Saturday, October 22, 2011

చందమామలో - ఆలూరి బైరాగి బాల గీతాలు....

చందమామలో ఆలూరి బైరాగి బాల గీతాలు....   

స్నేహ ధర్మం

అనగనగా మరి, ఒక ఊళ్ళో
ఉన్నారిద్దరు కుర్రాళ్ళూ
దిక్కులేని వారిద్దరునూ
ముక్కుపచ్చలారని వాళ్ళూ.

కొంపాగోడు లేదేమీ,
పూటకూటికే గతిలేదు
చిరిగిన, మరక ఉడుపులకూ
మసిగుడ్డయినా సరిరాదు.

ఏదిదొరికితే అది తింటూ
ఆకలి తీర్చుకొనేవాళ్ళు
రోడ్డు ప్రక్కనే పంపుంటే
దప్పిక ఆర్చుకునేవాళ్ళు

వాన విసురుగా ముసురొస్తే
ఏపంచో వెదికే వాళ్ళు
వేసవికాలపు రాత్రిళ్ళూ
ఆరుబైట గడిపేవాళ్ళు

వారిని చూచిన వారంతా
అన్నదమ్ము లనుకొన్నారు
కాని వాస్తవంగా వారు
చుట్టా లెట్లాగూ కారు

చుట్టరికంగా దారిద్ర్యం
వారిని దగ్గర చేసింది
స్నేహం ఉచ్చులుగా పన్నీ
కాళ్ళకు బంధాలేసింది

చలికాలం ఒకరోజు ఉదయం
వారాకలిగా లేచారు
ఎక్కడ ఏం దొరుకుతుందా
అని చుట్టూ కలజూచారు

రోడ్డు వెంబడే పోతుంటే
నారింజొక్కటి దొరికింది
పెద్దవాడు పరుగెత్తాడు
కాయకేసి చెయ్యురికింది

దానిని తీసుక ఆత్రంగా
తోలు ఒలిచి తినబోయాడు
కాని అంతలో ఇంకొకడూ
ఉన్నాడని గుర్తించాడు

చిన్నవాడనీ దయదలచి
కాయ అతనికే ఇచ్చాడు
అయ్యో తొందరపడ్డానే
అని మనసున కడు నొచ్చాడు

చిన్నవాడు సగపాలు గొని
సగమాతనికే ఇచ్చాడు
ఇద్దరి ఆకలి తీరేట్టు
న్యాయంగా సరిపుచ్చాడు

ఇతరులు నీయెడ ఏ విధిగా
వర్తించా లనుకొంటావో
నీవు వారి యెడ అట్లాగే
వర్తించాలని అనుకోవాలి
వేటగాని సాహసం


ఒక కారడవిని
వేటగాడు ఒకడుండేవాడు
తప్పదతని గురి
ఎంతో నేర్పరి ఆ విలుకాడు

బాలు డనాధుడు
ఒక డతనికి తోడుగ ఉన్నాడు
నీడవలే ఆ
వేటగాణ్ణి వెన్నాడేవాడు

వేటగాని గురి
చూచి ముగ్ధుడై ఆ పిల్లాడు
ఆనందంతో
కేరి చప్పటులు చరిచేవాడు

క్రూర మృగాలను
చూచి కొంచెమైనా భయపడడు
వేటగానిలా
ఓరిమిగలవాడా బాలకుడు

వారిద్దరునూ
ఒకరోజున వేటకు వెళ్ళారు
ఎలుగు బంటులను
రెంటి నొక్క చోటున చూచారు

వీరిని గని ఆ
మృగాలొక్క అదటున ఉరికాయి
అరణ్యమంతా
దద్దరిల్లిపోయే ట్టరిచాయి

ఒక భల్లూకం
వేటగాని మీదకు ఉరికింది
రెండవదానికి
బాలునివైపు కదను దొరికింది

దురదృష్టమది
అతనివద్ద అమ్మొక్కటే ఉంది
ఏం చేయటం
కడకతనికి ఒకటే తోచింది

ఆ బాణంతో
బాలునిపై కురికే జంతువునూ
కూల్చి కాచుకొని
నిలుచున్నాడు, కదలడెంతకునూ

మీది మీది కా
ఎలుగుబంటి తిన్నగ వస్తున్నది
వేటగాడు కను
లార్పడు ఎరుగడసలు భయమన్నది

కొంచెం సేపా
ఎలుగుబంటి నిలుచుందొకలాగే
వెళ్ళిపోయినది
వచ్చిన త్రోవను తిరిగి అలాగే

సాహస ముంటే
చాలు, మనిషి కెన్నడు ముప్పుండదు
ఇతరుల కోసం
సాహసించినా ఏ తప్పుండదు
కలవారి అబ్బాయి

కలవారి అబ్బాయి రాముడను వాడు
పండుగకు క్రొత్త ఉడుపులు తొడిగినాడు
తళ తళ మెరిసేటి పట్టు చొక్కాయి
పట్టులాగూ చూచి మురిసె నబ్బాయి

సరిక్రొత్త చొక్కాయి తొడగిన నాడు
ఇంటిలో కూర్చుంటే ఎవడు చూస్తాడు
అని మనసులో రాముడూహించినాడు
ఆడుకొంటానమ్మ బయట నన్నాడు

అమ్మ అన్నది ' బయటికెళ్ళ కబ్బాయి
క్రొత్తబట్టలు నీవి మాసిపోతాయి
బయట కెళ్ళావంటె జాగ్రత్త నీవు
బూచులుంటవి, ఇంక తిరిగిరానీవు

కాని ఆ అబ్బాయి మాట వింటాడా?
అందులోనూ క్రొత్త బట్టలేశాడా
తుదకు మనసును పట్టలేక పొయ్యాడు
గుట్టుచప్పుడు గాను బయటకెళ్ళాడు

బయట ఒక కుర్రాడు ఎదురువచ్చాడు
వెర్రి బాగులవాడు, కడుపేదవాడు
చింకి బట్టలవాడు, జిబ్బి తలవాడు
ఒంటిపై దళసరిగ దుమ్మున్నవాడు

రాము డతనిని ఏవగించుకున్నాడు
చీదరించుక త్రోవ తొలగిపొయ్యాడు
కాని కాలొక అరటి తొక్కపై వేసి
పడి, చూడసాగాడు ఆకసం కేసి


తల చెరగి పోయి, వలువలు మాసిపోయి
మురుగు కాలవనీట మరకలైపోయి
కలవారి అబ్బాయి బావురన్నాడు
పేదపిల్ల డతణ్ణి లేవదీశాడు

చేయూత ఇచ్చాడు, దుమ్ము దులిపాడు
ప్రేమతో తలనిమిరి బుజ్జగించాడు
భయపడకు పాపమని ఊరడించాడు
ఇంటివరకూ తాను సాగనంపాడు

రాముడింటికి వచ్చి భోరుమన్నాడు
జరిగింది తల్లితో చెప్పి వేశాడు
అతడు దాచక నిజం చెప్పటం వల్ల
పల్లెత్తుమాటైన అనలేదు తల్లి

రాము డారాత్రి ఒక కలగాంచినాడు
మరల ఎదురయ్యాడు పేదపిల్లాడు
కాని అతనిని చూచి రాము డీసారి
ఏవగించుక తొలగిపోలేదు దారి

No comments:

Post a Comment