Wednesday, February 29, 2012

ఈ పెళ్ళి పత్రిక్కి 45 యేళ్ళు......

ఈ పెళ్ళి పత్రిక్కి 45 యేళ్ళు......

శిధిలావస్థలో ఉంటే టేపెట్టి అతికించి, లామినేట్ చేయించేసా....ఇహ ఎన్నేళ్ళైనా తిరుగులేదయ్యా....

అవును - మా అమ్మా నాన్నల పెళ్ళిపత్రిక ఇది

మా ముత్తాత - శ్రీరాములుగారు మన ఇంటిపేరు "కాశీభట్ట" రా, వాడెవడో గవర్నమెంటు రికార్డుల్లో "కాశీభట్ల" అని ఎక్కించేస్తే మీరూ నోరుమూసుకుని కూర్చుంటారేమిరా? నా ఆరోగ్యమే బాగుంటే ఈ పొన్నుకర్రతో ఆ మార్చిన వాడి నడ్డి విరగకొట్టేవాడిని అని ఎప్పుడూ మా తాతగారిని అందరిముందూ కబడ్డీ ఆడుకునేవారుట....

అయినా ఏం లాభం - "భట్ట" కాస్తా "భట్ల" గానే మిగిలిపోయింది  .. :)

47 యేళ్ళ క్రితం పావర్టీ సెర్టిఫికెట్టు.....ఒంటి మీద వెంట్రుకలన్నీ లేచి నిలబడ్డాయి నమ్మూ నమ్మకపో!

47 యేళ్ళ క్రితం పావర్టీ సెర్టిఫికెట్టు.....

అప్పట్లో మా తాతయ్యకు (అమ్మ వాళ్ళ నాన్న) మోపిదేవి గుళ్ళో సంవత్సరానికి 400 ఇచ్చేవారు....అంటే నెలకు 33 రూపాయలన్నమాట...ఆ 33 రూపాయల్లోనే, 9 మంది పిల్లలు, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య గారి నాన్న, అమ్మ, మా తాతయ్యగారి కుటుంబం పోషిస్తూ వచ్చిన 6 గురు బీద చుట్టాలు , మొత్తంగా 19 మందికి కూడూ, గుడ్డ, కొంప గోడూ అన్ని సరిపెట్టేవాడు తాతయ్య.....అంతమంది తలకాయనొప్పులు ఒక్కడే ఎప్పుడూ నవ్వుతూ, మొహం మీద నవ్వు చెరగకుండా ఎలా భరించుకొచ్చాడో అనీ నాకు ఇప్పటికీ విపరీతమైన ఆశ్చర్యంగా ఉంటుంది......

నేను కొంచెం పెద్దయాక, ఏం తాతయ్యా ఎలా నడుపుకొచ్చేవాడివి ఇంతలో అంటే, ఈ 33 రూపాయల్లో అంటే - "మనం చెయ్యగలిగింది మనం చెయ్యటమేరా, మిగిలింది ఏదైనా ఆ భగవంతుడే, ఆ సుబ్రహ్మణ్యస్వామే చూసుకునేవాడు" అని అన్నాడు....ఇప్పుడు ఇది రాస్తుంటే ఒంటి మీద వెంట్రుకలన్నీ లేచి నిలబడ్డాయి నమ్మూ నమ్మకపో!

ఈ సర్టిఫికెట్ దేనికి తీసుకోవాల్సి వచ్చిందో తెలియదు అని అమ్మ చెప్పింది....

అసలు నీకిది ఎక్కడ దొరికిందని అడుగుతున్నారా?

చెప్పాగా అన్నీ దాచిపెట్టే అలవాటున్నదని....అలా అమ్మమ్మ దగ్గరినుంచి అల్లప్పుడెప్పుడో ఎత్తుకొచ్చింది...ఇప్పుడు ఇలా ఈ రూపంలో....

42 యేళ్ళ క్రితం ఆంధ్రా బాంకు వారి కిడ్డీ బాంకులు ఎలాగుండేవి?

నేను పుట్టినప్పుడు, మా తమ్ముడు పుట్టినప్పుడు మా నాన్నగారు - హైదరాబాదు అశోక్ నగర్లోని ఆంధ్రా బాంకులో మా పేర్ల మీద చెరొక అక్కవుంటు ఆరంభించినదుకు గానూ, బాంకు వారు ఇచ్చిన కిడ్డీ బాంకు బొమ్మలు.....ఒక దానికి 43 నడుస్తున్నది, ఒక దానికి 40......అదేనండీ - వయసు

శారదా ప్లాస్టిక్స్ వారి తయారీ.....కిడ్డీ బాంకు ఎలా ఓపెను చెయ్యాలా?  ఇదిగో....ఇప్పుడో ప్రశ్న - ఈ బొమ్మల్లోంచి డబ్బులు తీసి బాంకులో జమ చెయ్యాలంటే - ఒక దానికి సెక్యూరిటీ కోడ్ పైనున్న ఒక బొమ్మలో ఉన్నది.... రెండో దాని సెక్యూరిటీ కోడ్ మీలో ఎవరన్నా చెప్పగలరా? :) చాలా చింపులయ్యా....అది కూడా చెప్పలేకపోతే ఈ పోష్టు చదివి దండగే!

చెప్పలేని వారికి కవచమున్న వీపు చూపించేస్తున్నా!


Tuesday, February 28, 2012

లెక్కలొచ్చా నీకు?

The sole "prize" book hanging in there from academia kindergarten to 5th grade...

Others are with a mysterious paper vendor! lol...

Mom says - One old books box got sold to a paper vendor and those might be in that box...Oh well...at least this one out of the six books survived... 


లెక్కలొచ్చా నీకు? Why six books? If it's from L K G to 5th - They should be 7 right? 

Yeah - That's a good question - There was no book prize for L.K.G...It was a drawing set with pencils and a painting book. That one is gone too!
Proof is here:

BTW - If you are thinking why am I posting all these things in the blog, here is the answer - Hopefully these treasures will lead me to another treasure - Long Lost Friends....May be Or May be not.... But it's out there - and hopefully some day, some one will find it and will establish the contact.....And of course - for some sonta DabbA too... :)

Monday, February 27, 2012

ఆ సంగతి ఇప్పుడు తెలిసిందా ఏం?

అమ్మమ్మగారి ఊరు చల్లపల్లిలో అల్లప్పుడెప్పుడో ఉన్న ఒకే ఒక ఫుటో స్టూడియో - చుట్టూ ఉన్న నలభై మైళ్ళకు ఒకే ఒక్క ఫుటో స్టూడియో - అదే, అదే - కృష్ణాజిల్లాలోని వరల్డ్ ఫేమస్ శ్రీనివాసా ఫోటో స్టూడియోలో అల్లప్పుడెప్పుడోనే, అనగా నాలుగు దశాబ్దాల క్రితం పైమాటేనన్నమాట .......

అప్పుడు తీయించుకున్న ఫుటో ఇదిగోనయ్యా! 

హబ్బా! ఎంత సుందరాంగుడివిరా నాయనా!

ఆ సంగతి ఇప్పుడు తెలిసిందా ఏం? లేకుంటే ఎక్కడన్నా కాలిందా?

ఈ ఫుటో ఎనకాతల ఉన్న వివరాలు కూడా చూసి సంతోషించండే!

చీరలు బాబూ చీరలు!!

చీరలు బాబూ చీరలు - అద్దకం ఎలా చేస్తున్నారో చూడండి

ఎక్కడా? మా ఇంటి వెనకాతలే!

మీ ఇల్లంటే? ఎక్కడ బాబూ ?

గాంధీ నగర్, హైదరాబాదులోనయ్యా ...

మా డాబా మీదికెక్కి చూస్తూంటే, వీళ్ళు కనపడగానే ఫోటోలు తీసుకొచ్చా!ఇంతకుముందు ఎవడికీ కనపడకుండా, కింద గదుల్లో చేసేవారుట...ఇప్పుడు స్థలం సరిపోవట్లేదని పైకొచ్చేసి నా చేతికి చిక్కారు...

ఆ తర్వాత వాళ్ళ దగ్గరకెళ్ళి, వివరాలు అవీ అడిగి ఓ వీడియో తీసుకునొచ్చా! పేద్ద ఫైలయ్యిందయ్యోయ్...నెమ్మదిగా ఫ్లాషులోకి కన్వర్టు చేసి "ప్రజల సౌకర్యార్థం" సైటులో పెట్టాలి....

Friday, February 24, 2012

అందరూ గుజరాత్ వెళ్ళిపోండిరా! బాగుపడతారు

అందరూ గుజరాత్ వెళ్ళిపోండిరా! బాగుపడతారు....న్యూస్ పంచుకున్న ఉష గారికి (రేడియో అక్కయ్య శ్రీమతి తురగా జానకీ రాణి గారి అమ్మాయి) ధన్యవాదాలతో

నర్మదా నది (బ్రాంచ్ కెనాల్) మీద 100 కి.మి సోలార్ పానెల్స్ వేసి అటు నీరు ఆవిరైపోకుండానూ, ఇటు విద్యుత్ ఉత్పత్తి సాధిస్తూనూ....వాహ్ మోడీ వాహ్! నాయకులంటే నీవంటి వారే!

ఇందులో కూడా మింగితే మింగుండొచ్చుగాక, జనాలకు ఉపయోగపడే పని ఇలాటిది ఒక్కటన్నా చెయ్యని మా ప్రభుత్వాలను, మా రాజకీయనాయకులను చూసి ఎంత సిగ్గుపడుతున్నామో నీకు తెలియదులే!

Thursday, February 23, 2012

భువనవిజయంలో - ఇనప కుర్చీలే సింహాసనాలు, చెక్కబల్లలే కవిపీఠాలు!!

ఐదో తరగతిలో ఉండగా జరిగిన స్కూల్ వార్షికోత్సవాల్లో భాగంగా వేసిన స్కిట్ - "భువనవిజయం" లో ఈ ముక్కుతిమ్మన ఎవరయ్యా బాబూ? ముక్కు లేని వాడిని ముక్కు తిమ్మన చేస్తే ఎలాగండీ?

అయ్యా - ఆ ముక్కు తిమ్మన నేనే....

ఇనప కుర్చీలే సింహాసనాలు, చెక్కబల్లలే కవిపీఠాలు....

32 యేళ్ళ క్రితం సంగతి....అప్పుడంతే, అప్పుడంతే

ఎక్కడున్నావ్ ఇంతకీ?

ఆ రెండో ఫోటోలో కుడివైపు కూర్చున్న వారిలో - ఇద్దరిలో ఇటువైపునుంచి మొదటివాడినయ్యా....

మొదటి ఫోటోలో మీరే పట్టుకోవాలిఆ సౌందర్యవతిని - ఈ పాతికేళ్ళూ చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వస్తిని!!

1976లో పావలా అంటే యమహో నీ యమా యమా అన్నమాట.....

నెలవారీ నాన్నగారిచ్చే రూపాయి - పాకెట్ మనీ కోసం ఇరవై తొమ్మిది రోజులు వెయిట్ చేసీ చేసీ చేసీ, చేతిలో ఉన్న నాలుగు పావలాలు, వారానికొక్కటి చొప్పున చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ యమా యమాగా గడుపుతున్న కాలంలో "గురుపూజ" / "గురుపూజోత్సవ దినము" వచ్చెను....

దానికి ("గురుపూజ" / "గురుపూజోత్సవ దినము") - హైదరాబాదు అశోక్ నగరులోని లక్ష్మీ చిల్డ్రెన్స్ స్కూల్ - నాకు విద్యాబుద్ధులు నేర్పిన, నాకు బాగా ఇష్టమైన స్కూలు వారు పావలా అడిగితిరి....

దానకర్ణుని వలె ఉన్న నాలుగు "పావలా" కుండలాల్లో ఒకటి దానమిచ్చితిని....

అప్పుడు వారు ఈ రసీదు లాటి అపురూప సౌందర్యవతిని చేతిలో పెట్టితిరి.....

ఆ సౌందర్యవతిని  ఈ పాతికేళ్ళూ చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వస్తిని.....(పైసకు ఒక సంవత్సరము చొప్పున ఋణానుబంధము విపరీతముగా బలపడినది)...

ఇప్పుడు అవకాశము వచ్చెను కదాయని కెమెరాలో బంధించితిని....

ఇక్కడ వేస్తిని....

Tuesday, February 21, 2012

ఆరు లక్షల స్టాంపులకు, ఫస్ట్ డే కవర్లకు ప్రేరణ ఇదిగో - ఇవే!

నా దగ్గరున్న, అక్కడ అమెరికాలో మా రామారావు దగ్గరున్న లాకర్లో ఆనందంతో ఈలలు వేస్తున్న  దాదాపు ఆరు లక్షల స్టాంపులకు, ఫస్ట్ డే కవర్లకు ప్రేరణ ఇదిగో - ఇవే!

ఏం గర్వం! ఏం గర్వం! ఎప్పుడు చూసినా అలా డబ్బా కొట్టుకోందే సంతోషంగా ఉండదా నీకు?

మా బా అడిగావే! ఇన్నేళ్ళ తర్వాత అలాటి కొచ్చెనేసావంటే, ఇహ చెప్పనక్కరలా!

అది సరే కానీ - మా నాన్నగారి వద్ద ఉన్న కవర్ల కట్టల్లో కొన్ని ....(from 1976 series)


 PS: For the old STAMPS post check here

 Or copy paste the following into browser address bar

http://janatenugu.blogspot.in/2011/02/blog-post_14.html

Sunday, February 19, 2012

వీళ్ళతో మాట్లాడడమే ఓ ఎడ్యుకేషన్.....ఎన్ని సంగతులు, ఎన్ని సంఘటనలు, ఎన్ని కబుర్లు!!

వీళ్ళతో మాట్లాడడమే ఓ ఎడ్యుకేషన్.....ఎన్ని సంగతులు, ఎన్ని సంఘటనలు, ఎన్ని కబుర్లు - ఈ రోజు ధన్యం....

ఒకటా రెండా? దాదాపు ఆరు గంటలు....అహా! ...అడగగానే కాదనకుండా ఎంతో విలువైన తమ సమయం వెచ్చించి, తెలియని ఎన్నో ఎన్నెన్నో విషయాలను తెలుసుకునే అవకాశం కల్పించిన ఈ ముగ్గురికీ సహస్ర ధన్యవాదాలతో

ఎవరా వీరు?

తెలియనివారికి -

శ్రీ కొడవటిగంటి రోహిణీ ప్రసాద్, శ్రీ కె.బి.గోపాలం. శ్రీ సుధామ....

Wednesday, February 15, 2012

దాదాపు 48 వేల పుస్తకాల లిష్టు!!

డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీ - నిజామాబాద్ వారి వద్ద ఉన్న దాదాపు 48 వేల పుస్తకాల లిష్టు...

దేనికోసమో వెతుకుతుంటే ఇది కనపడింది....

ఎవరికన్నా ఉపయోగపడుతుందేమోనని ఈ టపా వేసా!

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్

PS: It's about 2115 Pages and close to 4 MB

కరుణశ్రీ గారి పాత పుస్తకాలు కొన్ని!

కరుణశ్రీ గారి పాత పుస్తకాలు కొన్ని!

మా నాన్నగారి లైబ్రరీ నుంచి...

వీటిల్లోనుంచి - "కన్నెపాటలు" నాలుగైదేళ్ళ క్రితం వెబ్సైటులోకెక్కించటం జరిగింది

బొమ్మలు పెట్టావు...బానే ఉంది...ఇవన్నీ చదివావా అని అడుగుతున్నారా?

సుబ్బరంగా! ఎప్పుడో చదివేసినవే.....

ఓ! నా దగ్గర ఇన్ని ఉన్నాయహో అని ఊరకే "షో" చేద్దామని బొమ్మలు ఇక్కడేసా!

అదయ్యా సంగతి సుబ్బారావు...

Tuesday, February 14, 2012

పెద్దాయన నన్నయను వదిలేసి తిక్కనామాత్యుల వారి "పర్వాలు" చదువుతుంటే??

అల్లప్పుడెప్పుడో తి.తి.దే వారు - బోల్డంత పుణ్యకార్యం తలపెట్టి - ప్రచురించిన కవిత్రయ విరచిత "ఆంధ్రమహాభారతం" పుస్తకాలు ఇన్నాళ్ళకి, సుమారు నాలుగేళ్ళ తర్వాత నా చేతిలో పడ్డాయబ్బాయి....

పెద్దాయన నన్నయను వదిలేసి తిక్కనామాత్యుల వారి "పర్వాలు" చదువుతుంటే కలిగిన ఆనందం ఏమని చెప్పేది?

అన్నీ పది రూపాయలే !! - శ్రీపాద, చింతా.......

అన్నీ పది రూపాయలే

శ్రీపాదవారి నాటకాలు, రూపికలు = 10 రూపాయలు
చింతాదీక్షితుల వారి అమ్మణ్ణి = 10 రూపాయలు
చింతాదీక్షితుల వారి లీలాసుందరి = 10 రూపాయలు

అలా...అలా....మరికొన్ని....

నీకు ఆ భాషొచ్చా? అవును అబ్బాయ్...ఇరగతీతే........!!

1999 ప్రాంతంలో మా కంపినీ వాడు ఒహ ఫ్రెంచి ప్రాజెక్టు ఎత్తుకురాగా, ఆ మాయొక్క కుంఫిణీలో ఉన్నవారిలో భాషా కోవిదులం మనమే కాబట్టి (డబ్బా! సొంత డబ్బా! గులకరాళ్ళ డబ్బా!) నన్నూ , ఇంకొహ ముగ్గురినీ కలిపి అందులో తోసి తలుపు ముయ్యగా ముక్కు మూసుకుని చేస్తిమి....

నీకు ఆ భాషొచ్చా? అవును అబ్బాయ్...ఇరగతీతే........

ఒకప్పుడు ఆ బిర్లా ప్లానెటేరియం పక్కనున్న ఫ్రెంచి విద్యాలయంలో ఆ సుందర భాష నేర్చుకున్న పోతుబిడ్డలం....సరే లెండి....ఆ భాష నేర్చుకునేప్పుడు పడ్డ పాట్లు - మా జాన్ పియెర్ పాగ్లియానో , సునీల్ పోలమూరి గార్లకే తెలుసు....

ఆ భాష నేర్చుకునేప్పుడు కూడా ఓ ప్రాజెక్టు చేస్తిమి...

వదీ విప్పుడు మీరు సూడబోతున్నారన్నమాట....ఆనందో బ్రహ్మ! 
సూటూ బోడ్గా బట్ టెంగ్రీ టెమూజిన్ ఖాఖాన్ - కెమెరాకు చిక్కిన విధంబెట్టిదనిన?