Friday, November 18, 2011

చెత్తాచెదారం, దుమ్ముదుమారం, ఉత్థ ఉలారం, గాజుమలారం!!! - సొంతడబ్బా

సొంతడబ్బా

- పైడిపాటి సుబ్బరామశాస్త్రి

(ప్రతిభ పత్రిక , 1941)


చెత్తాచెదారం
దుమ్ముదుమారం
ఉత్థ ఉలారం
భోరుభోరునా
హోరెత్తిస్తూ -
గలగలగలగల
గాజుమలారం,
చెవులో చిటెళ్లు
ఫెఠిళ్లుమంటూ -
కంకరరాళ్లూ
ఖాళీడబ్బా,
డబడబడబడబ
లాడిస్తూ -

ఉప్పర మెగనే
డప్పులమోతా,
టుపటుపటుపటుప
మోగిస్తూ -
కీచురాళ్లతో
పేచీపడుతూ
గింగురుగింగురు
యీలలువేస్తూ -

ఢాంఢాంఢాంఢాం
రాండోల్మోతా
ట్రట్టర్ ట్రట్టర్
నగారదెబ్బా,
చెవులో డ్రమ్మును
బ్రద్దలు చేస్తూ -

ఒక్కమినిట్టూ
ఊపిరిసలపక,
చుడుగుడుగుడుగుడు
గుడుగుడుగుడుగుడు
లాడేస్తున్నావ్ -
దంచేస్తున్నావ్ -
చెక్కేస్తున్నావ్ -
పొడిచేస్తున్నావ్ -

చోటుమార్చినా
ప్లేటుమార్చకా
ఒకటే వూదర
ఒకటే వూదర
పెట్టేస్తున్నావ్
కొట్టేస్తున్నావ్ -

నవ్యం నవ్యం నవ్యం అంటూ
బడబడలాడే
పదజాలంతో
లోకంకళ్లూ
కప్పేస్తావ్?
వేడివేడిబల్
పెసరట్టంటూ
తీసిన అట్టే
తిరగేస్తావ్?
అయితే కానీ,
అట్లే కానీ,
వూకనే దంచూ
ఊదుతూవుంటా


మాటోయి - మాటా
మనలో - మాటే
ఏమన్నారో
విన్నావా - ?
వినవు నువ్వూ
వినవ్ నువ్వూ
ఇదే ! మరి
నీదగ్గర
నీమోతలో
నీకే వినపడదూ !
-- నీకూ
పైన పటారం
లోన లొటారం - ట ||
పాదరసం ఫేడై పోయీ
రూపాఇ రూపూ రూపరిపోయీ
అర్ధణాకాసే అసహ్యంగా
అగపడుతోందిట! అగపడుతోందిట!
నువ్వేంచేస్తావ్?
నేనేం చేస్తా __ ?
ఊ _ చూశావా _ అంట
ఎల్లా -
ధుమా పేలిపోయి
మజా మాడిపోయి
వీలు చెడి
ఎత్తుతప్పి
అసాధ్యంలో

డు
తోం
దో ||

(ఇది ఏ ఒక్కర్నీ ఉద్దేశించింది కాదు.)



****************************************
చివర బ్రాకెట్లోఉన్నది కూడా "సొంతడబ్బా" లోదేనండోయి....
ఇలాగన్నారంటే ఖచ్చితంగా ఒకళ్లని ఉద్దేశించిందే! :)
ఆ ఒకరు ఎవరనేది తెలిస్తే ఇక్కడో కామెంటు కొట్టండి...

No comments:

Post a Comment