Monday, August 8, 2011

ఆలస్యం చేసారో - మీ అంత దురదృష్టవంతులు ఉండరు....!

"ద టూ ఎస్కొబార్స్"

సౌత్ ఆఫ్రికా క్రికెట్టు జట్టు కెప్టెన్ హాన్సీ , సంజయ్ చావ్లా, అజహరుద్దిన్ వగైరా వగైరా - క్రికెట్టు మాచుల ఫిక్సింగు వార్త విని/చదివి ఆశ్చర్యంతో నోళ్ళు వెళ్ళబెట్టిన 2000వ సంవత్సరం నుంచి పదకొండేళ్ళు రీలు ముందుకు తిప్పితే మళ్ళీ అలా నోరు వెళ్ళబెట్టిన రోజు - ఆగస్టు ఏడో తారీకు, 2011....అయితే వినో/చదివో కాదు...చూసి ....

ఏం చూసి?

సినిమా చూసి....సినిమా అంటే సినిమా కాదనుకో...డాక్యుమెంటరీ....

వాల్దెర్రామా, ఆంద్రె ఎస్కొబార్ - ఈ పేర్లు 90వ దశకంలోని సాకర్ అభిమానులకు, సాకర్ ప్రపంచంలోకి తోకచుక్కలా దూసుకొచ్చేసిన కొలంబియా దేశాన్ని అభిమానించేసిన సాకర్ ప్రేమికులకు పరిచితమైన పేర్లు....ఆ తోకచుక్క అభిమానుల్లో నేనూ ఒకణ్ణి.....

ఆర్జెంటీనా మీద అంతవరకూ ఎవరూ సాధించని 5 - 0 స్కోరును నల్లబోర్డు మీద తెల్లగీతలా గీసేసినందుకు - ఆ మాచి హైలట్లు చూసి వీరాభిమానినైపోయా....  అప్పటికి ఆంద్రె అంటే చాలా మటుకు తెలుసు కానీ, పాబ్లో అంటే మన దావుద్ ఇబ్రహీం లా ఒక మంచి వ్యక్తి అని మాత్రమే తెలుసు.....కానీ ఇద్దరికీ బోల్డు లంకెలున్నాయని తెలియదు......

సరే "రింగులు" తిప్పటం ఆపేసి.... డాక్యుమెంటరీలోకొస్తే - పాబ్లో ఎస్కొబార్ , ఆంద్రె ఎస్కొబార్ (అసలైతే పాబ్లొ ఎస్కొవార్, ఆంద్రె ఎస్కొవార్ అని పలకాలి...) - ఈ ఇద్దరూ, నాణేనికి రెండు ముఖాలు ఎట్లా ఉంటవో అట్లా అన్నమాట.....ఆ నాణెం పేరు కొలంబియా అనుకుంటే ఒక ముఖం పాబ్లొ, ఇంకో ముఖం ఆంద్రె....

పాబ్లో పేరు చెబితే గడగడలాడేవారు ఎంతమందో, అభిమానించేవారు అంతమందే.....ఆంద్రె పేరు చెబితే అంతా అభిమానించేవారే......పేదరికం కష్టాలను సహించలేని పాబ్లొ రాబిన్ హుడ్ లా ధనికులను దోచుకోటం మొదలుపెట్టి, ఆ దోచుకున్న ధనం తనలాటి పేదవారికి పంచిపెట్టి, ఆ తర్వాత ఏ కారణానికో రక్తం రుచి మరిగిన పులిలా కాచుక్కూర్చుని దెబ్బ మీద దెబ్బ వేసి కొలంబియా అండర్ వరల్డ్ రారాజుగా వెలిగిపోతూ, గవర్నమెంటును శాసించే స్థాయికి ఎదిగిపోతాడు....డ్రగ్స్ బిజినెస్సుతో ఇహ తిరుగులేకుండా పోతుంది పాబ్లొకి....

అయితే ఈ డ్రగ్స్ బిజినెస్సును ఉత్తర అమెరికా ఖండానికి విపరీతంగా వ్యాపింపచేసేసిన పాబ్లో, మూలాలు మర్చిపోకుండా ఆ డ్రగ్స్ బిజినెస్సులో వచ్చిన ధనంతో పేదవారికి కొన్ని వేల  ఇళ్ళు, స్కూళ్ళు, హాస్పిటల్సు కట్టించి తన పని తను చేసుకుపోతూ ఉంటాడు......ఆ పనుల్లో భాగంగా సాకర్ టీములకు ఓనరుగా మారిపోటం కూడా ఒకటి.....డబ్బుల కోసం కానివ్వండి దేనికన్నా కానివ్వండి - విధివశాత్తు ఆంద్రె పాబ్లొ టీముకు ఆడవలసి వస్తుంది....

పాబ్లో చేస్తున్న ఈ డ్రగ్స్ గోల తట్టుకోలేని పెద్దన్న (అమెరికా) రంగంలోకి దిగగానే పాబ్లొ పరిస్థితి కొద్దిగా తారుమారవుతుంది.....ఆ పెద్దన్నను తట్టుకోటానికి, తనని అమెరికాకు అప్పగించెయ్యకుండా ఉండటానికి రాజకీయాల్లోకి ప్రవేశిస్తాడు ఈ మాఫియా కింగు......

ఆ తర్వాత ఆంద్రె పరంగా, పాబ్లొ పరంగా - జరిగింది చాలామందికి తెలిసిన విషయమే అయినా, తెర మీద చూస్తే ఓహో అసలు సంగతులు ఇవన్న మాట అని బహువిధాలుగా ఆలోచిస్తూ ఉండిపోతారు..... 

పాబ్లొ తన మాఫియా సామ్రాజ్యస్థాపనకు వేసిన అడుగులు, ఆంద్రె తన సాకర్ ప్రపంచ స్థానకు వేసిన అడుగులు చాలా హృద్యంగా చిత్రీకరించుకొచ్చారు దర్శకులు జెఫ్ జింబాలిస్ట్, మైకేల్ జింబాలిస్ట్..... అన్నీ నిజమైన పాత్రలు, వారికి సంబంధించిన నిజమైన క్లిప్పులు పెట్టడంతో ఒక "మాంఛి" ఉత్కంఠతో సాగింది సినిమా.....


పాబ్లొ తన ప్రస్థానంలో వేసిన అడుగులు , చేసిన పనులు తప్పా అన్న విషయానికి వస్తే ఈ డాక్యుమెంటరీ చూసి మీరే నిర్ణయించుకోవాలి.....కొద్ది రోజులు పోతే మన దేశంలో పాతుకుపోతున్న, పోయిన అవినీతి భూతాన్ని చూస్తే కొలంబియా పరిస్థితి మనకొస్తుందేమోరా నాయనా అన్న భయం ఒక్క లిప్తకాలం వెంటాడింది.....

డాక్యుమెంటరీ - ఆ మురికివాడలు, అందులోని బడుగు జీవాలు చూస్తే మన మురికివాడలు, రోడ్డు పక్క ప్లాస్టిక్కు కవర్ల టెంటులేసుకుని బతుకుతున్న మన ప్రజ గుర్తుకొచ్చి ఓ నిముషం కలుక్కుమన్నది....

అయితే నిత్యం సమస్యలతో కొట్టుమిట్టాడే ఆ బడుగు జీవాలకు - చిన్నపాటిదే అయినా - సాకర్ ఆటలో ఆణిముత్యాలని ఏరుకొచ్చి వాళ్ల ఆటను జనాలకు పరిచయం చేసి, ఆ ఆటను చూడ్డానికి వచ్చేట్టు చేసి, ఆ ఆటలో మునిగిపోయిన కొద్దిసేపు తమ తమ కష్టాలు మర్చిపోయేలా చేసి, ఇళ్ళు కట్టించి ఇవ్వటంతో, స్కూళ్ళు, హాస్పిటల్సు కట్టించి ఇవ్వటంతో- అసలు సంతోషం అంటే ఏమిటి అని తెలియచెప్పిన పాబ్లో అనే మనిషి గొప్పవాడా?

డ్రగ్స్ నుంచి వచ్చే ధనం కోసం, తన సర్కిల్ ను కాపాడుకోటం కోసం, చివరికి తన ఉనికిని కాపాడుకోవటం కోసం ఎంతటి కార్యానికైనా ఒడిగట్టిన పాబ్లో అనే మనిషి హీనుడా ?

- అన్న ప్రశ్నలే కాక ఇతరమైన అనేక ప్రశ్నలు బోల్డు కందిరీగల్లా మిమ్మల్ని చుట్టేస్తే అది ఆ డాక్యుమెంటరీ తప్పు కాదు........

ఒక మెరుపేమిటంటే - తన సామ్రాజ్యంలో "కిడ్నాప్" లకు తావు లేకుండా, ఇతరమైన నీతి నిబద్ధతలతో బతికిన మనిషి పాబ్లో అని తెలిసి ఆశ్చర్యమనిపించింది....

అదేమిటి - అంతా పాబ్లొ గురించే చెప్పావు , ఆంద్రె సంగతేమిటీ అని అడుగుతున్నారా?

అది మటుకు చూసి తెలుసుకోవాల్సిందే మేష్టారూ! చెప్పేది కాదు.... 

ఇతర వివరాలు కావాలనుకున్నవారు ఇక్కడ చూడవచ్చు

http://www.the2escobars.com/

తప్పక చూడవలసిన, తీరాల్సిన డాక్యుమెంటరీ ఇది......ఆలస్యం చేసారో - మీ అంత దురదృష్టవంతులు ఉండరు....

Finally - I will say that it's one of the most powerful documentaries ever made.........left a scar, a big one on my heart! 

AhA! Say what - Who cares about your scar? 

Watch this documentary and tell me - what did it do to you - YOU dumb, dumber, dumbest  !


భవదీయుడు
వంశి


PS: ఈ డాక్యుమెంటరీలో పాబ్లొను చూసాక, అనగా ఇతరంగా కాక ముఖారవిందం రీత్యా మాత్రమే  - మన ఆంధ్రదేశంలో "ఇప్పుడు" ఒక చక్రం తిప్పుతున్న వ్యక్తి గుర్తుకు రావట్లా? ఎవరో చెప్పుకోండి చూద్దాం.....పేరు అంత ప్రముఖంగా బయటకు వినపడకపోవచ్చు కానీ, చాలా చక్రాలున్న వ్యక్తి..... 1 comment:

  1. వంశీ గారు

    దీని గురించి ఇక్కడ తెలియచేసినందుకు కృతజ్ఞతలు. గత కొన్ని నెలల్లో ఇంత చక్కటి డాక్యుమెంటరీ చూడలేదండి. ఇంటర్నెట్లో ఎలాగో సోదించి సాధించి, చూసాను. చూస్తున్నంతసేపు మధ్య మధ్యలో నాలో కలిగిన బావాలు చెప్పనలవి కానటువంటివి. తప్పకుండ మన ఇంటి " దృశ్య మాలికలో " ఉండవలసినటువంటి చిత్రం. ఈ చిత్రంలో ఉన్న ఇద్దరు ముఖ్య పాత్రలు వారి వారి భావాలకనుగుణంగా జీవిస్తారు. నాకెందుకో వారిద్దరిలో ఎవరిదీ తప్పు అనిపించలేదు. తీర్పు కష్టమే.

    రాజేష్ దేవభక్తుని.

    ReplyDelete