Monday, April 23, 2012

బాలప్రభ - రథోత్సవం - రచన: మధురవాణి

బాలప్రభ - రథోత్సవం
రచన: మధురవాణి 
1958 ఆంధ్రప్రభ పత్రిక నుండి

బ్లాగరు మధురవాణనుకున్నారా?
అనుకున్నా! నేననుకున్నా.....ఆవిడకు 54 ఏళ్ళైతే - ఆవిడే ఈవిడ... :)



****************

గణ గణ గణ మని గంటలు మ్రోగగ
ధణ ధణ ధణ మని ఢంకా మ్రోగగ
రథమాదారిని సాగిందీ
కడు శీఘ్రముగా కదిలిందీ
రంగుల రంగుల దీపాలెన్నో
హంగులు మీరగ వెలిగాయి
పిన్నల పెద్దల మొగాలపై, బల్
సంతోషాల్ చెలరేగాయి
పిన్న, పెద్దా భేదాల్ మాని,
అంతా, అక్కడ చేరారు

ఇంతటి యుత్సవ మెన్నడు లేదని
యెంతగనో కొనియాడారు
ప్రభువులు సైతం వేడుక చూడగ
పరివారముతో సాగారు
వింతల జూచుచు కొంత వడికి వా
రెందుకో, వొకచో నాగారు

చేరువలోనే పనిలో మునిగిన
చెంగని గని, ప్రభువన్నాడు

పండుగనాడును పాపం చెంగడు
పనితీరిక లేకున్నాడే?

అన విని, వేగమె అమాత్యుడంతట
చెంగనితో, నిటు జెప్పాడు

ప్రజలెల్లరు నటు దేవుని జూడగ
పరుగులు దీయుచు నున్నారే?
పని, యెప్పుడునూ వుండేదే గద
పోవక యిచటనె యున్నావేం?

అనగా చెంగడు మంత్రిగారితో
అన్నడెంతో వినయముగా

ఱెక్కాడనిచో డొక్కాడదు గద
దిక్కు, అదే గద మాకూ?
దేవుని జూడగ బోవుట యెట్టులు?
వారె వత్తురిటు బాబూ!

మంత్రిగారెంతో అబ్బురమొంది
మళ్ళీ యిటు లడిగారు

ప్రభువులు సైతం భక్తి ప్రపత్తుల,
దేవుని జూడగ బోవగను
నీ కొఱకై ఆ దేవుండే, యిటు
వచ్చు ననెదవే అది యెట్లు?

అని యడిగిన యా మంత్రిగారితో
అనెనా చెంగడు నమ్రతతో

అన్నిటి దెలిసిన మీరే యిట్టులు
అడిగితిరే యిది యేమీ
పేదల యిండ్లకు దేవుడు రాక
యింకెవ రొత్తురు స్వామీ?

1 comment:

  1. ఇప్పుడే ఒక ఫ్రెండ్ చెప్తే వచ్చా.. వంశీ గారండోయ్.. హిహ్హిహ్హీ.. ఈ మధురవాణి నేను కాదుగా.. ;-)

    ReplyDelete