Thursday, November 17, 2011

ఇవి చిరంజీవి పాటలుట. ఎప్పుడన్నా విన్నావా?

నాయనా - ఇవి చిరంజీవి పాటలుట. ఎప్పుడన్నా విన్నావా? చదివావా?

ఇవేమి పాటలో / గేయాలో, పుట్టుపూర్వోత్తరాలేమన్నా తెలిస్తే వివరించండి స్వాములూ. ఊరు పేరు లేదు, ఒక్క చిరంజీవి పాటలు అన్న పేరు తప్ప. 

దారుణంగా ఉన్నాయి - విశ్వనాధ అధ్యక్షులుగా ఉన్న పత్రికలో ఇలాటి పాటలెలా ప్రచురించబడ్డాయో తెలియరాలేదు.....

ఇప్పుడే అనుకుంటే  అప్పుడు కూడా ఉన్నయ్యన్నమాట, ఇలాటివి...హర హర మహాదేవా!జై చిరంజీవ!


****************************************


చిరంజీవి పాటలు

- గేయాలు
(ప్రతిభ పత్రిక, 1941)


1.

పాత పాటే
పాడుకోనా
నీ తలంపే
వీడుకోనా ||

గొంతులోనే
కూలిపోనా
గుండెలోనే
మండిపోనా || ,, ||


నీటిలోనీ
నీడలోనే
మేడచేసీ
ఆడుకోనా  || ,, ||


2.

కొండమీదే
వుండి నవ్వే
చిన్ని చుక్కా
చెప్పవా నా
కెవరవో నీ
వెవరవో ||

చీకటంతా
చీల్చిపాడే
చిన్నిగొంతా
చెప్పవా నా
కెవరవో నీ
వెవరవో  ||


వాసనలతో
వచ్చిపిలిచే
చిన్నిపూవా
చెప్పవా నా
కెవరవో నీ
వెవరవో  ||


3.

నిదుర బరువులు నన్ను
వదులుటేనాడో
నీవు నామ్రోలనే
నిలుచుటేనాడో ||

కొండపై సూరేడు
కొలువు తీరిచెనంట
కొలనులోపల తామ
రలు పూచెనంట  || ,, ||


పగలుపోయెను రేయి
వచ్చినది యన్నారు
రేయిం బవలు లేక
రీతియే నాకు     || ,, ||

కనులనిండా నాకు
కారుచీకటులేన
నీవె చీకటివోలె
నిలిచినావేమొ    || ,, ||


4.

అతడు -

బంగారు సంకెళ్ల
బందీని నేను

ఆమె -

బంది గొంతుకలోని
పైడిగంటను నేను


అతడు -

పైడిసంకెలమ్రోత


ఆమె -

పైడిగంటలమ్రోత


అతడు - ఆమె

తాండవేశ్వరపాద
తాళనాదమ్ములో


అతడు -

కరిగిపోయేనా


ఆమె -

కలిసి బ్రతికేనా
5.

నీవు లేవని యందునా
నాతోటి
రావులె మ్మనుకొందునా  ||

నాచుట్టు నానీడలే
నవ్వుతూ
నడువ వేమని యడిగితే  ||,,||

దిక్కులన్నీ జాలిగా
ఒక్కతెవె
ఎక్కడికి పోదువంటే     ||,,||

మొండిరాయై గుళ్లలో
నీస్వామి
వుండెనని లోక మంటే    ||,,||6.

నాకు భయమేస్తోందినాన్నా
ఏదో
నల్లనల్లని నీడ
నావైపు నడిచింది
నాకు భయమేస్తోందినాన్నా ||


నాచేయి వదలకే నాన్నా
నువ్వు
నాచేయి వదిలితే
నడిచివస్తదినీడ
నాచేయి వదలకే నాన్నా ||


నన్ను చూస్తూ నడువు నాన్నా
నన్ను
నీవు చూడకపోతె
నీడలు పిలుస్తాయి
నన్ను చూస్తూ నడువు నాన్నా ||7.

న న్నెరుగరా నాకు
నేలంతకడుపు
నేలంతకడుపులో
మబ్బంత ఆకలి
మబ్బంత ఆకట్లో
మనసంత మంట
మనసంత మంటలో
మండిపోయానే
న న్నెరుగరా మీరు
న న్నెరుగరా ||8.

నన్ను పాపనుచేసి ఊపుతున్నావా?
మిన్ను కూయెలకట్టి
మన్నునూయెలచేసి
నన్ను పాపనుచేసి ఊపుతున్నావా?నన్ను నిద్దురపుచ్చి నవ్వుతున్నావా
నానిద్ర రేయిగా
నీనవ్వు పగలుగా
నన్ను నిద్దురపుచ్చి నవ్వుతున్నావా?కలలలోనే నీవు కానిపిస్తావా
నాకలలు నీడగా
నూకాంతి నీవుగా
కలలలోనే నీవు కానిపిస్తావా

12 comments:

 1. స్వామీ, ఇవి చాలా నయం.

  శ్రీ వి.వి.గిరిగారు రాష్ట్రపతిగా ఉన్నరోజుల్లో వారి సతీమణి సరస్వతిగారు పద్యాలు వ్రాసి పత్రికల్లో (కనీసం నాకు గుర్తున్నంతవరకు ఆంధ్రపత్రికలో) పకటించారు. దారుణాతిదారుణమైన అక్షరరాక్షసక్రీడ.

  శ్రీ యెర్రంశెట్టి శాయిగారి పుస్తకం 'సాహిత్య హింసావలోకనం' లో రచయితభార్య పాత్రగూడా సరస్వతిగారిలాగే కవిత్వం వెలిగిస్తుంది. ఆశ్చర్యపడి రచయిత ఇదెలాగు అంటే అవిడ జవాబు చిత్తగించండి. "పద్యాలు రాయడం చాలా తేలిక. నాలుగూ లైనులూ ఇంతింత పొడగు కరెక్టగా రాసి వాటిముందు ఉ, చ, మ, శా అని యేదో ఒక గుర్తు పెట్టాలి. చిన్న పద్యం ఒకలాంటి దానిలో పొట్టి పొడుగు లైనులు ఒకటి విడిచి ఒకటి రాసి అప్పుడు ముందు క అని గుర్తు పెట్టాలి......"

  ఇదీ సంగతి.

  ReplyDelete
 2. @శ్యామలీయం

  మీరు చెప్పిన ఉ, చ, మ, శా, క - బ్రహ్మాండం....ఉ,చ,మ,శా,క లు పెట్టలేకపోయిన అల్లాగే ఉన్నది ఈనాటి మన గోవుల, అదేనండీ (కౌ) , అనగా కవుల పరిస్థితి...

  ఏది "ఉ" నో, ఏది "చ" నో తెలీక ఒకడు, "ఉ" "చ" కలిపి ఒకడు సిగ్గూ లజ్జా లేకుండా చక్కగా పాఠకుల నట్టింట్లో విచ్చలవిడిగా పోసేస్తున్నారు......

  నాకున్న జ్ఞానానికి - పాతకాలంలో కొద్దిగా ఫరవాలేదేమో , తేడా ఉన్నదేమో అనుకున్నా....కానీ అప్పట్లో కూడా ఇలాటోరు ఉన్నారని ఇప్పుడే అర్థమయ్యింది......

  "కౌ"లు కాని కవులకు, "కౌ"లైన కవులకు - నొచ్చుకుంటే హృదయపూర్వక క్షమాపణలతో!

  ఇహ సంగతికొస్తే - ఇప్పుడే చూశానండోయ్ - ఆ పుస్తకం తిరగేస్తున్నప్పుడు అందులోనే చివరన "బాపి నాన్న" అని ఒహ శీర్షిక పెట్టి, దాని కిందే చిరంజీవి అని పేరొహటి వేసి ఇల్లాటి కవితే ఒకటి ప్రచురించబడి ఉన్నది...

  ఆ కవితలోని మాటలు, పదాలు, పద సముదాయాలు - పాఠకుల అదృష్టం కొద్దో, దురదృష్టమ్మ్ కొద్దో - అచ్చు గుద్దినట్టు ఈ "చిరంజీవి" పాటల్లానే ఉన్నాయి....తట్టుకునే శక్తి లేని నేను ఆ కవిత ఇక్కడ ప్రచురించే సాహసం చెయ్యలేను....పెద్ద మనసుతో క్షమించెయ్యాలి.....

  అయితే ఆ "బాపి నాన్న" ఎవరో తెలియరాలేదు....ఊహేమనగా ఈ బాపినాన్న - "బొడ్డు బాపిరాజు" గారన్నా అవ్వాలి, "అడివి బాపిరాజు" గారన్నా అవ్వాలి....

  రెండో ఆయన అయ్యేందుకు అవకాశం చాలా తక్కువ అని ఓ శంక.....

  మరి మొదటాయనేమో నిజంగానే పండితులు....వారికి నమోనమహలతో !! ఈ చిరంజీవి గారు పండితపుత్రులు...సరిపోయింది....వందనములు ...వందనములు....

  "మూల"శంకలో శంక తీరింది.....ఇప్పుడు ఆ "బాపి నాన్న"లో "బాపి" గారి మూలం ఏమిటో, ఎక్కడో తెలియాలి....

  ReplyDelete
 3. వంశీగారు, "....ఆ పుస్తకం తిరగేస్తున్నప్పుడు......."
  ఏ పుస్తకం అండీ? 'సాహిత్య హింసావలోకనం' ?

  ReplyDelete
 4. @ శ్యామలీయం

  సాహిత్య హింసావలోకనం కాదండీ - ఈ పైనున్న పాటలు , ఆ "బాపినాన్న" కవిత - రెండూ ప్రతిభ నవసాహిత్య పరిషత్పత్రిక, 1941 లోనివి....

  ReplyDelete
 5. మాగంటి వారికి
  ఏమిటో మీ (అప్పుడప్పుడూ నాది కూడ) చాదస్తం కానీ కవిత్వంలో అస్ఫష్ట్ట్టత ఈ నాటిది కాదని అర్ధమౌతుందా సారూ :-}

  ReplyDelete
 6. Vamsi-gaaru,

  The only Chiranjeevi we know in Telugu literary world is the late నార్ల చిరంజీవి. He did write a good bit of పిల్లల పాటలు and కథలు. And ofcourse he also wrote some good lyrics for films in 1960s. However Naarla passed away at quite young age. So, I wonder if he was the one who published in 1940s.

  Regards,
  Sreenivas

  ReplyDelete
 7. :) - అస్పష్టత అన్నది సృష్టిస్తోంది మీరు.అనగా అచ్చంగా మీరు కాదనీ, కవులనీ అర్థం చేసుకోవాలనీ విన్నపమన్నమాట.పాఠకులైన మాబోటి వారి బాధలు అర్థం చేసుకోక ఎడాపెడా కుమ్ముతున్నారు.

  తట్టుకున్నవాళ్లు తలుపులమ్మ, తట్టుకోలేనివాళ్ళు ఊపులమ్మ అని....విధి లిఖితం.

  వచన కవిత అని ఒక "జాన్ర" వచ్చినప్పటినుంచి ఈ గందర"గోళాలు" కడప బాంబుల్లా మా నెత్తిమీదేసేస్తున్నారు. "భావకవులు" కాకుంటే "వచనకవులు" అని ఒక బిరుదు తగిలించేసుకుని "మా హృదయాల్లో పాలు పొంగినాయి, దానికితోడు భావోద్రేకం హోరుగాలిలా జతకట్టడంతో మా కలాల్లోంచి ఆ రసాన్ని జారవిడిచాం, రసమో, కషాయమో మీ మీ స్థాయిని బట్టి నిర్ణయించుకోండి అంటున్నారు. సరస్వతీపుత్రులకైతే ఫరవాలా కానీ, మాబోటి సామాన్య పాఠకుడి పరిస్థితేమిటి? అలా ఉద్రేకం పట్టలేక, అదేనండీ భావోద్రేకం, మాత్రమే రాసి ఉంటే అంతటితో ఊరుకోక అవన్నీ అచ్చేయించి మా ప్రాణం తీయటమెందుకు? వాడు ఏడిచిందే కాక చుట్టుపక్కల ఉన్న పదిమందినీ ఏడవండిరా అని ప్రయత్నిచటం ఎందుకు?

  పోనీ ఏడుపును కాసేపు పక్కనపెట్టండి...ప్రేమనే తీసుకుందాం....వీడికో పిల్ల మీద ప్రేమ పుట్టిందనే అనుకుందాం. ఉద్రేకం పట్టలేని ఆ కవిగారు బోల్డు ప్రేమ గీతాలు, విరహ గీతాలు రాసాడనుకుందాం....వాడు, ఆ అమ్మాయి ఆ సంగతిని చూసుకోక మాకు వినిపిస్తే ప్రయోజనమేమిటి? మాకోసం కాదుగా, ఆ పిల్ల కోసం రాసింది ఆ పిల్లకే ఇచ్చుకో...మా నెత్తిన ఆ పితలాటకం ఎందుకు? బోల్డంత మంది ఏడుస్తూ ఉంటారు, బోల్డంత మంది ప్రేమిస్తూ ఉంటారు...వీళ్లందరిది కవితా రూపం సంతరించుకున్నదనుకోండి, ఇహ చెవులు చేటలైపోటమే....

  ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పాలనిపించి - పేరు రావాలి అన్న దుగ్ధ ఈ వచన కవితకూ, కవులకూ మూలమేమో అన్న అనుమానం అప్పుడప్పుడూ పొడసూపుతూ ఉంటుంది. మాకెందుకు బాబూ పేరు అని డొల్ల మాటలు చెబుతారు చాలా మంది కానీ, అయ్యవి మాటలు నమ్మదగ్గవా లేదా అనేది ప్రాజ్ఞులు, విజ్ఞులు, సరస్వతీపుత్రులు, కవులు చెప్పాలె. అలాగని పేరు రావాలని కోరుకోడం మంచిది కాదని నేననట్లా....తెచ్చుకున్నందుమూలాన ప్రయోజనం కవికే కానీ, మాలాటోళ్ళకు కాదుగా.... అయినా ఆ పేరు తెచ్చుకోటానికి సరుకు, సంగతి ఉండాలిగా? ఆ సరుక్కు తగ్గ పాఠకులుండాలిగా....

  మీరేచెప్పండి - ఇప్పటి కవితల్లో మచ్చుకు ఒక కవితను చూపించి, మీరే ఆ కవి హృదయాన్ని గ్రహించేసి, లేదా మాయారూపు సంతరించేసుకుని దానికో వ్యాఖ్యానం ఇచ్చి - అహా అనిపించండి.....ఎవరిచేత ఆహా అనిపించాలా? ఒకడికి అనిపించొచ్చు, ఒకడికి అనిపించకపోవచ్చు - అదీ నిజమే, పాఠకులంతా మందబుద్ధులూ, నికృష్టులూ.....

  Continued......

  ReplyDelete
 8. ఇహ మీరన్న పాతకాలం పరిస్థితి - ఇంత దారుణంగా ఉన్నదని నేననుకోటల్లా....అక్కడక్కడా చెదురుమదురుగా కనిపించినా చాలా మటుకు "కంట్రోల్" లోనే ఉండేది....ఎందుకంటే సమాజంలోని "క్రీమీలేయర్" / "ఇంటలెక్చువల్స్" ఓ బాధ్యత తీసుకుని అదుపులో పెట్టేవారు, దానికి తగ్గట్టు రాసినవాడికీ ఒక రకమైన భయం ఉండేది....ఇప్పటి "క్రీమీలేయర్" / "ఇంటలెక్చువల్స్" సంగతేమిటి? బాధ్యతా లేదు, మన్నూ మశానమూ లేదు.....

  మిమ్మల్నే తీసుకోండి...ఇది ఉదాహరణ కింద మాత్రమే - ఏదో మనసులో పెట్టుకుని రాస్తున్నాననుకోవాకండి.... మీరు ఖచ్చితంగా మనకున్న "క్రీమీలేయర్" / "ఇంటలెక్చువల్స్" లో ఒకరు.....అయితేనేమి మీ బాధ్యత మీరు నిర్వర్తించట్లేదని నేనంటా.....అనగా ఏ పిచ్చి కవితనైనా చూస్తే ఒరే ఇలాక్కాదురా, ఇలా రాస్తే బాగుంటుంది అని "గైడ్" చెయ్యటమో, ఏమిట్రా శుంఠా అని తిట్టటమో, వాతలు పెట్టటమో చేస్తే , నేర్చుకోవాలనుకున్నవాడు నేర్చుకుంటాడు....లేని వాడు శ్మశానానికి పోతాడు.....

  ఇంకో ఉదాహరణ కింద - మీ కవితల్లో 60 శాతం నాకు నచ్చవు, మిగిలిన 40 శాతంలో 20 శాతం బ్రహ్మాండం....నీకు నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏమిటి అని మీరు తిప్పేసుకు వెళ్ళిపోవచ్చు, కానీ నాలాటి వాళ్ళు బోల్డంతమంది ఉండవచ్చు (ఉండనూ పోకవచ్చు - అది వేరే సంగతి, మంచిదీనూ), వారు నాలా చెప్పలేకపోనూ వచ్చు....అది వారు చెప్పకపోటం మూలాన, మీ తప్పులు మీకు తెలియకపోవచ్చు....

  తెలియనందువల్ల, మీరు ఇంతకు ముందు రాసినవాటి మీద ఎవడూ మాట్లాడలేదు కాబట్టి అవి నచ్చినాయనే ఉద్దేశంతో, రాతలకు మెరుగు పెట్టుకోకుండా బాంబులు వేస్తూనే ఉన్నారనుకోండి - దానివల్ల ఏమవుతుందంటే మొత్తం కవిత్వం మీదే ఓ విధమైన అసహ్యం కలుగుతుంది.... అదందీ సంగతి...

  చెప్పదలచుకున్నది "అస్పష్టత" లేకుండా చెప్పగలిగాననే అనుకుంటూ...ఒకవేళ అస్పష్టంగా ఉంటే తెలియచెయ్యండి, ఇంకొద్దిగా వివరించేందుకు ప్రయత్నిస్తాను....

  ఆ అస్పష్టతకు కారణభూతులు మీరే, అనగా కవులే కాబట్టి, పరిణామాలకు కూడా మీరే బాధ్యులు... :) అది ఎప్పుడు తగ్గితే అప్పుడు చాలా మంది మనసులు శాంతిస్తాయనీ, సారస్వతానికో మేలు జరుగుతుందనీ గంట మోగించి చెబుతూ

  అలాటప్పుడు, అనగా ఆ అస్పష్టత ఉన్న లేకున్నా ఆ కవితకింద ఓ ఫుట్ నోట్సు ఇచ్చారనుకోండి, ఇంతకుముందు టపాలో చెప్పినట్టూ, మిత్రులొకాయనకు సమాధానమిచ్చినట్టూ - "సంగతి" ఉండీ లేనట్టుండే వాటితో పేచీ లేదు....సగటు పాఠకుడికి, అనగా సరస్వతీపుత్రులకు కాకుండా - కొద్దిగానైనా అర్థం అయ్యే ప్రమాదం ఉన్నది. ఆ ప్రమాదం, ప్రమోదం అయ్యేందుకు - ఖర్మ కాలి ఫుట్ నోట్సుఇస్తే , అలా ఇచ్చిన ఫుట్ నోట్సు ఉపయోగపడనూవచ్చూ, లేకపోనూవచ్చూ.... అది విధిలిఖితం......కవిగారు రాసిన "సంగతి"కీ - సగటు పాఠకుడైన నాబోటివాడికీ అర్థమయ్యే సంగతికీ ఉత్తర ధృవం, దక్షిణ ధృవం అయినప్పుడు - ఒరే దద్దమ్మా , అటేపు కాదురా ఈ ధృవం వైపు రా నువ్వు పోవాల్సింది అని దిక్సూచిగా ఉపయోగపడే సాధనమనిన్నూ, ఆ కవి యొక్క కవితా ప్రపంచంలోకి అడుగుపెట్టి - భయంతో బిగుసుకుపోటానికో, ఆనందంతో కేరింతలు కొట్టడానికో, ఎండిపోయిన గాడిబావి నిండేలా కన్నీళ్ళు కార్చటానికో, అటూ ఇటూ కాకపోతే తట్టుకోలేక తీవ్రవాదిగా మారిపోయి ఏదో ఒకటి తీసుకుని ఆ కవిని "పొడి"చెయ్యటానికో ఏ ఈ ఫుట్ నోట్సు ఉపయోగపడుతుందనిన్నూ, టపాలో చెప్పినట్టు "నచ్చితే మరింత ఆనందించటానికి, నచ్చకపోతే పక్కనపడెయ్యకుండా అర్థం చేసుకోడానికి ఉపయోగపడే పని" అనిన్నూ మరల వక్కాణిస్తూ

  ఇంతటితో స్వస్తి....

  ReplyDelete
 9. Sreenivas gaaru

  May be you are right, I don't know...

  I might be wrong - To my belief Narla and Viswanatha are opposite poles..And purely for that opposite poles reason - I will be surprised if these were written by Narla and Published in Viswanatha's patrika....

  ReplyDelete
 10. మొత్తం మీద అటుతిప్పీ ఇటుతిప్పీ బాంబులు నామీదకు విసిరారు. సర్లెండి ఎంతచెడ్డా అ/కవులేకదా లోకువ ఈ కాలమునన్
  సరళంగా ఉంటే పల్చగా ఉందంటారు.
  ఫుట్ నోట్సులుండేది అసలు కవిత్వమే కాదంటారు (చూడుడు : త్రిపురనేని శ్రీనివాస్ కవిత్వం కావాలి కవిత్వం కవిత)
  ప్రాసలెక్కువైతే వచనమై సోలిపోయాడంటారు
  గోప్యంగా చెప్పితే అస్ఫష్టంగా ఉందంటారు
  అరటిపండు వలచినట్లు చెపితే వ్యాసాలు రాసుకోపో అంటారు. (అన్నారు నా బ్లాగులో ఫార్వార్డ్ ట్రేడింగ్ పై ఓ కవిత వ్రాసినపుడు).
  పాఠకులను తక్కువ అంచనా వేయకూడదంటారు.
  చదువరి ఊహకు కొంత వదిలేయాలంటారు. (చదువరి అనగా సదరు బ్లాగరి కాదు సుమా)
  ఒకటో రెండో ఇంగ్లీషు పదాలు దొర్లితే, ఇది తెలుగు కవితా కాదా అని ప్రశ్నిస్తారు
  బరువైన పదాలు వాడితే గ్రాంధికంగా ఉందంటారు
  సామాజిక సమస్యలు చెపితే ఏదో ఓ ఇజానికి జారబడ్డారంటారు
  మానవసంబంధాలు ప్రక్రుతి గురించి వ్రాస్తే, ఇప్పుడది ఫాషన్ కాదంటారు
  అస్థిత్వ వాద కవిత్వం వ్రాస్తే వీడు కుచించుకుపోయాడ్రోయ్ అనేస్తారు
  అర్ధంకాకపోవటం కూడా ఓ అనుభూతే కనుక, అర్ధంకాని కవిత కూడా కవితే అనీ, దానికి సంబంధించి కవిత వ్రాయటం పూర్తయింది, ఇక అర్ధం చేసుకోవటం మాత్రం మిగిలుంది అంతే అంతకు మించేం కాదూ అని సూత్రీకరిస్తారు. (చూడుడు; నా బ్లాగులో వృద్ధ జంట అనే కవిత క్రింద జరిగిన ఓ చర్చ)
  ఇంతకీ ఎవలాలూ అని ప్రశ్నిస్తున్నారా (లేక ఎవరా నలుగురు ఏరా నలుగురు అంటూ జస్టిస్ చౌదరి గారిలా పుస్తకాల రేక్ తిప్పేయ్యాలని ఎమోషన్ వచ్చేస్తుందా) వస్తున్నా వస్తున్నా సార్
  వారు,,,,,, వారు
  మాగంటివారు, వారి పక్కింటి వారు, వెనకింటి వారు, ఎదురింటి వారు 
  ఇన్ని సమస్యలతో అసలు ఓ కవి తన కలాన్ని నిత్యం కాకపోయినా అడపాతడపా తళుక్కు మనిపిస్తున్నాడంటే మెచ్చుకోక ఏం చేద్దాం అంటారు. (మీరన్న క్రీమీ లేయర్ మొట్టికాయల గురించి)
  ఈ మధ్యో చక్కటి అవిడియా వచ్చింది గొప్ప కవిత్వం రాయాలంటే
  ఏ దైనా ఒక విషయంపై ఓ నలభై లైన్ల వ్యాసం వ్రాసేసి, దానిలో మధ్యమధ్యలో ఒక్కో లైన్ చొప్పున ఓ ఇరవై లైన్లు తొలగించేస్తే, ఒహ గొప్ప ఇరవైలైన్ల కవిత అవుతుందని దానికి కవిత్వానికుండాల్సిన అన్ని లక్షణాలు ఆటోమేటిగ్గా వచ్చేస్తాయని అనిపించేస్తుంది. ఈ సారి అలాంటి బాంబులతో రెడీగా ఉంటాను ఏంచేస్తారో చూస్తాను అప్పుడు,,,, కాసుకోండి. బస్తీమే సవాల్
  కవులను ప్రశ్నించే వారికదే శిక్ష, శాపం, పాపం, నాకు తట్టటం లేదు అదే ఫ్లోలో ఓ నాలుగైదు పదాలు వేసుకోవలసినదిగా విన్నపం
  భవదీయుడు
  బొల్లోజు బాబా
  పి.ఎస్. సరదాగానే సీరియస్ గా కాదు. మీరిచ్చిన రేటింగ్ నాకు సంతోషంగానే ఉంది ఎందుకంటే ఓ యాభై కవితల సంకలనంలో నాకు సాధారణంగా బాగా నచ్చేవి పది పదిహేనుకు మించి ఉండవు. మీ రేటింగ్ కూడా దానికి సరిపోయింది. 

  ReplyDelete
 11. బాబా గారు

  LOL.... బాగుంది మీ బాధల చిట్టా....చొక్కాలో కారంతో సరిపెట్టేసాం - అదేనండీ "అంగీ"కారం తో సరిపుచ్చేసాం..

  సరే నవ్వులు, బాంబులు, బస్తీ మే సవాల్ లు కొద్దిసేపు పక్కనబెట్టి - సీరియస్సుగానే అనగా కుతూహలంతో కూడిన సీరియస్సునెస్సుతోనే అడుగుతున్నా చెప్పండి

  పైన మీరుదహరించిన వ్యాఖ్యలను బట్టి నిజంగా వాటి గురించి మీరేమనుకుంటున్నారో తెలుసుకోవాలని అడుగుతున్న కొన్ని ప్రశ్నలు, ఉపప్రశ్నలు......

  ఒకటో ప్రశ్న - మీరు జనాల కోసం రాస్తున్నారా? మీకోసం రాసుకుంటున్నారా?

  రెండో ప్రశ్న - పైన మీరుదహరించిన వ్యాఖ్యల్లో, మీరు పక్కనబెట్టేవి ఏవి? మీకు పనికొచ్చేవి ఏవి?

  కొన్ని నాకోసం, కొన్ని వాళ్ళకోసం అనో, ఇంకేదన్నా మధ్యస్తంగానో సమాధానం చెబుతే నేనేం చెయ్యలేను కానీ...

  ఇప్పుడు ఒకటో ప్రశ్నలోని మొదటి భాగానికి సంబంధించి కొన్ని ఉపప్రశ్నలు -

  1) జనాల కోసం రాస్తుంటే, ఎటువంటి జనాల కోసం రాస్తున్నారు?
  2) వాళ్ళకర్ధమవ్వాలని రాస్తున్నారా? వారే అర్ధం చేసుకోవాలని రాస్తున్నారా?

  ఈ ఒకటో ప్రశ్నకు, రెండో ప్రశ్నకు, ఒకటో ప్రశ్న ఉపప్రశ్నలకు సమాధానం మీకు వీలు కుదిరినప్పుడు ఇస్తే రెండో ప్రశ్న యొక్క ఉపప్రశ్నలు కొన్ని మిగిలిఉన్నాయి, అవి వదులుతా....

  ReplyDelete
 12. మాగంటి వారికి

  మీరు జనాల కోసం రాస్తున్నారా? మీకోసం రాసుకుంటున్నారా?
  జ. ఏ దైనా ఒక అనుభవాన్ని/ఎక్కడో చదివిన ఓ విషయాన్నికవిత్వీకరణ/ అక్షరబద్దం చేయాలనే ప్రయత్నమే దాదాపు నాకవితలన్నీ
  ఇదివరకైతే ఇవి చాలా మట్టుకు నా డైరీలకే పరిమితమయ్యేవి. ఇప్పుడు బ్లాగులు కూడా డైరీలనే నా భావన
  అవి జనాలకు కూడా నచ్చుతున్నాయని (మొదట్లో మిత్రుల వద్ద/తరువాత తరువాత బయటివారికి) తెలిసాకా పబ్లిక్ చేయటం మొదలైంది
  ఈ నాటికీ కూడా నేను స్పష్టంగా చెప్పలేను కానీ ఇవి నచ్చవచ్చు అనుకొన్నవే పబ్లిక్ చేసాను. ఇవి నచ్చవు అనుకొని వదిలేదినవి కూడా ఉన్నాయి. కనుక పై ప్రశ్నకు గో.పి వలే రెండూ ఉంటాయని అనుకొంటాను

  1) జనాల కోసం రా స్తుంటే, ఎటువంటి జనాల కోసం రాస్తున్నారు?
  చెప్పలేను. చాలా మట్టుకు కవితలు కవికీ తనకు ఒకే వేవ్ లెంగ్త్ కలిగిన పాఠకులు మాత్రమే ఆదరిస్తారని/ఆస్వాదిస్తారని భావిస్తాను.
  2) వాళ్ళకర్ధమవ్వాలని రాస్తున్నారా? వారే అర్ధం చేసుకోవాలని రాస్తున్నారా?
  రెండూ ఖచ్చితంగా కాదు. సత్తె ప్రమాణకంగా చెపుతున్నాను నమ్మండి నమ్మకపొండి -- ఎవరైనా అడిగితే ఆ కవితకు అర్ధం చెప్పగలగాలి అన్న ఉద్దేశమే డామినేట్ చేస్తూంటుంది. కవితకు అనేక కరక్షన్ లు చేయిస్తూంటుంది. (బహుసా టీచర్ బుద్దేమో అది)


  ఇక పైకామెంతులో చెప్పిన కవి బాధలు కవిత వ్రాసేటపుడు ఎక్కడ ఉంటాయో తెలియదు కానీ దాన్ని ఎడిట్ చేసేటపుడు మాత్రం పైకి వచ్చి డాన్స్ చేస్తాయనేది మాత్రం సత్యం. (కొన్ని కవితలకు ఎడిట్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు కూడా)
  మిగిలిన విషయాలు మరో సారి

  భవదీయుడు
  బొల్లోజు బాబా

  ReplyDelete