Tuesday, June 5, 2012

నాకు పన్నెండేండ్ల వయసగు దాక దొంగతనములు చేయవలెనని!! - విశ్వనాథ

 దొంగతనం  -  చేస్తే ఏమవుతుంది అన్న సంగతి "అంతే" అన్న రచనలో వివరిస్తారు

********************************************

"అంతే"

శ్రీ విశ్వనాథ సత్యనారాయణ
(1940 బాలకేసరి పత్రికనుండి)


నాకు పన్నెండేండ్ల వయసగు
దాక చిన్నవి దొంగతనములు
చేయవలెనని యూహ యుండెను
చేయుటకు భయమున్


పుస్తకంబులు కొనగవలెనని
పోయి యంగడి కచట వలసిన
పుస్తకములను కొన్ని తీసితి
పుచ్చుకొని చేతన్


అచటి యంగడిలోని మానిసి
అచ్చమైన యమాయకుండును
అతని మోసము చేయుచుండెద
రందరును పిల్లల్


రెండు పుస్తకములను దాచితి
రెండు మరి కనిపిచునట్లుగ
పుచ్చుకొంచు దుకాఋఅదారుకు
పోయి కనబడితిన్


పట్టి దాచిన పుస్తకాలకు
పావలా వెల చేత నుండిన
పుస్తకములకు రెండణాలను
పుచ్చుకొను మంటిన్


దాచి నట్టిది యాత డెచ్చట
చూచిపోవునో యంచు గుండియ
గుబుకు గుబుకున పైకి తోచగ
కొట్టుకొనుచుండెన్


అతని కనుమానమ్ము కలిగిన
అంతతో నా పనియు సరియని
నుదుట చెమ్మట పోసి నిలువున
కదలుచుండగనే


మాయ యెఱుగని యతడు పాపము
పోయి తన బేడ తా గైకొని
చేరి పదియును నాల్గణాల్ నా
చేతిలో పెట్టెన్

నేను కన్నును మూసి తెఱచెడి
లోన నచ్చటినుండి పరుగున
పోయితిని ఆ చుట్టు పట్టుల
పొడయు లేకుండన్


ఇంటికి పోవుద మటంచును
ఇంతలో మా అమ్మ కూరలు
తెమ్మటన్నది జ్ఞాపకమ్మును
తెచ్చుకొని మరలన్

ఆ బజారును వదలి కూరల
యంగడికి జని బీరకాయలు
పుచ్చుకొని నేనొక్క వీశెడు
మూట కట్టి వేసన్


బీరకాయల బేడ యంగడి
దారునకు నీయంగ జేబున
అర్ధరూపాయీని ఉంచితి
నతని హస్తములో


అంత నంగడిదారు నా దగు
అర్ధరూపా యట్టు-నిట్టుల
త్రిప్పి పడదని మరల నిచ్చెను
తిరిగి యంతటిలో


ఏల పడ దని యర్ధరూపా
యిట్టునట్టుల త్రిప్పిచూచితి
అదియు నొకవై పంత చెక్కిన
యట్లుగా నుండెన్


ఏమి చేయుటొ యింత తోచక
యెంత పట్టము తీసికొందు వ
టంచు నాతని నడుగ నాతడు
అసలు వద్దనియెన్


వారు వీరును వచ్చి చూచిరి
వారిలో గొందరు దయాళురు
అతడు బాలున్ డెంతయో యొక
యంత యిమ్మనగా


పట్టి యంగడిదారు చివరకు
పావలా వట్టం బటంచును
బేడ మినహాయించి బేడను
పెట్టె నా చేతన్


తిరిగి యింటికి వచ్చు చంతయు
గిరగిరా తిరిగెడు మనస్సున
దాని కది సరిపోయె నంచును
లోన నిది తెలిసెన్

పావలా మోసమ్ము చేసితి
పావలా వట్టమ్ము నొసగితి
పూని భగవంతుండు నాకును
బుద్ధిగా నేర్పెన్


నాకు అంతే అప్పటిప్పటి
దాక మోసము దొంగతనమును
చేయు టనగా భయము, ఊహయు
పోయె నిప్పటికిన్


ఎంతచాటుగ చేసినను వా
డెంతవాడో కాని దేవుడు
కుక్కకాటుకు చెప్పుదెబ్బగ
కూర్చియే పెట్టున్


1 comment: