Tuesday, November 8, 2011

తమలపాకుతో కొ.కు - తలుపు చెక్కతో ఆరుద్ర!! అహ్హా......

తమలపాకుతో కొ.కు - తలుపు చెక్కతో ఆరుద్ర

ఏమిటీ టైటిలు?

అదా? చెబుతా వినుకో వీరకుమారా తమలపాకు కథను, అహ్హా తలుపుచెక్క కథనూ!!

అనగా అనగా "ప్రగతి" అని సచిత్ర వార పత్రిక ఉండేదిట. ఆ పత్రిక సంపాదకుడైన మద్దుకూరి చంద్రశేఖర రావు గారికి ఏమొచ్చిందో ఏమో - 1969 సంవత్సరంలో ఓ రోజు కొ.కు గారిని "అయ్యా - కె.వి రమణారెడ్డి గారు గిరీశం మీద ఓ వ్యాసం రాసారు...ఇప్పుడు మీరు ఆ గురజాడ గిరీశాన్ని, దాంతో పాటు రమణారెడ్డి గారి రాతలను ఓ పట్టు పట్టాలి" అని బతిమాలో బామాలో ఆయన చేత "గిరీశం పాత్ర" అనే వ్యాసం రాయించారని ఇతిహాసం.

ఇది ఇతిహాసమేనండోయ్......ఇతిహాసమో / పుక్కిట పురాణమో - ఈ రెండిట్లో ఏదో ఒకటండోయి ....నిజమెంతో తెలియదు...నన్ను తప్పు పట్టవద్దు దయచేసి....

అలా కొ.కు గారిచేత రాయించిన వ్యాసం 1969, ఏప్రిల్ 4వ తారీకున ప్రజల్లోకి వచ్చిన పత్రికలో 30వ పేజీలో ప్రచురించబడింది అని ఆ పత్రిక విషయసూచికలో ఉన్నది...

ఇక్కడో అద్భుతమైన వార్త మీ చెవిన వెయ్యాలి....అదేమంటే మనకందుబాటులో, అనగా ఆ ప్రెస్ అకాడెమీ వెబ్సైటులో ఉన్న ఆ ప్రతిలో ఆయొక్క 30వ పేజీ తప్ప అన్నీ ఉన్నాయి....అందువల్ల ఆయన, అనగా కొ.కుగారు నిజంగా గిరీశాన్ని, రమణారెడ్డి గారిని ఏమని పట్టు పట్టారో తెలియరాలేదు...

సరే అది అయిపోయిందా? ఆ తర్వాత వెలువడిన పత్రికా ప్రతుల్లో, అనగా 11 ఏప్రిలున సదరు పత్రిక సంపాదకుడు ఈ గిరీశం వ్యాసం మీద జనాలని "అప్పారావే గిరీశమా" అనే చర్చకు పెట్టినట్టున్నూ, కొ.కు గారి అభిప్రాయ వ్యాసం మీద "సార్కర్" / "పార్కర్" అనే ఆయన తన స్వంత అభిప్రాయం వెల్లడించారనిన్నీ, అందువల్ల ఆ వ్యాసాలన్నీ ప్రచురిస్తున్నామనీ, అలాగే ఇతర రచయితల అభిప్రాయలను ఆహ్వానిస్తున్నామనీ ప్రకటించేసి, మాకు ఆ ప్రచురించే అభిప్రాయాలతో సంబంధం లేదని ఓ స్టేటుమెంటు ఇచ్చి పక్కకు తప్పుకున్నారు....

అల్లా ప్రకటించేసాక, 18వ తారీకున బొల్లిముంత నాగేశ్వర రావు అనే ఆయన రాసిన "గిరీశం ది క్రిటిక్" అనే అభిప్రాయ వ్యాసం ప్రచురించారు...25వ తారీకున చక్రి అనే ఆయన రాసిన "గిరీశం పాత్ర" అనే అభిప్రాయ వ్యాసం ప్రచురిస్తూ దానికి అనుబంధంగా కొ.కు గారు "గిరీశం పాత్ర పై లేఖ" అని సంపాదకులకు రాసిన లేఖ (సారాంశమో ఏమో తెలియరాలేదు) కూడా ప్రచురించారు.

ఆ భాగం ఇక్కడ చూడవచ్చు....

ఆ తర్వాత మే 2వ తారీకున వెలువడిన పత్రికలో "గిరీశం ది డెవిల్" అనే వ్యాసం ఒకటీ, 9వ తారీకున "లేఖ మీద లేఖ" అని ఆరుద్ర గారు రాసిన వ్యాసం ఒకటీ ప్రచురించారు....

ఆ ఆరుద్ర గారి వ్యాసం ఇక్కడ చూడవచ్చు....

ఈ పై రెండు లంకెల్లో ఉన్న వ్యాసాలు చదివేసి రండి ముందు...ఆ తర్వాత ఈ కిందిది చదవొచ్చు


ఇంతకీ కుటుంబరావు గారు తమలపాకుతో గిరీశాన్ని ఏమని తడిమారో తెలియలేదు కానీ, ఆరుద్ర గారు తలుపుచెక్కతో కొ.కు గారిని, గిరీశాన్ని నిమరటానికి చెయ్యవలసిన ప్రయత్నం చేసారేమోనని అనుమానం వచ్చింది....కానీ ఆరుద్ర గారి మొత్తం లేఖ చదివాక ఆ అనుమానం ఆవిరైపోయింది....

ఇవి చదివాక మీ ఆవిరులు, అనుమానాలు పంచుకుంటారేమోనని ఇక్కడ టపా కింద వేసానన్నమాట.

అదొక్క కారణమే కాక ఎవరి వద్దైనా కొ.కు గారి అసలు లేఖ ప్రతి ఉన్నదేమో , ఉంటే పంచుకుంటారేమోనని కూడానూ...అదండీ సంగతి....

ఆక్షేపించేందుకు, కించపరిచేందుకు రాసిన రాతలు కావని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి...

భవదీయుడు
మాగంటి వంశీ

తా.క: ఆ తర్వాత మే 16వ తారీకున "గిరీశంలోని ఫాల్ స్టాఫ్" అని రవిబాబు రాసిన వ్యాసంతో, మే 23వ తారీకున బూజు కర్ర గిరీశం అని కాటూరి రవీంద్ర త్రివిక్రం, మే 30వ తారీకున గిరీశం ఇంగ్లీషు చదువు అని కొత్తపల్లి సుధాబాల రాసిన వ్యాసాలతో  చర్చ ముగిసిపోయినట్టు కనపడుతోంది....

అవునూ - ఇంతకీ ఆ మిగిలిన భాగాలూ, వ్యాసాలు ఎక్కడ ?

ప్రెస్ అకాడెమీ వారి వెబ్సైటులో ఉన్నాయి చూసుకోండేం!!

అన్నీ అప్పనంగా ఇస్తే చదివేద్దామనే? కొంచెం మీరు కూడా కష్టపడండి బాబులూ ...

నాకు కొ.కు గారు, ఆరుద్ర గారు ఇష్టమైన వ్యక్తులు కాబట్టి ఈ రెండు ఇక్కడ పోష్టు చేసా...

3 comments:

 1. వంశీ గారు, మద్దుకూరి చంద్రంగారి గురించి అనుకోకుండా మీ బ్లాగ్ లో చూడ్దం చాలా ఆసక్తికరంగా ఉంది.

  ఆయన గురించిన ఇతర వివరాలేమైనా తెలిస్తే దయచేసి తెలియజేయగలరు.

  ReplyDelete
 2. @ చంద్రహాస్

  మీకు కలిగిన ఆసక్తికి కారణమేమిటో తెలుసుకోవాలని నాకు కుతూహలంగా ఉన్నది...వీలున్నప్పుడు వివరించుడు.!

  ఆయన గురించిన విస్తృతమైన వివరాలు నాకు తెలియవు.....నాకు తెలిసిన కొద్దిపాటి వివరమేమనగా - అదీ ఆ ప్రగతి పత్రిక చదవటంతో తెలిసినది ఇక్కడ మీతో పంచుకుంటున్నా. నేను తప్పయ్యుండొచ్చు....

  - ఆయన ఆ పత్రిక ముఖ్య సంపాదకులనీ, ఆ పత్రిక పెట్టిన మొదట్లో మంచి మంచి రచయితలను పట్టుకుని బ్రహ్మాండమైన వ్యాసాలు, అవీ ఇవీ రాయించి ప్రచురించారనీ - కొద్ది రోజులు పోయేప్పటికి కారణాలేవైనా పెద్దవారినీ, మంచివారినీ వదిలేసి - నాసి రకం సంగతులతో పత్రిక నడిపారనీ, దాని వల్ల వాసి లేని ఊబిలో దిగబడిపోయి పత్రిక ఇహ పైకి రాలేక అధోలోకానికి ప్రయాణమైపోయిందనీ అనుమానం....

  ReplyDelete
 3. @వంశీ,

  మాయింటిపేరు చూస్తే నా ఆసక్తికి కారణం మీకు కొంత తెలుస్తుంది. మీ కామెంటుకు కృతజ్ఞతలు.

  ReplyDelete