Wednesday, August 22, 2012

పాండిత్యం ఉంటే బలాత్కార అభియోగం నుంచి తప్పించుకోవచ్చా?

పాండిత్యం ఉంటే బలాత్కార అభియోగం నుంచి తప్పించుకోవచ్చా?

తప్పించుకోవచ్చుట

ఎలాగ?

ఇలాగ

గేహేగేహే జంగమా హేమవల్లీ
వల్యాం వల్యాం పార్వణశ్చంద్రబింబః
బింబే బింబే కోకిలానాం విరావో
రావే రావే జాయతే పంచబాణః


రావే రావే అని వెంబడి పడి బలాత్కారం చెయ్యబోతే తప్పించుకుని ఆ అమ్మాయి రాజు గారి దగ్గరికెళ్ళి విన్నవించుకోగా, రాజు గారి వీణ్ణి పిలిచి ఏమిరా "రావే రావే" అని వెంబడి పడ్డావుట అని అడిగాట్ట....

లేదండీ - ఆ అమ్మాయికి ఈ శ్లోకం నేర్పిద్దామని వెంబడి పడ్డానంతే అని పైనిచ్చిన శ్లోకం వదిలాట్ట....అదీ సంగతయ్యా!

అది విని రాజుగారు వాణ్ణి సన్మానించి పంపాట్ట....

ఆ రాజూ సరే, వీడి పాండిత్యమూ సరే....పాపం ఆ అమ్మాయే...

ఇది చదివితే మన రాజకీయనాయకుల బలాత్కారాలు గుర్తుకు రావట్లా? 

PS: 

ఇంతకీ ఆ శ్లోకానికి అర్థం ఇదీ

ప్రతిగృహంబున చరియించు పసిడితీగె
పసిడితీగె వసించు పార్వణశశాంకు
డతని బింబంబు కోకిలాద్భుతరవంబు
తద్రవము మరునగ్ని కింధనము వినుము 


ఇంకా అర్థం కానివాళ్ళకి అర్థం ఇదీ, ఇది కూడా అర్థం కాకపోతే మీ మీ భాషల్లో మీ మీ యాసల్లో తర్జుమా చేయించుకోండేం ? 

ప్రతి ఇంటిలోనూ ఊగాడుతున్న బంగారు తీగ లాటి అమ్మాయి, ప్రతి తీగలోనూ శుక్లపక్షంలో ఉన్న చంద్రబింబం లాటి ముఖమున్నదని, ప్రతి బింబంలోంచీ కోకిలల శబ్దాలొస్తున్నవని, ప్రతి శబ్దంలోనూ మన్మధుడు పుడుతున్నాడని అర్థం

ఇది కాళిదాసు చెప్పాడని కొంతమందంటారు, కాదు కాదు అవంతీ దేశపు ఆస్థాన పురోహితుడి కథని కొంతమందంటారు.... పురోహితుడి కథైతే ఆ రాజుగారు అవంతీ దేశాధినేతన్నమాట చెప్పనఖ్ఖరలేదుగా....


2 comments:

 1. వంశీ గారు మంచి అందమైన శ్లోకాన్ని పరిచయం చేసి దాని మీద మంచి కథ చెప్పారు. 'రావే రావే' అన్నది తెలుగు వాళ్ళ సంబోధన. దీన్ని తీసుకు వెళ్ళి అవంతీ దేశపు రాజపురోహితుడికి తగిలించారు. కాని అవంతి అనేది తెలుగు నేలపైన ఉండిన పట్టణం కాదు అన్నది గమనించాలి.

  అదలా ఉంచుదాం. ఈ శ్లోకం చదివాక మనకు శ్రీశంకరభవత్పాదుల వారి శ్రీరామకర్ణామృతం లోని ఒక అంద మైన శ్లోకం తప్పకుండా గుర్తుకు వస్తుంది.

  మార్గే మార్గే శాఖినాం రత్నవేదీ
  వేద్యాం వేద్యాం కిన్నరీబృందగీతం
  గీతే గీతే మంజులాలాపగోష్టీ
  గోష్ట్యాం గోష్ట్యాం త్వత్కథా రామచంద్ర.

  భావం:
  అన్ని మార్గాలలోనూ మనకు బాట ప్రక్కనే చక్కని చెట్లు కనిపిస్తున్నాయి. ఆ చెట్ల క్రింద మంచి రత్నవేదికలు యేర్పాటు చేయబడి ఉన్నాయి. అటు వంటి అన్ని వేదికల మీదా కూడా కిన్నెర వనితల బృందాలుగా కూడి మనోహరంగా గాన కచ్చేరీలు చేస్తున్నారు. ఓ రామచంద్ర ప్రభూ! ఆ కిన్నెరలు పాడే గీతాలన్నీ నీ దివ్య కథలతో సమకూర్చ బడినవే సుమా!

  స్వస్తి.

  ReplyDelete
 2. శ్యామలరావు గారు

  పేరులోనే అమృతమున్నదిగా.....

  కిన్నెరలు ధన్యం, శంకర భగవత్పాదుల శ్లోకాన్ని మాకందించిన మీరు ధన్యం, చదివిన మేము ధన్యం...

  ReplyDelete