Sunday, October 14, 2012

పుస్తకం - భారతీయ కవితా కల్పకం - గొడవ .... LOL

పుస్తకాల పరిచయం సిరీస్ లో రెండోది...

మొదటిది, ఈ సిరీస్ కథా కమామీషులు తెలియాలంటే దీనిముందున్న పోష్టు చదువుకో ఏం?

ఇక్కడో విషయం చెప్పాలె....

నాకు గుర్తున్నంతవరకూ, ఈ వ్యాసం చదివాకే గావాలు జంపాల చౌదరి - Very disturbed at the condescending tone of this article, readers should not be treated with disdain, restrain is needed  అని అన్నట్టు గ్యాపకం ....  :) :) :) 


(FYI - This is one of his comment on that article. Might not be the exact word to word, but the essence of it is the above. But we had fun, or atleast I did with the conversation)


ఇహ పుస్తకానికొచ్చేస్తే ఇది అభిప్రాయం కాదులే కానీ, ఓ పుస్తక పరిచయం అనుకోవచ్చు  ....ఇహ చదువుకో
**************************************************


“భారతీయ కవితా కల్పకం” – అసలు ఈ మాట ఏమిటో, ఇలాటి పేరున్న రచన ఒకటి ఉందని తెలిసినవారెవరో, అదీ తెలుగులో ఉందనీ తెలిసినవారు ఎంతమందోనని పాతతరం వారినొదిలేసి ఈకాలపు “సాహిత్యాభిలాషుల సెన్సస్” కార్యక్రమం పెట్టుకుంటే తేలిన సంఖ్య రెండు వందల లోపేనట. అది మరి ఆ రచయితకు అవమానమో, ఆ రచనకు అవమానమో, మన సాహిత్యానికి అవమానమో ఆ పరమాత్మునికే ఎఱుక. శ్రీ మీసరగండ విశ్వంగారు నేను అభిమానించే రచయితల్లో ఒకరు. అసలు రచయితల్లో ఈయన పేరే ఎప్పుడూ వినలేదు అన్న కామెంటు వస్తే అంతకన్నా ఖర్మం ఇంకోటి లేదని భవదీయుడి అభిప్రాయం! ఆ కామెంటు రాసిన దుర్మార్గులని “విద్వాన్ విశ్వం” గారన్నా తెలుసా అని అడగాలనిపిస్తుంది. అప్పటికీ తెలియకపోతే, ఇక తెలుగు సాహిత్యం నిజంగానే దుస్థితిలో ఉందని ఖరాఖండిగా చెప్పొచ్చు.

ఒక రచయితగా, అనువాదకుడిగా శ్రీ విశ్వంగారు చేసిన రచనల్లో, ఈ అనువాద రచన (1963) ఒక కలికితురాయిగా నిల్చిపోవాల్సినా, ఈ రచనకు రావల్సిన పేరు రాలేదనిపిస్తుంది. అందుకు నాకు కనపడ్డ కారణం – ఈ రచనలో “TOPICS DISORGANIZATION”. ఆగండి – అక్కడే ఆగిపోండి ..అనువాదమంటున్నారు, చాలా గొప్పగా వుందంటున్నారు, పేరు రాలేదంటున్నారు మరి ఈ అనువాదానికి “మూల” రచన ఏమిటి, ఒకవేళ “మూల” రచన ఏదన్నా ఉంటే “మూల” రచయిత ఎవరు అని గొప్ప ప్రశ్న మీ బుఱ్ఱల్లో ఉదయించకముందే – వివరణ.

ఈ అనువాదానికి “మూల” రచనలు , “మూల” రచయితలు బోల్డు. అథర్వవేదంలోని వైదిక సూక్తులు, టాగోర్ రాసిన బెంగాలీ కవితలు, తమిళం లోని పొఘై ఆళ్వర్ కవితలు, కన్నడంలోని సర్వజ్ఞ మూర్తి రచనలు, నన్నెచోడుడి పలుకులు, గుజరాతీలోని కవితలు , హిందీలోని కబీరు కవితలు, సంస్కృతంలోని భోజరాజుని మాణిక్యాలు – ఇలా 376 పేజీల ఈ సుందర వనికి ఎన్నో మూలాలు. ఏరుకుని సాహితీ క్షుద్బాధ తీర్చుకోవాలనుకునేవాడికి ఎన్నో “కంద” మూలాలు.

ఈ రచన / పుస్తకం ఎలా ఉంటుందంటే – ఇంట్లో ఉన్న పుస్తకాల షెల్ఫులో కాలం గడుపుతున్న వివిధ భాషా పుస్తకాల్లోనుంచి ఆయన కళ్ళకు కనపడ్డవి, చేతికి అందినవి తీసుకుని అప్పటికప్పుడు అనువాదం చేసేసినట్టు , అలా రాసినవి అచ్చేసినట్టూ కనపడుతోంది. “ఆంధ్ర ప్రభ”కు ఎడిటర్గా పనిచేసిన వ్యక్తి “భూతాశ్రమంలో (అంటే పూర్వాశ్రమంలో అన్నమాట)” కానీ, “భవిష్యత్ ఆశ్రమంలో” కానీ అలా ORGANIZE చెయ్యకుండా చేసారంటే ఎందుకో నమ్మబుద్ధి కాకపోయినా, దగ్గరున్న పుస్తకం తెరిచాక నమ్మాల్సి వచ్చేటట్టు వుంది.

అసలింతకీ ఈ పుస్తకం నా దగ్గరకొచ్చిన విధంబెట్టిదనిన – మొన్న రెండు నెలల క్రితం ఇండియానుంచి వస్తూ మా నాన్నగారు ఇవ్వగా, మా ఆవిడ తెచ్చిన బోల్డు పుస్తకాల్లో – ఎన్నిసార్లు చదివానో గుర్తుకూడా లేని, అన్నిసార్లు చదివినా చదివిన ప్రతిసారీ రోమాలు నిక్కబొడుచుకునిపోయి, పుస్తకం ఏకబిగిన పూర్తి చేసేదాక వదలనివ్వని శ్రీ తెన్నేటి సూరిగారి “చెంఘిజ్ ఖాన్” ఒరిజినల్ ప్రింటు బుక్కుతో పాటూ, ఈ భారతీయ కవితా కల్పకం (1963) పుస్తకం కూడా ఒకటి…

తెచ్చినవాటిల్లో 50 శాతం శిధిలావస్థలో ఉన్నాయి…అందుకు గబ గబా (ఆచార్య వేమూరి గారు ఇదే మాటను వికి వికి అంటారు!) ఆ పుస్తకాలను రోజూ కొద్ది కొద్దిగా డిజిటైజు చేసుకుంటున్నా….. స్నేహితుడొకాయన ఆర్కైవ్.ఆర్గ్ లో కూడా ఈ పుస్తకముందని నిన్న చెబితే తెలిసింది. లింకు ఇక్కడ. అలానే ఈ పుస్తకంలోని కొన్ని మణిపూసలు, క్రితం నెల మాగంటి.ఆర్గ్ లో కూడా సద్దాను….చూడాలనుకున్నవాళ్ళు, సాహిత్యవేత్తలు సెక్షన్లో చూడొచ్చు..

సీమప్రాంత రచయితలను (పుట్టపర్తి, రాళ్ళపల్లి, మధురాంతకం…ఇలా) చాలా మందిని నిర్లక్ష్యం చేసి, మఱుగు చేసిన పరిస్థితి ఈ “విద్వాన్” మణిపూసకు పట్టకూడదు అని ఘోషిస్తూ – ఈ రచనలోని మెఱిసిపోయే మచ్చు తునకలు నాలుగు :

1) శీర్షిక – ఉషః కన్య

అనారతము రోదసినే
అవలోకించుచు నుదయ
మ్మయి సర్వము వ్యాపించే
అతివ ఈమె ఉషఃకన్య
ఉదయమ్మై మంజుల వ
ర్ణోజ్వలాంబరము ధరించి,
యున్న తురా లీమె వెడలు
చున్న దదో కనుంగొనుము.
బంగారు పూతలతో నా
యంగన అందఱి హృదయము
పొంగించుచు వారిలోన
రంగళించు జీవరసము2) శీర్షిక – అయ్యో!

కమల శంఖ చక్రాది
రేఖల జెలంగు
లోక కళ్యాణకరమైన
నీ కరమున
కంకణము గట్టెనా మౌని,
కందమూలములను
ద్రవ్వుక, వనులలో
మలయుమంచు?
(కౌసల్య రామునితో….)

3) శీర్షిక – అగపడవేమయ్యా!

యుగములకు యుగములే
తగులబడిపోయినవి
పగలు రాతిరి పిలిచి
అగడు పడితిమి మేము
నగధీర! నీ వేమొ
నగుచు నిలిచున్నావు!
తగని ఖేదమ్ముతో
వగచుచుంటిమి మేము
తెగలేదు సందియము
సొగచుయుంటిమి తండ్రి!
అగపడదు మాకింక
నిగమ నుత నీ రూపు
యుగములకు యుగములే
తగులబడిపోయినవి4) శీర్షిక -కాలవస్త్రం

కవలలు రాత్రింబవళ్ళు
కాలవస్త్రమును గట్టిగ
కలిసి నేయుచున్నారు
అపార మిది, అనంత మిది
ఆరు గడులతో నున్నది
అటు వేసే పడుగు పొడవు,
ఇటు వేసే పేక పొట్టి
అటు యిటు నేసినదే యీ
అమలము కాలంబరమ్ము


- ఆహా ఎంత అద్భుతమైన వర్ణనలు! – ఇలాగుండాలి కవితలంటేనూ, అనువాదాలంటేనూ! మూలం చదవనఖ్ఖరలేకుండా, మనసుకు పట్టేసేటట్టుండాలి. ఈ పైన వాటిలో ఒక్కటి మీ మనసుకు పట్టలేదు, కనీసం ఆహా అని కూడా అనిపించలేదు అంటే, ఇక ఆ భగవంతుడే మిమ్మల్ని కాపాడుగాక.

ఇది అనువాదమంటున్నారు, మరి చరిత్ర పుటల్లోకెక్కేసిన “పెన్నేటిపాట” కొచ్చినంత పేరు ఈ రచనకు ఎందుకు రావాలి అని అడుగుతారా? ఎందుకో ఒకసారి ఈ పుస్తకం అందుకుని, చక్కగా పడక్కుర్చీలో కూర్చుని,పిల్లగాలులు వీస్తున్న ఒక సాయంత్రంపూట పక్కనే టీయో, కాఫీయో పెట్టుకుని నెమ్మదిగా తాగుతూ,ఇందులో ఉన్న ఒక్కో అనువాద కవితా చదివి – బుఱ్ఱలోకెక్కిందనుకున్న తర్వాత, తీరిగ్గా ఇక్కడికొచ్చి చెప్పండి.

అసందర్భం కాకపోతేనూ , అసంబద్ధంగా ఆలోచిస్తూండకపోతేనూ, రాస్తూండకపోతేనూ – మదబ్భిప్పరాయం ఒకటి చెప్పాలె… దేని గురించి ? – రచనల గురించి. ఈనాటి / సమకాలీన రచనల గురించి.

ఏ కాలంలోనైనా, ఆ కాలానికి సంబంధించి రచన ఆధునికంగా వుండొచ్చు, ఐతే రచయితకు తొలిగా మన పాతసాహిత్యం మీద పట్టు వుండాలి. పోనీ పట్టు కాకపోయినా శ్రద్ధగా చదివి, ఆ చదివినదానిలో కొద్ది శాతమన్నా బుఱ్ఱలోకెక్కించుకుని / ఆకళింపు చేసుకుని వుండాలి. బలమైన పునాది అక్కడే పడుతుంది. “ఆధునిక” రచనలు నిలబడాలంటేనో, రచనల్లో ప్రయోగాలు చెయ్యాలంటేనో ఆ పునాది అవసరం.

విశ్వంగారి రచనల్లోనూ, మన పాత సాహిత్యంలోనూ, అన్నిటికీ మించి ఆనాటి (అంటే పూర్వ) రచయితల్లో 80-90 శాతమ్మంది పునాదులు ఎంతో బలమైనవి అని చెప్పటానికి మనకు అందుబాటులో వున్న, చదివిన, చదువుతున్న పుస్తకరాజాలే సాక్ష్యం. అదే ఈనాటి ఆధునిక రచనల విషయంలో చెప్పొచ్చా అంటే కాలమే నిర్ణయిస్తుంది.

నన్నడిగితే – పైపైన బంగ్లాలు కట్టిన ఈనాటి రచనల్లో ఎన్ని బలంగా పునాదుల మీద నిలబడ్డాయో పాఠకులకే (ఒకవేళ నిజమైన పాఠకులన్నవారెవరైనా ఉంటే!) తెలుసు. పాఠకుల్లో రకాలు బోల్డు, అందుకు పై బ్రాకెట్లో మాట చెప్పవలసి వచ్చింది.. వారి గురించి తీరిగ్గా తర్వాత…:)

ముందుగా రచయితకి “శబ్ద”, “శిల్ప” రహస్యం తెలిస్తే రచనా శిల్పాన్ని చెక్కడం ప్రారంభించొచ్చు. అసలు రాతి శిల్పమంటే రాయి అవసరం ఉందా అని అడిగేవారు ఈనాటి రచయితల్లో కోకొల్లలు. అందుకే “నిజంగా” నిలబడ్డ ఈనాటి రచనలు వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. చెప్పొచ్చేదేంటంటే ఈనాటి రచయిత పాతసాహిత్యంలో పండితుడు కానఖ్ఖరలా, పాతసాహిత్యంతో పరిచయం మటుకు చాలా అవసరం.

రచనల్లో కూడా బోల్డు రకాలు. రచయిత మతిలోని గతుల సంగతులు స్వయంసంయమనాన్ని బట్టి తాళం వేస్తూ “రంజుగా” చెప్పేవి కొన్ని, “పసందుగా” చెప్పేవి కొన్ని, “విశిష్టంగా” చెప్పేవి కొన్ని, “విలక్షణంగా” చెప్పేవి కొన్ని, “సరళంగా’ చెప్పేవి కొన్ని, “ఉద్రేకంగా” చెప్పేవి కొన్ని, “ఉల్లాసంగా” చెప్పేవి కొన్ని, “మనోహరంగా” చెప్పేవి కొన్ని, “మక్కువగా” చెప్పేవి కొన్ని, “తూతూ మంత్రంగా” చెప్పేవి కొన్ని. ఐతే మంచి రచయిత లక్షణమేమిటంటే రంజు విషయాల్ని ఎంత మమేకంగా చెబుతాడో, పసందు విషయాలను కూడా అంతే మమేకంగా చెబుతాడు. అవే నిలబడతాయి.

శక్తి వున్నా ఆపని చెయ్యలేని రచయితలనుండి వచ్చే ఈనాటి “ఆధునిక” రచనలు నిజమైన పాఠకులకు “తలబరువుగా” మారేవి, మారుతున్న వనటంలో అతిశయోక్తి వుందనుకోను. ఇక శక్తి లేక చెయ్యలేకపోయిన రచయితల నుండి వచ్చే రచనల గురించి ఎంత తక్కువ మాట్టాడుకుంటే అంత మంచిది. లేని పాండిత్యప్రకర్ష చూపించాలనుకుంటే ఇతర మార్గాలు బోలెడు. దానికి తగ్గ పాఠకులు వేరు, భజనపరులు వేరు.

రచనకు సౌందర్యం అద్దేదేముందిలే అని మంగలాయన చేతుల్లో పెట్టాల్సిన తల తీసుకెళ్ళి చాకలాయన చేతిలో పెడితే “రాణీపాల్” రంగులో బయటకు వస్తుంది.

మదబ్భిప్పరాయం సశేషం….


ఒక రచయిత రచన చేసాడంటే ఆ రచనకు తగిన సౌందర్యాన్ని అద్దగలగాలి, ఆపైన ఆ సౌందర్యానికి తగిన విలువ కట్టగలిగిన నైపుణ్యం కావాలి. అలా సౌందర్యాన్ని అద్దగలిగినప్పుడే, విలువ కట్టగలిగినప్పుడే ఆ రచనా సౌందర్యం కలకాలం నిలబడుతుంది.

రచయిత మనఃస్ఫూర్తిగా రాస్తున్నకొద్దీనూ, ఇతర సాహిత్యం, పాతసాహిత్యం “మనసు” పెట్టి చదువుతున్నకొద్దీనూ జ్ఞానం పెరుగుతుంది, రచనా శైలి పదునెక్కుతుంది. ఆ శైలి పదునెక్కితే ఏళ్ళు గడిచినా రచన నిలబడుతుంది. ఎంచుకున్న రచనాశిల్పానికి తగ్గ భాషను ఎంచుకోవటంలోనే రచయిత నైపుణ్యం తెలిసిపోతుంది.

అలా చూసుకుంటే, ఈ రచనలో విశ్వంగారి పాండితీ ప్రకర్ష, నైపుణ్యం, వివిధ భాషల మీద ఆయనకున్న పట్టు అచ్చంగా అలా కళ్ళ ముందు, చేతుల్లోనూ మిగిలిపోయి, గుండెలో నిద్రపోతుంది.

ఐతే రచనల్లో నిలబడ్డవన్నీ కళ్ళకు కనపడాలని లేదుగా, అందునా గుడ్డి కళ్ళకు మరీను. అలా కనపడకుండా పోయిన ఆణిముత్యాల్లో ఈ రచన ఒకటి అని నా అభిప్రాయం.

ఈ రచనకు పేరు రాకపోడానికి ఇతర కారణాలున్నవేమో తెలియదు కానీ, హ్యూస్టన్ నివాసి, నాసా నుండి రిటైరు అయిన జియో, కాస్మో కెమిస్టు, కవి – డాక్టర్ ఎ.వి.మురళి గారన్నట్టు – “In my opinion this humongous book and Sri Viswam gaaru deserves a national award – if there was/is one such – for translations.”

చివరిగా ఒకమాట చెప్పాలి – మారేపల్లి రామచంద్రశాస్త్రిగారు, తాను విద్యార్థిగా వున్నప్పుడు (1915 – 20) ప్రాంతాల్లో, ఉపాధ్యాయుణ్ణి ఒక తెలుగు పదానికి వ్యుత్పత్తి పదం అడిగితే - “అది తెలుగు పదంరా, దానికి వ్యుత్పత్తి ఎమిటి?” అని ఎకసెక్కంగా గద్దిస్తే, ఆయన ఆ బాధను జీవితాంతం మర్చిపోకుండా “నుడికడలి” నిఘంటువును తయారు చేసారని తెలిసిన పెద్దాయన ఒకరు చెప్పారు. అంతటి బ్రహ్మాండమైన నిఘంటువు అచ్చుకూడా అవలేదనుకోండి మన “వీర తెలుగు భాషాభిమానుల” చేతుల్లో పడి , అది వేరే సంగతి. అసలు ఈ సంగతి ఎందుకు చెప్పానో ఊహించండి !!

Book Details
Year Of Publication – 1963
Number of pages – 376
Publishers – Annapoorna Publishers, Eluru Rd, Vijayawada
Printers: Venkata Ramana, Museum Rd, Vijayawada

1 comment:

  1. http://pustakam.net/?p=4384
    -ఇది ఈ వ్యాసం పుస్తకం.నెట్లో వేసినప్పటి లంకె :-)

    ReplyDelete