితేగా దిండు తడిసిపోయింది, మెలకువా వచ్చేసింది.....

ఆ రూపం ఎవరిది అనుకున్నారు?

హనుమయ్యది.....

జైశ్రీరాం అంటూ చెయ్యి చూపిస్తూ, ఓ పేద్ద గదతో నిలబడిన ఆ సుందర విగ్రహం ఈ జన్మలో మర్చిపోలేను....

ఆయన ఎందుకు కనపడ్డాడో తెలియదు కానీ బోల్డంత ఆనందం....నేను ఆయనకు భక్తుణ్నే కాని వీరభక్తుణ్ణీ కాను , కాకుంటే వీర శివభక్తుడినవటంతో అప్పుడప్పుడు ఆ శివయ్య కలలోనన్నా కనపడితే బాగుండని అనుకుంటూ ఉండేవాడిని కానీ, హటాత్తుగా ఆ శివస్వరూపం ఈ రూపంలో దర్శనమిచ్చిందేమో ! తెలియదు...సర్వం జగన్నాధం....

ప్రతి శనివారం అభిషేకంలో పాలు పంచుకుంటాను, అలంకారంలో పాలుపంచుకుంటాను కాబట్టి ఇలా దర్శనమిచ్చాడేమో తెలియదు కానీ మరచిపోలేని కల, గుర్తుండిపోయే కల....

సాధారణంగా మనిషికొచ్చే కలల్లో 99.5 శాతం నిద్ర నుంచి లేస్తూనే పలక మీద తడిగుడ్డేసి తుడిచేసినట్టు సోదిలోకి రాకుండా ఎక్కడికో పరుగులెత్తుకుంటూ వెళ్లిపోతాయ్. మిగిలిన .5 శాతం కలల్లో .3 శాతం కలలు కొద్దిగా నిద్ర లేచాక కూడా కొద్దిగా గుర్తు ఉంటవి. అయితే ఆ "గుర్తు" మిగలడానికి, మిగుల్చుకోడానికి కొద్దిగా కష్టపడాలి. మిగిలిన .2 శాతం మటుకు కష్టపడనఖ్ఖరలేకుండా గుర్తు ఉంటాయి. ఇదీ నా థియరీ. అలా .2 శాతంలోకి పడిపోయింది నిన్నరాత్రి వచ్చిన ఈ కల.

జై శ్రీరాం.....జై హనుమాన్..

భవదీయుడు
వంశీ

PS: నమ్మనివారు ఈవేళ రేపట్లో మా ఇంటికి వస్తే ధారల దిండు చూపిస్తా....అసలు చాలా ఆశ్చర్యంగా, చాలా అంటే విపరీతమైన ఆశ్చర్యంగా ఉన్నది నాకు ఈ సంఘటన......

5 comments:

 1. ఆహా! మీ అనుభవం వింటుంటే నా కనులకొలనులో కూడా నీటిజాడ కనిపిస్తోంది. ఎంత అదృష్టవంతులండీ మీరు. జై హనుమాన్! జై శ్రీరాం!.

  ReplyDelete
 2. భజే రుద్రరూపం.. అన్నారుగదండీ.

  ReplyDelete
 3. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. మీ దగ్గర కాబట్టి అనేస్తున్నా. :)

  మనకు (ఇందులో నేనూనూ) అనుభూతులకన్నా ఫార్ములాలమీద ఎందుకో గురి. అభిషేకం చేస్తే కల వచ్చిందేమోనన్న అనుమానం. ఎందుకండి? ఏమో, తనంతట తానే వచ్చాడేమో? ఎదుట మనకు కావలసిన వాళ్ళు మనలను మనలుగా ప్రేమించాలని ఆరాటం.పాట కూడా (మనసున మనసై..నన్ను నన్నుగా ప్రేమించుటకు, నాకోసం కన్నీరు నింపుటకు - డా. చక్రవర్తి. :)). ఆ పనే తెలియని దైవమో, మరేదైనా శక్తి చేసిందేమో? ఏం, ఎందుకు చేయకూడదు? పసిపాప మీద ఇష్టం కారణాలతో ఏర్పడుతుందా? అలాగే మీలోని ఏదో ఒక పసిపాప మనస్తత్వం ప్రకృతికి, నియతి కృతనియమరహితమైన దైవానికి నచ్చిందేమో?

  ఈ మధ్య చాలా చూస్తున్నానండి. ఆధ్యాత్మికత పేరు మీద ఫార్ములాల మీద ఫార్ములాలు. మహర్షులు చెప్పిన ఫార్ములాల ప్రకారం దేముడు నడుచుకుంటాడు అనో లేదా దేముడికి సంబంధించిన పార్ములాలను మహర్షులు కనుక్కున్నారనో..ఏవేవో..ఈ ఫార్ములాల వల్ల ఆత్మన్యూనత, అనవసరమైన 'మాట ' లపై గురి, వ్యక్తిపూజ, ఇవి తప్ప ఒరిగేదేమీ లేదు. వంద ఫేస్ బుక్ ఉపన్యాసాలకంటే సాయంత్రం కార్తిక దీపం పెట్టి, ఆ దీపం చివరను చూస్తూ పదినిముషాలు కూర్చుంటే వచ్చే అనుభూతి మాటలకందనిది. అది అటుండె.

  ఏతావతా, నా పరిశీలన ఏమంటే, ఈ అనుభూతిలో మునగడం మంచిది. ఆ అనుభూతి సారం వంటపడితే మరిన్ని అనుభూతులు, దైవికమైన అనుభవాలు కలుగగలవు. :)మీరు అదృష్టవంతులు తప్పకుండా.. అయితే ప్రతి ఒక్కరికీ ఆ అదృష్టం అందుబాటులోనే ఉంది. పాప చిర్నవ్వు రూపంలోనో, వర్షం చినుకు రూపం లోనో, దీపపు వత్తి చివ్వరో, గంధపు బొట్టు చల్లదనం లోనో..వెతుక్కుంటే వీజీగానే దొరకచ్చు.

  ReplyDelete
 4. రవి - అదృష్టం అందరికీ అందుబాటులోనే ఉందని చాలా బాగా చెప్పారు.....మీరన్న మాటలకందని అనుభూతి మరింత నిజం....చాలా ఖచ్చితమైన నిజం.....అయితే అందుబాటులో ఉన్న అదృష్టాన్ని అందుకోగలం అన్న నిజాన్ని చాలా మంది కన్వీనియంట్ గా మర్చిపోయి, అలా మర్చిపోయామన్న సంగతి కూడా మర్చిపోయి మీరన్న ఫార్ములాల వైపు పరుగులు తీస్తున్నారేమో!

  దాన్ని కాష్ చేసుకోడానికో, తమ ఉనికిని పెంచుకోడానికో ఆధ్యాత్మికత ముసుగేసుకుని తయారయినవారి సంఖ్య, కమర్షియల్ గురువుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగే ఉండొచ్చు అని నా అనుకోలు....నాకు తెలిసే అవకాశమూ లేదు, దాని మీద దృష్టీ లేదు కాబట్టి అనుకోలు అని వాడాల్సొచ్చింది...

  ఇహపోతే అభిషేకం అనుమానం - అది ఖచ్చితంగా నా తప్పే....చెప్పాలనుకున్న రీతిలో చెప్పలేకపోయాను....ఇమోషనెక్కువై మోషనూ ఎక్కువవ్వటం వల్ల, జారుడు బల్ల మీద జారుతూ అక్కడొచ్చి పడిన వాక్యాలవి...ఇప్పుడైనా సరిగ్గా వివరించగలనేమో ప్రయత్నిస్తా......ప్రమేయం లేకుండా జరిగే వాటికి కారణం వెతుక్కోవటం కొద్దిగా పిచ్చితనమని అనుకున్నా, అటువైపు అడుగులెయ్యాల్సి రావటం సహజమేనేమో....

  శివయ్య కనపడితే బాగుండునని బలమైన స్వార్ధ పూరిత కోరికతో ఉన్న నాకు, ఏ నాడూ, ఏ మాత్రమూ, ఏ రూపంలోనూ కోరికలు కోరని హనుమయ్య రూపం దర్శనమివ్వటం వల్ల ఏర్పడ్డ ఆనందాతిరేకమైన సందేహ, సంకట స్థితి.... (ఒకరకంగా చెప్పాలంటే - అబద్ధమెందుకు - మూర్ఖంగా, నేను చేసె సేవ వల్ల శివయ్య ఎప్పుడైనా దర్శనం ఇవ్వకపోతాడా అన్న బలీయమైన కోరికతో సేవకు వెళ్ళేవాడిని...అది ఎంత తప్పో ఈ అనుభవంతో తెలియవచ్చింది.....ఆ శంభో శంకరుడికి క్షమాపణలతో.....)

  ఈ అనుభవం తర్వాత, మీ మాటలు చదివాక అనుభూతి సారం వంటపట్టించుకోవాలన్న తపన మీరన్న తర్వాత నిజంగానే కలుగుతోంది....అది "స్వార్ధమైన కోరిక"గా మారకుండా ఎంతమటుకు నియంత్రించుకోగలనో చూడాలి....

  మీరన్న ఫార్ములా వైపు ఓ అడుగేసి ఈ నా అనుభవం వివరించాలనుకుంటే

  శివయ్య సేవ
  కోరిక = స్వార్ధ పూరితం (దర్శనం కోసం)
  అనుభవం = ఈషణ్మాత్రం
  అనుభూతి = అస్పష్టం

  హనుమయ్య సేవ
  కోరిక = శూన్యం
  అనుభవం = హిమవత్పర్వతం
  అనుభూతి = అనిర్వచనీయం

  అదండి నేను చెప్పాలనుకున్న మాటలు, అర్ధమయ్యిందో లేదో తెలియదు కానీ - ఇంతకన్నా స్పష్టంగా వివరించలేను....

  ReplyDelete
 5. ఇంకో విషయం - ఓరి పిచ్చోడా, నువ్వు చేసే సేవలకే శివయ్య దర్శనమిస్తే యోగులు, సాధులు, సిద్ధులు వీళ్లంతా ఎందుకు వాళ్ళ ఇదీంతా ఎందుకు అని మీరడగొచ్చు కానీ, దానీకి సమాధానం నా దగ్గర లేదు....నాకు తెలిసినంతలో, తోచినంతలో చేయగలిగిన, చేసిన సేవే గొప్పదని అనుకోటల్లా కానీ, అదేదో తెలుస్కోవాలన్న ఆరాటం మటుకు ఉన్నది....:)

  ReplyDelete