Friday, October 21, 2011

శ్రీ శ్రీ ఆకాశవాణి ప్రసంగం (1958)


కొందరు సాహితీ సేవకే పుడతారని తెలుస్తుంది. పని చేసి హడావిడిగా వెళ్ళిపోతారెందుకో మరి ! అలా వెళ్ళిపోయిన విమర్శకుడు, కవి అయిన శ్రీ శ్రీ ఆప్త, ఆత్మీయ మిత్రుడి చిత్రమిది ! శ్రీ శ్రీ కి కుడి భుజం, కుడి కన్నూ ఇతడే. "ఉదయిని" పత్రికను నడిపి, నష్టపోయి, ఆరోగ్యం పోగొట్టుకొని అకాల మృత్యువు వాత పడ్డాడు. డా. ఏటుకూరి ప్రసాద్ ఇతనిపై మంచి పుస్తకం రాసేదాకా ప్రతిభా వంతుని గురించి లోకానికి తెలియదు. ఆధునిక కావ్యాలలో ముప్ఫైసార్లు పునర్ముద్రణ పొందిన ఏకైక కావ్యం "మహాప్రస్థానం" ! గొప్ప కావ్యాన్ని

"తలవంచుకు వెళ్ళిపోయావా నేస్తం !
సెలవంటూ లోకాన్ని వదిలి......!

అంటూ శ్రీ శ్రీ ఇతనికి అంకితమిచ్చాడు
 అతనే చిత్రంలో ఉన్న కొంపెల్ల జనార్దన రావు

శ్రీ శ్రీ - కొంపెల్ల జనార్దనరావు - సమానధర్మాలు - ఆకాశవాణి ప్రసంగం (1958)

ఇది ఆ ప్రసంగం పూర్తి పాఠం కాదు కానీ - శ్రీ శ్రీ గారు 1958 - ఆకాశవాణి ప్రసారికలో జనార్దన రావు గారి గురించి ఇలా చెప్పుకొస్తారు

"మా ఇద్దరి మధ్యా సమానధర్మాలేమిటి. ఒక్కొక్కటే చెప్పుకొస్తాను.

1. ఇద్దరం యించుమించు సమవయస్కులం.
2. ఇద్దరికీ ఆడంబరం అంటే ఇష్టం లేదు.
3. ఆ రోజుల్లో ఇద్దరం సాహిత్యం అంటే పడి చచ్చేవాళ్ళం.
4. విశ్వనాథ కవిత్వం అంటే ఇద్దరికీ ఎడతెగని మోజు.
5. సాహిత్యానికొక సాధికారమైన వేదిక ఉండాలనీ, అదీ పత్రికారూపంలో ఉండాలని ఇద్దరం దృఢంగా విశ్వసించాం.
6. పత్రికల నిర్వహణలో పెట్టుబడిదారీ విధానం ప్రత్యక్షంగా పనిచేస్తోందని అతను లోపల నుంచీ, నేను పై నుంచీ ఆరోజుల్లో గ్రహించాం.
7. డబ్బులేని
పత్రికలు బతకవని ఇద్దరికీ తెలుసు కని ఆ డబ్బు ఎలా ఆర్జించాలో ఇద్దరికీ తెలియదు. ఇరవై యేళ్ళ తర్వాత ఇప్పుడిప్పుడే నాకు ఈ టెక్నిక్ తెలుస్తోంది.
8. ఇద్దరి జీవితాలనీ సాహిత్యానికే అంకితం చెయ్యాలని అనుకున్నాం
9. ఇద్దరిలోని మితవాదతత్వం లేదు. ఏ యెండకాగొడుగు పట్టడం అంటే ఇద్దరికీ అసహ్యం.

మరి వైరుధ్యాల మాట

1. అతనికున్నంత క్లాసికల్ లెర్నింగ్ నాకు లేదని నా దిగులు. నాకున్న కాలేజి ఎడ్యుకేషన్ తనకు లేదని అతని బెంగ. కాని స్వయంకృషితో అతను ఆంగ్ల సాహిత్యాన్ని అధ్యయనం చేశాడు. సంస్కృతంతో సరాసరి పరిచయం లేకపోయినా మన సంస్కృతిని నేను ఒంటపట్టించుకున్నాను.
2. అతను చచ్చిపోయీ బతికున్నాడు. నేను బతికుండీ చచ్చినట్టు పడి ఉన్నాను. అతను చెయ్యదలచుకున్నంతా చెయ్యలేకపోయాడు. నేను కొంతలో కొంతైనా చేశాను. ఇంకా చేస్తాననే ధైర్యమూ ఉంది. ఈ ధైర్యమే ఇంకా నేను బ్రతికుండడానికి కారణం.

జనార్దనరావు గురించి నేను చెప్పిందీ చెప్పగలిగిందీ ఇంకేముంది - ఈ ప్రసంగం ఎలా ముగించడం? ఏమీ తోచలేదు. కీట్సు చనిపోయినప్పుడు షెల్లీ మూల్గిన మూల్గుతో ముగిస్తా...

ఐ లివ్ ఫర్ ఎడోనిస్.
"


నాలుగు పేజీల పూర్తి పాఠం ఒకట్రెండు రోజుల్లో వెబ్సైటులో చూడవచ్చు....


ఆడియో ఎవరి వద్దనైనా ఉంటే పంచుకోవలసిందిగా మనవి...


భవదీయుడు
వంశీ 

 

No comments:

Post a Comment