Tuesday, October 18, 2011

సౌమ్యవాది మానిఫెస్టో - శ్రీ శ్రీ - సౌమ్య నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం (1969) - ఆకాశవాణి విజయవాడ

సౌమ్యవాది మానిఫెస్టో
- శ్రీ శ్రీ

(సౌమ్య నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం (1969) - ఆకాశవాణి విజయవాడ)

సౌజన్యం :- శ్రీ మాగంటి శివరామ శర్మ గారి పాత డైరీ

నాన్నగారి వద్ద ఉన్న ఆడియో టేపు పూర్తిగా పాడైపోటం వల్ల ఆడియో వినిపించే భాగ్యం దక్కలా!...

ఎవరివద్దనైనా ఉంటే పంచుకోండి బాబూ - ముందస్తు ధన్యవాదాలు...

ఆడియో పాడైపోతే పాఠం ఎక్కడ దొరికిందా?

పోష్టు చదివే అడిగావా?

"పాత డైరీ" అని చెప్పాగా! మా నాన్నగారికి ఈ టేపుల మీద నమ్మకం లేక డైరీలో కూడా పాఠం, పాఠాంతరం రాసుకునేవారు...అదీ సంగతి....

భవదీయుడు
వంశీ


***************************

ఉగాది కవి సమ్మేళన
శుభోదయావసరాన
సౌమ్య నామ వర్షానికి
స్వాగతమగు సమయాన

భావి జాడ చూడనిచ్చు
దూరదర్శినీ యంత్రం
పట్టుకు వద్దామంటే
బజారులో దొరకలేదు

కవులను ద్రష్టలుగా జమ
కట్టు రివాజుంది కనుక
కళ్ళుమూసుకుంటే ఏం
కనిపించిందో చెబుతా

గాఢ తిమిర మధ్యంలో
కాంతుల రాకడ చూశా
మానవేతి హాసంతో
మలుపుల పోకడ చూశా

అయినా ముంజేతి కంక
ణాని కద్ద మెందుకులే
జరుగబోవు సంఘతనలో
ఛాయల ప్రసరించునులే

పగలు వెనుక చీకటులూ
రేయి గడచి వెల్తురులూ
వస్తాయనడానికి జ్యో
తిష్కులతో పనేలేదు

చనిపోయే వాళ్ళంతా
చస్తూనే ఉంటూంటే
జనియించే వాళ్ళంతా
వస్తూనే ఉంటారు

హఠాత్తుగా గ్రహమేదో
అవనీ స్థలిని ఢీకొని
ప్రళయం వచ్చేస్తుందని
భయపెట్టను జడవకండి

శాస్త్రజ్ఞాన మధ్యను
చాదస్తం నిండవచ్చు
మూడుకాళ్ళ కుందేళ్ళకు
మూఢ భక్తులుండవచ్చు

భూలోకపు సరిహద్దులు
కుంచించుకు పోతూంటే
అంతర్గ్రహ యాత్రలకై
అహమహమిక పెరుగుతోంది

త్వరలోనే చంద్రునిపై
నరుడు చరణమూను దినం
ఈ యేడే వస్తుందని
యెవరైనా చెప్పవచ్చు

మానవ స్వభావంలో
మాలిన్య మదేమొకాని
తలలైతే తారలలో
పొరలడమో బురదలోన

మానవులంతా ఒకటని
మనిషి గ్రహించే సుదినం
ఇంతట్లో వచ్చేస్తూ
చన లేవీ కనరావు

అందుచేత ఐకమత్య
మంటూ ఘోషిస్తే ఇది
కేవలమూ కంఠశోష
మూకాంధక బధిరఘోష

ఇతరేతర దేశాల్లో
సతమతాల సంగతి కేం?
భారత నాటకరంగ
ప్రదర్శనలు చూదామా

రాష్ట్రాల్లో రాజకీయ
మర్కటాల కర్కటాల
సర్కస్ ఫీట్లూ, పందెపు
కుక్కుటాల పొట్లాటలు

భాషలవారీ సేనలు
ప్రజారక్ష కొరకేనట
శివాల సేనలుచేసే
సవాలు సుస్పష్టంకద

విచిత్రమేమంటే మన
విశాలాంధ్ర గృహమందే
వేరువేరు వంట గదులు
కోరిపోరు ధోరణులు

తిరుగుబాటు పేరిట ది
మ్మరులు చేయు హంగామా
చీలికవాదుల సంఘపు
సెక్రటరీ చిరునామా

అసలు సమస్యల జోలికి
ససేమిరా పోనివాళ్ళు
స్వప్రయోజనాలకు భే
షైన రంగు పులుముతారు

ఆధునిక సమాజానికి
ఆర్థికమే కీలకమని
తెలిసికొనీ తెలియనట్లు
తిరగేస్తే ఫలమేమిటి

చూశావా గాంధీజీ
దేశం ఈదేశం నీ
దేశం ఎటు పోతోందో
చూశావా! చూశావా!

నేతృత్వ దరిద్రమైన
నీ జాతిని చూశావా
దేశం ఏమవుతోందో
చూశావా! బాపూజీ?

ఇది నీ శత జన్మదినో
త్సవ వత్సర మవుటవల్ల
కాస్త ప్రస్తుతానికి అ
ప్రస్తుతమై వినబడ్డా

వినిపిస్తా నీ వొసగిన
సామరస్య సందేశం
సకల భారతీయ జనత
ఒకటే అని ప్రకటిస్తా******************************

No comments:

Post a Comment