Wednesday, November 16, 2011

శ్రీ పాలగుమ్మి పద్మరాజు గేయాలు - (1938)

అప్పుడు

(గేయ రచన: శ్రీ పాలగుమ్మి పద్మరాజు)
(1938, ప్రతిభ పత్రిక, ప్రెస్ అకాడెమీ వెబ్సైటు నుండి)


పైరుగాలికి నాట్యమాడే
పైటరాపిడి తగిలి చిటుకున
పండిపోయిన దాని మ్మొకటి
పగిలి విచ్చింది
పండు దొండకు సాటివచ్చే
పడతిపెదవులలోన దాగిన
పండ్లముత్తెపుతళుకు లన్నీ
పక్కుమన్నాయి

అప్పుడు నేననుకొన్నాను
అందాని కర్ధం ఇదే నని.

గట్లమీదా పుట్లమీదా
గంతులేస్తూ తిరిగివచ్చిన
కోడెదూడని బాడి అయినా
గోవు నాకింది
దుస్తులంతా దుమ్ముపడినా
దులపకుండా చేరవచ్చిన
కన్నతండ్రిని తల్లి ఎత్తుకు
కౌగిలించింది.

అప్పుడు నేననుకొన్నాను
ఆనంద మంటే ఇదే నని.


తేనెకోసం పూవుపూవుకి
తిరుగుతుండే గండుతుమ్మెద
కాలికంటినపుప్పొ డంతా
పూల కంటింది
పూటపూటకు సేకరించిన
పూరజంతో బరువు లెక్కిన
విరులగుత్తులు పురుడుపోసుకు
పిందె లయినాయి

అప్పుడు నేననుకొన్నాను
అచ్చపు సత్యం ఇదే నని.



*****************************************


మౌనశ్రుతి


(గేయ రచన: శ్రీ పాలగుమ్మి పద్మరాజు)
(1938, ప్రతిభ పత్రిక, ప్రెస్ అకాడెమీ వెబ్సైటు నుండి)


చిన్నశంఖంలోన చిక్కువడినట్టుగా
ఆమెగొంతుకలోన అంబుధులుమూల్గినవి
దీర్ఘమౌ మౌనగీతికలరాగాలతో
మారుమ్రోగినవి నామనసులోగుహలు.

ఆమెహృదయంలోన ఆచికొన్న వలపులు
కనులతళతళలో మినుకుమని మెరసినవి
అంధకిరణాలతో ఆక్రమించినది ఆ
కనుబడని వెలుగు నామనసులోగుహల.

ఆమెతనువునపులక లఖిలదిక్కోణాల
గాలికెరటాలపై కదలివ్యాపించినవి
మూలమూలల నొదిగి మురిగిపోయినగాలి
మారుపులకించె నామనసులోగుహల.

చిన్నశంఖంలోన చిక్కువడినట్టుగా
ఆమెగొంతుకలోన అంబుధులుమూల్గినవి
దీర్ఘమౌ మౌనగీతికలరాగాలతో
మారుమ్రోగినవి నామనసులోగుహలు.



****************************************


చిత్రరచన

(గేయ రచన: శ్రీ పాలగుమ్మి పద్మరాజు)
(1938, ప్రతిభ పత్రిక, ప్రెస్ అకాడెమీ వెబ్సైటు నుండి)



ఏమి వ్రాస్తున్నావు చిత్రకారా?
చిన్నపిల్లల బొమ్మరిళ్ళలో నాజూకూ
చిట్టిపాపల తప్పటడుగులవయ్యారం
చిరుతపలుకుల ముద్దులొలికే మైమరపూ.

ఏమి వ్రాస్తున్నావు చిత్రకారా?
చిలిపికజ్జాలనీ, వలపుకన్నీటినీ,
ఎడబాటువగలనీ, కడకంటిఎరుపునీ,
మరలకలయికలనీ, కరగుహృదయాలనీ.

ఏమి వ్రాస్తున్నావు చిత్రకారా?
ముడతలుపడ్డదేహంలోపల
ముక్కిపోయినమనసులూ
తేనెలెతీపిని చే దనితోసే
తిక్కలెక్కినజిహ్వలూ
ఆయాసంతో అలసట చెందీ
అదే వాగే నాల్కలూ.

ఏమి వ్రాస్తున్నావు చిత్రకారా?
ఏడుపులూ నవ్వులూ ఏకంగా జేసేసి
ఈజీవితపు కష్టసౌఖ్యాలనీడల్ని
ఏడురంగుల్లోకి అనువదిస్తున్నాను.

No comments:

Post a Comment