Saturday, October 13, 2012

ఓ పుస్తకమ్మీద అభిప్రాయంఅప్పుడెప్పుడో రెండున్నరేళ్ళ క్రితం గావాలు పుస్తకం సౌమ్యకు ఈ ఆర్టికల్లు పంపిస్తే వాళ్ళ సైటులో అచ్చేసిందావిడ....ఈ రోజెందుకో కూర్చుని నా డైరీలో ఒకానొక పుస్తకం రివ్యూ రాసుకుంటూంటే  (అవును ఆ అలవాటు కూడా ఉందిలే, పుస్తకం చదవగానే ఆ పుస్తకంలోని మంచి - దిక్కుమాలిన పాయింట్లు రాసుకుంటూ ఉంటాలే), ఆ అమ్మాయికి పంపించిన ఈ ఆర్టికల్ సంగతి గుర్తుకొచ్చి దాదాపు ఓ సంవత్సరం తర్వాత అటేపు వెళ్ళి చూద్దును కదా, సైటంతా మారిపోయి బ్రహ్మాండంగా తయారయ్యింది.....

అయితే అంత బ్రహ్మాండంలో నా ఆర్టికల్ ఎక్కడుందో కనుక్కోడం కష్టమైపోయింది.....

సరేలే ఈ వెతుకులాట అంతా ఎందుకు అని, ఆ ఆర్టికల్ ఇలా ఇక్కడ పునః ప్రచురిస్తున్నా.....

అలా ఇంకోకటొ రెండో కూడా పంపించాను.....ఒకటి విద్వాన్ విశ్వం గారి పుస్తకం, ఇంకొకటి సరిగ్గా గుర్తుకులేదు........అలాగే పొద్దు వారి సైట్లో కూడా నా ఆర్టికల్ కనుక్కోడం కష్టమైపోయింది....అవి కూడా నా ఎక్స్ టర్నల్ హార్డ్ డ్రైవ్లో వెతికి పునః ప్రచురించాలి.

వాటితో పాటు నా డైరీల్లో ఉన్న పుస్తకాలు - పాయింట్ల మీద పోష్టులెయ్యాలి.....దీని సిగతరగ రోజుకి 48 గంటలైతే పొయ్యేది....  


ఇది అభిప్రాయం కాదులే కానీ, ఓ పుస్తక పరిచయం అనుకోవచ్చు  ....ఇహ చదువుకో

**************************************************

ప్రతిభాషలోనూ అలిఖితమైన సాహిత్యం బోల్డంత ఉంటుంది. అలాటి సాహిత్యాన్నంతా "జనపదాలు" అని పిలవచ్చునేమో! కాదనుకుంటే జానపదసాహిత్యం అని కూడా అనొచ్చు. ఈ కాలపు "సూపరు" పిల్లలకు జనపదం, అందునా పూర్వ మరియు సంప్రదాయ జనపదం గురించి ఎంత తెలుసు అని ప్రశ్నించుకుంటే, వచ్చే సమాధానానికి నోళ్ళు కొట్టుకోకుండా ఉండటం కష్టమేమో అనిపిస్తుంది. సంప్రదాయ జనపదం ఏమిటి అని అడిగారనుకోండి, ఇహ ఈ కింద రాసిందంతా చదవనఖ్ఖరలా మీరు. 

సంప్రదాయ జనపదం, వాటి ఆచారం, ఆచరణ కొద్దిగా తెలిసినవారికి - మనకున్న పండుగలు పబ్బాలకు, ఉత్సవాలు ఉత్తరేణిలకు ఆ జనపదాలతో ఎంత దగ్గరి సంబంధం ఉందో విడమర్చి చెప్పనఖ్ఖరలా. ఐతే అలాటి జనపదాన్ని మహానుభావులు కొందరు తమ కలం బలంతో కరిగించి లిపి అనే మూసలో పోసి, బంగారు కణికలుగా మార్చి, ఒరే ఇది బంగారం రా అని చెప్పి మరీ మనకిచ్చినా, అది బంగారం అనీ, దానికి అమూల్యమైన విలువుందనీ తెలిసీ  కూడా పారేసుకుంటున్న మూర్ఖపు జనాభా మనలో బోలెడంతమంది. జనపదాలంటే - తప్పులు పట్టుకునేవారు మళ్ళీ విరుచుకుపడతారేమో - జనపదం అంటే జనాలు నివసించే స్థలం అనీ, నువ్వన్నది కాదనీ - ఎవ్వరేమని అన్నా నామటుకు అది "జనపదమే"

కొద్దిగా ఆవేశం, ఆవేదనా తీరింది - ఇహ అసలు సంగతిలోకి వచ్చేస్తూ 

ఆ పండుగలు, ఆచారాలు, పరమార్థాలూ, పండగల్లో చేసే దానాల ముచ్చట్లు, చేసే భజనలు, దేశాచారాలు, వాటితో పాటు ఆ పండగలకి సంబంధించిన పల్లెటూరి పాటలు, దీవన పదాలు చదవాలంటే, ఇతరులెంతమంది ఉన్నా ఒకే ఒక్క పెద్దాయన రాసిన మూడు పుస్తకాలు పట్టుకున్నారనుకోండి - పట్టుకుని ఊరికే కూర్చోకుండా అలా అలా వాటిని చదువుకుంటూ పోయారనుకోండి - ఒకేళ మీరు పెద్దోరైతే చక్కగా మీ మీ పల్లెల్లోకి వెళ్ళి మీ చిన్నప్పుడు పాడుకున్న పాటలు - బుఱ్ఱలో బొంగరాలు బొంగరాలుగా తిప్పుకోవచ్చు. ఒకేళ చిన్నోరైతే అప్పుడెప్పుడో మా చిన్నప్పుడు లాగూలేసుకుని మేము, మాలాటోళ్ళు ఆ పాటలు ఎలా వినేవాళ్ళమో, కొండొకచో పాడుకునేవాళ్ళమో మీ మీ బుఱ్ఱల్లో ఊహించుకుని ఘాట్టిగా గంటంతోనో, గునపంతోనో, అది వీలుకాకపోతే దబ్బనంతోనో మార్కు చేస్కోండి.

అసలు ఆ  పుస్తకం ఏమిటి ? రాసిన పెద్దాయన ఎవరు? ఎన్ని పండగలున్నాయి అందులో ? ఎన్ని పాటలున్నాయి అందులో ? ఎప్పుడు రాసిన పుస్తకం అది ? ఎన్ని పేజీలు ? పబ్లిషర్స్ ఎవరు ? ప్రింటర్సు ఎవరు ? ఎక్కడ దొరుకుతుంది ? - ఆగు నాయనా..ఆగు..

ఆ పండుగ పరంపరలోని పుస్తకాల్లో మొదటి భాగాన్ని పరిచయం చేసే ప్రయత్నం మాత్రమే ఇది.... మానాన్నగారు పంపించిన భోషాణంలో దాగున్న ఆ పుస్తకాన్ని తీసి మొత్తం ఒక్క ఊపులో చదివేసి, అలా మా ఊరు చల్లపల్లికెళ్ళొచ్చి, కొన్ని స్వంతంగా పాడుకున్న, గుర్తున్న, మరి కొన్ని విన్నపాటలు అలా అలా ఈలలేసుకుంటూ (ఊళలు కాదండీ!- ఈలలు - ఈలలు )పాడేసుకుని తీరిగ్గా తర్వాత ఆ పుస్తకాన్ని టెక్కే మీద పెట్టి, ముందు ఫోటోలు తీసుకుని, ఆ పైన వివరాలు రాసుకుంటే, ఈ విధంగా తేలాయి   

పుస్తకం పేరు - "పండుగలు - పరమార్థములు"
రాసినవారు - శ్రీ నేదునూరి గంగాధరంగారు
పేజీలు -  78
ఎన్ని పండగలు - బోల్డు
ఎన్ని పాటలు - బోల్డు
ప్రింటర్స్ - లక్ష్మి ప్రెస్సు, రాజమహేంద్రవరం

ఎక్కడ దొరుకుతుంది - తెలియదు! ఆ ఒక్కటి అడగొద్దు! నా దగ్గరైతే ఉంది ... :)

అబ్బా! 78 పేజీల్లో మీరు అన్నిటికన్నా పైన చెప్పినవన్నీ రాసారా! నమ్మశక్యం గాకుండా ఉందే! సరే పుస్తకం వివరాలు అన్నీ బాగున్నాయండి - పుస్తకం రాసిన పెద్దాయన సంగతులు, పుస్తకంలోని సంగతులు చెప్పండి బాబూ 

ఆ పెద్దాయన గురించి నేను చెప్పేకన్నా "నేదునూరి గంగాధరం" అని ఒక్కసారి గూగిల్లండి. టూకీగా చెప్పాలంటే జానపద సాహిత్యమంటే ప్రాణాలిచ్చేసే వ్యక్తి. మరుగున పడిపోయిన ఎన్నో ముత్యాలు - అవేనండీ - జనపదాలని అలా అలా ఆ అగాథంలోనుంచి బయటకు తీసుకొచ్చి మన దోసిట్లో పడేసిన మహానుభావుడు. 

ఈయనా, బి.రామరాజుగారు, చింతా దీక్షితులు, టేకుమళ్ళ వారు, శ్రీమతి చింతపల్లి వసుంధర, ఎల్లోరాగా పిలవబడే శ్రీ గొడవర్తి భాస్కర రావుగారు - ఇలా కొంతమందంటేనూ, వారి పుస్తకాలంటేనూ భవదీయుడికి బోల్డు అభిమానం. వద్దనున్న ఇతరుల పుస్తకాల గురించి మెల్లగా తర్వాత ఎప్పుడైనా...ఇహ పెద్దాయనను వదిలిపెట్టి, పుస్తకంలోని సంగతులకొస్తే
 
పుస్తకం విషయసూచికకు కూడా రాకముందే అన్నా చెల్లల సంవాదన చేయించి పుస్తకం రాసిందెందుకో, పుస్తకంలో చెప్పబోతున్నదేమిటో తెలియచేస్తారు గంగాధరంగారు...మీలో ఎంతమందికి ఆ పుస్తకం దొరుకుతుందో నాకు తెలియదు కాబట్టి - ఆ సంవాదన కొంచెంగా ఇక్కడ

చెల్లెలు:
పండుగలు; నోములు; వ్రతంబులు
ప్రతీ యేటను చేయుచుందురు
పరమ సూత్రమేమిటో?
తెలియఁజెప్పుము అన్నయా!

అన్న:
దేశ సంస్కృతి; దీప్తిఁజెందఁగ
దేశ కళలవి! తేజరిల్లఁగ
దేశ మందలి; ధీవిసాలుర
స్మరణ చిహ్నముల్, చెల్లెలా!

చెల్లెలు:
దేశ సంస్కృతి; దీప్తి యేది?
దేశకళలకు, తేజమేది?
దేశ మందలి; ధీవిసాలుర
స్మరణలేమిటి? అన్నయా!

అన్న:
రామరాజ్యము ! ప్రజాసౌఖ్యము
సకల వృత్తుల ! చాకచక్యము
పుణ్యపురుషుల! బోధ వర్తన
లుండునమ్మా ! చెల్లెలా!

చెప్పాలనుకున్నవి సంవాదనలో చెప్పేసాక, విషయ సూచికకు వచ్చి అక్కడ కూడా చెప్పేసాక - ప్రథమ భాగం మొదలు అవుతుంది. ఈ భాగంలో పండుగల గురించి ఇలాగ వివరిస్తారు -

అ) "గ్రంథములు పోవచ్చును, మతములు మారవచ్చును, భాష మారవచ్చును, ప్రళయము రావచ్చును, కాని ప్రకృతిలో వ్రాసి పెట్టిన జీవనసాహిత్యము మాత్రము ప్రకాశించుచునే యుండును. ఈ జీవసారస్వతమే మన పర్వదినములు; ఆచారములు"

ఆ) " పూర్వీకులు దేశియ, జాతీయ, విజ్ఞానములను చిరస్థాయిగా నుండుటకై, ప్రతీ సంవత్సరము నొక్కసారి జ్ఞాపకముండునట్లేర్పాటు చేసినారు. ఆ యేర్పాట్లే పండుగలు. ఒక సంవత్సరములో ఈ పండుగలు, వ్రతములు అన్నియును సుమారు యెనుబది కలవు"
 
ఇ) "ప్రాచీన భారతీయ గౌరవుమును నిల్పుచున్న ఈ పండుగలలో ఉత్సవములు జరుపుదురు. ఉత్సవములనగా కథలయొక్క రూపములే. ఉత్సవములు లేనిదే మానవజీవితము సార్ధకము కాజాలదు. నిండుతనముండదు."

అలా పండుగల గురించి ఇంకా బొల్డు విశేషాలు చెప్పాక, ఆంధ్ర దేశానికొచ్చి - తెలుగువారి సంవత్సరాదితో మొదలుపెడతారు. ఈ పండగ రోజున చెయ్యాల్సిన ఆచారాలు వివరంగా వివరిస్తారు. ఆ ఆచారాలు ఏమిటా? ఆచారాల వివరాల్లోకి పూర్తిగా పోకుండా స్థూలంగా
1. వేపపువ్వు పచ్చడి
2. పంచాంగ శ్రవణము
3.మిత్ర దర్శనము
4. ఆర్యపూజనము
5. గోపూజ
6. ఏరువాక

వేపపువ్వు పచ్చడికి ఇతర పేర్లు - "నింబకుసుమభక్షణం", "ఉగాదిపులుసు" వగైరా వగైరా గా చెప్పి - ఆర్యులు చెప్పిన సూత్రం వివరిస్తారు

ఆర్యులు చెప్పిన సూత్రమిదిట

అబ్దాదౌ నింబకుసుమం! శర్క రాంలఘృతైర్యుతం
భక్షితం పూర్యయామేతు! తద్వర్షం సౌఖ్యదాయకం!

అంటే సంవత్సరారంభాన, మొట్టమొదటి ఝాములో వేపపువ్వు, పంచదార, చింతపండు, నెయ్యి, ఉప్పు, కారము వేసి లొట్టలేసుకుంటూ(లొట్టలు - నా పైత్యం-క్షమించాలి! నాకు భాఘా ఇష్టం వేపపువ్వు పచ్చడంటే) తింటే త్రిదోషాలు హరించి శరీరం బాగుండి, ఆరోగ్యం కలిగి తద్ద్వారా సంవత్సరమంతా సౌఖ్యంగా గడవటానికి మొదటిపాదం గా పనికొస్తుందని గంగాధరంగారు చెబుతారు. 

నాకు ఈ ఉగాది ఎప్పుడొచ్చినా, అలా కళ్ళుమూసుకుని ఎంతో తన్మయత్వంతో పచ్చడి తింటూంటే గుర్తుకొచ్చే పెళ్ళి ఒకటుందండోయి - ఉగాది పచ్చడికి, పెళ్ళికి లంకె ఏమిటి బాబూ ? అసలా పెళ్ళి ఏమి ? కథా కమామీషు ఏమి?

వివాహ స్థలం - మా అమ్మమ్మగారి ఊరు, వరుడు - రావి చెట్టు, ఆవిడ - వేపచెట్టు. ప్రతి సంవత్సరం డాక్టర్ తాతయ్య గారింటెనకాల పక్కపక్కనే పెంచిన రావిచెట్టుకి, వేపచెట్టుకి పెళ్ళి, ప్రతి ఉగాది రోజు పదకొండింటికి జరిగేది..బోల్డు సంబరంగా ఉండేది....ఆ వేపచెట్టు కింద ఒక రచ్చబండలాగా ఉండేది, సాయంత్రంపూట ఆ చెట్టు కింద చేరి, పండిపోయి కిందపడిన వేపపళ్ళు తింటే (గింజలు కాదు నాయనా, గుజ్జు మాత్రమే ) కడుపులో పుఱుగులు పోతాయని మా అమ్మమ్మ చెప్పిన వేదమంత్రాన్ని అక్షరాలా పాటించేవాళ్ళం...ప్చ్చ్...ఇప్పుడో? ఆ రావిచెట్టూ లేదు, వేపచెట్టూ లేదు..

మళ్ళీ పుస్తకంలోకి వచ్చేస్తే - వసంత ఋతువుకు, వేసవి కాలానికి ప్రారంభపు రోజనీ, కాబట్టి ఈ సంవత్సరాది నుండి తొమ్మిది దినాలు "వసంతనవరాత్రులు" "వసంత మాధవ పూజలు" "వసంతోత్సవాలు" జరుపుతారు. తెల్లవారితే సంవత్సరాది వస్తుందనగా "దొంగ ఏరువాక" సాగిస్తారని - గంగాధరంగారు చెబుతారు.

దొంగఏరువాక అనగానే అమ్మమ్మగారింటి పక్కనే ఉండే "పిచ్చమ్మ" గారు గుర్తుకొచ్చారు. వారికి బోల్డు పాడి ఉండేది. పొలాలూ ఉండేవి. అసలు ఏరువాక అంటే మీలో ఎంతమందికి తెలుసో ఒక్కసారి కామెంటండి. కామెంటలేరా - ఐతే సరే వినుకోండి - అందరినీ పిల్చుకుని దుక్కి దున్నటానికి ఎడ్లను తయారు చేసి, నూనేసిన పులగం వాటికి బెట్టి, నాగలికి ఆ ఎడ్లను కట్టి, పసుపు కుంకాలు రాసి, దండలేసి ధూపదీపాలు, హారతులు ఇచ్చి తొలిదుక్కి దున్నించటం ఏరువాక. అంటే ముచ్చిముమ్మాటు మూడు చాళ్ళు తోలిస్తారు అన్నమాట.

మరి దొంగఏరువాకేమిటి ? - ఎవరికీ చెప్పకుండా, నాగలిని, ఎద్దుల్ని పూజించి దుక్కి దున్నటమే. ఆ పని పిచ్చమ్మ గారి పతీశ్వరులు ఎంతో సమర్థవంతంగా చేసేవారు. ఎందుకో, కారణమేమిటో తెలియదు కానీ, మా అమ్మమ్మ "దిష్టి" కొడుతుందనిరా అనేది. ఇహ పిచ్చమ్మగారి సంగతి పక్కనబెట్టి - ఆ ఉగాది రోజున పాటించాల్సిన మిగతా ఆచారాల గురించి కూడా చక్కగా వివరించారు ఈ పుస్తకంలో. అన్నీ రాసుకుంటూ పోతూ ఉంటే పుస్తకం వారి స్థలం సరిపోదేమో అని అనిపించి కొద్దిగా వెనక్కు తగ్గవలసి వస్తోంది.

ఎలాగూ ఏరువాక గురించి చెప్పారు కాబట్టి అక్కడే ఒక ఏరువాక పూజాపదం కూడా ఇచ్చారు గంగాధరంగారు

మంగళమమ్మా, మాపూజలు గైకొమ్మా
మంగళమమ్మా, మా నాగలీ నీకు || మం ||
కష్టమనక భూమి దున్ని
కరువుమాపి, కడుపు నింపి
సకలజీవ రాశిని, నీ
చాలున పోషింతువమ్మా || మం ||

కర్షకులను; కరుణతోడ
కాపాడుచు, నెల్లప్పుడు
కామితార్థములు నొసంగు
కల్పవల్లి వమ్మ నీకు || మం ||

ఇప్పుడు అసలు సిసలు నాగళ్ళెక్కడున్నాయి? కోడెద్దులు, కాడెద్దులు ఎక్కడున్నై అంతా ట్రాక్టర్లూ, మనుషులేగా అంటారా? అలా అన్నా అసలు సంప్రదాయం పాటించాలనుకుంటే, ఈ పై పాట పాడుకోవాలని నిజంగానే ఉద్దేశముంటే నాగలి బదులు "ట్రాక్టరూ" అని పాడుకోవచ్చు. అందులో తప్పేమీ లేదని భవదీయుడి అభిప్రాయం. హాస్యానికి అనట్లేదు. కాలం మార్పుతో పాటూ ఈ పాటల సాహిత్యం కూడా మార్చుకోవచ్చు. సంప్రదాయం పాటించటం ముఖ్యం కానీ, మాటలదేముంది అన్నీ మనచేతిలో పనేగా! పండితులెవరన్నా పూనుకుని ఈ కాలానికి తగ్గట్టు ఆ పదాల పడికట్టూ, ప్రాసకు తగ్గట్టూ మారిస్తే, భేషుగ్గా సిగ్గుపడకుండా పాడుకోవచ్చు.

అలానే ఏరువాక పౌర్ణమికి, ఏరువాక పండగకి పాడుకునే - ఏరువాక ఆరాధన జానపద గేయం ఒకటి

ఏరువాకమ్మకూ ఏమి కావాలి
ఎఱ్ఱ ఎఱ్ఱని పూలమాల కావాలి
ఎరుపు తెలుపుల మబ్బుటెండ కావాలి
ఏరువాకమ్మకూ ఏమి కావాలి
పొలము గట్టున నిలిచి వేడుకోవాలి
టెంకాయ వడపప్పు తెచ్చిపెట్టాలి
ఏరువాకమ్మకూ ఏమి కావాలి
ముత్తైదులందరూ పాట పాడాలి
పున్నిస్త్రీలందరూ పూజ చేయాలి
ఏరువాకమ్మకూ ఏమి కావాలి
పాట పాడుతు తల్లి
పాదాలు మ్రొక్కాలి
ఏరువాకమ్మను ఏమి కోరాలి
ఎడ తెగని సిరులివ్వ వేడుకోవాలి
పాడి పంటలు కోరి పరవశించాలి

గంగాధరంగారు పుస్తకంలో రాసిన ఈ క్రింది పాట సంవత్సరాది సంబరం పాట - కొద్ది తేడాతో పిల్లలందరి స్నానాలూ అవీ అయ్యాక, దేవుడికి పూజ అయ్యాక ఉగాది పచ్చడి తినేముందు, అమ్మమ్మ మాతో పాడించేది - (తేడా బ్రాకెట్లో చూడొచ్చు!) 

ఉగాది పండుగ వచ్చింది
ఊరికి అందం తెచ్చింది
దేవుడి గుడిలో బాజాలు
బాజాలయ్యాక పూజాలు
ఊరేగింపులు జరిగాక
ఉత్సవాలు ముగిసాక
పంచాంగాలను చదివించి
మంచీ చెడ్డలు విన్నాము

(ఊరేగింపులు చేద్దామూ
ఉత్సవాలూ చేద్దామూ
పంచాంగమ్మును విందామూ
అన్నీ తెలుసుకుందామూ)

 ఇహ సంవత్సరాదిని పక్కనబెడితే, పండుగల పూట పిల్లలు ఆడుకునే ఆటల గురించి వివరిస్తారు గంగాధరంగారు. చిన్నోళ్ళైతే చెడుగుడి, ఉప్పట్లు, చెమ్మచెక్క లాంటి ఆటలు , పెద్దోళ్ళైతే చిన్నీ - బిన్నీ, ఉత్తుత్తి పెళ్ళి , హరికథలు, ఆకపదాలు, భజనలు, కోలాటాలు (కోపులు) లాంటివాటితో గడుపుతారు.

ఒకటే ఒక్క పదం (బ్రాకెట్లో ఉన్నది!) తేడాతో మా పిన్ని పాడే పాటా, ఆవిడ ఏడిపించిన దుర్గయ్య బావ జ్ఞాపకాలు అలా లేచి కూర్చున్నాయి, గంగాధరంగారు పుస్తకంలో రాసిన ఈ క్రింది పాట చూస్తే

చిప్ప చిప్ప గోళ్ళు
సింగరాజు (మాబావ) గోళ్ళు
మా బావి నీళ్ళు
మండాప రాళ్ళు
మా మామ కాళ్ళు
మంచం కోళ్ళు

ఇంకా బొల్డు పాటలున్నాయి, అవి అన్నీ ఇక్కడ రాసే పని కాదు... ఇలాటి పాటలకోసం గంగాధరంగారు రాసినవే "సెలయేరు", "మిన్నేరు" మొదలైన జానపద గీతాల సంకలనాలు/రచనలు ఉన్నాయి. వీటిలో కొన్ని డి.ఎల్.ఐ లో లభ్యమవుతవి. ఆసక్తి ఉన్నవారు అక్కడ వెతుక్కోవచ్చు.

ఇక ఒక్క దాటుగా పెద్ద పండుగ - దసరాకు వచ్చేస్తా - ఈ పండుగలోని భాగాలు, వాటి వివరాలు గంగాధరంగారు ఈ పుస్తకంలో తెలియచేస్తున్నారు. స్థూలంగా రాస్తే ఇవీ -
1. దేవీపూజ
2. ఆయుధ పూజ
3. పొలిమేర దాటుట
4. పారు వేట
5. జమ్మి (బేతాళ) పూజ

మళ్ళీ సొంతడబ్బాకొచ్చేస్తున్నానహో! ఈ పైవాటిలో పారువేట తప్పితే అన్నిట్లోనూ భాగస్వామ్యం ఉండేది భవదీయుడికి. పారువేట అంటే, దశమి రోజు పొలిమేర దాటటం అయిపోయాక ఏదన్నా జంతువుని పరిగెత్తించటం, వేట చేస్తున్నట్టుగా అభినయించటం అన్నమాట. ఆరో నంబరు కాలవ దగ్గర దగ్గరగా పొలిమేర ఉండేది మా చల్లపల్లికి. ఆ పొలిమేరకు దగ్గరలో యానాదుల బజారు (అని అప్పుడు పిలిచేవాళ్ళు) ఆ వీధిలోనూ, ఆ చుట్టుపక్కలా ఉన్న జనాలంతా మేకల్ని , గేదెలని పరిగెత్తించేవాళ్ళు. ఉత్తుత్తి వేట అయిపోయాక, గేదెలను వదిలిబెట్టి మేకల్ని కోసుకుని తినేవాళ్ళు. ఆ కోసుకునే భాగం అంటే చిన్నప్పుడు చచ్చే భయంగా ఉండేది. అందుకు అసలు ఆ భాగంలో పాలు పంచుకునేవాడిని కాదన్నమాట.   

మళ్ళీ పుస్తకంలోకి వచ్చేస్తే - గంగాధరం గారి ఊరు రాజమహేంద్రిలో దశమిరోజు జరిగే ఒక విశేషాన్ని వివరించారు పుస్తకంలో - "రెవెన్యూ శాఖ ఉద్యోగులు కఱ్ఱలతోనూ, కాగితములతోనూ ఏనుగును కట్టి చక్కగా అలంకరించి ఊరేగించుచుండిరి. అక్కడి వేడుకలు కన్నుల పండువుగా నుండుటచేత, నెక్క డెక్కడి నుండియొ, ప్రజలు వచ్చెడివారు." ఈ వాక్యాల్లో నాలోని పాఠకుడికి ఎక్కడో "భూతకాల" ప్రయోగం కనపడింది, తప్పు అయ్యుండొచ్చు కాని నాకు అనిపించింది ఏమిటంటే ఆ వేడుకలు నెమ్మదిగా అంతరించిపోతున్నాయనో, పోయాయనో ఆవేదన చెందుతున్నారేమో అని.

ఇక దసరా పాటల్లోకి వస్తే "అయ్యవారికి చాలు, ఐదు వరహాలు - పిల్లవాళ్ళకు చాలు, పప్పు బెల్లాలు" పాడుకుంటూ తిరిగిన రోజులు అలా గుర్తుకొచ్చినాయి, గంగాధరంగారు ఉదహరించిన పాటలు చూస్తే. మచ్చుకు ఆ పుస్తకంలోని పాట ఒకటి

ఇవ్వలేని లోభుల యిళ్ళకు బోము
మూటగట్టుట యేమి మోక్షము గదయ్య
కోటినార్జించిన కూటికెగదయ్య
మటుమాయవాదులను మరియడుగబోము
నీటుగన శార్జోడు నేడివ్వరయ్య
సాటెవరు మీతోను సరసము గదయ్య
అయ్యవారికి చాలు అయిదు వరహాలు
తెప్పించి కట్నంబు లిప్పించరయ్య
మాపప్పుబెల్లాలు మాకు దయచేసి
శీఘ్రముగ నంపుడీ శ్రీమంతులార...

ఈ పై పదాన్ని "రూక పదం" అంటారనీ, అప్పట్లో చాలా ప్రఖ్యాతి పొందిన పదమనీ తెలియచేస్తున్నారు గంగాధరంగారు. ఈ పదం నేనెప్పుడూ వినలేదు, పాడే అవకాశమూ రాలేదు. ఎందుకంటే మా బజార్లో, అటుపక్క బజార్లో, ఇటుపక్క బజారులో ఘాట్టిగా కలిపితే  70 గడప, అందరి పిల్లలూ ఉండేవాళ్ళు కాబట్టి, ఎవ్వరూ ఏమీ ఇవ్వకుండా పోయేవాళ్ళు కాదు. అందుకు అన్నమాట.

ఇప్పుడు ఇక దసరా పండుగ కోలాటలు, ఆటలు, పాటలు, ఆచారాలు వదిలేసి దీపావళికొస్తే , ఆ పండుగకు సంబంధించిన కథావిశేషాలు, వివిధాభిప్రాయాలు, వివిధ దేశ వాడుకలు, వివిధ దేశాచారాలు (వివిధ దేశాలంటే భారతదేశం బయట అనుకునేరు! - గుజరాతీలూ, జైనులు, కొంకణులు - ఇలాగన్నమాట!) గురించీ, పండుగ ఆచరణ విధానాల గురించీ వివరణ వున్నది. దీపావళి కొంతమంది 13 దినములుగా భావించే  పండుగ కాగా, ప్రాధానంగా ఐదు దినాల పండుగ అని విశేష వివరాలు ఇచ్చారు..ఆ పంచదినాలు, వాటి వివరాలు ప్రధానంగానూ / స్థూలంగానూ ఇక్కడ

1) నిధనత్రయోదశి
2) నరక చతుర్దశి
3) దీపావళి
4) గోవర్ధనోద్ధరణ
5) యమద్వితీయ

రైతులు గోపూజను, వారింట్లో వారు కేదారగౌరీ వ్రతం, గౌరమ్మ పండుగ చేస్తారని రాసి, ఆ వ్రత వివరాలు, కొన్ని పాటలు కూడా ఇచ్చారు. మచ్చుకు లక్ష్మి మంగళహారతి పాట.....ఆవిడను నిలదీస్తూ, వేడుకుంటూ, ఆహ్వానిస్తూ ఎంత సుందరంగా ఉందో చూడండి

మహలక్ష్మి యనినిన్ను ! చాలగ బిలిచితే
ఓ లక్ష్మి నీకింత, జాలమేలా?
పాలసముద్రుని పట్టిరో యని నిన్ను
పలుమారు పిలిచితే పాలించవేమమ్మా!
మంగళం, మంగళం, మహాలక్ష్మీ
నీకు మంగళం మంగళం

అలికి పూసిన యింట్లో చిలుకు జల్లితి నేను
మెళుపు చూపుతు రావె అలుకలేలా
కళకళ నవ్వుచు కలయిండ్ల నెక్కుచు
కలికి ముద్దులగుమ్మ చిలుక రావమ్మా || మం ||

ఒంటిగా నీవు మా యింటికి రావమ్మ
జంటబాయక నా వెంటనుండూ
కంఠాన మెరసేటి కంఠహారములిత్తు
ఇంట్లోకి రావమ్మా | యిపుడు మహలక్ష్మీ || మం ||

ఇక సంక్రాంతి గురించి బోల్డంత రాసుకొచ్చారు గంగాధరంగారు... చదవాల్సిందే తప్ప ఇక్కడ రాసేది లేదు..

ఇక్కడో సంగతి చెప్పాలండోయి - ఈ వ్రతాలూ, నోముల సంగతికొస్తే చిన్నప్పుడు మా ఇంట్లో అవి జరిపించడానికి ప్రత్యక్షమైపోయే ఆస్థాన పురోహితుడిని చూసినప్పుడల్లా మా నాన్నగారితో మావయ్య ఒకటనేవాడు..."బావా - ఈ పురోహితులకు, వాళ్ళ వ్యాపారానికి అమాయకమైన మహిళలే మాంచి సరుకు" అని. ఆ మాట అప్పుడు అర్థంకాలా కానీ, ఊహ బాగా తెలిసాక అర్థం అయ్యింది. మా నాన్నగారు ఒకటే అనేవారు - "ఒరే కృష్ణా - వాళ్ళే కనక ఆ వ్యాపారంలో లేకుంటే, మనకున్న ఈ పాటి విశ్వాసాలు, నమ్మకాలు, ఆ వ్యాపారం చేసేప్పుడు బయటపడే మన పూర్వచరిత్ర ఏవీ మిగలకుండా పోయేవి. కాబట్టి వాళ్ళకూ, మన ఆడాళ్ళకు ఋణపడి ఉండటమే మనం చెయ్యగలిగింది" అని

మళ్ళీ పుస్తకంలోకి వచ్చేస్తే - ఇంకా కొన్ని ఆచారాలు, పండుగల గురించి రాసుకొచ్చింతర్వాత భజనల భాగం దగ్గరికొస్తారు గంగాధరంగారు.

భజనలంటే మళ్ళీ డబ్బానే, అదే సొంత డబ్బా - మా ఊర్లో చెరువు , గాడిబావి, కోట పక్కనున్న శివాలయంలో - మా కిష్టాయి మావయ్య, గుడ్డి సత్తెం తాతయ్య, వుయ్ తాత, నారాయణ, సోడాల బాబూరావు ఇంకా బోల్డు మంది సాయంత్రం అయ్యేటప్పటికి చేరి భజన్లు చేసేవాళ్ళు. సదానందం, విశ్వనాథు, రంగస్వామి - ఇలా మా బాచులో ఉన్న పిల్లకాయలందరినీ మా కిష్టాయి మావయ్య అదిలించి భజనలకు తీసుకెళ్ళేవాడు. మొదట్లో ఇదెక్కడి గొడవరా అనుకున్నా, నెమ్మదిగా ఆ భజనలతో పాటుగా మోగే చిడతలు, ఘటం సౌండుతో ఊగిపోతూ మేమే అందరికన్నా ముందు గుడికి చేరుకునేవాళ్ళం. అదీ సంగతి...ఆ సంగతి అక్కడొదిలిపెడితే, గంగాధరంగారు ఈ పుస్తకంలో ఇచ్చిన తప్పిడి కుండల భజన పాటతో ఈ నా ఘోషకు ముగింపు పలుకుతాను.

గుమ్మా గుమ్మన్నలార గుమ్మన్నలారో
నా రాస గుమ్మడీ రారావమ్మా
తూరూపు నున్నాది తారూపు గుల్లో
నా రాస గుమ్మడీ రారావమ్మా
తారూపు గుల్లకు తవ్వంత కొప్పో
నా రాస గుమ్మడీ రారావమ్మా
తవ్వంత కొప్పూలో గుప్పుడేసిపూలో
నా రాస గుమ్మడీ రారావమ్మా
గుప్పుడేసి పూలకు తాకట్టు సరుకో
నా రాస గుమ్మడీ రారావమ్మా
తాకట్టు సరుకూకీ తాగుమోతు మొగుడో
నా రాస గుమ్మడీ రారావమ్మా
తాగుమోతు మొగుడికీ తాళింపు కూడో
నా రాస గుమ్మడీ రారావమ్మా
తాళింపు కూడుకీ తాటికాయ పులుపో
నా రాస గుమ్మడీ రారావమ్మా

ఇలా...సాగిపోతుంది...

చివరి మాటలు రెండు -

మొదటిమాట
 "పండుగలు - పరమార్థములు" పరంపరలోని పుస్తకాల్లో రెండు మూడు భాగాలున్నాయి - కానీ అవి మహమ్మదీయ, క్రైస్తవ, బౌద్ధ, జైనాది మతాల పండుగల గురించి వున్నవి...వాటి గురించి మళ్లీ తర్వాత ఎప్పుడైనా...

రెండో మాట

ఇప్పటిదాకా అంటే ఓ పాతిక - ముప్ఫైఏళ్ళ క్రితం దాకా ఏ ప్రాంతంలోనైనా సంప్రదాయాలు, ఆచారాలు రక్షించుకొచ్చింది మహిళలే అని నిర్ద్వంద్వంగా చెప్పొచ్చు..ఈనాటి మహిళ ఆ పని చేస్తోందా, చెయ్యగలదా అన్న ప్రశ్నకొస్తే సమాధానం మీ దివ్యమైన మస్తిష్కానికే వదిలేస్తున్నా...దానికి నానా రకాల సమాధానాలు వస్తాయని తెలుసూ, కానీ అవన్నీ మీ వివేచనకే వదిలెయ్యటం జరుగుతోంది. ఆ మాటకొస్తే ఆనాటి పురుషుల్లో కూడా "ఆనాటి మహిళల" పాత్ర పోషించిన వారు ఎక్కువే. ఇప్పుడో ?

సంప్రదాయాలంటే, ఆచారాలంటే పెరిగిపోయిన, పెరిగిపోతున్న తృణీకార, అహంకార దరిద్రం ఎప్పటికి తీరుతుందో కానీ ! ప్చ్చ్...అప్పటిదాకా చెయ్యగలిగినవారు శక్తికొద్దీ చేస్తూ ఉండటమే

మొత్తానికి నిన్న సాయంత్రం అలా అలా నన్ను ఏదో తీరాలకు తీసుకెళ్ళిపోయిన శ్రీ నేదునూరి గంగాధరం గారికి కృతజ్ఞతలు తెల్పుకుంటూ..

భవదీయుడు
వంశీ


3 comments:

 1. నేదునూరి గంగాధరం జానపద వాజ్ఞ్మయ కుటీరము (ఇంచుమించుగా అదే) పేరుతో దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ పక్కనే రాజమండ్రీ గోకవరం బస్టాండ్ దగ్గర్లో ఓ చిన్న ఇల్లుండేది. అది ప్రభుత్వం నడుపుతున్న సంస్థ కాదనీ, గంగాధరం గారి కుటుంబీకులో ఎవరో నిర్వహిస్తున్న పరిశోధనా సంస్థ అనీ ఎవరో చెప్పినట్టు సుమారు ఇరవయ్యేళ్ళ నాటి జ్ఞాపకం. అప్పటికి జానపద వాజ్ఞ్మయం గురించి తెలుసుకోవాలన్నంత అవగాహనా స్థాయి లేక ఆ దారమ్మట ఎన్ని వందల సార్లు తిరిగినా ఏనాడూ లోపలికి వెళ్ళలేదీ పాపాత్ముడు. ఇప్పుడింతకీ ఆ ఇల్లుందో లేదో... దాని పరిస్థితి ఏంటో... ఏమీ తెలీదు. ప్చ్... ఏదైనా పోగొట్టుకున్న సంగతి తెలిసే దాకా దాని విలువ తెలీదు.

  ReplyDelete
  Replies
  1. >> ఏదైనా పోగొట్టుకున్న సంగతి తెలిసే దాకా దాని విలువ తెలీదు.

   ఫణీంద్ర - అవున్నిజం ...నిజం నిజం

   Delete
 2. http://pustakam.net/?p=4422
  -ఇదీ ఈ వ్యాసం లంకె.

  ReplyDelete