Wednesday, November 16, 2011

ఇదే విషయమ్మీద అఫ్సర్ గారి బ్లాగులో, కొత్తపాళీ గారి బ్లాగులో ఆవేశ రూపం కాకపోయినా, అంతోటి రూపమే చూపించాల్సి వచ్చింది ఓ సారి!!

అచటనేయుండు

-- దేశిరాజు కృష్ణశర్మ
(1938, Pratibha Patrika)
(Credits: Press Academy Website)

పాకుతూ సోలుతూ
పై బడగ దొర్లుతూ
పరితాప పడుతు నే
మరలి వచ్చేదాక
అచటనే యుండు నీ
వచటనే యుండు

కన్నులే కాయలై
గిర్రుగిర్రున తిరుగ
మన సెల్ల అవశమై
మరచి వచ్చేవేళ
మరచి పోబోక నీ
వచటనే యుండు

చక్రాల తిరుగుళ్ళు
చరచు పరపుల దాగి
శల్యమై ప్రాణాలు
చిక్కబట్టుక నేను
సరవి వచ్చేదాక
సాగి పోబోక నీ
వచటనే యుండు

చిన చిన్న దీపాలు
శక్తిరూపాలు
పెద్ద పెద్ద దీపాలు
పెద్ద పాముల్లు
దీపాల వెలుగులో
దేదీప్యమానవై
తేజరిల్లుచు నన్ను
మరచిపోబోక నే
మరలి వచ్చేదాక
అచటనే యుండు

క్రూరములు క్షుభితములు
ఘోరరూపాలలో
కోసి చూచినగాని
గుండెలే లేవయ్య!
చేతనంబును బొంది
జీవములు లేనట్టి
ఈ శవంబుల మధ్య
నే చచ్చుచును బ్రతికి
సరవి వచ్చేదాక
సాగి పోబోక నీ
వచటనే యుండు

ఉదయభానును చూసి
బుద్ధి మంతుడ నౌచు
సాంధ్య చంద్రుని చూచి
చట్టు బుద్ధుల నెరిగి
ప్రొద్దు పొడుపుల జీవ
పుంజమ్ము మేల్కొలిపి
సాంధ్య కాంతులలోన
సమయుచును బ్రతికి నే
సరవి వచ్చేదాక
సాగిపోబోక నీ
వచటనే యుండు

మృదువుగా తరళముగ
వెలిపూల చాలులో
రేకగా క్రొన్నీటి
తరగలో నురుగుపై
కొసరుగా సులువుగా
పై కెగయు విహగ మటు
ఒదిగి ఒదుగుల్లోన
నలిగి నలిగీ నేను
తలక్రిందుగా తిరిగి
అటు తిరిగి ఇటు తిరిగి
పాకుతూ సోలుతూ
పై బడగ దొర్లుతూ
పరితాప పడుతు నే
సరవి వచ్చేదాక
సాగిపోబోక నీ
వచటనే యుండు

ఇటు చూచి అటు చూచి
వెనక ముందుల చూచి
తలకిందుగా చూచి
మనసులో చూపుంచి
ఎలుగెత్తి ఏడ్చుచూ
చేయెత్తి పిలుచుచూ
పుణ్య పాపాలన్ని
మంచి చెడ్డల నెల్ల
నాయేడ్పులో కలిపి
నా చూపులో చూపి
నిను చూచుచూ నేను
పాకుతూ సోలుతూ
పై బడగ దొర్లుతూ
పరితాప పడుతు నే
మరలి వచ్చేదాక
మరచి పోబోక నీ
వచటనే యుండు నీ
వచటనే యుండు!


నాకు బోల్డంత ఆశ్చర్యం వేసేట్టు, ఆనందం కలిగేట్టు - ఓ సంఘటన 1938లోనే జరిగింది....ఏమిటి బాబూ అది?

ఇది ఫుట్ నోట్సున్న కవితకో చక్కని ఉదాహరణ. అసలు కవి ఎందుకు రాసాడు ? ప్రేరణ ఏమిటి - అన్నది పాఠకుడికి చక్కగా అర్థమయ్యి - నచ్చితే మరింత ఆనందించటానికి, నచ్చకపోతే పక్కనపడెయ్యకుండా అర్థం చేసుకోడానికి ఉపయోగపడే పని ఈనాటి మన కవులు ఎందుకు చెయ్యరో నాకైతే అర్థం కాదు కానీ.....

ఇదే విషయమ్మీద అఫ్సర్ గారి బ్లాగులో, కొత్తపాళీ గారి బ్లాగులో ఆవేశ రూపం కాకపోయినా, అంతోటి రూపమే చూపించాల్సి వచ్చింది ఓ సారి... ఆవేశరూపం ఏమిటి నా బొంద....ఊరకే అన్నాలెండి....అది వారికీ తెలుసు ....:) - ....


అర్థమయ్యిందా, ఇప్పుడు మొత్తం కథ?

అదీ సంగతి....

అదంతా సరే కానీ 1938 - ఫుట్ నోట్సేది?

వస్తున్నా - ఇదిగో

[కొండ మీద దేవాలయం. సగంలో భక్తుడు జర్రున కాలు జారిపడ్డాడు. మళ్ళీ ఎక్కడానికి విశ్వప్రయత్నిస్తున్నాడు. జీవిత లక్ష్యమే దేవాలయం. భక్తుడు జీవయాత్రికుడు]

అదండీ....ఇహ ఇప్పుడు ఇది, అనగా - ఈ ఫుట్ నోట్సు దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ఓ సారి ఆ పై కవితను చదివి రండి...

1938వ సంవత్సరంలోనే జరగ్గా లేనిది, ఇప్పుడు చెయ్యలేకపోడానికి కారణం ఏమిటి?

నాకైతే కారణం తెలుసు.....మీకు తెలిస్తే ఇక్కడో కామెంటు రాయండి...మిగతా అందరికీ తెలుస్తుంది....

1 comment:

  1. భలే ఉంది పొయెం

    కారణం మీకే కాదు నాకూ తెలుసోచ్ :-)

    ReplyDelete