Friday, October 7, 2011

చిన్ననాటి చేష్టలు - " సీతాఫలం" - అందరికీ లభించేది కాదది!!!

సీతాఫలం - ఈ పేరు వినగానే, మన కపాలంలోని జ్ఞాపకబ్రహ్మం - ఆ సీతాఫలం లోపల గుజ్జులో దాక్కునే నల్లని గింజల్లా, ఎక్కడో మన మెడకాయ మీద ఉన్న తలకాయ లోపలి గుజ్జులో దాక్కున్న గుర్తులని బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తుంది...నిన్న సాయంత్రం అల్లా కొన్ని గింజలు మన గుజ్జులోంచి బయటకొచ్చినై...అదీ క్లుప్తంగా ఈ టపాకి కథాను, కమామీషునూ...

ఇక్కడో మాట చెప్పాలె - మనబోటి సామాన్యుడి గుజ్జులో గింజల అందానికే మైమరచిపోయి - మనకు మనం చప్పటి అట్లు (అనగా చప్పట్లు అన్నమాట) వేసుకోటమే కాకుండా, చుట్టూ చేరిన భజన బృందానికి పంచటంతో - మొహమాటానికో, నిజంగానేనో ఆ చప్పటి అట్ల రుచి తగలగానే "ఆహా!, ఓహో!" అనిపించి వారిచేత కూడా భజనసేతుమురా లింగా అని చప్పట్ల భజన చేయిస్తే - మహా మహా పండితులు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి "సీతాఫలం" జ్ఞాపకాలు ఎంతమందితో, ఎన్ని, ఎంతటి పనులు చేయించాలి? ఆ ప్రశ్నకు సమాధానం ఈ టపా చివర - వారి స్వంత మాటల్లోనే చదువుకోవచ్చు......

ఇహ సీతాఫలానికొస్తే, శీతాకాలంలో విరివిగా లభించే కాయ/ఫలం కాబట్టి , దానికి ఒకప్పుడు తెలుగుదేశాన నివసించిన నియాండెర్తల్స్ చేసిన నామకరణమని మా మావయ్య ఉవాచ, ఘాట్టి నమ్మకమూనూ....అది కాదనే దమ్మూ, ఆయనతో వాదించే ఓపికా మా కుటుంబంలోని అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాల జనాభాలో ఎవరికీ లేవు కాబట్టి అది కరకట్టే అయ్యుంటుందని భవదీయుడి అభిప్రాయం....

గొగ్గులు గొగ్గులుగానైనా ఒక అందమైన వరుసలో ఉండే ఈ గొగ్గు ఫలాల్లో గుజ్జు తీసుకు తినడానికి బోలెడు సమయం పడుతుందని మా ఇంటో చాలా మంది తినేవారు కాదు....మనమేమో ఎడ్డెమనగా తెడ్డెపు బుద్ధి కలవాడవటంతో, వాళ్ళు తినలేదు, తినలేరు కాబట్టి సత్తా చూపించటానికైనా , అరుగు మీద కూర్చుని కాళ్ళూపుకుంటూ మా రోడ్డెంబడి పొయ్యే వారిని చూస్తూ అమ్మ చూడకుండా ఓ అరడజను ఫలాలూ, అందులో ఉన్న గుజ్జు ఉప్ఫున ఊది పారేసి, గింజలేమో తుపుక్కుని ఊసి పారేసి ఆనందభరితుడను కావటం ఒక జ్ఞాపకం.

ఇంటో ఎవరూ తినకపోతే మీ ఇంటో అన్ని సీతాఫలాలెక్కడినుంచొచ్చినై అని అడుగుతున్నావా?

ఛా - చాలా జ్ఞానం ఉన్నది తవఁరికి ...అంతా సీతాఫలం మహత్యమేనా సుబ్బారావూ? 

అది సరే కానీ - మిగతాది చెప్పనీ - అయితే ఆనందం సాయత్రానికల్లా ఆవిరై పోయింది. చెంబు పుచ్చుకోవటం, చెరువు గట్టుకు పోవటం. సింహాసనం అధిష్టించటం. చెంబులు చెంబులు ఖాళీ చేసి నేల కరుచుకుపోవటం. ఇహ చెంబులెత్తలేని పరిస్థితొచ్చాకా, ఆ దేవదేవుడిని ప్రార్థించుకొని కష్టపడి ఓపిక తెచ్చుకుని ఇంటికి పోవటం, అరుగు కింద పడేసిన గింజలన్నీ అప్పుడే చూసిన అమ్మ చేతిలో చావు దెబ్బలు తినటం, తర్వాతి రోజు పొద్దునకు జలుబు చెయ్యటం, ఆ సాయంత్రానికి జ్వరం రావటం, కాంపౌండరు "మార్తి" వారి వద్దకు పోవటం, ఆయనతో తిట్లు తిట్టించుకుని క్రోసిన్ మందు తెచ్చుకుని వేసుకోటం - ఇల్లా బోలెడు గింజలండి....ఎన్ని చెప్పను......

అయితే సీతాఫలం తినటంలో ఉన్న ఆనందం ఏమని చెప్పేది....అది తినటం కూడా ఒక కళ.....చక్కగా మగ్గిన ఫలాన్ని ఎడమ చేతిలో పెట్టుకొని, కింద తొడిమ భాగం వద్ద గట్టిగా పట్టుకొని కుడి చేయి మధ్య వేలుని అటువైపు, బొటన వేలుని ఇటువైపు - సరిగ్గా ఫల మధ్యానికి వచ్చేట్టు సరిచూసుకుని నెమ్మళంగా, నిమ్మళంగా ఒక రెండు నొక్కులు నొక్కగానే - ఫలం కొద్దిగా విచ్చుతుంది. అప్పుడు ఆ విచ్చుడు దారెంబడే కొద్దిగా గట్టిగా నొక్కితే అటు సగం ఇటు సగం చక్కగా చేతిలోకొస్తాయి....అప్పుడు ఎడమ చేతిలో ఉన్న సగభాగం కింద వైపు, అనగా గొగ్గుల వైపు పట్టుకుని నోటి వద్దకు తీసుకొచ్చి, పైనున్న కొద్దిపాటి తెల్లని గుజ్జుని నాకి, చప్పరించాలి.

అలా చప్పరించగానే రుచి నచ్చేస్తే ఎట్లా? ఒక అరనిముషం ఆ గుజ్జుని చప్పరిస్తూ నోరు లోపలంతా పుక్కిలించినట్టు నాలికతో తిప్పితే స్వర్గం బెత్తెడు దూరంలో కనపడుతుందన్నమాట. ఆ బెత్తెడు దూరం పాకటానికి మీరు రెండు చేతుల్లోని సగభాగాల్లోని గుజ్జు నాకాలి...అప్పుడు మీకు జయ విజయులు కనపడతారు.... వైకుంఠ ద్వార దర్శనం ప్రాప్తిస్తుంది....అంటే పోతారని కాదు కానీ, స్వప్నంలాటి , అంతటి నిజాన్ని మీరు ఆస్వాదించవచ్చు.....

సరే వైకుంఠాన్ని పక్కబెడితే, ఎడమ చేతిలో ఉన్న భాగం గుజ్జు కొద్దిగా నాకారుగా? ఇప్పుడు ఎడమ చెయ్యి వేళ్ళనన్నిటినీ ఆ భాగం చుట్టు కమ్మేసి, నోటి దగ్గర పెట్టేసి, నెమ్మదిగా కముకు దెబ్బలేసినట్టు నొక్కితే గుజ్జు మొత్తం లోపలికొచ్చేస్తుంది.....ఆ గుజ్జానందంలో పడిపోయి గింజలు ఉయ్యటం మర్చిపోయేరు....ఒహ వేళ మర్చిపోయారనుకోండి, నిజమైన వైకుంఠ దర్శనం ప్రాప్తిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండేం? అల్లాగే కుడి చేతిలో భాగాన్ని కూడా నాకెయ్యండి....స్వర్గలోక స్వప్న ప్రాప్తిని పొందండి...ఆనందో బ్రహ్మ....

అయితే రోజుకు ఒకటి మాత్రమే తినండి నాయనలారా! చెప్పలేదని ఆ తర్వాత నన్ను మొత్తొద్దు....ఏం?

ఒకవేళ పండిన ఫలం దొరకలేదనుకోండి...చక్కగా పచ్చి కాయలను తెచ్చుకొని ఇంట్లో ఒక మూలగా వెడల్పుగా పోసి వాటి మీద సీతాఫలాల ఆకులు వేస్తే మూడు రోజుల్లో చక్కగా పండుతాయి...ఆగలేమురా నాయనా అనుకుంటే చక్కగా నిప్పుల మీద వేసి కాల్చుకుని కూడా తినెయ్యొచ్చు...బ్రహ్మండంగా ఉంటుంది ఆ రుచి కూడా....

దిక్కుమాలిన గాస్ స్టవ్వుల మీద రుచేం రుచి కానీ, చక్కగా కుంపట్లో ఏస్కుని తినండేం? అల్లా కాల్చుకోలేం నాయనా, మాకు కుంపట్లెక్కడ దొరుకుతై అంతారా? బియ్యం బస్తాలుంటాయిగా అందులో వేసి పెట్టండి....మర్చిపోండి....నాలుగు రోజులయ్యాక బయటకు తియ్యండి...మీ స్వర్గ ఫలం రెఢీ....

సరే...నా జ్ఞాపకాల గింజల గోల ఆపేసి టపా అసలు కథలోకొస్తే - "చిన్ననాటి చేష్టలు - సీతాఫలము" అన్న వేటూరి ప్రభాకర శాస్త్రి గారి రచన ఒకటి ....ఇది 1983/84 మణిమంజరి పత్రికలో ప్రచురితం......

భాష మీద పట్టు ఉన్నవారు "పదాలను" బచ్చాలాట/చెడుగుడు వగైరా వగైరా ఎలా ఆడతారో , అలాగ్గా అనగా సుళువుగా - మనబోటి సామాన్యులకు చూపించే సీతాఫల జ్ఞాపకం ఇది.....ఇందులోని ఇంకో విశేషమేమంటే ఆ చిన్నపిల్లల్లోని అమాయకత్వం, ఆలోచనా పద్ధతి, ఉక్రోషం, ఆనందం, ఉత్సుకత, స్వచ్ఛత - అంతే స్వచ్ఛంగా, నిర్మలంగా, నిమ్మళంగా, అచ్చంగా, ఉన్నది ఉన్నట్టుగా, పొందికగా - పెద్దయ్యాక వ్రాయగలగటం ఒక వరం, కటాక్షం....అందరికీ లభించేది కాదది....

ఆ మహా పండితుడికి, అపర సరస్వతీపుత్రుడికి, మహానుభావుడికి సాష్టాంగ నమస్కారాలతో!

ఇహ చదువుకోండి....


చిన్ననాటి చేష్టలు - సీతాఫలము

---- శ్రీ వేటురి ప్రభాకర శాస్త్రి

దమ్మిడీ కొకటి సీతాఫలము పండు
తమ్ములన్నల మేము తలకొక్కపండు
అమ్మ సమ్మతి గొంటి మారగించితిమి
"అమ్మ! నా కడఁగదే అతీపివాపి !!"

దమ్మిడీ చాలునే అమ్ముతున్నారే
మాయమ్మ కొనిపెట్ట మరియొక్కపండు
అమ్మగా అమ్మగా అయిపోవునేమో
అమ్మగా! అమ్మగా! ఆలసింపకువే

సీతాఫలము చాల శీతళిస్తుంది
జలుబు చేస్తుందిరా జ్వరము వస్తుంది
కొనను పొమ్మని అమ్మ కూకలేసింది
కొనలేదు మఱినాదు కొద తీరలేదు

చేత దమ్మిడి లేదు చేయునది లేదు
ఆతీపిపై వాపి అడచుకోలేను
ఆపండ్లగింజలే ఆటలాడుటకు
రెండు జేబులలోని నిండించుకొంటి
 
గింజలే, గింజలే, గుంజు లేనేలేదు
ఎందు కీగింజలని యేవ తోచునుగొంత
అంతలో నాఫలము నతిమధురిమము తోచు
పారవైచుట యెట్టు? లారగించుట యెట్టు?

 పప్పు తీపేమొ యని పగులగొట్టితిఁ గాని
అది బాద మక్రోటు ఆలుబకరా కాదు
కసుకుమని కొఱికితిని, తుసుకుమనియుమిసితిని
యాక్కులాలా! నోరువోక్కురోక్రై చెడెను


విసిరికొట్టితి గింజలన్నీ
కసరుకొంటిని వాటిఁమీదను
ఒక్కగింజే చేత మిగిలిన
దూహ గొల్పినదీ

నాటి సీతాఫలపు చవు లవి
యూటలూరెను నోటిలోపల
ఏవగింపును గోప ముడిగె నీ
కేమొ తల పొదవెన్

చూచితిని యోచించిచూచితిని మరిమరీ
సీతాఫలపుగింజ చేతఁబట్టుకొనీ
ఒక్కత్రుటిలో గింజ వ్రక్కలై యందులో
మొక్క వెల్వడినట్లు బుర్ధి పొడమినది

మొక్కయది పెద్దదై పెక్కుపూవులుపూచి
పిందెలై కాయలై ప్రిదిలి పండ్లైనట్లు
అవి నేను తినగలిగినన్నితిన్నట్లు మా
యమ్మకును "ఇంద" మనియాసగొల్పినయట్లు

అప్పుడే ఆగింజ జేకొని
యాస లెల్ల ఫలించినట్లై
పాటిదొడ్లో పాతిపెట్టితి
భద్రమగుచోటన్

ముఖము గడిగిన, కాళ్ళు గడిగిన
పుక్కిలించిన, మంచినీళ్లవి
పాదులోనే, నాకు పాదది
ప్రాణపదమాయెన్

నిక్కముగనే మొక్కమొలచెను
నేను నొక జనకుండ నయితిని
బిడ్డవలె నాచిన్న మొక్కను
బెంచదొదగితిని

పాదుచేయుట యెరువువేయుట
పదనుగొల్పుట నీళ్ళుపోయుట
పెరుగసాగిన మొక్కజూచుచు
మురిసిపోవుటయున్

గడచినవి రెండేడ్లుగాబోలు, నేపాతి
మొలపించినది మొక్క పూతపూచినది, నా
కిల్లంత గంతులే, గల్లంతులే, బలే
అల్లకల్లోలమే అది పండ్లుపండెనని

పూవులెన్నో రాలిపోయినవి, నాకెన్నొ
గడబిడల్ మనసులో, పొడమదాపిందెయని
ఎట్టకేలకు నొక్కచిట్టిపిం దగ పడెను
తియ నీరు నే బోసి దినదినము పోషింప

మేకెరువు తియనీరు మేపితిని చెట్టునకు
ప్రాకుతీగల ద్రెంచి పాఱవైచితి, మన్ను
క్రుళ్ళగించితి, చెట్టువ్రేళ్ళు తెగకుండగా
ఆపిందె క్రమముగా నేపునబెరిగినది


ఆనాడు నేదిన్న యాదమ్మిడీపండు
నురువుకంటెను బెద్దపెరిగినది యాకాయ
పచ్చికాయో పండొ ప్రతిదినము పరికింతు
పండిదిగొ తిందునని దండోరవేయుదును

మాయమ్మ చూచె, నది "నాయనా నీచేతి
చలువ సీతాఫలము ఫలియించినదిగాని
కోయకుమి యిప్పుడదికాయ కసుగాయసుమి
పక్వ మగునందాక బాగుగా బెరుగనీ

పెరిగి గింజలగళ్ళు విరిసి లో పిక్కటిలి
పండబాఱినతఱిని బ్రద్దలగు నప్పుడది
యొకనాడుమెత్తబడుటకు దాచియుంచియా
మర్నాడు తింటేను మహరుచిగ వుంటుంది

చెప్పకుండా కాయ చెట్నుంచి కోసేవు
కాయయును నీయాస కడకు వ్యర్థములవును
ఆరముగ్గినపండు అతిరుచ్యముగ నుండు
నన్నదమ్ములు మీరె యారగింతురు గాని"

అమ్మమాటలు నమ్మి యాగితిని గొన్నాళ్ళు
కాయకాయే పగులు కానరాకే పోయే
నే నాగలేనైతి నెరపితిని సాహసము
కత్తితో నొకగంటు గావించితిని దాన

అమ్మతో జెప్పితిని అది పగులు వాసెనని
నామాట తథ్యమని నమ్మినది మాయమ్మ
పగిలితే కోసుకో, పండేనేమో యనెను
కోసుకొనివచ్చితిని కొయ్యవంటిది కాయ
 
కసరుగాయే, కత్తిగంటే, పగులలేదు
ఇదియేమిరా తండ్రి యిట్లు చేసితివనెను
పనికిమాలినకాయ పారవేసెద ననెను
నాకాయ తెమ్మంటి చీకొట్టి తఱమినది

నాకెరుకపడకుండ నాకాయ దాచినది
దాని దెలియగ గోరి తంటాలు పడ్డాను
వెదకితిని వెదకితిని తుదకి గనుగొంటి నది
తవుటిలోపల గ్రుక్కి తట్టలో దాచినది

ఔపడిన దమ్మ నీ దాపరికమన్నాను
ఎంతయావర నీకు ఎట్లు కనుగొన్నావు?
ఉక్క కది మెత్తబడునో యేమొ రెన్నాళ్ళు
తెరచిచూడకురోరి తెలివిమాలినవాడ!

అనియెమాయమ్మనాయాత్ర మెరుగదుగదా
దమ్మిడీ కానాడు తాను గొనియియదాయె
నా చెట్టుకాయనే నన్ను తిననియదాయె
తలిదండ్రులు పెద్దతంటాలు పిల్లలకు

మర్నాడు చూచితిని మరి మెత్తబడలేదు
మఱియొక్కపుటాగి తెరచి చూచితి నంతె
మరికొంతసేపాగి తెరచిచూచితి నంతె
ఎంతయాగిన నంతె యేమిసేయగవచ్చు
 
అందులో నొకచెక్క తిందునని కోసితిని
వట్టివగ, రందు రవ్వంతైన రుచిలేదు
పారవైచితిని గోపారుణాక్షుండనై
ఆరజూచిన దమ్మ నారోతచేత యది

 పండునేమో కాయ పాడుచేసితివిరా
ఇంత తొందరయైన నెట్లురా నీబ్రదుకు
ఎబ్బెబ్బె నీవెంత యేబ్రాసివైతివిర
ఏడ్వవలసినదె నీ వింకేమి చేసెదవు

అని యసహ్యించుకొనె నను గసరుకొని రోసె
అవమాన మయ్యె నా కావురని యేడ్చితిని
నాసొమ్ము నే పాడుచేసుకొన్నా నన్న
గర్వమొక్కటి నాకు దుర్వారమై పొడమె


అవమాన మొకప్రక్క నాగర్వమొక ప్రక్క
పండుచెడెనన్న దుర్భర దుఃఖమొక ప్రక్క
ముప్పేటలై నన్ను ముప్పు త్రిప్పుల బెట్టె
రోతరోతపోయె నాతీరు నాకపుడు


ఆనాడు మానాన్న యఖిలంబు విన్నాడు
అనుచితము చేసితివి, పనికి మాలినవాడ
అనునంతలో నేను గసలుచును బలికితిని
నాచెట్టు నాకాయ నాయిష్టమేకదా

నష్టపడితిని పండు నాకె నష్టముదీన
నెవరిక్ కేమీ యంచు నవకతవకలు పలుక
నౌనోయి యవివేకి! యాచెట్టు నీ చెట్టె
నాస్థలములో నాటినాడవది యెఱుగుమా

నీవు నాబిడ్డడవు గావునన్ నావాడ
వే, యింతకును నెవ్వడేని యెదియేని యిది
నాది యని చెప్పుకోగా దగుట కద్దాని
జక్కరక్షింపదగు సామర్థ్యముండవలె
 
అది లేనివా డెవడు నిది నాది యనఁదగడు
అని యిట్లు మానాన్న మనసునొవ్వనియట్లు
మందలించెను నన్ను మందమందమ్ముగా
సిగ్గునం జిదికితిని సీతాఫలమువలన

చదువుచే తప్పిదము సవరించుకొందునని
పాఠములు రాత్రిదీపముముందు తెఱచితిని
తెనుగుపద్యములలో మొనగాడ నగుటచే
వేమన్న పద్య మది వేమారు చదివితిని


తామసించి చేయఁదగ దెట్టికార్యంబు
వేగిరింప నదియు విషమ మగును
పచ్చికాయ దెచ్చి పడవేయ ఫలమౌనె
విశ్వదాభిరామ   వినురవేమ

ఏమిరా చదివెదవు వేమన్న పద్యమా
వ్యర్థమే నీ చదువనర్ధమే చేసితివి
తెలివిగలవాడవైతే యిట్లు చేతువా
యనుచు మానాన్న పద్యార్ధము వివరించె

ఈపద్యమున నాకు లోప మొక్కటి తోచె
నాన్న! అది యడుగదగునా? అంటి, నడుగుమనె
వేగిరించిన నదియు విష మగు ననుదాని
కా పచ్చికాయ-ఫలమౌనె యను కథ చెల్లె

తామసంబున చేయదగదు కార్యం బనుట
కేదికథ? పద్యమున లేదేమి? లోపమిది
నాబుద్ధి దిద్దుటకె కాబోలు నీనాడు
పాఠమున వచ్చినది పద్యమిది యంటి

సీతాఫలము నీవు చెరచినా వనునేవ
తొలగె నీకీ ప్రశ్న తోచినది కాబట్టి
పండితుడవై నీవు ప్రథితిగాంచెద వేమొ
చదువుమా నాతండ్రి సత్కావ్యములు చక్క

 గుర్తించి సత్కృతుల గుణదోషముల నిట్టు
లాత్రపడెదవొ యేమొ ఆ చదువులో గూడ
సీతాఫలపు కథను చిరము స్మరియింపుమా
బుద్ధిగలవాడవై వృద్ధి పొందుమ తండ్రి

కవి వౌదువేని యీకథ కబ్బ మొనరింపు
మట్లె వేమన్న పద్యమున గల లోపమును
తామసంబున జేయదగ దెట్టి కార్యమను
దానికథ నొక దాని బూని రచియింపుమా
 
ఆనాటి మానాన్న యాశీర్వచన మెట్లు
ఫలియించెనో నేను పలుకజాలను గాని
ఆనాడు నేనాటినట్టి సీతాఫలము
ఫలియించుచున్న దిప్పటి కెన్నె ఫలములను6 comments:

 1. beautiful poem and your commentary is nice

  ReplyDelete
 2. సీతాఫలం గురించి చక్కగా వివరించారండి. సీతాఫలం తినటం ఇలా కూడా ప్రయత్నించి చూడండి. పండును నెమ్మదిగా రెండు భాగాలుగా చేసి చిన్న స్పూన్ తో , కప్పులోనుంచి అయిస్ క్రీం తిన్నట్లుగా , కొద్దికొద్దిగా తీసుకుని తినటమే. అంతా తిన్నాక పండు తొక్కమాత్రం మిగులుతుంది. చేతికి ఏమీ అంటుకోదు.

  ReplyDelete
 3. @anrd - ఇప్పుడంటే స్పూన్ల సుకుమారం పెరిగింది కానీ, నాలుగు దశాబ్దాల క్రితం స్పూనుతో తింటానని అన్నవాడిని, అడిగినవాడిని భూతవైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళేవాళ్ళు....

  అయినా చేతికంటకుండా సుకుమారంగా తింటే వేళ్ళ మీద మిగిలిపోయిన గుజ్జు నాక్కోటం ఎట్లా? ఆ నాక్కోటంలోని ఆనందం తెలిసేదెట్లా....వేళ్ళను నాకితే వచ్చే ఆనందం స్పూనును నాకితే వస్తుందా?

  మధ్య మధ్యలో వేళ్ళతో పిసగ్గా గుజ్జులో కలిసిన తొక్కను తినటంతో రెండింతలయ్యే రుచి స్పూనుతో వచ్చేనా?

  ఇల్లా ఇంక బోలెడు ప్రశ్నలొచ్చేస్తాయండీ.... :)

  ReplyDelete
 4. |నాక్కోటంలోని ఆనందం తెలిసేదెట్లా....వేళ్ళను నాకితే వచ్చే ఆనందం స్పూనును నాకితే వస్తుందా?|

  :).

  పోతే సీతాఫలం మాధుర్యాన్ని మళ్ళీ గుర్తుతెచ్చారు. హైదరాబాదెళుతూంటే (తెనాలి నుండి అప్పటి నాగార్జున ఎక్స్‌ప్రెస్‌లో) మిర్యాలగూడ రాగానే వీటి వాసన తగిలేది. ఇక మిర్యాలగూడ నుంచీ అలా ఆస్వాదిస్తూ హైదరాబాదు చేరేవాడిని.

  ReplyDelete
 5. సీతాఫలం అంటే నాకెంతో ఇష్టం. ఎన్ని పళ్ళైనా తినవచ్చు. తిన్నవెంటనే నీళ్ళు త్రాగాలి. సీతాఫలాలకు విరుగుడు నీళ్ళు.
  ‘వస్తుగుణదీపిక’లో ....
  శీతాఫలము - Anona Squamosa. White custard apple. (సంస్కృతం - సీతాఫల, అతాపిఫల; హిందీ - సీతాఫల్, షరీఫా)
  కాకజేసి చలువ జేయును. రక్తమును, ఇంద్రియమును వృద్ధిచేయును. గుండెకు, మనస్సుకు బలము నిచ్చును. జీర్ణశక్తి నిచ్చును. క్రిమిని హరించును. మేహవాతము నణచును. శ్లేష్మమును పెంచును. కొద్దిగ పైత్యమును చేయును. అగ్నిమాంద్యము గలవారికి జ్వరమును దెచ్చును. దీనికి విరుగుడు నీళ్ళు దాహము పుచ్చుకొనుట. పండుగుజ్జు వేసి కట్టిన వ్రణములు శీఘ్రముగా పక్వమై పగులును.

  ReplyDelete
 6. శంకరయ్య మాష్టారు గారికి నమస్కారాలు...

  సీతాఫలానికి విరుగుడు - నీళ్ళన్న విషయం గుర్తు చేసినందుకు ధన్యవాదములు... పల్లీలు తిన్నాక నీళ్ళు తాగితేనూ, సీతాఫలం తిన్నాక నీళ్ళు తాగకపోతేనూ - పరిస్థితి హరహర మహాదేవ అనే అమ్మమ్మ గుర్తుకు వచ్చింది....

  ReplyDelete