Tuesday, May 8, 2012

మీ అమ్మా నాన్న ముందు ఈ పిల్లదానిలా చెయ్యండి చూద్దాం!

మీకు దమ్ముంటే, మీకు ఇరవై ఏళ్ళు దాటితే మీ అమ్మా నాన్న ముందు ఈ పిల్లదానిలా చెయ్యండి చూద్దాం!

దోశ: దోశ మధ్యలో చిల్లులు చేసి రెండు కళ్ళు, ముక్కు, మూతి పెట్టి, ఆ దోశ ముఖమ్మీదేసుకుని ఆ కళ్ళ చిల్లుల్లోంచి ఓ సారి పక్కనున్న నన్నో వాళ్లమ్మనో చూసి, ఆ ఆనందం అయ్యాక, ప్లేట్లో పెట్టి ముందు నోరు భాగం చుట్టూ ఉన్న ముక్కలు కొరికి తినేసి, కళ్ళు ముక్కులున్న చోట మరింత పెద్ద చిల్లులు చేసి మళ్ళీ ఓ సారి ముఖమ్మీదేసుకుని చూసి మళ్ళీ ప్లేట్లో పెట్టి, ఆ పెట్టినదాన్లో సగం తిని అమ్మా చాలు కడుపు నొప్పి అనటం....అమ్మ ఉగ్రరూపం దాల్చటం....నోరుమూస్కుని మిగిలింది తినెయ్యటం, ఒక్కోసారి ఏడుస్తూ....

ఇడ్లీ: మధ్యలో గుంట చేసి, కారప్పొడి స్పూనుతో తీస్కుని ఆ గుంటలో కాకుండా పక్కనున్న ప్లేట్లో అంతా పోసి, ఇలాక్కాదని గుంటున్న ఇడ్లీని ముక్కలు చేసి ఆ ముక్కలతో కారప్పొడి అద్దుకుంటూ, ఆ అద్దుకోటంలో పొడినంతా ప్లేటు చివరికి తోసి అది కింద పడిపోతే అమ్మొంక ఓ సారి చూసి - ఆవిడ చుడకపోతే ఆ పడిపోయిన కారప్పొడంతా ప్లేటు కిందకు తోసేసి ఇంకో స్పూనుచ్చుకుని ఇంకొంచెం కారప్పొడేసుకోటం.....తంతు మళ్ళీ మొదలుపెట్టటం....

ఉప్మా: చిన్న చిన్న గుండ్రం ముద్దలు చేసి రెండు కళ్ళు పొడిచి, ఓ నాలుగు ముద్దలు ఒకదాని మీద ఒకటి పెట్టి నాన్నా ఉప్మా మాన్ చేసేసా అనటం....మంచు పడ్డప్పుడు దాంతో స్నో మాన్ చేస్తుంది, దాంతో ఉప్మాతో ఉప్మా మాన్ కూడా చెయ్యొచ్చని అర్థమయిపోయిందన్నమాట

జంతువుల బొమ్మలున్న బిస్కట్లు - ముందు కాళ్ళు, ఆ తర్వాత తల, ఆ తర్వాత మిగిలిన భాగంలో సగం నమిలి, మిగిలిన భాగంలో బిస్కటు రజనంతా కార్పెట్ మీద పొయ్యటం....

బ్రెడ్డు - కొద్దిగా గట్టిగా ఉన్న చుట్టు భాగాన్ని చేతుల్తో పీకి ప్లేట్లో పెట్టి, మెత్తటి భాగంలో రెండు బొక్కలు పొడిచి కళ్ళ మీద పెట్టుకుని అందులోంచి ఓ సారి చుట్టు చుసి, కనపడకపోతే ఆ బొక్కలు ఇంకొంచెం పెద్దవి చేసి , మళ్ళీ కళ్ళ మీద పెట్టి చుట్టూ చూసి సంతొషించాక మెల్లగా తినటం మొదలు పెట్టి - ఆ గట్టిగా ఉన్నది తిను చాలా బాగుంటుంది అందులోనే బలం ఉంది అని అమ్మ అరుస్తే, నెమ్మదిగా అమ్మ చూడకుండా కూర్చున్న కుర్చీకున్న కుషన్ల కింద ఇరికించెయ్యటం....

నూడుల్స్ - ఓ పేద్ద ఫోర్కుచ్చుని ప్లేట్లో ఉన్న నూడుల్స్ మధ్యలో పెట్టి పరపరా పరపరా తిప్పి తిప్పి తిప్పి, చివరికి ఓ రెండు నూడుల్స్ ఆ ఫోర్కుకు పట్టుకోగా ఆ రెండిట్లో ఒకదాన్నీ నోట్లోకి పోనిచ్చి గట్టిగా చప్పుడు చేస్తూ జూరి, కిందపడిపోతున్న రెండోదాని చివర చేత్తో పట్టుకుని  ఫోర్కుకు సగం వరకూ చుట్టి - మళ్ళీ గట్టిగా చప్పుడు చేస్తూ లోపలికి పంపించెయ్యటం. కావలసినంత తిన్నాక ఆ మిగిలిపోయిన ప్లేటు చేత్తో పట్టుకుని , ఎలా? వంకరగానన్నమాట, అమ్మా ఇంక చాలు సింకులో పడెయ్యనా అని సమాధానం కోసం చూడకుండా సింకు దగ్గరకెళ్ళిపోతూ, ప్లేట్లో మిగిలిన నూడుల్స్లో కొన్ని కిందపారేసి (ప్లేటు వంకరగా పట్టుకుందిగా! అందుకు....) దాన్ని తొక్కుకుంటూ ప్లేటు సింకులో పడెయ్యటం .....అమ్మొచ్చి అది చూడటం...అరవటం, ఓ నాప్కిన్నివ్వటం, దాని చేతే ఎత్తించటం, తుడిపించటం.....ఇది లబోదిబోమనటం....

ఐస్ క్రీం : నాన్నా స్ట్రా బెర్రీ ఐస్ క్రీం కావాలి అని అడిగి, ఒక స్కూపు చాలంటే వినకుండా రెండు స్కూపులేయించుకుని, వంకరగా పట్టుకోటంతో షాపు బయటికి కూడా రాకుండానే పైనున్న స్కూపు కింద పడిపోతే ఏడుపు మొహమేసుకుని నాన్నా అనటం.....సరే కిందటిసారి అలాగయ్యింది కదాని ఈ సారి ఒక స్కూపే వేయించుకుని జాగ్రత్తగా షాపు బయటకొచ్చి కారెక్కి, ఆ కోను కిందభాగం కొరకటం మొదలుపెట్టి ఆ చిల్లులోంచి జారే ఐస్క్రీం జుర్రి, ఓ రెండు నిముషాలు కాంగానే ఐస్క్రీం ధార ఎక్కువ కావటంతో మూతి ముక్కు అంతా చేసుకుని క్లాత్ సీట్లున్న కారులో, ఆ సీటుమీద నాన్న చూడకుండా పెట్టేసి, చేతులు కారు సీటుకు పూసి బంక వదిలించుకుని, మూతి ముక్కు అంతా గవునుకు పట్టించి కాం గా కూర్చోటం....

అయ్యా ఇలా బోల్డంత లిష్టుంది.....పిల్లల్ని పెంచటమంటే మాటలా.....

ఈ పిల్లది ఎవరో అనుకునేరు - మాదే - వైష్ణవి ... :)

4 comments:

 1. మా అమ్మాయి చిన్నతనం గుర్తుకు వచ్చింది. గారెలు వేస్తే , వాటిని విష్ణు చక్రంలా తిప్పుతూ గంటలు, గంటలు ఆడటం...ఇవన్నీ ఇప్పుడు చాలా గుర్తుకు వస్తాయి.అప్పటిలో నేను కూడా కార్పెట్ పాడైపోతుందనో, గంటలు, గంటలు ఆడకుండా తొందరగా తినమనో చాలా కోప్పడేదాన్ని.ఎంత చెప్పినా గోడల మీద గీతలు గీసేయ్యడం , అన్ని ఇప్పుడు జ్ఞాపకాలే!ఇప్పుడు enjoy చెయ్యండి తన చిలిపి పనులన్నీ, చూస్తుండగానే ఎదిగిపోతారు.

  ReplyDelete
 2. antha bagane undi kaani vo photo pettochukada aa gaduggayi allari choopisthoo...

  ReplyDelete
  Replies
  1. తెలుగుకళ - నా కుటుంబాన్ని కానీ, కుటుంబసభ్యుల్ని కానీ "రోడ్డున" పడేసుకున్నట్టు "బ్లాగులో" పడెయ్యటం ఇష్టం లేదండి...

   Delete