Sunday, November 13, 2011

కపాల మోక్షం !!

కపాల మోక్షం

-- శ్రీ శ్రీరంగం నారాయణబాబు

వేదసన్నిహితు
ఆదిశంకరుని
తపస్సమాధిని
ఓంకారమ్మే
హుంకరించినది.
చలించినవి
చరాచరమ్ములు
భూతా లుద్రేకించినవి
కాటుక పెట్టిన
నయనేంద్రియమై
కర్మసాక్షియే
చీకటు లురిలాడు.
అభ్ర గంగలో
శుభ్ర వీచికల
హాలహలమ్మే
తల యెత్తింది.
శేషుని ఫణాల
మణుల కాంతులు
వీసర వోయినవి
పూదోటలు లేనే లేవు
వసంతములు రానేరావు
ముల్లోకంబుల
తబిసి మిన్నలు
ముర్మరించినారు
అనంతకోటి
జీవరాసుల
హా హా కారం చేశాయి
హరోం హరాయని
పాహి పాహి యని
ప్రణమిల్లాయి.
ఆర్ద్ర మైనది
ఆ మహామహుని
అంతఃకరణ.
అంతట అక్షులు   విప్పి
ఆకలి ఆకలి అంటూ
భిక్షాపాత్రకు
చేయి చాపినాడు.
ఉగ్రతపస్సున
మ్రగ్గినది.
వేడి కంటికి
సూడిద పెట్టిన
బ్రహ్మకపాలం
పట పట
పళ్ళు కొరికినాడు
నటరాజు;
భూత పిశాచాల్
బొబ్బరిల్లినవి
వందిమాగధులు
వణికారు.
భయపడి బసవడు
రంకె వేసినాడు.
భూలోకమ్మున
తురకల గోరీలందు
క్రైస్తవుల సమాధులలోన
హిందూ శ్మశానవాటుల
కపాలమ్ములు
విక విక నవ్వినవి.
పుణికలు
పులకరించినవి;
కంకాళమ్ములు
ఘల్లున మ్రోగినవి;
స్వేయ్త పర్వతపు
శిఖరాచలముల
కనకభాండమే
కదిలింది.
స్వాహావల్లభు
సువర్ణ గర్భం
సళువరించినది
కళవళించినది.
గంగ వక్షమే
పాల పోటుతో
సింధు గర్భమున
గంగ కడుపులో
లవణ సాగరపు
లోతుల్లో
దాగిన నేత్రాగ్ని
మానవరూపం దాల్చింది.
మన్నే వెలిగించింది,
మిన్నే పొగచూరింది,
మంటల్లోనే పుట్టాడు,
మంటల్లోనే పెరిగాడు,
మంటల్లోనే మడిశాడు.
అగ్ని వీణయై
భుగ్న కంఠమై
భగ్న గీతియై
తారకమంత్రం
పరంజ్యోతిగా
వీరశైవుడు
భారతవీరుని
కపాల మొక్కటి
కపర్ది చేతికి
రివ్వున వాలింది.
కెవ్వున కెకేశాడు
కంఠే కాలుడు,
ఫాల నేత్రమే
స్పందించింది.
అండపిండ
బ్రహ్మాండమ్మంతా
తాండవనృత్యం చేసింది,
ఆనందాశ్రుల నించింది.
శేషుని ఫణాల
మెత్తనిశయ్య
పుడమి
ఒత్తిలిగించింది
ఎడారి పుష్పించింది
ఎందరు పుట్టలేదు
ఇంకెందరు గిట్టలేదు
అందరికీ
లభియిస్తుందా
హాలాహల మంటిన
హస్త స్పర్శ,
పెదవుల చుంబనము,
కపాల మోక్షం,
కపాల మోక్షం!

(రుధిర జ్యోతి నుంచి)
(ప్రతిభ పత్రిక - 1937 సంచిక)
ప్రెస్ అకాడెమీ వెబ్సైట్ నుండి

No comments:

Post a Comment