Tuesday, October 18, 2011

ఆరుద్ర మాష్టారు - ఆకాశవాణి - పిట్టకథ

ఆరుద్ర గారేమిటి? ఆకాశవాణిలో పిట్టకథ చెప్పటమేమిటి?

నమ్మకపోతే సౌమ్య నామ సంవత్సరం ఉగాది కవి సమ్మేళనం సందర్భంగా విసిరిన "పిట్టకవితాకథ" -

చదివి, మీకేమనిపించిందో చెప్పండి...

*******************************

సౌమ్యనాదం

-- ఆరుద్ర

ఆకాశవాణి విజయవాడ ఉగాది కవి సమ్మేళనం (1969)


గాంధీ పుట్టిన దేశమేనా ఇది?
టార్చిలైట్లు పట్రండి వెతుకుదాం
నెహ్రూ చెక్కిన శిల్పమేనా ఇది?
తుమ్మజిగురు పట్రండి అతుకుదాం

దేశమంటే మట్టికాదు
శిల్పమంటే శిలకాదు
అయినా మట్టిని పరీక్షించాలి
అవశ్యం శిలను సమీక్షించాలి

ఈ దేశీయుల మస్తిష్కాల్లో
ఇంత మృత్తిక ఎలా వచ్చింది?

ఈ శిల్పం ఇంత జల్పం ఎలా నేర్చింది?
ఏభై కోట్ల నయనాల జతలు
వీక్షిస్తున్నవి ఏ ఇమ్మడి ముమ్మడి వెతలు
ఏభై కోట్ల గళాలు తెంపుకున్న నిగళాలు
ఎవర్ని బంధిస్తున్నవి ఎవర్ని నిందిస్తున్నవి?
ఎద లిప్పుడు ఏ రాక్షస నినాదానికి స్పందిస్తున్నవి
పద్యాల సేద్యానికి యోగ్యమైనది కాదీ కార్తి
ఉద్యమాల ఉన్మాదంలో ఉత్పాదిత మగుచున్నది ఆర్తి
పుకార్ల తుపానులో వికావికలవుతున్నది
పొట్టచేత బుచ్చుకున్న మూగబతుకులు
మధుమాసం వచ్చిందో లేదో
మామిడిచెట్టు పూచిందో లేదో
గుర్తించే తీరుబాటూ
కీర్తించే పొరబాటు
ఏ పికావికి లే దిప్పుడు

ఎలా నిజం పాడగలవు వరభృతాలు
పువ్వు తొడిమను వీడిపోతా నంటున్నప్పుడు
మెదడు గుండెను విడిచిపెడతా నన్నప్పుడు
చెట్టునున్న ముళ్ళే చీడపురుగులుగా మారుతున్నప్పుడు
చేతినున్న ఐదువేళ్ళూ అయిదు రాజ్యాలవుతున్నప్పుడు

దేవతలు పీడిస్తున్నప్పుడు
దెయ్యాలు దీవిస్తున్నప్పుడు
దీపాలు వెలగడం మానేసి
పాపాలు వీక్షిస్తున్నప్పుడు
జలగలు చెలరేగి జాతర చేసుకొంటున్నప్పుడు
ఇప్పుడు కళ్ళనుండి కారే నెత్తుటిబొట్లు
చప్పుడు చేయనప్పుడు
ఏ కన్నూ భవిష్యత్తు చూడదేం?
ఏ నోరూ వాస్తవాన్ని చాటదేం?
అవని అంతా పెద్ద అరణ్యమే ఇప్పుడు
అఖిలేశు హస్తమే ఆటోమేటిక్ రైఫిలు
వేట వేట వేట
కూటక రణాల, కుట్రల, కూహకాల కారడవిలో
వేట వేట వేట
సాటివాణ్ణి తోటివాడు తూటాడే పాడువేట
ఈ వేట బాధ పాత గాధ
ఇది పదేళ్ళలోపు పిల్లలకు
చెప్పకూడని పిట్టకథ
, ఉత్తరోత్తరా
తప్పవలసిన గట్టి వ్యధ


అనగనగా ఒకరాజు
ఆ రాజుకు ఎందరో మంత్రులు
అందరూ వేటకెళ్ళి అన్ని తిమింగిలాలయ్యారు
ఇందులో ఏ ఒక్కటీ ఎండదు
దేని కడుపూ నిండదు
కథ కంచికి వెళ్ళలేదు
మన మింటికి మళ్ళలేము
ఇంట్లో వాళ్ళే ఇల్లు కొల్లబెడుతున్నప్పుడు
వొంట్లో నరాలే ఒళ్ళు కుళ్ళబొడుస్తున్నప్పుడు
నేర మారోపించాలి ఎవరిపైన
నిందిస్తే ఏం లాభం ఎవరినైనా?
ఎవడు ముద్దాయి? ఎవడు ఫిర్యాది?
ఈ ఉమ్మడి కుమ్మక్కులో ఎవరయ్యా జడ్జి
అవని అంతా పెద్ద అన్యాయ స్థానమే ఇప్పుడు
అఖిలేశు హస్తాలే నకిలీ త్రాసు చిప్పలు
ధరణిలో ఎక్కడ చూసినా
తిరగబడని అంగుళమే లేదు
విద్వేషానికి ఉద్వాసన చెప్పని రాజ్యం లేదు
విద్రోహం క్షుద్రం చెయ్యని దేశం లేదు

పోలీసుకు లేదు బలం
పాలసీలో లేదు నిజం
పొగరెత్తిన గూందాలూ
పొగచూరిన జండాలూ
కలుపుతారు భుజం భుజం
కరడు కట్టెహజం, హతం
కంచే చేను మెస్తున్న కిరాత సమయంలో
కంచె రాటులు మంచినీళ్ళు అందిస్తాయి
మంచెమీద నిలబడ్డ కామందే
మారు వడ్డించుకోమంటాడు
పాలించే స్వార్థానికి పట్టింపులు లేవు లేవు
పక్కింట్లో పస్తుల చావు
ఈ ఇంట్లో కోడి పులావు
ఏ దేశమేగినా ఎందు కాలిడినా
ఏ నోట విన్నా ఒకటే ఆదర్శం

నాకు తృప్తి నాకు ముక్తి
మిగతావాళ్ళది కక్కుర్తి

గుడిలోపల నాటుబాంబు
బడిలోపల స్ప్రింగు బాకు
నిశువుకైనా నిర్లక్ష్యం
పశువుకైనా బలపక్షం
ఇటువేపో దురాగతం
అటువేపో అరాచకం
ఆవేశాల అరాచాలమీర
కావేషాల ఫిరంగులు వస్తున్నవి
ముందుచూస్తే ధర్నా
వెనుక చూస్తే ఘెరావు
తల్లిపాలతో పీల్చిన దాక్షిణ్యం
పరస్పరం పోరాడే
నిరంతర కరుణం ఇది

సుప్తానల సంపుటాలు దీప్తించే సమరం యిది
శోకార్ణవ తరంగాలు శుష్కించని కురంగాలు
అపో కలిప్సు అశ్వాలివి
ప్రపూత భావ కిరణాలివి
ఈ వెలుగులు ఛేదించని గోడ నువ్వు కట్టలేవు
ఈ సత్యం పడగొట్టని కోట వాడు పెట్టలేడు
ఇంత వింత చీకటిలో
ఉన్నది  ఒక సన్నదివ్వె
ఈ రాబందులకు దూరంగా
ఉంటుందొక శాంతి గువ్వ
తెల్లవారినా పొద్దు వెలగని
ఎల్లకాలపు ముసురు కాదిది
ఈ యేభయి కోట్ల హృదులు
ఎంత బండబారినా
రాయిని చీల్చుకు వచ్చే పుష్పలత
ఏ యుగంలోనూ నశించని మానవత
కాదది అవాజ్మావనస గోచరమగు వస్తువు
కచ్చితంగా అది మేధస్సు మీది విజ్ఞాన వస్తువు
అది వినియోగపడినపుడే ఉగాది
ఆనాడు నాగీతం నివాళి
గాంధీ దీవించిన మేకపిల్లా ఇది?
కబేలా బారినుండి కాపాడదాం దీన్ని
నెహ్రూ ఎగరేసిన పావురమా ఇది?
దీని సందేశం విని పాటించుదాం దాన్ని

*********************************


భవదీయుడు
వంశీ

2 comments:

  1. మీరు చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం! ఎంతో చక్కనివన్నీ సేకరించి,పదిలపరిచి మాకు కూడా అందిస్తున్నారు ధన్యవాదాలు!

    ReplyDelete
  2. enno samvatsarala kritam vinnanu ee pittakathani. Malli chadive bhagyam mee valana kaligndi. entagano krutagnudini. Oka sandeham. Deenilo "vidyarthi rushyasrungulanu seduce cheyinche rajakeey a romapadula pannagam minnagainadi" unnatlu gurthu. 1970 ugadi kavi sammelanalo ayina kavachhu. ee vishayamulo meekemayina telusaa?

    ReplyDelete