Thursday, November 17, 2011

జరుక్ శాస్త్రి గారి "మా బాపిరాజు" గేయం - 1937

జరుక్ శాస్త్రి గారి "మా బాపిరాజు" గేయం - 1937

మా బాపిరాజు

-- శ్రీ జలసూత్రం రుక్మిణీనాధ శాస్త్రి
(ప్రతిభ నవ్య సాహిత్య పరిషత్పత్రిక, 1937)


తెలుగువనముకు దోహదములన్
దీప్తి నిచ్చిన ఘనుడ వయ్యా....
పొసగగా కవనమ్ము శిల్పము
పోహళించితివి!

అందాలు చిందినవి పొంకాలు కుదిరినవి
కాళ్లగజ్జలు ఘల్లుఘల్లు మంటున్నాయి
లాస్యాలు ఆగినవి ఆస్యప్రభలు విచ్చి
ఆనంద మందుతూన్నది సరస్వతిదేవి !

మాకు...
అలరవీంద్రుడ వీవె అవనీంద్రుడవు నీవె
పట్టినదెల్ల బంగారమ్ము చేయగా
నీ బొనవ్రేలిచ్చు నెరచూర లందుకొని
కవనమూ శిల్పమూ గజ్జ కట్టినవి!

మీరు
ఒరులగొప్పను మెచ్చుకోలేని తెలుగుల్లో
చెయిజారి పడ్డారు శీర్ణమతులైనారు!
నాబాపిరాజ! ఓహో పాపఱేడ!
నాబాపిరాజ! ఓహో పాపఱేడ!

వేయితల లందుకోరాని భావమరీచి
క్షణములోపల మీకు కరతలామలకమే!
పాటల్లో కథలలో చిత్రాల్లో గోష్ఠిలో
నాగసర మూది నాతలపాము నాడించి

ఎదొమచ్చుజల్లి నాడెందమ్మును హరించి
దానితో నొకకొత్త సృష్టి చేతురు మీరు!

మీహృదంతర మొక్క "ఏఫీసనే" యౌను
జ్ఞానప్రసూనాంబ ఉపాస్యమ్మెకా!

రసస్రష్టలు మీరు రసపిపాసిని నేను
నాబాపిరాజ! ఓహో పాపఱేడ!

తెలుగువనముకు దోహదములన్
దీప్తి నిచ్చిన ఘనుడ వయ్యా....
పొసగగా కవనమ్ము శిల్పము
పోహళించితివి!

No comments:

Post a Comment