Wednesday, November 9, 2011

త్రీ ఛీర్స్ టు శ్రీశ్రీ - దాశరథి

త్రీ ఛీర్స్ టు శ్రీశ్రీ
-- దాశరథి

మా తరానికి గురువు శ్రీశ్రీ
మా కలానికి బలము శ్రీశ్రీ

తెల్లని చల్లని మల్లెలతో తృప్తి పడడు శ్రీశ్రీ
జ్వాలలతో మాలలల్లి
జగతి హిమగళాన వేసి
జాగరితం చేస్తాడు శ్రీశ్రీ
శ్రమికజాతి తిరుగుబాటు శ్రీశ్రీ
నిజమైన ప్రబలవోటు శ్రీశ్రీ

పేదల ఆవేశం
విప్లవ పాలాశం
కవితా జలపాతం
నవతా కలగీతం - శ్రీశ్రీ

శ్రీశ్రీ మానాల్కలపై మంత్రం
శ్రీశ్రీ అగ్నిగీత మాలపించు జంత్రం
కృత్రిమ మెరుగనివాడు
కుట్రలు తెలియనివాడు
ద్వేషం రోషం కావేషం
భేషజన్మ్ లేనివాడు
పతితులకై భ్రష్టులకై
పదం పాడినాడు
కర్షకులకు జలధరమి
వర్షించినాడు
చెత్త దారి విడిచినాడు
కొత్తదారి నడిచినాడు
విప్లవ కవితారీతుల
విత్తనాలు నాటినాడు

అతడు మా పతాక
అతడు మా ప్రతీక
కల్లోలిత హృదయోద్గత
కావ్యాలకు టీక

చందమామలో మచ్చలు
చాలా వున్నాయిగాని
మా శ్రీశ్రీ మనస్సులో
మచ్చలేదు చిచ్చుతప్ప
అమృతమయుడు శ్రీశ్రీ
అమాయకుడు శ్రీశ్రీ
స్నేహశీలి శ్రీశ్రీ
దయాశీలి శ్రీశ్రీ

ఇరువదవ శతాబ్దము
ఇచ్చిన గొప్పవరము శ్రీశ్రీ
సమసమాజ నవసరోజ
పరీమళము శ్రీశ్రీ
త్రీ ఛీర్స్ టు శ్రీశ్రీ
ప్రగతి పత్రిక - శ్రీశ్రీ షష్ట్యబ్ద సంచిక - Feb 6, 1970 నుండి
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

3 comments:

 1. అద్భుతమైన గీతాన్ని అందించారు.
  కృతజ్ఞతాభినందనలు.
  ఎప్పుడో చదివాను. మొదటి రెండు చరణాలు తప్ప మరేమీ గుర్తులేదు.
  ఎంత ప్రయత్నించినా దొరకలేదు. చాలా సంతోషంగా వుంది.

  దాశరధి గుండె లోతుల్లోంచి వచ్చిన అక్షరాలు.
  శ్రీ శ్రీ మీదున్న వల్లమాలిన అభిమానంతో పొంగి పొర్లిన పదాలు.

  కానీ ఆ తదనంతర కాలంలో ఇద్దరి మధ్య ఎందువల్లో స్నేహం చెడి శత్రుత్వం పెరిగి ఇదే దాశరధి -
  "ఒరే శ్రీ శ్రీ ని నీ మహా ప్రస్థానం నీ పాలిటి మహా శ్మశానం "
  అంటూ తిట్టు కవిత కూడా రాసారు.
  అదీ ఎక్కడా దొరకడం లేదు. (అవసరం అని కాదు)
  జరిగిన చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు కదా.

  ReplyDelete
 2. మొదట్లో సఖ్యంగా ఉన్నా తర్వాత యీ ఇద్దరు కవులూ సభ్యత పాటించకుండా తిట్టుకొన్నారు.శ్రీశ్రీ 'సిప్రాలీ చదువితే తెలుస్తుంది.

  ReplyDelete
 3. @ ప్రభాకర్ - దాశరథి గారివి మరిన్ని ఉన్నాయి....తీరికగా ఒకటొకటి....త్వరలోనేలెండి.... :)

  ఇక్కడో మాట చెప్పాలనిపించి --

  తిట్టుకున్నా, కొట్టుకున్నా - సమవుజ్జీలే.....ఆ సాహితీ మేరువులు, మదగజాల, సరస్వతీపుత్రుల మధ్యకు అల్పులమైన మనం పోతే నుగ్గైపోటమే! ఆ జ్ఞానం మనకుంటే ఒకళ్ళను పొగడమూ, ఒకళ్ళను తెగడమూ!!

  మన దరిద్రపు పాఠకుల్లో చాలామందికి ఉన్న అలవాటేమంటే - సపోసు ఫర్ సపోసు - శ్రీశ్రీ గారి రచనలో, ఆయనో నచ్చనివాడు ఉన్నాడనుకుందాం..వీడు ఏదో ఒహ అవకాశం కోసం గోతి కాడ నక్కలా కాచుక్కూర్చుని ఉంటాడు...మన ఖర్మ కాలి అవకాశం దొరికిందే అనుకుందాం - అనగా, సాహితీలోకంలో ఇంకెవరన్నా శ్రీశ్రీని ఓ మాట అన్నారనుకోండి , సందర్భమేదైనా కానివ్వండి, ఆ మాట అన్నవారి ఉద్దేశం తప్పుడుది కాకపోయినా కానివ్వండి - వీడికి అసలు సంగతి అర్థం అయినా అవకపోయినా - ఒంటిమీదున్న గుడ్డలెత్తుకుని, అవకాశం దొరికింది కదాని తన నగ్న రూపాన్ని ప్రజల్లోకి వదులుతాడు... ఒకవేళ ఈ సిగ్గూ లజ్జాలేని నగ్న స్వరూపుడికి వత్తాసుగా భజనపరులు ఉన్నారనుకో, ఇహ చెప్పనక్కరలా ఆ బాజా భజంత్రీల గోల.

  కళ్ళున్నవారు చూడలేరు ఆ వలువలు విలువలు లేని "నర్తన"శాల.వాళ్ళ గుడ్డలే కాక, ఇవతల నిలబడి చోద్యం చూస్తున్న మూర్ఖుల గుడ్డలు కూడా పీకి పాకాన పెడదామని చూస్తారన్నమాట.

  శ్రీశ్రీ గారి స్థానంలో దాశరథి గారున్నా అదే పరిస్థితి....తేడా ఏమీ లేదు....అదీ దురవస్థ....ఎప్పటికి తెలుసుకుంటారో - పిచ్చ ము.కొ

  ReplyDelete