Friday, May 18, 2012

శ్రీ నండూరి రామమోహన్ - బాలగేయాలు (1948 ప్రతి నుండి)

శ్రీ నండూరి రామమోహన్ - బాలగేయాలు (1948 ప్రతి నుండి)

*****************************************************

చందమామా రావె జాబిల్లి రావె
మబ్బులెక్కీరావె మా యింటికేసి

సన్నజాజీపూలు సంపంగిపూలు
ఒడినిండ కోసుకుని ఒయ్యారమొలుక
మాయింటికడ కొచ్చి మాపాపకీవె

గయ్యాళి పాపనీ ఉయ్యాల వూపి
లాలించి హాయిగా జోలల్లు పాడి
కళ్లలో తీయనీ కల లల్లిపోవె

నింగినీలమునుంచి తొంగిచూస్తావు
మబ్బులోపల దూరి మాయమౌతావు
పట్టుకొందామంటె పారిపోతావు

చందమామా రావె జాబిల్లి రావె
మబ్బులెక్కీరావె మా యింటికేసి


*********************************



ఉయ్యాల జంపాల
ఊపవే ఓ అమ్మ
కథవొకటి చెప్పవే
కలగంటు పడుకొందు....ఉయ్యాల...

కథలోని ఆ రాజు
కలలోకి వస్తేను
వేటకై నేగూడ
వెడతానె ఓ అమ్మ....ఉయ్యాల....


కీలుగుఱ్ఱం ఎక్కి
ఛల్ ఛల్లు మంటాను
ఏడుకొండలు దాటి
ఏడునదులూ దాటి
రంగూల మేడలో
రాక్షసిని చంపెసి
చెరలోని కన్నెనీ
చెరనుండి విడిపింతు....ఉయ్యాల.....

జోకొడుతు చెప్పవే
ఊ కొడుతు కలగందు....ఉయ్యాల.....



*********************************




వానాలు కురవాలి
వరిచేలు పండాలి
తెల్లాటి మబ్బులూ
నల్లంగ మారాలి
మూడు దుక్కులవాన
ముసురుగా రావాలి.....వానాలు.....

ఏపుగా చేలలో
ఎదగాలి మాపైరు
బారెడెత్తున కంకి
బంగారు పండాలి ....వానాలు....


కోయాలి పంటలూ
వేయాలి కుప్పలూ
పదిపుట్ల గింజలూ
పాలేరు తేవాలి
మా గాదె నింపాలి
మా దాసి దంపాలి
మా బొజ్జ నిండాలి ....వానాలు....


*****************************

No comments:

Post a Comment