Monday, October 29, 2012

అలిసిపోయారా? అయితే ఇది చూడండి....విజృంభించండి!

అలిసిపోయారా? అయితే ఇది చూడండి....విజృంభించండి

మీ మీ ఊళ్ళల్లో కానీ, మీ మీ కాలనీల్లో కానీ రోడ్లమీద పేద్ద పేద్ద గుంతలు, బొక్కలు ఉన్నాయా?

అవి చూసి చూసి చిరాకొచ్చి మునిసిపల్ ఆఫీసు చుట్టూ కాళ్ళరిగేలా ఎప్పుడన్నా తిరిగారా?

తిరిగి తిరిగి అలిసిపోయారా? అయితే ఇది చూడండి.....

ఇలాటి ఆలోచనేదన్నా చేసి విజృంభించండి

పనిలో పనిగా పనికిమాలిన ప్రతిజ్ఞలు చేసి, రెణ్ణెళ్ళలో మీకది చేస్తాం ఇది చేస్తాం అని ఒట్టు మీద ఒట్టేసి వోటేయించుకుని ఆ తర్వాత ఏమీ చెయ్యకుండా జనాల నోళ్ళల్లో మట్టి కొట్టిన రాజకీయనాయకుల మొహాలు కూడా అక్కడికెక్కించెస్తే ఓ పనైపోతుంది...

అల్లా మీకు తెలిసినోళ్ళెవరన్నా, అదేనండీ రాజకీయనాయకులు ఉంటే వాళ్ల పేర్లతో ఓ కామెంటు కొట్టి పోండి

Thursday, October 25, 2012

ఆకాశవాణి ప్రముఖులు శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గారు ఇహ లేరు !

కొద్ది క్షణాల క్రితం సుధామ గారు పంపించిన ఈమెయిలు చూసి విషాదంలో మునిగిపోయాను 

 *********************************

ప్రముఖ లలిత సంగీత విద్వాంసులు.ఆకాశవాణి విశ్రాంత సంగీత ప్రయోక్త శ్రీ.పాలగుమ్మి విశ్వనాధం గారు ఈ రాత్రి 8.45కు తమ 94 వ ఏట కన్నుమూశారని తేలియజేయడానికి విచారిస్తున్నాను.

-- సుధామ

**********************************
పాలగుమ్మి గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ


పెద్ద పెద్ద వారంతా దాదాపుగా ఒకేసారి వరుస కట్టి వెళ్ళిపోవటం చాలా బాధాకరం...

అంతకన్నా బాధాకరం, వారి జ్ఞానాన్ని తర్వాతి తరాలకు పంచే ప్రయత్నం ఈ తరంవారి , అంటే మా తరం వారి నుంచి జరగకపోవటం.....

Wednesday, October 24, 2012

శ్రీ ఎస్.బి.శ్రీరామమూర్తి (రామం) - శ్రీ సుధామ - ఇష్టాగోష్టి

విజయవాడ ఆకాశవాణి - అద్భుతమైన చారిత్రక పుస్తకరాజం - ఆ చరిత్ర పుస్తకం లో ఎప్పటికీ చెరిగిపోని, చిరిగిపోని పేజి శ్రీ ఎస్.బి.శ్రీరామమూర్తి (రామం) గారిది.

హైదరాబాదు ఆకాశవాణితో పరిచయమున్నవారికి సుధామ గారు చిరపరిచితులు, మహామహులు, స్వర సుధాకరులు.

ఆ ఇద్దరు మహామహులు, మేరునగరాజాలు ఒక ఇష్టాగోష్టిలో పాల్గొంటే శ్రోతలకు, ప్రేక్షకులకు విజయదశమంత పండగే. అంతటి అదృష్టం కలిగించిన డి.డి సప్తగిరి ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలతో. . అంతకు మించి, గుర్తుపెట్టుకుని ఈ వీడియో లింకు పంపించిన రామం గారి అమ్మాయి తృష్ణ గారికి కృతజ్ఞతలతో.

ఆ ఇంటర్వ్యూ "చూడాలంటే" ఇక్కడ నొక్కండి

ఆడియో మాత్రమే "వినాలంటే" ఇక్కడ నొక్కండి..

ఇతర పరిచయ కార్యక్రమాలు, చర్చా కార్యక్రమాలు వినాలంటే వెబ్సైటులో ఆకాశవాణి - పరిచయాలు సెక్షన్లో వినవచ్చు 


భవదీయుడు
మాగంటి వంశీ

PS: The classical bit played at the start, during and at the end of the interview is a beauty. Simply amazing.

Sunday, October 21, 2012

కాపీ కొడితే మటుకు మాది మీదవుతుందా ! తెలుగు పిల్లల డాన్సొకటి...

ఓ రెండు వారాల క్రితం ప్రపంచ సంగీత దినోత్సవం లాటిది జరిగింది మా ఊళ్ళో.....చిన్న పిల్లలకు కథలు (స్టోరీ టెల్లింగ్), నానాదేశసంగీత నాట్య విభావరులు జరిగినయ్...ఆ విభావరుల్లో మచ్చుకి రెండు ఈ కింద చూడొచ్చు.....అనగా కిందిచ్చిన లంకెలె మీద నొక్కుడు.....

ఆసక్తికరమైన విషయమేమంటే ఈ సంగీత నాట్య విభావరుల్లో పాల్గొన్నవారంతా, అంటే పెర్ఫార్మర్స్ అంతా చిన్నపిల్లలు అనగా 13 ఏళ్ళ లోపువారు....

మొదటిది బొలీవియా దేశ నాట్యం, పాటతో సహా....పాటకేగా నాట్యం చేసేది...నిశ్శబ్దానికి కాదుగా...అది అర్థమైతే తమరి జన్మ ధన్యమే.....ఆ పిల్లల కాస్ట్యూములు బాగున్నయ్, చాలా కలర్ఫుల్ గా ఉన్నయ్ ....అడిగితే మా దేశంలో ఇంతకన్నా జిగేల్ జిగేల్ మనే వస్త్రాలు వాడతాం అని ఓ పిల్ల సమాధానం చెప్పి నన్ను ఆశ్చర్యపరిచింది....మన మువ్వల పట్టీల్లా, పెద్దసైజు మువ్వలు ఒక సన్నపాటి ఇనప/అల్యూమినియం షీటు మీద గుచ్చేసి కాళ్లకు కట్టుకుని బ్రహ్మాండంగా చేసారు....

ఈ నాట్యం దాదాపు మన సంక్రాంతిని పోలి ఉండే ఒక పండగకు చెయ్యటం ఆచారమని పిల్లవాడు చెప్పాడు. పట్టివిప్పి చూపించాడు....అంత బరువూ, అంత తేలికా కాకుండా ఉన్నది...ప్రతి ఊళ్ళో ఆ నాట్యం అయిపోయాక అలా చేసిన పిల్లలందరికీ ఆ సంవత్సరానికి సరిపడే స్కూల్ యూనిఫారంలాటి బట్టలు, ఆ పిల్లల గురువుగారికి ఉన్నితో చేసిన కోటు ఒకటి బహూకరిస్తారట....మనవాళ్ళు పిల్లలకు పప్పు బెల్లాలు పంచినట్టు, భలే ఆశ్చర్యం వేసింది.....

ఇదేం చూసారు, మా దేశం వెళ్ళిరండి, జులై నెలలో అదేదో పండగొస్తుందిట, అప్పుడు పెద్దవారు చేసే నాట్యాలు, అప్పుడు ప్లే చేసే మ్యూజిక్కు ఇంకా బావుంటయ్ అని చెప్పింది ఈ నాట్యంలో పాల్గొన్న ఒక చిన్నపిల్ల......ఆ అమ్మాయి ఇక్కడే, అంటే అమెరికాలో పుట్టింది కానీ వాళ్ల తలిదండ్రులు బొలీవియా వారనీ, అందుకే మా దేశం వెళ్ళిరండని చెపుతున్నానని కూడా పెద్ద ఆరిందాలాగా చెప్పింది...ఆ అమ్మాయి చెప్పిన తీరుకి నవ్వొచ్చింది నాకైతే...

వాళ్ళ గురువుగారితో ఓ రెణ్ణిముషాలు మాట్లాడి, మీ మ్యూజిక్కు మా సినిమాల్లో వాడుకుంటున్నట్టు అనుమానంగా ఉంది అని అన్నా....రవూల్ మోంటెస్ అనే పేరు కల ఆ గురువుగారు, మాది మాదే, కాపీ కొడితే మటుకు మాది మీదవుతుందా అని నవ్వు నవ్వి ఊరుకున్నాడు....నేనూ మన సిగ్గులేని మ్యూజిక్ డైరెక్టర్లని తలుచుకుని ఓ నవ్వు నవ్వి ఊరకున్నా....

Links here:

Link 1

Link 2

NOTE: On the Video - Click the PLAY button once and wait until the video buffers. Also use Internet Explorer for best results. Firefox may not work.

సరే అదయ్యాక, స్టోరీ టెల్లింగు టైమని అందరూ పొలో మంటూ పిల్లలనేసుకుని ఒక థియేటరులోకి పరిగెత్తారు...సరే చూద్దామని మేమూ వెళ్ళాం....డెల్టా అనే పేరుకలావిడ రెండు గోప్ప కథలు చెప్పింది....

చిన్నపిల్లలంతా మెస్మెరైజ్డ్.....కథలు చెప్పటం మాంఛి కళయ్యా....అందునా పిల్లల అటెన్షన్ తప్పుకోకుండా అట్టిపెట్టుకోటం గోప్ప లక్షణం....ఆ పని / బాధ్యత ఆవిడ చాలా బాగా నిర్వర్తించింది.....ఆ వీడియో తర్వాతెప్పుడైనా.....

అదయ్యాక, ఈ లంకె నొక్కి అక్కడున్న డాన్సు మెడలు వంచుకుని చూడండి.... ఫ్లాషులోకి కన్వర్టు చేసేప్పుడు దానికేం రోగం వచ్చిందో, అలా మెడలు ఒరగేసి చూసేట్టు చేసిపెట్టింది....

సరే మెడలు ఒరగటం అయి, చూసేసాక - ఈ నాట్యం ఏ దేశందో మీరు చెప్పాలని మిగిలిన డీటెయిల్స్ వదిలేస్తున్నా....

అలా ఇంకా బోల్డు దేశాల నాట్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చూసి ఇంటికొచ్చేప్పటికి సాయంత్రమయ్యింది....

అనుకోకుండా వెళ్ళినా, బోల్డంత ఆనందం మిగిలింది....


సరే ఇదంతా అయ్యాక మనవాళ్ళ పిల్లలదొక వీడియో ......మొన్న ఆగష్టు పదిహేనుకు జరిగిన ప్రోగ్రాముల్లో తెలుగు పిల్లల డాన్సొకటి ఇక్కడ...

You have to wait until 2 minutes and 20 secs on this video for the smaller kids to appear.... and they did a fantastic job...all of them , well most of them are 5 and 6 year olds

ఇహ మీరు ఆనందోబ్రహ్మ.....
Thursday, October 18, 2012

ఛీ ఛీ సిగ్గు లేదు, నీకు అక్కాచెల్లెళ్ళు లేరు?

ఏయ్! అలా మీద పడిపోతే మర్యాదగుండదు, ఆ పక్కకెళ్ళు!


ఏవమ్మోయ్ నోరు జాగ్రత్త...పల్లం ఇటేపుంటే ఆ పక్కకెళ్ళమంటావేంటి? నా పేరేంటి? జలం, నీరు, తన్నీరు, ఉదకము గట్రా గట్రా గట్రా...మరి ఆ పేరున్నప్పుడు పల్లమెటుంటే పారేది అటే....కావాలంటే నువ్వెళ్ళు అటేపుకి ....

ఛీ ఛీ సిగ్గు లేదు, నీకు అక్కాచెల్లెళ్ళు లేరు?

సిగ్గు నాకెందుకు? అనవసరంగా మాట్లాడుతున్న నీకుండాలి కాని......

మబ్బులు మబ్బులు మబ్బులొచ్చినయ్, కమ్ముకొచ్చినయ్, ఆటకొచ్చినయ్

*********************************


ఇంకొద్ది టచింగులివ్వాలి కానీ, 80 శాతం పూర్తి....

చెట్టు, లైటు, షేడు మిగిలిపోయినై

అక్రిలిక్స్ - 16 * 20 ఇంచుల కాన్వాసు మీదWednesday, October 17, 2012

ఆసక్తి ఉన్నవారు చూసుకోవచ్చు

సేకరించిన / సేకరించగలిగిన రంగస్థల ప్రముఖుల చిత్రాలు, 20వ శతాబ్దపు మొదట్లో ఆంధ్రదేశాన్నేలిన మహానటుల చిత్రాలు పబ్లిష్ చెయ్యడమైనది....

రంగస్థలమంటే ఆసక్తి ఉన్నవారు వెబ్సైటులో (Click on the link) చూసుకోవచ్చు - రంగస్థల ప్రముఖులు  sectionలో

Here are few names:

 • అద్దంకి శ్రీరామమూర్తి
 • ఆంధ్ర నాటక కళాపరిషత్, తెనాలి
 • ఆంధ్ర సభ, చెన్నపురి
 • ఆరణి సత్యనారాయణ
 • చారుదత్తుడు - వసంతసేన
 • బొమ్మకంటి కృష్ణమూర్తి
 • బ్రహ్మజోస్యుల సుబ్బారావు
 • ఛత్రపూర్ జగన్మోహన్ థియేటర్, బందరు
 • చిలకమర్తి
 • సి.ఎస్.ఆర్
 • ధర్మవరము కృష్ణమాచార్యులు
 • డాక్టర్ జి.వి.సుబ్బారావు
 • ఈమని లక్ష్మణ స్వామి
 • జి.రాఘవేంద్ర రావు
 • హార్మోనిష్టులు
 • జోస్యుల శేషయ్య
 • కడియాల రత్తయ్య
 • ఉప్పలూరి సంజీవరావు
 • కందాడై శ్రీనివాసన్
 • కపిలవాయి రామనాధశాస్త్రి
 • కారుపర్తి నాగలింగం
 • కొచ్చెర్లకోట రంగారావు
 • కోలాచలం శ్రీనివాసరావు
 • లక్కరాజు విజయగోపాల్
 • మాధవపెద్ది వెంకటరామయ్య
 • మంగిపూడి రామలింగశాస్త్రి
 • మోతే నారాయణరావు
 • ముంజులూరి కృష్ణా రావు
 • ముప్పిడి జగ్గరాజు
 • ముత్తరాజు సుబ్బారావు
 • నెల్లూరి నాగరాజారావు
 • నిడసనమెట్టు కొండల రావు
 • పానుగంటి
 • పారుపల్లి సుబ్బారావు
 • పర్వతరెడ్డి రామచంద్రా రెడ్డి
 • ప్రతాపరుద్రీయము
 • పి.వి.రామానుజం శెట్టి
 • సింగరాజు నాగభూషణరావు
 • సీతారామాంజనేయ నాటక సమాజం, ఏలూరు
 • సొహ్రాబు - రుస్తుం
 • స్థానం నరసింహా రావు
 • సుసర్ల రామచంద్ర రావు
 • తాడిపత్రి రాఘవ
 • వడ్డాది సుబ్బారాయుడు
 • వడ్లమాని కుటుంబరావు
 • వంగల ఆంజనేయులు
 • వి.సి.గోపాలరత్నం
 • వేదము వెంకటరాయ శాస్త్రి
 • వెదురుమూడి శేషగిరిరావు
 • వెంపటి వెంకటేశ్వర్లు
 • వేమూరి రామారావు
 • వెంకటాచల అయ్యర్
 • వెంకట రమణయ్య
 • వీరబ్రహ్మాచార్యులు
 • యడవల్లి సూర్యనారాయణ రావుభవదీయుడు
వంశీ

Monday, October 15, 2012

పోసికోలు బ్లాగర్లకు కాకుండా సరుకున్న బ్లాగర్లకు పనికొచ్చే వార్త!

ఉస్కుటపా బ్లాగర్లు, చెత్త కబుర్ల బ్లాగర్లు, పోసికోలు బ్లాగర్లకు కాకుండా సరుకున్న బ్లాగర్లకు పనికొచ్చే వార్త!

ఇదిగో ఇక్కడ....


LINK

1900 ల్లోని పుస్తకాలు ఒక ఇండెక్సు ప్రకారం, తెలుగులో టైటిల్సుతో ఉన్న పుస్తకాలు పి.డి.ఎఫ్ రూపంలో కావాలంటే అక్కడ నొక్కండి.....దించుకోండి....చదువుకోండి....ఆనందించండి....

కాదూ, కూడదు, కానేరదు - మాకు డి.ఎల్.ఐ సైటే యహ్హాహు, ఉహ్హాహూ అనుకుంటే  ఈ లంకెలో నేనెప్పుడో తయారు చేసిపెట్టుకున్న ఎక్సెల్ షీట్లు దించుకుని అక్కడున్న పేర్లతో , డి.ఎల్.ఐ కెళ్ళాక సెర్చి చేస్కోండి...

ఆనందో బ్రహ్మ

భవదీయుడు
వంశీ

Sunday, October 14, 2012

పేడతో పిడకలెలా చేస్తారండీ?

నాకు చదువరి గారంటేనూ, తాడేపల్లి గారంటేనూ బోల్డంత అభిమానం..."ముఖ"పరిచయం లేకపోయినా ముఖపరిచయం ఉన్నది....చదువరిగారు రెండేళ్ళ క్రితం కామోసు,రెండున్నరేళ్ళ క్రితమో సరిగ్గా గుర్తుకులేదు  ఓ రోజు ఈమెయిలు కొట్టి "పొద్దు"కో వ్యాసం పంపించు మహానుభావా అని అడగ్గానే ఉద్రేకమొచ్చి ఇంతలావుది రాసి పంపిచ్చా......అదే ఇది....

ఇప్పుడు ఇక్కడెందుకేసానంటే ఇంతకు ముందు రెండు పోష్టుల్లో చెప్పిన కారణమే....

ఇది కొంతమందికి అప్పుడు నచ్చింది, అదే మనుషులకు ఇప్పుడు నచ్చుతుందా అంటే చెప్పలేను....తేడాలొచ్చినై ఆ మనుషుల్లో, మనసుల్లో....

అదలా పక్కనెడితే పూర్ణిమ అని ఒహావిడెవరో అర్థమై చావలేదని నోరుపారేసుకోటం, నేను దానిమీద కామెంటు పారేసుకోటం కూడా జరిగినట్టు గుర్తు....

సర్లే ఏదైతేనేం,  గతమే గతః ప్రస్తుతః ఆ పాతః ఆర్టికలః ఇక్కడః చదువః*********************************************


సాహిత్యమంటే రసప్రపంచం. మరి రసమంటే ఏమిటీ? మావిడి రసమా? అల్లం రసమా? చింతపండు రసమా? టమాటా రసమా?

ఈ పైన చెప్పినవి విడివిడిగా కాదుకానీ, ఇలాటి రసాలు అన్నీ మష్తిష్క మర్దనంతో బయటకు తీసి, కలమనే రాచిప్పలో పోసి కలగలపేసి సాహిత్యలోక సరస్వతీ దేవికి నైవేద్యంగా అర్పించిన ఈ రసమే ఆ రసము - అదే పరబ్రహ్మ స్వరూపం అంటారా. మీరు నక్కతోక తొక్కి నాకలోకంలో పడ్డ నా తోటి జతగాళ్లు.

ఎవరో సరిగ్గా గుర్తులేదు కానీ, ఒక పెద్దాయన ఏదో వ్యాసంలో వారి కాలం నాటి సాహిత్యం, పాండిత్యం, పండితులు, సారస్వతం గురించి వ్రాస్తూ ఒక పిట్టకథ చెబుతారు

"పూర్వం ఒక పండితుడు ఓ పండితసభలో పాల్గొంటూ- ఇంతమంది పండితులు "రసము" గూర్చి తలో రీతిగా బుట్టెడు రచనలు చేసారు, మాటలు చెప్పారు. అవి అన్నీ పక్కనబెట్టెయ్యండి. సులువుగా నేను ఒకే ఒక్క పద్యంలో చెపుతాను వినండి అని "పాలు గోరెడు మార్జాల పరివృఢుండు." అని ఆ సభలోకి ఒక బిందువు విసిరాట్ట. ఇందులో రసమెక్కడుందండీ అని అడిగితే - పాలకు మించిన రసమెక్కడున్నదయ్యా అని ఆ పండితులవారి జవాబు. మరి పద్యమంటారు, పద్యానికి నాలుగు పాదాలుండాలి కదయ్యా? అని అడిగితే - పిల్లికి ఉన్నవి చాలుకదయ్యా అన్నారట సదరు పండితులవారు."

ఈ పిట్టకథ చెప్పడమైపోయాక ఒక మాట అంటారు. మా తరంలోని ఈనాటి పండితమ్మన్యులు, సమకాలికులు భావదారిద్రోపేతమైన భావుకతని పుంజీలు పుంజీలుగా వేసి చేసిన ఆ నైవేద్యం జెష్టాదేవి నెత్తిన బెట్టి మా వాణీ గృహంలో నట్టనడయాడిస్తున్నారు అని బాధ పడతారు. ఇవే మాటలు ఇప్పటి పాండిత్యానికి, పండితులకు అన్వయించి చూసుకుంటే ఆ పెద్దాయన మాట, ముందుచూపు, ఆవేదన నభూతో నభవిష్యతి. 

అసలు గొడవేమిటయ్యా ? ఈ వ్యాసం ఉద్దేశమేమిటి? ఈ ఉదాహరణలేమిటి? పిట్టకథలేమిటి? అర్థం కాకుండా మొదలెట్టావు, ఏ సముద్రంలోకి విసిరేస్తావో చెప్పు బాబూ! అసలే ఈత కూడా రాదు నాకు.

అయ్యా...అక్కడికి రావాలనే ఈ ప్రయత్నం. సాహిత్య భాష వేరు, సాహిత్య రసం వేరు, దాని రుచి వేరు అని చెప్పటం ఈ వ్యాసం ఉద్దేశమండీ! వ్యాకరణం లేని వ్యవహారిక భాషా ప్రజ్ఞా పాటవాలతో పాఠకుడి చేతికి అంజనం పూసిన చందంగా పదచిత్రీకరణ చేసే ఈనాటి పండితమ్మన్యుల కోసం రాస్తున్న వ్యాసమిది! కావున మీరు కొద్దిగా ఓర్పు సహనం నేర్చుకోవాలి, అభ్యసించాలి, అనుభవించాలి.

ఓహో అలాగా! ఐతే మొదలెట్టు మరి

సాహిత్య భాషకి కొన్ని ద్రవ్యాలు అవసరమండీ! అన్నిటికన్నా ముఖ్యమైన ద్రవ్యం - చిత్తం భ్రమించిన కవి, రచయిత.

ఏమిటీ మతి చెడినవాడా కవీ, రచయిత అంటేనూ?. వేళాకోళంగా ఉందా నీకు

చిత్త భ్రమ అనగా సదరు కవీ ,  రచయిత చిత్తప్రవృత్తిగా అర్థం చేసుకోవాలి తమరు.

ఓహో అలాగా ! మరి తరువాతి ఔపచారిక ద్రవ్యాల సంగతో?

రెండవ ద్రవ్యం, వస్తువు అనగా చిత్తభ్రమణానికి కారణభూతమైన రసం.

ఓ పైత్య రసమన్నమట.

పైత్యమో, పిండమో ఇప్పటికి పక్కనబెట్టి మూడవ ద్రవ్యాన్ని చూస్తే - అది ఆదిమానవ రూపంలో సంచరిస్తున్న పాఠకుడు.

ఏమిటీ పాఠకుడనేవాడు ఆదిమానవుడా?

అవును ఆదిమానవుడే. ప్రకృతి పురుషుడు. మీ సౌలభ్యం కోసం ఈ ఆదిమానవుల సమూహాన్ని మూడు తండాల్లోకి విభజించవచ్చు.

ఇందులో నా సౌలభ్యం ఏమిటీ! తమరి సమాధి.

చిత్తభ్రాంతి, చిత్తభ్రమణం గురించి మాట్లాడుకున్నప్పుడు సమాధి ప్రస్తావన చాలా ఔచిత్యంగా ఉంది. అనగా మీకు కొద్దిగా మెదడు ఉందని నా ఎఱికకు వచ్చింది.. సరే సమాధి సంగతి పక్కనబెట్టి సమూహాల్లోకి వస్తే - మొదటి తండా ఏ చిత్తభ్రమణ పైత్య రసాన్నైనా ఆనందించే సహృదయ తండా. రెండవ తండా పైత్యరసాన్ని మింగలేక కక్కలేక వాంతిభ్రాంతిలో పడికొట్టుకునే సామాన్య ప్రజానీకతండా. ఇహ మూడవ తండా పైత్య రసాన్ని ఏమాత్రమూ తట్టుకోలేక వమనం చేసే పండిత తండా.

ఓరి నీ తండాల పిండం తిండూలాలెత్తుకెళ్లా. ఇదేదో కొద్దిగా అర్థమయ్యీ అర్థమవనట్టుగా ఉందే!  ఆదిమానవులంటావు, ప్రజానీక తండా, పండితుల తండా అంటావు...? పనసపండు తెచ్చి పళ్ళెంలో పెడితే తినలేని అల్లుడు దిక్కు దిక్కులు చూసాడట అలా ఉంది నా పరిస్థితి.

వస్తా అక్కడికి తర్వాత వస్తానండీ! ముందు చిత్తభ్రమణాన్ని, చిత్తులనీ వర్ణించనివ్వండి!

ఇదేదో ఆసక్తిగా ఉండేట్టుంది. సరిగ్గా సద్దుకుని కూర్చోనీ. నీ చిత్తుకాయితాల ఘోష అంతా అయిపోయాక నేను చిత్తభ్రమణమూ, పైత్యమూ గూర్చి లఘు సిద్ధాంత వ్యాసం సమర్పించుకోవచ్చునేమో!!

చిత్తులు స్థూలంగా మూడు రకాలు, వారికి కలిగే చిత్తభ్రమణాలు మటుకు కోకొల్లలు

ఏమీటేమిటీ? చిత్తులు మూడే రకాలా? భ్రమణాలు మటుకు కోకొల్లలా?

అవును. మొదటి రకం చిత్తులు - వీరు సాత్విక స్వభావ చిత్తులు. అనగా చిత్తం భ్రమించినా అది సాత్విక రూపంలో, రాళ్లూ గట్రా విసిరెయ్యక మెత్తనైన పూలు విసురుతుంది. వాడే భాష దోషరహితంగా, నాజూకైన నగలతో అనగా అలంకారాలతో ఉంటుంది. కవి గారూ అంతకు తగ్గట్టుగా సున్నిత మనస్కులై ఉంటారు. ఎంత సున్నితమంటే కంది పచ్చడి తిని కందిపోయేంత.

పెద్దన గారూ, పోతన గార్లాంటోళ్లన్నమాట.

అవునండీ. మీకు కొద్దిగా జ్ఞానముందన్న సంగతి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది నాకు. సరే విషయం...విషయంలోకి వస్తూ ఆడసింహం సంగతి తెలుసుగా, నెమ్మదిగా చక్కగా నోట్లో కరుచుకుని పిల్లలని తీసుకునిపోయినట్టు, వీళ్ల రాతలతో ఆదిమానవుణ్ణి వాళ్లెంబడి ఊయల్లో ఊగించుకుంటూ తీసుకునిపోతారన్నమాట. 

ఓహో బాగుంది.

ఇహ రెండో రకం చిత్తులు. వీరిది చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం పరిస్థితి. అనగా రాచరిక దర్పమన్నమాట. వీరు తమకున్న వ్యాకరణ వైవిధ్యంతో, ఛందోవైవిధ్యంతో ఆదిమానవులను సమ్మోహితులను చేసి లాక్కుపోతారన్నమాట. ఆ వైవిధ్యమూ, ఆ ఊపూ, ఆ రాచరికం ఆదిమానవుణ్ణి అలా పట్టేసుకోగా, రాజుగారెంబడి పడిపోతాడన్నమాట. రాజుగారెక్కడుంటే ఈ మానవుడక్కడే! ఇంకోలా చెప్పాలంటే - రక్తజఘన మర్కటం తెలుసు కదండీ. ఆ మర్కటం తన పిల్లలని సింహంలా నోట్లో కరుచుకుని తీసుకుపోదు. పిల్లలే తల్లిని కరుచుకుని తల్లితో పాటూ పోతూ ఉంటాయి...అలాగన్నమాట

అంటే శ్రీనాథుడు, మన కృష్ణదేవరాయలవారి ఆస్థానంలోని వికటకవిగారూ, ఈ శతాబ్దంలో విశ్వనాథ, ఛందోబద్ధ శ్రీశ్రీ లాంటోళ్ళా?

అవునండీ. ఉద్భటారాధ్యచరిత్రలా మధ్యలో మీ ఆర్భాటగోలారాధ్యచరిత్ర మాని చెప్పేది వినండి.

సరే చెప్పు

ఇహ మూడవ రకం చిత్తులు. వీరు మశక రకాలన్నమాట. గుడ్లు పెట్టేసి మళ్లీ కనపడకుండా పారిపోయే జాతి. వీరికున్న రక్తవే స్వాహా! రక్తవే స్వాహా! గుణంతో రక్తాన్ని పీల్చటమే కాక, తమ రచనా వైదుష్యంతో మెదడువాపు వ్యాధి విస్తృత పరిచి తమ వంతు కృషి చేస్తూ జీవిత సాఫల్యం పొందుతారు. భాష మీద పట్టు సంపాదించుకోరు, వ్యాకరణం అంటే తెలీదు. ఆ పైన వీరు వదిలి వెళ్లిన గుడ్లలో నుండి పుట్టలు పుట్టలుగా పుట్టుకొచ్చిన మశకాలతో మరిన్ని తిప్పలు.

అనగా ఈనాటి రచయితలు, కవులూ అంతా మశకాలని నీ ఉద్దేశమా?

అవును మార్తాండతేజా. ముప్పాతిక శాతం మంది మశకాలే. ఏమిటీ తమరి కనుగుడ్లకేమయ్యింది. అలా పితుక్కొని బయటకొచ్చినాయి?

ఇంకొంచెంసేపు ఈ వివరణాత్మక పైత్యాన్ని వింటే మొత్తం ఊడిపోయి దొర్లుకుంటూ ఆ హిందూ మహాసముద్రంలో కలిసిపోయి సొరచేపలకు ఆహరమైపోతాయేమోనన్నంత భయంగా ఉందయ్యా!

పోనీ అలాగైనా ప్రశాంత కబోది జీవనం గడపొచ్చు మీరు. మీ జాతకంలో ఇదివరకే రాసేసి ఉండి ఉండవచ్చు.

ఆపవయ్యా! కబోది జీవనం నాకెందుకు గానీ, ఇలాటి చిత్తులను, వారి భ్రమణములను తట్టుకొను మార్గము విశదీకరించు!

చిత్తులకు బోధి వృక్షం కింద బోధ చెయ్యాలి.  ముందు మనసనే సాన మీద రచనను జాగ్రత్తగా అరగదీసుకోమని. అరగదీసాక గంధమొస్తే పంచమని. దుర్గంధమొస్తే తనే , అట్టిపెట్టుకోమని.

ఎవరి కంపు వారికింపు అన్న చందమన్న మాట. మరి వారి కంపు వారికి బానే ఉంటుందిగా

అదే వచ్చిన చిక్కు. అయితే  ఉపాయమున్నది. ఒక్కటే ఒక్క పుస్తకభేది మాత్ర.. జాడ్యం కొద్దీ మందు...అసామన్యమైన జాడ్యానికి మాంచి ఘాటున్న మందు కానీ పనిచెయ్యదు. అలాటిదే ఈ పుస్తకభేది మాత్ర. క్షోభపు రాతలు రాసిన కవీ, రచయితను పండిత తండాలోని ఆదిమానవులు ఒక కరివేపాకు చెట్టుకు కట్టేసి, బలవంతాన తెరిచి పుస్తకభేది మాత్ర ఆయన నోట్టోనూ, కొద్దిగా ఆయన కలంలోనూ వెయ్యటమే. కుదరకపోతే, అనగా పిల్లి మెడలో గంట నే గట్టలేననుకుంటే మీరు దాన్ని వేసుగుని కూర్చోటమే! ఈ మాత్ర ఒకటి చిల్లికుండలో వేస్తే చిల్లు పూడి కారే నీళ్ళు కూడా ఠక్కున ఆగిపోయినాయని నిన్న మా మిత్రుడొకాయన చెప్పాడు. 

అనగా వారి రచనలను బహిష్కరించడమన్నమాట. బాగుంది. అది సరేనయ్యా! ఒక ప్రశ్న. ఒక గజ ఈతగాడున్నాడు. ఆయన ఏ ఏటికి అడ్డంపడినా ఒకటే ఈత పద్ధతి పాటిస్తాడా?

లేదండీ ఒకసారి కుక్కలాగా ఈదొచ్చు, ఒకసారి మొసలిలాగా ఈదొచ్చు, ఆయాసమొస్తే కాళ్ళూ చేతులు ఎగేసి వెల్లకిలా కూడా ఈదొచ్చు.

మరి అలానే వ్యావహారిక భాషతో వివిధ రకాలైన ఈతలు కొట్టొచ్చుగా సాహిత్యమనే ఏట్లో?

ఎవరికి వారు ఈతరాకున్నా గజ ఈతగాడనుకోని  ఏలాగున ఈదినా, ప్రాణాలు నిలబడేందుకు పీల్చే గాలి ప్రధానమవునా కాదా ! 

అవును గాలే ప్రధానం. పైత్యానికి మందే విధానం.  మరి ఈ పరిస్థితి నుండి బయటపడాలంటే ఏమి చెయ్యాలో మరి చెప్పవయ్యా

పలికెడిది భారతంబట
పలికించెడి విభుడు వ్యాసభగవానుండట

కందువ మాటలు, సామెతలు, నుడికారాలు, పలుకుబడులు పసందు వేసి మాలగా గుచ్చిన రచన, కవిత - ఆదిమానవుల మెదడు వికసించటానికి ఒక అద్భుతమైన సాధనంగా ఉపకరిస్తుందండీ. లేకుంటే మూగ చెవిటి సంవాదమే !

ఇంతకీ వేరేవాళ్లవి వికసించడానికే రచనలు చేయాలంటావు. మరి అసలు శాల్తీ వికాసమెక్కడ?

అదే చెపుతూంట ఇంతసేపు. మీరు అటు బభ్రాజమానమూ కాక, ఇటు వైశంపాయనులూ కాక మధ్యస్థంగా వున్నారు. అక్కడ వచ్చింది చిక్కు


ఓహో! ఆ మధ్య ఇలాటి రచనొకటి చదివి నేను చెవిటివాడినా, మూగవాడినా అనేది అర్థం కాలా! ఇప్పుడు కళ్లు తెరుచుకున్నాయి. మరి రసమన్నావు దాని సంగతి కూడా చెబుతావా ? అసలు ఈ రసమెట్లా పుడుతుందయ్యా?

ఆలంబన, ఉద్దీపన ఈ రెండు పదార్థాల సంయోగంతో రసం పుడుతుందండీ.

అర్థం కాలా! ఏదీ ఒక ఉదాహరణ ఇలా పడెయ్యి

ఒక హరిణం అలా వయ్యారంగా అడుగులేస్తూ అడవిలో పోతూ ఉందనుకుందాం. వేటగాడికి లేడి ఆలంబన, అడవి ఉద్దీపన. అడవి అనే పరిసరం ఈ వేటగాడికి ఉద్దీపన కలిగిస్తే, వేటాడాలనే ఉత్సాహానికి లేడి ఆలంబన.

మరి వేటాడితే లేడికి పరలోకప్రాప్తేగా?

వేటాడేంతవరకూ రసప్రాప్తి, వేట ముగియడంతో రస సమాప్తి.

ఓహో! అంటే రచయిత అనేవాడు ఆదిమానవుణ్ణి తన భావ, భాషా సామర్థ్యంతో ఎంతసేపు ఆ వేట అనే ఆటలో నిలపగలడో అంతసేపూ రసం ఊరుతూనే ఉంటుందన్నమాట. బాగుందయ్యా.

అబ్బా! భలే పట్టేసారే కిటుకు. మీకున్నపాటి జ్ఞానం ఈ కాలపు రచయితలకుంటే ఎంత బాగుండు! ఇంకొద్ది వివరణతో సాహిత్య రసానికొస్తే - ఈ రసం రెండు రకాలు. బుద్ధితో వ్రాయగా వచ్చే రసం ఒక రకం, హృదయంతో వ్రాయగా వచ్చే రసం ఒక రకం. బుద్ధితో వ్రాసేది తనకున్న పాండిత్యాన్నీ, తెలివితేటలను లోకానికి పంచే రసం. పేరు ప్రఖ్యాతులనాశించో, పట్టాల కోసమో వ్రాసే రచనలు ఈ రసాన్ని బహు పుష్టిగా కలిగుంటాయి. ఇక హృదయంతో వ్రాసే రచనలు అనుభూతులతో కూడి, సంస్కారాన్ని వృద్ధి పరచే రసాన్ని కలిగుంటాయి.. మనకున్న సారస్వత చరిత్రను జాగ్రత్తగా గమనించండి. కాలపరీక్షకు నిలబడ్డవన్నీ హృదయ సంబంధమైనవే ఐతే అలా నిలబడ్డ రచనలన్నిటికీ ఒక గుణం ఉన్నది. ఆ రచన చేసిన సాహితీ స్రష్టకు తన రచన గూర్చి స్పష్టమైన అవగాహన ఉన్నది. ఆ రచన ఒకే కక్ష్యలో స్థిరంగా తిరుగుతూ ఉంటుంది.

కక్ష్య ఏమిటి నాయనా? రచనేమన్నా గ్రహమా? ఉపగ్రహమా? మూస పోసిన మూకుడా?

ఒక ఇతివృత్తాన్ని పట్టుకున్నప్పుడు, ఆ ఇతివృత్త పరిధే కక్ష్య. పరిధి దాటితే తోకచుక్కైపోయి రాలిపోటమే.

ఐతే పరిధి గీసుకుని రసాలు ఊరించాలంటావు

ఇతివృత్తం మీద స్పష్టమైన అవగాహన, దాని పరిధి తెలుసుకుంటే చాలని మూకుడు మీద మూత వేసి చెప్పటమైనదండీ

ఓహో! బాగుంది. చాలా బాగుంది. మరి ఈనాటి రచనలు…?

ఈనాటి రచనల కక్ష్య ఏది? లక్ష్యమేది?

మరి ఏ రచనైనా నువ్వు చెప్పిన కక్ష్యలో సంచారం చెయ్యడానికి……

రచనకు వాక్యనిర్మాణం ముఖ్యం, వ్యాకరణం మరింత ముఖ్యం. ఏ భాషైనా వాక్యనిర్మాణం వల్లే వేరే భాష నుండి వేరవుతుంది. సందర్భోచితమో, వ్యావహారికమో, అలంకారికమో - ఏదైనా కానీ నిర్మాణ పాత్రను పూర్తిచేసుకునున్న వాక్యాల్ని ఏరుకుని, చక్కగా గుది గుచ్చుకోవాలి. కక్ష్య పరిధి అవగాహనకు తెచ్చుకుని రచనకు పూనుకోవాలి. ఆలాటి రచనే రచనా ప్రపంచంలో స్థిర సంచారం చేస్తుంది. శాశ్వతంగా నిలబడిపోతుంది... ఆదిమానవుడిలో స్థాయీ భావాలను ప్రేరేపించాలి, వ్యాకరణంతో దాహార్తిని చల్లార్చాలి, భాషా హొయలతో ఉద్రేక పరచాలి, ఆ ఉద్రేకంలో నుంచి ఉద్భవించిన ఆనందం అనుభవించేట్టు చెయ్యాలి. ఆ పైన ఇతర వేదనలను మరిపింపచేస్తే రస భోగం అనుభవమవుతుంది. రచనకు సార్థకత్వమేర్పడుతుంది. పాత సాహిత్యం, ఆయా రచయితలు చేసిన పని అదే

ఓహో తెరచాప వేసినట్టు ఇన్ని చాపలు "పరచాలి" అన్నమాట…..గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్ ! అని అంటావన్నమాట ఐతే.

ఆ మాట మీరు చెప్పాలె.

మరి ఈనాటి రచనలు ఏలాగున ఉన్నాయో కూడా ఓ మాట జెప్పు

తిక్కనను మార్క్సిస్టు దృక్పథంతోనూ, విశ్వనాథను వ్యంగ్యాత్మక దృక్పథంతోనూ చూడాలని వాదిస్తే ఎలాగుంటుంది? అలాగుంటున్నాయన్నమాట. దోసెడంత వీధిలో కృష్ణవేణమ్మను తమ పైత్యరసంతో నింపి కుళ్ళుకాలవలా దుర్గంధాలతో పరుగులెత్తిస్తున్నారు. చిత్రగుప్తుని చిట్టాలన్నీ చింపేసి ఆయనకే చిట్టి కవిత రాసిచ్చేవాడు ఈనాటి కవీ, రచయితానూ.. వ్యావహారిక భాషనుకుంటూ కట్టె కొట్టె తెచ్చె అన్న చందంగా రచనలు చెయ్యడమూ, కవితలు వ్రాయడమూ..పేలపిండిలా ఆ పదార్థాన్ని ఆదిమానవుల మీద దులపడమూ ...ఇదీ మశకాలు చేస్తూన్న పని

మరి ఎలాగుండాలో కూడా చెప్పెయ్యొచ్చుగా

పూర్వ శబ్ద స్వరూపాన్ని ప్రామాణికంగా గ్రహించలేనప్పుడు, ఆ ప్రామాణికతను సమకాలీన శబ్దానికి అన్వయించి ఆ శబ్దాన్ని ప్రామాణికంగా మార్చలేనప్పుడు రచనకు పూనుకునే సాహసం చెయ్యవద్దు. వీలుచేసుకుని రచనకు పూనుకునే ముందు పాత సాహిత్యాన్ని చదవాలి..అందులోని రచనా పద్ధతులని తెలుసుకోవాలి, నైపుణ్యాన్ని అలవర్చుకోవాలి ...వ్రాసి వ్రాసి చిత్తుకాగితాలు తగలేసి నెత్తికి గండభేరుండ తైలం రాసుకోవాలి. వ్రాసిన వ్రాతల్లో ఎక్కడో ఒకచోట తనను తాను చూసుకుని నవ్వుకోటమో, ఏడవటమో చేస్తే ఆ రచన నెమ్మదిగా రాటు దేల్తుంది. లేకుంటే రచన రాచపుండై వ్రాసినోడినే కాక ఇతరుల వెన్నెముకల్ని కూడా బాధపెడుతుందన్నమాట.
  
మరి ఆ ప్రామాణికత ఎవరు నిర్ణయిస్తారయ్యా?

పేడతో పిడకలెలా చేస్తారండీ?

ఓ వేసావే బ్రహ్మాండమైన దెబ్బ! మరి నీ వాక్య నిర్మాణం మీద నీకు ఎంత పట్టుంది ?

అందుకే నేను రచయితనూ కాను, కవినీ కాను. ఆదిమానవుణ్ణి.

అదిగో ...ఈ ఘోషలో వాగాడంబరమే తప్ప అసలు అంబరం లేదని కొందరు అంటున్నారయ్యా

ఓ వారా! వారికో కొత్త తండా ఏర్పాటు చెయ్యవలసిందే!!పుస్తకం - భారతీయ కవితా కల్పకం - గొడవ .... LOL

పుస్తకాల పరిచయం సిరీస్ లో రెండోది...

మొదటిది, ఈ సిరీస్ కథా కమామీషులు తెలియాలంటే దీనిముందున్న పోష్టు చదువుకో ఏం?

ఇక్కడో విషయం చెప్పాలె....

నాకు గుర్తున్నంతవరకూ, ఈ వ్యాసం చదివాకే గావాలు జంపాల చౌదరి - Very disturbed at the condescending tone of this article, readers should not be treated with disdain, restrain is needed  అని అన్నట్టు గ్యాపకం ....  :) :) :) 


(FYI - This is one of his comment on that article. Might not be the exact word to word, but the essence of it is the above. But we had fun, or atleast I did with the conversation)


ఇహ పుస్తకానికొచ్చేస్తే ఇది అభిప్రాయం కాదులే కానీ, ఓ పుస్తక పరిచయం అనుకోవచ్చు  ....ఇహ చదువుకో
**************************************************


“భారతీయ కవితా కల్పకం” – అసలు ఈ మాట ఏమిటో, ఇలాటి పేరున్న రచన ఒకటి ఉందని తెలిసినవారెవరో, అదీ తెలుగులో ఉందనీ తెలిసినవారు ఎంతమందోనని పాతతరం వారినొదిలేసి ఈకాలపు “సాహిత్యాభిలాషుల సెన్సస్” కార్యక్రమం పెట్టుకుంటే తేలిన సంఖ్య రెండు వందల లోపేనట. అది మరి ఆ రచయితకు అవమానమో, ఆ రచనకు అవమానమో, మన సాహిత్యానికి అవమానమో ఆ పరమాత్మునికే ఎఱుక. శ్రీ మీసరగండ విశ్వంగారు నేను అభిమానించే రచయితల్లో ఒకరు. అసలు రచయితల్లో ఈయన పేరే ఎప్పుడూ వినలేదు అన్న కామెంటు వస్తే అంతకన్నా ఖర్మం ఇంకోటి లేదని భవదీయుడి అభిప్రాయం! ఆ కామెంటు రాసిన దుర్మార్గులని “విద్వాన్ విశ్వం” గారన్నా తెలుసా అని అడగాలనిపిస్తుంది. అప్పటికీ తెలియకపోతే, ఇక తెలుగు సాహిత్యం నిజంగానే దుస్థితిలో ఉందని ఖరాఖండిగా చెప్పొచ్చు.

ఒక రచయితగా, అనువాదకుడిగా శ్రీ విశ్వంగారు చేసిన రచనల్లో, ఈ అనువాద రచన (1963) ఒక కలికితురాయిగా నిల్చిపోవాల్సినా, ఈ రచనకు రావల్సిన పేరు రాలేదనిపిస్తుంది. అందుకు నాకు కనపడ్డ కారణం – ఈ రచనలో “TOPICS DISORGANIZATION”. ఆగండి – అక్కడే ఆగిపోండి ..అనువాదమంటున్నారు, చాలా గొప్పగా వుందంటున్నారు, పేరు రాలేదంటున్నారు మరి ఈ అనువాదానికి “మూల” రచన ఏమిటి, ఒకవేళ “మూల” రచన ఏదన్నా ఉంటే “మూల” రచయిత ఎవరు అని గొప్ప ప్రశ్న మీ బుఱ్ఱల్లో ఉదయించకముందే – వివరణ.

ఈ అనువాదానికి “మూల” రచనలు , “మూల” రచయితలు బోల్డు. అథర్వవేదంలోని వైదిక సూక్తులు, టాగోర్ రాసిన బెంగాలీ కవితలు, తమిళం లోని పొఘై ఆళ్వర్ కవితలు, కన్నడంలోని సర్వజ్ఞ మూర్తి రచనలు, నన్నెచోడుడి పలుకులు, గుజరాతీలోని కవితలు , హిందీలోని కబీరు కవితలు, సంస్కృతంలోని భోజరాజుని మాణిక్యాలు – ఇలా 376 పేజీల ఈ సుందర వనికి ఎన్నో మూలాలు. ఏరుకుని సాహితీ క్షుద్బాధ తీర్చుకోవాలనుకునేవాడికి ఎన్నో “కంద” మూలాలు.

ఈ రచన / పుస్తకం ఎలా ఉంటుందంటే – ఇంట్లో ఉన్న పుస్తకాల షెల్ఫులో కాలం గడుపుతున్న వివిధ భాషా పుస్తకాల్లోనుంచి ఆయన కళ్ళకు కనపడ్డవి, చేతికి అందినవి తీసుకుని అప్పటికప్పుడు అనువాదం చేసేసినట్టు , అలా రాసినవి అచ్చేసినట్టూ కనపడుతోంది. “ఆంధ్ర ప్రభ”కు ఎడిటర్గా పనిచేసిన వ్యక్తి “భూతాశ్రమంలో (అంటే పూర్వాశ్రమంలో అన్నమాట)” కానీ, “భవిష్యత్ ఆశ్రమంలో” కానీ అలా ORGANIZE చెయ్యకుండా చేసారంటే ఎందుకో నమ్మబుద్ధి కాకపోయినా, దగ్గరున్న పుస్తకం తెరిచాక నమ్మాల్సి వచ్చేటట్టు వుంది.

అసలింతకీ ఈ పుస్తకం నా దగ్గరకొచ్చిన విధంబెట్టిదనిన – మొన్న రెండు నెలల క్రితం ఇండియానుంచి వస్తూ మా నాన్నగారు ఇవ్వగా, మా ఆవిడ తెచ్చిన బోల్డు పుస్తకాల్లో – ఎన్నిసార్లు చదివానో గుర్తుకూడా లేని, అన్నిసార్లు చదివినా చదివిన ప్రతిసారీ రోమాలు నిక్కబొడుచుకునిపోయి, పుస్తకం ఏకబిగిన పూర్తి చేసేదాక వదలనివ్వని శ్రీ తెన్నేటి సూరిగారి “చెంఘిజ్ ఖాన్” ఒరిజినల్ ప్రింటు బుక్కుతో పాటూ, ఈ భారతీయ కవితా కల్పకం (1963) పుస్తకం కూడా ఒకటి…

తెచ్చినవాటిల్లో 50 శాతం శిధిలావస్థలో ఉన్నాయి…అందుకు గబ గబా (ఆచార్య వేమూరి గారు ఇదే మాటను వికి వికి అంటారు!) ఆ పుస్తకాలను రోజూ కొద్ది కొద్దిగా డిజిటైజు చేసుకుంటున్నా….. స్నేహితుడొకాయన ఆర్కైవ్.ఆర్గ్ లో కూడా ఈ పుస్తకముందని నిన్న చెబితే తెలిసింది. లింకు ఇక్కడ. అలానే ఈ పుస్తకంలోని కొన్ని మణిపూసలు, క్రితం నెల మాగంటి.ఆర్గ్ లో కూడా సద్దాను….చూడాలనుకున్నవాళ్ళు, సాహిత్యవేత్తలు సెక్షన్లో చూడొచ్చు..

సీమప్రాంత రచయితలను (పుట్టపర్తి, రాళ్ళపల్లి, మధురాంతకం…ఇలా) చాలా మందిని నిర్లక్ష్యం చేసి, మఱుగు చేసిన పరిస్థితి ఈ “విద్వాన్” మణిపూసకు పట్టకూడదు అని ఘోషిస్తూ – ఈ రచనలోని మెఱిసిపోయే మచ్చు తునకలు నాలుగు :

1) శీర్షిక – ఉషః కన్య

అనారతము రోదసినే
అవలోకించుచు నుదయ
మ్మయి సర్వము వ్యాపించే
అతివ ఈమె ఉషఃకన్య
ఉదయమ్మై మంజుల వ
ర్ణోజ్వలాంబరము ధరించి,
యున్న తురా లీమె వెడలు
చున్న దదో కనుంగొనుము.
బంగారు పూతలతో నా
యంగన అందఱి హృదయము
పొంగించుచు వారిలోన
రంగళించు జీవరసము2) శీర్షిక – అయ్యో!

కమల శంఖ చక్రాది
రేఖల జెలంగు
లోక కళ్యాణకరమైన
నీ కరమున
కంకణము గట్టెనా మౌని,
కందమూలములను
ద్రవ్వుక, వనులలో
మలయుమంచు?
(కౌసల్య రామునితో….)

3) శీర్షిక – అగపడవేమయ్యా!

యుగములకు యుగములే
తగులబడిపోయినవి
పగలు రాతిరి పిలిచి
అగడు పడితిమి మేము
నగధీర! నీ వేమొ
నగుచు నిలిచున్నావు!
తగని ఖేదమ్ముతో
వగచుచుంటిమి మేము
తెగలేదు సందియము
సొగచుయుంటిమి తండ్రి!
అగపడదు మాకింక
నిగమ నుత నీ రూపు
యుగములకు యుగములే
తగులబడిపోయినవి4) శీర్షిక -కాలవస్త్రం

కవలలు రాత్రింబవళ్ళు
కాలవస్త్రమును గట్టిగ
కలిసి నేయుచున్నారు
అపార మిది, అనంత మిది
ఆరు గడులతో నున్నది
అటు వేసే పడుగు పొడవు,
ఇటు వేసే పేక పొట్టి
అటు యిటు నేసినదే యీ
అమలము కాలంబరమ్ము


- ఆహా ఎంత అద్భుతమైన వర్ణనలు! – ఇలాగుండాలి కవితలంటేనూ, అనువాదాలంటేనూ! మూలం చదవనఖ్ఖరలేకుండా, మనసుకు పట్టేసేటట్టుండాలి. ఈ పైన వాటిలో ఒక్కటి మీ మనసుకు పట్టలేదు, కనీసం ఆహా అని కూడా అనిపించలేదు అంటే, ఇక ఆ భగవంతుడే మిమ్మల్ని కాపాడుగాక.

ఇది అనువాదమంటున్నారు, మరి చరిత్ర పుటల్లోకెక్కేసిన “పెన్నేటిపాట” కొచ్చినంత పేరు ఈ రచనకు ఎందుకు రావాలి అని అడుగుతారా? ఎందుకో ఒకసారి ఈ పుస్తకం అందుకుని, చక్కగా పడక్కుర్చీలో కూర్చుని,పిల్లగాలులు వీస్తున్న ఒక సాయంత్రంపూట పక్కనే టీయో, కాఫీయో పెట్టుకుని నెమ్మదిగా తాగుతూ,ఇందులో ఉన్న ఒక్కో అనువాద కవితా చదివి – బుఱ్ఱలోకెక్కిందనుకున్న తర్వాత, తీరిగ్గా ఇక్కడికొచ్చి చెప్పండి.

అసందర్భం కాకపోతేనూ , అసంబద్ధంగా ఆలోచిస్తూండకపోతేనూ, రాస్తూండకపోతేనూ – మదబ్భిప్పరాయం ఒకటి చెప్పాలె… దేని గురించి ? – రచనల గురించి. ఈనాటి / సమకాలీన రచనల గురించి.

ఏ కాలంలోనైనా, ఆ కాలానికి సంబంధించి రచన ఆధునికంగా వుండొచ్చు, ఐతే రచయితకు తొలిగా మన పాతసాహిత్యం మీద పట్టు వుండాలి. పోనీ పట్టు కాకపోయినా శ్రద్ధగా చదివి, ఆ చదివినదానిలో కొద్ది శాతమన్నా బుఱ్ఱలోకెక్కించుకుని / ఆకళింపు చేసుకుని వుండాలి. బలమైన పునాది అక్కడే పడుతుంది. “ఆధునిక” రచనలు నిలబడాలంటేనో, రచనల్లో ప్రయోగాలు చెయ్యాలంటేనో ఆ పునాది అవసరం.

విశ్వంగారి రచనల్లోనూ, మన పాత సాహిత్యంలోనూ, అన్నిటికీ మించి ఆనాటి (అంటే పూర్వ) రచయితల్లో 80-90 శాతమ్మంది పునాదులు ఎంతో బలమైనవి అని చెప్పటానికి మనకు అందుబాటులో వున్న, చదివిన, చదువుతున్న పుస్తకరాజాలే సాక్ష్యం. అదే ఈనాటి ఆధునిక రచనల విషయంలో చెప్పొచ్చా అంటే కాలమే నిర్ణయిస్తుంది.

నన్నడిగితే – పైపైన బంగ్లాలు కట్టిన ఈనాటి రచనల్లో ఎన్ని బలంగా పునాదుల మీద నిలబడ్డాయో పాఠకులకే (ఒకవేళ నిజమైన పాఠకులన్నవారెవరైనా ఉంటే!) తెలుసు. పాఠకుల్లో రకాలు బోల్డు, అందుకు పై బ్రాకెట్లో మాట చెప్పవలసి వచ్చింది.. వారి గురించి తీరిగ్గా తర్వాత…:)

ముందుగా రచయితకి “శబ్ద”, “శిల్ప” రహస్యం తెలిస్తే రచనా శిల్పాన్ని చెక్కడం ప్రారంభించొచ్చు. అసలు రాతి శిల్పమంటే రాయి అవసరం ఉందా అని అడిగేవారు ఈనాటి రచయితల్లో కోకొల్లలు. అందుకే “నిజంగా” నిలబడ్డ ఈనాటి రచనలు వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. చెప్పొచ్చేదేంటంటే ఈనాటి రచయిత పాతసాహిత్యంలో పండితుడు కానఖ్ఖరలా, పాతసాహిత్యంతో పరిచయం మటుకు చాలా అవసరం.

రచనల్లో కూడా బోల్డు రకాలు. రచయిత మతిలోని గతుల సంగతులు స్వయంసంయమనాన్ని బట్టి తాళం వేస్తూ “రంజుగా” చెప్పేవి కొన్ని, “పసందుగా” చెప్పేవి కొన్ని, “విశిష్టంగా” చెప్పేవి కొన్ని, “విలక్షణంగా” చెప్పేవి కొన్ని, “సరళంగా’ చెప్పేవి కొన్ని, “ఉద్రేకంగా” చెప్పేవి కొన్ని, “ఉల్లాసంగా” చెప్పేవి కొన్ని, “మనోహరంగా” చెప్పేవి కొన్ని, “మక్కువగా” చెప్పేవి కొన్ని, “తూతూ మంత్రంగా” చెప్పేవి కొన్ని. ఐతే మంచి రచయిత లక్షణమేమిటంటే రంజు విషయాల్ని ఎంత మమేకంగా చెబుతాడో, పసందు విషయాలను కూడా అంతే మమేకంగా చెబుతాడు. అవే నిలబడతాయి.

శక్తి వున్నా ఆపని చెయ్యలేని రచయితలనుండి వచ్చే ఈనాటి “ఆధునిక” రచనలు నిజమైన పాఠకులకు “తలబరువుగా” మారేవి, మారుతున్న వనటంలో అతిశయోక్తి వుందనుకోను. ఇక శక్తి లేక చెయ్యలేకపోయిన రచయితల నుండి వచ్చే రచనల గురించి ఎంత తక్కువ మాట్టాడుకుంటే అంత మంచిది. లేని పాండిత్యప్రకర్ష చూపించాలనుకుంటే ఇతర మార్గాలు బోలెడు. దానికి తగ్గ పాఠకులు వేరు, భజనపరులు వేరు.

రచనకు సౌందర్యం అద్దేదేముందిలే అని మంగలాయన చేతుల్లో పెట్టాల్సిన తల తీసుకెళ్ళి చాకలాయన చేతిలో పెడితే “రాణీపాల్” రంగులో బయటకు వస్తుంది.

మదబ్భిప్పరాయం సశేషం….


ఒక రచయిత రచన చేసాడంటే ఆ రచనకు తగిన సౌందర్యాన్ని అద్దగలగాలి, ఆపైన ఆ సౌందర్యానికి తగిన విలువ కట్టగలిగిన నైపుణ్యం కావాలి. అలా సౌందర్యాన్ని అద్దగలిగినప్పుడే, విలువ కట్టగలిగినప్పుడే ఆ రచనా సౌందర్యం కలకాలం నిలబడుతుంది.

రచయిత మనఃస్ఫూర్తిగా రాస్తున్నకొద్దీనూ, ఇతర సాహిత్యం, పాతసాహిత్యం “మనసు” పెట్టి చదువుతున్నకొద్దీనూ జ్ఞానం పెరుగుతుంది, రచనా శైలి పదునెక్కుతుంది. ఆ శైలి పదునెక్కితే ఏళ్ళు గడిచినా రచన నిలబడుతుంది. ఎంచుకున్న రచనాశిల్పానికి తగ్గ భాషను ఎంచుకోవటంలోనే రచయిత నైపుణ్యం తెలిసిపోతుంది.

అలా చూసుకుంటే, ఈ రచనలో విశ్వంగారి పాండితీ ప్రకర్ష, నైపుణ్యం, వివిధ భాషల మీద ఆయనకున్న పట్టు అచ్చంగా అలా కళ్ళ ముందు, చేతుల్లోనూ మిగిలిపోయి, గుండెలో నిద్రపోతుంది.

ఐతే రచనల్లో నిలబడ్డవన్నీ కళ్ళకు కనపడాలని లేదుగా, అందునా గుడ్డి కళ్ళకు మరీను. అలా కనపడకుండా పోయిన ఆణిముత్యాల్లో ఈ రచన ఒకటి అని నా అభిప్రాయం.

ఈ రచనకు పేరు రాకపోడానికి ఇతర కారణాలున్నవేమో తెలియదు కానీ, హ్యూస్టన్ నివాసి, నాసా నుండి రిటైరు అయిన జియో, కాస్మో కెమిస్టు, కవి – డాక్టర్ ఎ.వి.మురళి గారన్నట్టు – “In my opinion this humongous book and Sri Viswam gaaru deserves a national award – if there was/is one such – for translations.”

చివరిగా ఒకమాట చెప్పాలి – మారేపల్లి రామచంద్రశాస్త్రిగారు, తాను విద్యార్థిగా వున్నప్పుడు (1915 – 20) ప్రాంతాల్లో, ఉపాధ్యాయుణ్ణి ఒక తెలుగు పదానికి వ్యుత్పత్తి పదం అడిగితే - “అది తెలుగు పదంరా, దానికి వ్యుత్పత్తి ఎమిటి?” అని ఎకసెక్కంగా గద్దిస్తే, ఆయన ఆ బాధను జీవితాంతం మర్చిపోకుండా “నుడికడలి” నిఘంటువును తయారు చేసారని తెలిసిన పెద్దాయన ఒకరు చెప్పారు. అంతటి బ్రహ్మాండమైన నిఘంటువు అచ్చుకూడా అవలేదనుకోండి మన “వీర తెలుగు భాషాభిమానుల” చేతుల్లో పడి , అది వేరే సంగతి. అసలు ఈ సంగతి ఎందుకు చెప్పానో ఊహించండి !!

Book Details
Year Of Publication – 1963
Number of pages – 376
Publishers – Annapoorna Publishers, Eluru Rd, Vijayawada
Printers: Venkata Ramana, Museum Rd, Vijayawada

Saturday, October 13, 2012

ఓ పుస్తకమ్మీద అభిప్రాయంఅప్పుడెప్పుడో రెండున్నరేళ్ళ క్రితం గావాలు పుస్తకం సౌమ్యకు ఈ ఆర్టికల్లు పంపిస్తే వాళ్ళ సైటులో అచ్చేసిందావిడ....ఈ రోజెందుకో కూర్చుని నా డైరీలో ఒకానొక పుస్తకం రివ్యూ రాసుకుంటూంటే  (అవును ఆ అలవాటు కూడా ఉందిలే, పుస్తకం చదవగానే ఆ పుస్తకంలోని మంచి - దిక్కుమాలిన పాయింట్లు రాసుకుంటూ ఉంటాలే), ఆ అమ్మాయికి పంపించిన ఈ ఆర్టికల్ సంగతి గుర్తుకొచ్చి దాదాపు ఓ సంవత్సరం తర్వాత అటేపు వెళ్ళి చూద్దును కదా, సైటంతా మారిపోయి బ్రహ్మాండంగా తయారయ్యింది.....

అయితే అంత బ్రహ్మాండంలో నా ఆర్టికల్ ఎక్కడుందో కనుక్కోడం కష్టమైపోయింది.....

సరేలే ఈ వెతుకులాట అంతా ఎందుకు అని, ఆ ఆర్టికల్ ఇలా ఇక్కడ పునః ప్రచురిస్తున్నా.....

అలా ఇంకోకటొ రెండో కూడా పంపించాను.....ఒకటి విద్వాన్ విశ్వం గారి పుస్తకం, ఇంకొకటి సరిగ్గా గుర్తుకులేదు........అలాగే పొద్దు వారి సైట్లో కూడా నా ఆర్టికల్ కనుక్కోడం కష్టమైపోయింది....అవి కూడా నా ఎక్స్ టర్నల్ హార్డ్ డ్రైవ్లో వెతికి పునః ప్రచురించాలి.

వాటితో పాటు నా డైరీల్లో ఉన్న పుస్తకాలు - పాయింట్ల మీద పోష్టులెయ్యాలి.....దీని సిగతరగ రోజుకి 48 గంటలైతే పొయ్యేది....  


ఇది అభిప్రాయం కాదులే కానీ, ఓ పుస్తక పరిచయం అనుకోవచ్చు  ....ఇహ చదువుకో

**************************************************

ప్రతిభాషలోనూ అలిఖితమైన సాహిత్యం బోల్డంత ఉంటుంది. అలాటి సాహిత్యాన్నంతా "జనపదాలు" అని పిలవచ్చునేమో! కాదనుకుంటే జానపదసాహిత్యం అని కూడా అనొచ్చు. ఈ కాలపు "సూపరు" పిల్లలకు జనపదం, అందునా పూర్వ మరియు సంప్రదాయ జనపదం గురించి ఎంత తెలుసు అని ప్రశ్నించుకుంటే, వచ్చే సమాధానానికి నోళ్ళు కొట్టుకోకుండా ఉండటం కష్టమేమో అనిపిస్తుంది. సంప్రదాయ జనపదం ఏమిటి అని అడిగారనుకోండి, ఇహ ఈ కింద రాసిందంతా చదవనఖ్ఖరలా మీరు. 

సంప్రదాయ జనపదం, వాటి ఆచారం, ఆచరణ కొద్దిగా తెలిసినవారికి - మనకున్న పండుగలు పబ్బాలకు, ఉత్సవాలు ఉత్తరేణిలకు ఆ జనపదాలతో ఎంత దగ్గరి సంబంధం ఉందో విడమర్చి చెప్పనఖ్ఖరలా. ఐతే అలాటి జనపదాన్ని మహానుభావులు కొందరు తమ కలం బలంతో కరిగించి లిపి అనే మూసలో పోసి, బంగారు కణికలుగా మార్చి, ఒరే ఇది బంగారం రా అని చెప్పి మరీ మనకిచ్చినా, అది బంగారం అనీ, దానికి అమూల్యమైన విలువుందనీ తెలిసీ  కూడా పారేసుకుంటున్న మూర్ఖపు జనాభా మనలో బోలెడంతమంది. జనపదాలంటే - తప్పులు పట్టుకునేవారు మళ్ళీ విరుచుకుపడతారేమో - జనపదం అంటే జనాలు నివసించే స్థలం అనీ, నువ్వన్నది కాదనీ - ఎవ్వరేమని అన్నా నామటుకు అది "జనపదమే"

కొద్దిగా ఆవేశం, ఆవేదనా తీరింది - ఇహ అసలు సంగతిలోకి వచ్చేస్తూ 

ఆ పండుగలు, ఆచారాలు, పరమార్థాలూ, పండగల్లో చేసే దానాల ముచ్చట్లు, చేసే భజనలు, దేశాచారాలు, వాటితో పాటు ఆ పండగలకి సంబంధించిన పల్లెటూరి పాటలు, దీవన పదాలు చదవాలంటే, ఇతరులెంతమంది ఉన్నా ఒకే ఒక్క పెద్దాయన రాసిన మూడు పుస్తకాలు పట్టుకున్నారనుకోండి - పట్టుకుని ఊరికే కూర్చోకుండా అలా అలా వాటిని చదువుకుంటూ పోయారనుకోండి - ఒకేళ మీరు పెద్దోరైతే చక్కగా మీ మీ పల్లెల్లోకి వెళ్ళి మీ చిన్నప్పుడు పాడుకున్న పాటలు - బుఱ్ఱలో బొంగరాలు బొంగరాలుగా తిప్పుకోవచ్చు. ఒకేళ చిన్నోరైతే అప్పుడెప్పుడో మా చిన్నప్పుడు లాగూలేసుకుని మేము, మాలాటోళ్ళు ఆ పాటలు ఎలా వినేవాళ్ళమో, కొండొకచో పాడుకునేవాళ్ళమో మీ మీ బుఱ్ఱల్లో ఊహించుకుని ఘాట్టిగా గంటంతోనో, గునపంతోనో, అది వీలుకాకపోతే దబ్బనంతోనో మార్కు చేస్కోండి.

అసలు ఆ  పుస్తకం ఏమిటి ? రాసిన పెద్దాయన ఎవరు? ఎన్ని పండగలున్నాయి అందులో ? ఎన్ని పాటలున్నాయి అందులో ? ఎప్పుడు రాసిన పుస్తకం అది ? ఎన్ని పేజీలు ? పబ్లిషర్స్ ఎవరు ? ప్రింటర్సు ఎవరు ? ఎక్కడ దొరుకుతుంది ? - ఆగు నాయనా..ఆగు..

ఆ పండుగ పరంపరలోని పుస్తకాల్లో మొదటి భాగాన్ని పరిచయం చేసే ప్రయత్నం మాత్రమే ఇది.... మానాన్నగారు పంపించిన భోషాణంలో దాగున్న ఆ పుస్తకాన్ని తీసి మొత్తం ఒక్క ఊపులో చదివేసి, అలా మా ఊరు చల్లపల్లికెళ్ళొచ్చి, కొన్ని స్వంతంగా పాడుకున్న, గుర్తున్న, మరి కొన్ని విన్నపాటలు అలా అలా ఈలలేసుకుంటూ (ఊళలు కాదండీ!- ఈలలు - ఈలలు )పాడేసుకుని తీరిగ్గా తర్వాత ఆ పుస్తకాన్ని టెక్కే మీద పెట్టి, ముందు ఫోటోలు తీసుకుని, ఆ పైన వివరాలు రాసుకుంటే, ఈ విధంగా తేలాయి   

పుస్తకం పేరు - "పండుగలు - పరమార్థములు"
రాసినవారు - శ్రీ నేదునూరి గంగాధరంగారు
పేజీలు -  78
ఎన్ని పండగలు - బోల్డు
ఎన్ని పాటలు - బోల్డు
ప్రింటర్స్ - లక్ష్మి ప్రెస్సు, రాజమహేంద్రవరం

ఎక్కడ దొరుకుతుంది - తెలియదు! ఆ ఒక్కటి అడగొద్దు! నా దగ్గరైతే ఉంది ... :)

అబ్బా! 78 పేజీల్లో మీరు అన్నిటికన్నా పైన చెప్పినవన్నీ రాసారా! నమ్మశక్యం గాకుండా ఉందే! సరే పుస్తకం వివరాలు అన్నీ బాగున్నాయండి - పుస్తకం రాసిన పెద్దాయన సంగతులు, పుస్తకంలోని సంగతులు చెప్పండి బాబూ 

ఆ పెద్దాయన గురించి నేను చెప్పేకన్నా "నేదునూరి గంగాధరం" అని ఒక్కసారి గూగిల్లండి. టూకీగా చెప్పాలంటే జానపద సాహిత్యమంటే ప్రాణాలిచ్చేసే వ్యక్తి. మరుగున పడిపోయిన ఎన్నో ముత్యాలు - అవేనండీ - జనపదాలని అలా అలా ఆ అగాథంలోనుంచి బయటకు తీసుకొచ్చి మన దోసిట్లో పడేసిన మహానుభావుడు. 

ఈయనా, బి.రామరాజుగారు, చింతా దీక్షితులు, టేకుమళ్ళ వారు, శ్రీమతి చింతపల్లి వసుంధర, ఎల్లోరాగా పిలవబడే శ్రీ గొడవర్తి భాస్కర రావుగారు - ఇలా కొంతమందంటేనూ, వారి పుస్తకాలంటేనూ భవదీయుడికి బోల్డు అభిమానం. వద్దనున్న ఇతరుల పుస్తకాల గురించి మెల్లగా తర్వాత ఎప్పుడైనా...ఇహ పెద్దాయనను వదిలిపెట్టి, పుస్తకంలోని సంగతులకొస్తే
 
పుస్తకం విషయసూచికకు కూడా రాకముందే అన్నా చెల్లల సంవాదన చేయించి పుస్తకం రాసిందెందుకో, పుస్తకంలో చెప్పబోతున్నదేమిటో తెలియచేస్తారు గంగాధరంగారు...మీలో ఎంతమందికి ఆ పుస్తకం దొరుకుతుందో నాకు తెలియదు కాబట్టి - ఆ సంవాదన కొంచెంగా ఇక్కడ

చెల్లెలు:
పండుగలు; నోములు; వ్రతంబులు
ప్రతీ యేటను చేయుచుందురు
పరమ సూత్రమేమిటో?
తెలియఁజెప్పుము అన్నయా!

అన్న:
దేశ సంస్కృతి; దీప్తిఁజెందఁగ
దేశ కళలవి! తేజరిల్లఁగ
దేశ మందలి; ధీవిసాలుర
స్మరణ చిహ్నముల్, చెల్లెలా!

చెల్లెలు:
దేశ సంస్కృతి; దీప్తి యేది?
దేశకళలకు, తేజమేది?
దేశ మందలి; ధీవిసాలుర
స్మరణలేమిటి? అన్నయా!

అన్న:
రామరాజ్యము ! ప్రజాసౌఖ్యము
సకల వృత్తుల ! చాకచక్యము
పుణ్యపురుషుల! బోధ వర్తన
లుండునమ్మా ! చెల్లెలా!

చెప్పాలనుకున్నవి సంవాదనలో చెప్పేసాక, విషయ సూచికకు వచ్చి అక్కడ కూడా చెప్పేసాక - ప్రథమ భాగం మొదలు అవుతుంది. ఈ భాగంలో పండుగల గురించి ఇలాగ వివరిస్తారు -

అ) "గ్రంథములు పోవచ్చును, మతములు మారవచ్చును, భాష మారవచ్చును, ప్రళయము రావచ్చును, కాని ప్రకృతిలో వ్రాసి పెట్టిన జీవనసాహిత్యము మాత్రము ప్రకాశించుచునే యుండును. ఈ జీవసారస్వతమే మన పర్వదినములు; ఆచారములు"

ఆ) " పూర్వీకులు దేశియ, జాతీయ, విజ్ఞానములను చిరస్థాయిగా నుండుటకై, ప్రతీ సంవత్సరము నొక్కసారి జ్ఞాపకముండునట్లేర్పాటు చేసినారు. ఆ యేర్పాట్లే పండుగలు. ఒక సంవత్సరములో ఈ పండుగలు, వ్రతములు అన్నియును సుమారు యెనుబది కలవు"
 
ఇ) "ప్రాచీన భారతీయ గౌరవుమును నిల్పుచున్న ఈ పండుగలలో ఉత్సవములు జరుపుదురు. ఉత్సవములనగా కథలయొక్క రూపములే. ఉత్సవములు లేనిదే మానవజీవితము సార్ధకము కాజాలదు. నిండుతనముండదు."

అలా పండుగల గురించి ఇంకా బొల్డు విశేషాలు చెప్పాక, ఆంధ్ర దేశానికొచ్చి - తెలుగువారి సంవత్సరాదితో మొదలుపెడతారు. ఈ పండగ రోజున చెయ్యాల్సిన ఆచారాలు వివరంగా వివరిస్తారు. ఆ ఆచారాలు ఏమిటా? ఆచారాల వివరాల్లోకి పూర్తిగా పోకుండా స్థూలంగా
1. వేపపువ్వు పచ్చడి
2. పంచాంగ శ్రవణము
3.మిత్ర దర్శనము
4. ఆర్యపూజనము
5. గోపూజ
6. ఏరువాక

వేపపువ్వు పచ్చడికి ఇతర పేర్లు - "నింబకుసుమభక్షణం", "ఉగాదిపులుసు" వగైరా వగైరా గా చెప్పి - ఆర్యులు చెప్పిన సూత్రం వివరిస్తారు

ఆర్యులు చెప్పిన సూత్రమిదిట

అబ్దాదౌ నింబకుసుమం! శర్క రాంలఘృతైర్యుతం
భక్షితం పూర్యయామేతు! తద్వర్షం సౌఖ్యదాయకం!

అంటే సంవత్సరారంభాన, మొట్టమొదటి ఝాములో వేపపువ్వు, పంచదార, చింతపండు, నెయ్యి, ఉప్పు, కారము వేసి లొట్టలేసుకుంటూ(లొట్టలు - నా పైత్యం-క్షమించాలి! నాకు భాఘా ఇష్టం వేపపువ్వు పచ్చడంటే) తింటే త్రిదోషాలు హరించి శరీరం బాగుండి, ఆరోగ్యం కలిగి తద్ద్వారా సంవత్సరమంతా సౌఖ్యంగా గడవటానికి మొదటిపాదం గా పనికొస్తుందని గంగాధరంగారు చెబుతారు. 

నాకు ఈ ఉగాది ఎప్పుడొచ్చినా, అలా కళ్ళుమూసుకుని ఎంతో తన్మయత్వంతో పచ్చడి తింటూంటే గుర్తుకొచ్చే పెళ్ళి ఒకటుందండోయి - ఉగాది పచ్చడికి, పెళ్ళికి లంకె ఏమిటి బాబూ ? అసలా పెళ్ళి ఏమి ? కథా కమామీషు ఏమి?

వివాహ స్థలం - మా అమ్మమ్మగారి ఊరు, వరుడు - రావి చెట్టు, ఆవిడ - వేపచెట్టు. ప్రతి సంవత్సరం డాక్టర్ తాతయ్య గారింటెనకాల పక్కపక్కనే పెంచిన రావిచెట్టుకి, వేపచెట్టుకి పెళ్ళి, ప్రతి ఉగాది రోజు పదకొండింటికి జరిగేది..బోల్డు సంబరంగా ఉండేది....ఆ వేపచెట్టు కింద ఒక రచ్చబండలాగా ఉండేది, సాయంత్రంపూట ఆ చెట్టు కింద చేరి, పండిపోయి కిందపడిన వేపపళ్ళు తింటే (గింజలు కాదు నాయనా, గుజ్జు మాత్రమే ) కడుపులో పుఱుగులు పోతాయని మా అమ్మమ్మ చెప్పిన వేదమంత్రాన్ని అక్షరాలా పాటించేవాళ్ళం...ప్చ్చ్...ఇప్పుడో? ఆ రావిచెట్టూ లేదు, వేపచెట్టూ లేదు..

మళ్ళీ పుస్తకంలోకి వచ్చేస్తే - వసంత ఋతువుకు, వేసవి కాలానికి ప్రారంభపు రోజనీ, కాబట్టి ఈ సంవత్సరాది నుండి తొమ్మిది దినాలు "వసంతనవరాత్రులు" "వసంత మాధవ పూజలు" "వసంతోత్సవాలు" జరుపుతారు. తెల్లవారితే సంవత్సరాది వస్తుందనగా "దొంగ ఏరువాక" సాగిస్తారని - గంగాధరంగారు చెబుతారు.

దొంగఏరువాక అనగానే అమ్మమ్మగారింటి పక్కనే ఉండే "పిచ్చమ్మ" గారు గుర్తుకొచ్చారు. వారికి బోల్డు పాడి ఉండేది. పొలాలూ ఉండేవి. అసలు ఏరువాక అంటే మీలో ఎంతమందికి తెలుసో ఒక్కసారి కామెంటండి. కామెంటలేరా - ఐతే సరే వినుకోండి - అందరినీ పిల్చుకుని దుక్కి దున్నటానికి ఎడ్లను తయారు చేసి, నూనేసిన పులగం వాటికి బెట్టి, నాగలికి ఆ ఎడ్లను కట్టి, పసుపు కుంకాలు రాసి, దండలేసి ధూపదీపాలు, హారతులు ఇచ్చి తొలిదుక్కి దున్నించటం ఏరువాక. అంటే ముచ్చిముమ్మాటు మూడు చాళ్ళు తోలిస్తారు అన్నమాట.

మరి దొంగఏరువాకేమిటి ? - ఎవరికీ చెప్పకుండా, నాగలిని, ఎద్దుల్ని పూజించి దుక్కి దున్నటమే. ఆ పని పిచ్చమ్మ గారి పతీశ్వరులు ఎంతో సమర్థవంతంగా చేసేవారు. ఎందుకో, కారణమేమిటో తెలియదు కానీ, మా అమ్మమ్మ "దిష్టి" కొడుతుందనిరా అనేది. ఇహ పిచ్చమ్మగారి సంగతి పక్కనబెట్టి - ఆ ఉగాది రోజున పాటించాల్సిన మిగతా ఆచారాల గురించి కూడా చక్కగా వివరించారు ఈ పుస్తకంలో. అన్నీ రాసుకుంటూ పోతూ ఉంటే పుస్తకం వారి స్థలం సరిపోదేమో అని అనిపించి కొద్దిగా వెనక్కు తగ్గవలసి వస్తోంది.

ఎలాగూ ఏరువాక గురించి చెప్పారు కాబట్టి అక్కడే ఒక ఏరువాక పూజాపదం కూడా ఇచ్చారు గంగాధరంగారు

మంగళమమ్మా, మాపూజలు గైకొమ్మా
మంగళమమ్మా, మా నాగలీ నీకు || మం ||
కష్టమనక భూమి దున్ని
కరువుమాపి, కడుపు నింపి
సకలజీవ రాశిని, నీ
చాలున పోషింతువమ్మా || మం ||

కర్షకులను; కరుణతోడ
కాపాడుచు, నెల్లప్పుడు
కామితార్థములు నొసంగు
కల్పవల్లి వమ్మ నీకు || మం ||

ఇప్పుడు అసలు సిసలు నాగళ్ళెక్కడున్నాయి? కోడెద్దులు, కాడెద్దులు ఎక్కడున్నై అంతా ట్రాక్టర్లూ, మనుషులేగా అంటారా? అలా అన్నా అసలు సంప్రదాయం పాటించాలనుకుంటే, ఈ పై పాట పాడుకోవాలని నిజంగానే ఉద్దేశముంటే నాగలి బదులు "ట్రాక్టరూ" అని పాడుకోవచ్చు. అందులో తప్పేమీ లేదని భవదీయుడి అభిప్రాయం. హాస్యానికి అనట్లేదు. కాలం మార్పుతో పాటూ ఈ పాటల సాహిత్యం కూడా మార్చుకోవచ్చు. సంప్రదాయం పాటించటం ముఖ్యం కానీ, మాటలదేముంది అన్నీ మనచేతిలో పనేగా! పండితులెవరన్నా పూనుకుని ఈ కాలానికి తగ్గట్టు ఆ పదాల పడికట్టూ, ప్రాసకు తగ్గట్టూ మారిస్తే, భేషుగ్గా సిగ్గుపడకుండా పాడుకోవచ్చు.

అలానే ఏరువాక పౌర్ణమికి, ఏరువాక పండగకి పాడుకునే - ఏరువాక ఆరాధన జానపద గేయం ఒకటి

ఏరువాకమ్మకూ ఏమి కావాలి
ఎఱ్ఱ ఎఱ్ఱని పూలమాల కావాలి
ఎరుపు తెలుపుల మబ్బుటెండ కావాలి
ఏరువాకమ్మకూ ఏమి కావాలి
పొలము గట్టున నిలిచి వేడుకోవాలి
టెంకాయ వడపప్పు తెచ్చిపెట్టాలి
ఏరువాకమ్మకూ ఏమి కావాలి
ముత్తైదులందరూ పాట పాడాలి
పున్నిస్త్రీలందరూ పూజ చేయాలి
ఏరువాకమ్మకూ ఏమి కావాలి
పాట పాడుతు తల్లి
పాదాలు మ్రొక్కాలి
ఏరువాకమ్మను ఏమి కోరాలి
ఎడ తెగని సిరులివ్వ వేడుకోవాలి
పాడి పంటలు కోరి పరవశించాలి

గంగాధరంగారు పుస్తకంలో రాసిన ఈ క్రింది పాట సంవత్సరాది సంబరం పాట - కొద్ది తేడాతో పిల్లలందరి స్నానాలూ అవీ అయ్యాక, దేవుడికి పూజ అయ్యాక ఉగాది పచ్చడి తినేముందు, అమ్మమ్మ మాతో పాడించేది - (తేడా బ్రాకెట్లో చూడొచ్చు!) 

ఉగాది పండుగ వచ్చింది
ఊరికి అందం తెచ్చింది
దేవుడి గుడిలో బాజాలు
బాజాలయ్యాక పూజాలు
ఊరేగింపులు జరిగాక
ఉత్సవాలు ముగిసాక
పంచాంగాలను చదివించి
మంచీ చెడ్డలు విన్నాము

(ఊరేగింపులు చేద్దామూ
ఉత్సవాలూ చేద్దామూ
పంచాంగమ్మును విందామూ
అన్నీ తెలుసుకుందామూ)

 ఇహ సంవత్సరాదిని పక్కనబెడితే, పండుగల పూట పిల్లలు ఆడుకునే ఆటల గురించి వివరిస్తారు గంగాధరంగారు. చిన్నోళ్ళైతే చెడుగుడి, ఉప్పట్లు, చెమ్మచెక్క లాంటి ఆటలు , పెద్దోళ్ళైతే చిన్నీ - బిన్నీ, ఉత్తుత్తి పెళ్ళి , హరికథలు, ఆకపదాలు, భజనలు, కోలాటాలు (కోపులు) లాంటివాటితో గడుపుతారు.

ఒకటే ఒక్క పదం (బ్రాకెట్లో ఉన్నది!) తేడాతో మా పిన్ని పాడే పాటా, ఆవిడ ఏడిపించిన దుర్గయ్య బావ జ్ఞాపకాలు అలా లేచి కూర్చున్నాయి, గంగాధరంగారు పుస్తకంలో రాసిన ఈ క్రింది పాట చూస్తే

చిప్ప చిప్ప గోళ్ళు
సింగరాజు (మాబావ) గోళ్ళు
మా బావి నీళ్ళు
మండాప రాళ్ళు
మా మామ కాళ్ళు
మంచం కోళ్ళు

ఇంకా బొల్డు పాటలున్నాయి, అవి అన్నీ ఇక్కడ రాసే పని కాదు... ఇలాటి పాటలకోసం గంగాధరంగారు రాసినవే "సెలయేరు", "మిన్నేరు" మొదలైన జానపద గీతాల సంకలనాలు/రచనలు ఉన్నాయి. వీటిలో కొన్ని డి.ఎల్.ఐ లో లభ్యమవుతవి. ఆసక్తి ఉన్నవారు అక్కడ వెతుక్కోవచ్చు.

ఇక ఒక్క దాటుగా పెద్ద పండుగ - దసరాకు వచ్చేస్తా - ఈ పండుగలోని భాగాలు, వాటి వివరాలు గంగాధరంగారు ఈ పుస్తకంలో తెలియచేస్తున్నారు. స్థూలంగా రాస్తే ఇవీ -
1. దేవీపూజ
2. ఆయుధ పూజ
3. పొలిమేర దాటుట
4. పారు వేట
5. జమ్మి (బేతాళ) పూజ

మళ్ళీ సొంతడబ్బాకొచ్చేస్తున్నానహో! ఈ పైవాటిలో పారువేట తప్పితే అన్నిట్లోనూ భాగస్వామ్యం ఉండేది భవదీయుడికి. పారువేట అంటే, దశమి రోజు పొలిమేర దాటటం అయిపోయాక ఏదన్నా జంతువుని పరిగెత్తించటం, వేట చేస్తున్నట్టుగా అభినయించటం అన్నమాట. ఆరో నంబరు కాలవ దగ్గర దగ్గరగా పొలిమేర ఉండేది మా చల్లపల్లికి. ఆ పొలిమేరకు దగ్గరలో యానాదుల బజారు (అని అప్పుడు పిలిచేవాళ్ళు) ఆ వీధిలోనూ, ఆ చుట్టుపక్కలా ఉన్న జనాలంతా మేకల్ని , గేదెలని పరిగెత్తించేవాళ్ళు. ఉత్తుత్తి వేట అయిపోయాక, గేదెలను వదిలిబెట్టి మేకల్ని కోసుకుని తినేవాళ్ళు. ఆ కోసుకునే భాగం అంటే చిన్నప్పుడు చచ్చే భయంగా ఉండేది. అందుకు అసలు ఆ భాగంలో పాలు పంచుకునేవాడిని కాదన్నమాట.   

మళ్ళీ పుస్తకంలోకి వచ్చేస్తే - గంగాధరం గారి ఊరు రాజమహేంద్రిలో దశమిరోజు జరిగే ఒక విశేషాన్ని వివరించారు పుస్తకంలో - "రెవెన్యూ శాఖ ఉద్యోగులు కఱ్ఱలతోనూ, కాగితములతోనూ ఏనుగును కట్టి చక్కగా అలంకరించి ఊరేగించుచుండిరి. అక్కడి వేడుకలు కన్నుల పండువుగా నుండుటచేత, నెక్క డెక్కడి నుండియొ, ప్రజలు వచ్చెడివారు." ఈ వాక్యాల్లో నాలోని పాఠకుడికి ఎక్కడో "భూతకాల" ప్రయోగం కనపడింది, తప్పు అయ్యుండొచ్చు కాని నాకు అనిపించింది ఏమిటంటే ఆ వేడుకలు నెమ్మదిగా అంతరించిపోతున్నాయనో, పోయాయనో ఆవేదన చెందుతున్నారేమో అని.

ఇక దసరా పాటల్లోకి వస్తే "అయ్యవారికి చాలు, ఐదు వరహాలు - పిల్లవాళ్ళకు చాలు, పప్పు బెల్లాలు" పాడుకుంటూ తిరిగిన రోజులు అలా గుర్తుకొచ్చినాయి, గంగాధరంగారు ఉదహరించిన పాటలు చూస్తే. మచ్చుకు ఆ పుస్తకంలోని పాట ఒకటి

ఇవ్వలేని లోభుల యిళ్ళకు బోము
మూటగట్టుట యేమి మోక్షము గదయ్య
కోటినార్జించిన కూటికెగదయ్య
మటుమాయవాదులను మరియడుగబోము
నీటుగన శార్జోడు నేడివ్వరయ్య
సాటెవరు మీతోను సరసము గదయ్య
అయ్యవారికి చాలు అయిదు వరహాలు
తెప్పించి కట్నంబు లిప్పించరయ్య
మాపప్పుబెల్లాలు మాకు దయచేసి
శీఘ్రముగ నంపుడీ శ్రీమంతులార...

ఈ పై పదాన్ని "రూక పదం" అంటారనీ, అప్పట్లో చాలా ప్రఖ్యాతి పొందిన పదమనీ తెలియచేస్తున్నారు గంగాధరంగారు. ఈ పదం నేనెప్పుడూ వినలేదు, పాడే అవకాశమూ రాలేదు. ఎందుకంటే మా బజార్లో, అటుపక్క బజార్లో, ఇటుపక్క బజారులో ఘాట్టిగా కలిపితే  70 గడప, అందరి పిల్లలూ ఉండేవాళ్ళు కాబట్టి, ఎవ్వరూ ఏమీ ఇవ్వకుండా పోయేవాళ్ళు కాదు. అందుకు అన్నమాట.

ఇప్పుడు ఇక దసరా పండుగ కోలాటలు, ఆటలు, పాటలు, ఆచారాలు వదిలేసి దీపావళికొస్తే , ఆ పండుగకు సంబంధించిన కథావిశేషాలు, వివిధాభిప్రాయాలు, వివిధ దేశ వాడుకలు, వివిధ దేశాచారాలు (వివిధ దేశాలంటే భారతదేశం బయట అనుకునేరు! - గుజరాతీలూ, జైనులు, కొంకణులు - ఇలాగన్నమాట!) గురించీ, పండుగ ఆచరణ విధానాల గురించీ వివరణ వున్నది. దీపావళి కొంతమంది 13 దినములుగా భావించే  పండుగ కాగా, ప్రాధానంగా ఐదు దినాల పండుగ అని విశేష వివరాలు ఇచ్చారు..ఆ పంచదినాలు, వాటి వివరాలు ప్రధానంగానూ / స్థూలంగానూ ఇక్కడ

1) నిధనత్రయోదశి
2) నరక చతుర్దశి
3) దీపావళి
4) గోవర్ధనోద్ధరణ
5) యమద్వితీయ

రైతులు గోపూజను, వారింట్లో వారు కేదారగౌరీ వ్రతం, గౌరమ్మ పండుగ చేస్తారని రాసి, ఆ వ్రత వివరాలు, కొన్ని పాటలు కూడా ఇచ్చారు. మచ్చుకు లక్ష్మి మంగళహారతి పాట.....ఆవిడను నిలదీస్తూ, వేడుకుంటూ, ఆహ్వానిస్తూ ఎంత సుందరంగా ఉందో చూడండి

మహలక్ష్మి యనినిన్ను ! చాలగ బిలిచితే
ఓ లక్ష్మి నీకింత, జాలమేలా?
పాలసముద్రుని పట్టిరో యని నిన్ను
పలుమారు పిలిచితే పాలించవేమమ్మా!
మంగళం, మంగళం, మహాలక్ష్మీ
నీకు మంగళం మంగళం

అలికి పూసిన యింట్లో చిలుకు జల్లితి నేను
మెళుపు చూపుతు రావె అలుకలేలా
కళకళ నవ్వుచు కలయిండ్ల నెక్కుచు
కలికి ముద్దులగుమ్మ చిలుక రావమ్మా || మం ||

ఒంటిగా నీవు మా యింటికి రావమ్మ
జంటబాయక నా వెంటనుండూ
కంఠాన మెరసేటి కంఠహారములిత్తు
ఇంట్లోకి రావమ్మా | యిపుడు మహలక్ష్మీ || మం ||

ఇక సంక్రాంతి గురించి బోల్డంత రాసుకొచ్చారు గంగాధరంగారు... చదవాల్సిందే తప్ప ఇక్కడ రాసేది లేదు..

ఇక్కడో సంగతి చెప్పాలండోయి - ఈ వ్రతాలూ, నోముల సంగతికొస్తే చిన్నప్పుడు మా ఇంట్లో అవి జరిపించడానికి ప్రత్యక్షమైపోయే ఆస్థాన పురోహితుడిని చూసినప్పుడల్లా మా నాన్నగారితో మావయ్య ఒకటనేవాడు..."బావా - ఈ పురోహితులకు, వాళ్ళ వ్యాపారానికి అమాయకమైన మహిళలే మాంచి సరుకు" అని. ఆ మాట అప్పుడు అర్థంకాలా కానీ, ఊహ బాగా తెలిసాక అర్థం అయ్యింది. మా నాన్నగారు ఒకటే అనేవారు - "ఒరే కృష్ణా - వాళ్ళే కనక ఆ వ్యాపారంలో లేకుంటే, మనకున్న ఈ పాటి విశ్వాసాలు, నమ్మకాలు, ఆ వ్యాపారం చేసేప్పుడు బయటపడే మన పూర్వచరిత్ర ఏవీ మిగలకుండా పోయేవి. కాబట్టి వాళ్ళకూ, మన ఆడాళ్ళకు ఋణపడి ఉండటమే మనం చెయ్యగలిగింది" అని

మళ్ళీ పుస్తకంలోకి వచ్చేస్తే - ఇంకా కొన్ని ఆచారాలు, పండుగల గురించి రాసుకొచ్చింతర్వాత భజనల భాగం దగ్గరికొస్తారు గంగాధరంగారు.

భజనలంటే మళ్ళీ డబ్బానే, అదే సొంత డబ్బా - మా ఊర్లో చెరువు , గాడిబావి, కోట పక్కనున్న శివాలయంలో - మా కిష్టాయి మావయ్య, గుడ్డి సత్తెం తాతయ్య, వుయ్ తాత, నారాయణ, సోడాల బాబూరావు ఇంకా బోల్డు మంది సాయంత్రం అయ్యేటప్పటికి చేరి భజన్లు చేసేవాళ్ళు. సదానందం, విశ్వనాథు, రంగస్వామి - ఇలా మా బాచులో ఉన్న పిల్లకాయలందరినీ మా కిష్టాయి మావయ్య అదిలించి భజనలకు తీసుకెళ్ళేవాడు. మొదట్లో ఇదెక్కడి గొడవరా అనుకున్నా, నెమ్మదిగా ఆ భజనలతో పాటుగా మోగే చిడతలు, ఘటం సౌండుతో ఊగిపోతూ మేమే అందరికన్నా ముందు గుడికి చేరుకునేవాళ్ళం. అదీ సంగతి...ఆ సంగతి అక్కడొదిలిపెడితే, గంగాధరంగారు ఈ పుస్తకంలో ఇచ్చిన తప్పిడి కుండల భజన పాటతో ఈ నా ఘోషకు ముగింపు పలుకుతాను.

గుమ్మా గుమ్మన్నలార గుమ్మన్నలారో
నా రాస గుమ్మడీ రారావమ్మా
తూరూపు నున్నాది తారూపు గుల్లో
నా రాస గుమ్మడీ రారావమ్మా
తారూపు గుల్లకు తవ్వంత కొప్పో
నా రాస గుమ్మడీ రారావమ్మా
తవ్వంత కొప్పూలో గుప్పుడేసిపూలో
నా రాస గుమ్మడీ రారావమ్మా
గుప్పుడేసి పూలకు తాకట్టు సరుకో
నా రాస గుమ్మడీ రారావమ్మా
తాకట్టు సరుకూకీ తాగుమోతు మొగుడో
నా రాస గుమ్మడీ రారావమ్మా
తాగుమోతు మొగుడికీ తాళింపు కూడో
నా రాస గుమ్మడీ రారావమ్మా
తాళింపు కూడుకీ తాటికాయ పులుపో
నా రాస గుమ్మడీ రారావమ్మా

ఇలా...సాగిపోతుంది...

చివరి మాటలు రెండు -

మొదటిమాట
 "పండుగలు - పరమార్థములు" పరంపరలోని పుస్తకాల్లో రెండు మూడు భాగాలున్నాయి - కానీ అవి మహమ్మదీయ, క్రైస్తవ, బౌద్ధ, జైనాది మతాల పండుగల గురించి వున్నవి...వాటి గురించి మళ్లీ తర్వాత ఎప్పుడైనా...

రెండో మాట

ఇప్పటిదాకా అంటే ఓ పాతిక - ముప్ఫైఏళ్ళ క్రితం దాకా ఏ ప్రాంతంలోనైనా సంప్రదాయాలు, ఆచారాలు రక్షించుకొచ్చింది మహిళలే అని నిర్ద్వంద్వంగా చెప్పొచ్చు..ఈనాటి మహిళ ఆ పని చేస్తోందా, చెయ్యగలదా అన్న ప్రశ్నకొస్తే సమాధానం మీ దివ్యమైన మస్తిష్కానికే వదిలేస్తున్నా...దానికి నానా రకాల సమాధానాలు వస్తాయని తెలుసూ, కానీ అవన్నీ మీ వివేచనకే వదిలెయ్యటం జరుగుతోంది. ఆ మాటకొస్తే ఆనాటి పురుషుల్లో కూడా "ఆనాటి మహిళల" పాత్ర పోషించిన వారు ఎక్కువే. ఇప్పుడో ?

సంప్రదాయాలంటే, ఆచారాలంటే పెరిగిపోయిన, పెరిగిపోతున్న తృణీకార, అహంకార దరిద్రం ఎప్పటికి తీరుతుందో కానీ ! ప్చ్చ్...అప్పటిదాకా చెయ్యగలిగినవారు శక్తికొద్దీ చేస్తూ ఉండటమే

మొత్తానికి నిన్న సాయంత్రం అలా అలా నన్ను ఏదో తీరాలకు తీసుకెళ్ళిపోయిన శ్రీ నేదునూరి గంగాధరం గారికి కృతజ్ఞతలు తెల్పుకుంటూ..

భవదీయుడు
వంశీ