Thursday, October 6, 2011

భైరవి (1935) - శ్రీ పురిపండా అప్పలస్వామి

గిడుగు రామమూర్తి పంతులు గారు ప్రారంభించిన వ్యావహారిక భాషోద్యమాన్ని ఆయన తర్వాత కొనసాగించిన వాడుకభాషా యోధుడు. వాడుక భాషలో భారత రామాయణాలు రాశాడు. ఒరియా కధల్ని తెనిగించాడు. అంతేకాదు - మొట్టమొదటగా శ్రీ శ్రీ కవితను అచ్చువేయించాడు - ప్రభవ కావ్యాన్ని ప్రచురించాడు. 'పులిపంజా' విసిరాడు. అభ్యుదయ ఉద్యమానికి అంకితమయ్యాడు. 

ఆయనే పురిపండా అప్పలస్వామి




అపురూప చిత్ర సౌజన్యం - డాక్టర్ ద్వా.నా.శాస్త్రి



శ్రీ పురిపండా వ్రాసిన "భైరవి" ఈ క్రింద చదవండి...
(ఉదయిని పత్రిక (1935) - దసరా సంచిక నుండి )

భైరవి

-- శ్రీ పురిపండా అప్పలస్వామి

పాతిన శిశువుల
లేత దేహములు
విందులు కుడిచే
       నక్కల్లారా!
        భూతాల్లారా!

కుళ్ళిన శవాల
మాంసం తింటూ
పాటలు పాడే
       పురుగుల్లారా!
       గృధ్రములారా!

కటికిదరిద్రుల
బికారిరైతుల
పీకలు నులిమి
రక్తం త్రాగే
       మెకముల్లారా!
       వృకముల్లారా!

ఎముకల కోసం
కయ్యాలాడే
       కుక్కల్లారా!

కర్దమమందే
కాయం మరచే
       పందుల్లారా!

భావిప్రపంచం
మిథ్యంటారా?
భూదేవతనే
వంచిస్తారా?

పాపం పుణ్యం
పవళ్ళు రేలూ
స్వర్గం నరకం
దేఁవుడు దెయ్యం
బొం కంటారా?

కనుపడలేదా
కళ్ళే ఉంటే
భావి దృశ్యముల
ప్రళయజిహ్వికలు?

మీ దేహాలూ
మీ భోగాలూ
భుగభుగ మండే
చితాగ్నులందూ,
ఘూర్ణిల్లే వై----
తరణీ నదిలో

కనుపడలేదా
మీ ఆత్మలపై
చిచ్చుల పిడుగులు
విచ్చిన కోరలు
గరళం క్రక్కే
       సర్పాలూ,
ప్రేవులు చీల్చే
        శాపాలూ!

No comments:

Post a Comment