Friday, August 26, 2011

ఏమయ్యా , సాక్షి న్యూసు పేపర్ చూశావా ఈవేళ?

ఏమయ్యా, సాక్షి న్యూసు పేపర్ చూశావా ఈవేళ?

లేదు ఏం?

ఓ సారి వెళ్ళి చూడు....లంకె ఇదిగో


http://sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=25807&Categoryid=11&subcatid=23


అల్లా న్యూసు పేపర్లో మన పేరు చూసుకుంటే కొద్దిగా ఛాతీ ఉబ్బదూ?

లేదయ్యా  - ఉబ్బలేదు కానీ, కొద్దిగా అణిగింది.....రెండు వారాల నుంచి వెబ్సైటు వైపు పోనందుకు - సాక్షి వారి ఈ న్యూసు ఐటం ఆ బాధ్యత గుర్తు చేసింది......ఎవరు ఆ ఐటం వ్రాసారో తెలియలేదు కానీ, వారికి హృదయపూర్వక ధన్యవాదాలతో

లంకె ఈవేళ్టి న్యూస్ పేపర్లోది కాబట్టి, ఖర్మకాలి మీరు ఈ పోష్టు ఒకవేళ రేపు చూస్తే ఆ న్యూస్ పేపర్ ఆర్కైవ్స్ లో వెతకవలసి ఉంటుంది...లేదా ఈ క్రిందనున్న బొమ్మ మీద కూడా నొక్కొచ్చు, చదవచ్చు...


ఈ వార్త తెలియచేసిన జ్యోతి గారికి ధన్యవాదాలతో....

భవదీయుడు
వంశి

PS: వెబ్సైటులో చేర్చబడిన సమాచారానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ....

Wednesday, August 24, 2011

ఎవరి రోడ్డు బాగుందో ఏంటో?

ఎవరి రోడ్డు బాగుందో ఏంటో?

ఈవేళ నా ఖాతాలో రెండు
మా ఆవిడ ఖాతాలో ఒకటి

పడ్డాయయ్యోయ్

ఏమిటీ పడింది?

ఆక్రిలిక్ పెయింట్స్ బ్రష్షులమీదకెక్కించి కాన్వాసును కుమ్మితే భీకరమైన బొమ్మలు పడ్డాయి...చూసుకోండినాది....

 ఆవిడది 

ఇద్దరూ కూడబలుక్కుని రోడ్ల మీద రోడ్లు వేసారే?

కాదు బాబాయ్ - నేనేసింతర్వాత ఆవిడ ఫాల్ కలర్స్ వేద్దామని ఆ థీములో రోడ్డు కలిపింది....

పట్టిన సమయం - సుమారు 25 నిముషాలు....


ఇహ మన రెండో బొమ్మ


 అదండీ ఈవేళ్టి బొమ్మల కథ

భవదీయుడు
వంశి

సముద్రంలో జీవాలండి!!....పొద్దు గుంకే సూరీడండి!!....

కూతురు వేసిన బొమ్మలు రెండు.....

ఒక సారి చూపిస్తే చాలు, ఈ పిల్లలు ఎంత తొందరగా పట్టుకుంటారో అని ఆశ్చర్యం వేస్తుంది అప్పుడప్పుడు...

మంచి పెయింటింగు టీచరెవరన్నా దొరికితే బాగుండబ్బాయా!


సముద్రంలో జీవాలండి....
అవ్వేమిటో మీరు చెప్పాలండికొండలు, మబ్బులు, సముద్రాలండి
పొద్దు గుంకే సూరీడండి....


Tuesday, August 23, 2011

దడ దడ బొమ్మ - 2

దడ దడ బొమ్మ - 2

Aug 23, 2011


Monday, August 22, 2011

దడ బొమ్మ - 1

దడ బొమ్మ - 1

ఇప్పుడేగా ఆవలింతలు పూర్తవుతున్నాయ్.....సున్నితమైన దడ అన్నమాట.....
ఆనందో బ్రహ్మ....

భవదీయుడు
వంశి...

PS: Here is the final piece - Final Touches given by my "bharyamani" Smt Maganti Sridevi - Woo Hoo! Yes....She is a wonderful painter - far better than me! and that is the TRUTH..LOL!


Sunday, August 21, 2011

మీలో ఎవరికన్నా దడ దడ లాడించుకోవాలనున్నదేమోనని.....సుతారంగా ఉంటుందయ్యా....ఖంగారు పడనఖ్ఖరలేదు....

అల్లప్పుడెప్పుడో ఆబ్స్ట్రాక్ట్ పెయింటింగులంటే చాలా మందికి అర్థం కాని రోజుల్లోనే మనం ఆ అబ్స్ట్రాక్టునంతా ఔపోసన పట్టేసి , కుటుంబ సభ్యులని, కాలనీ జనాలని, కాలేజి జనాలని  దడ దడ లాడించటం జరిగింది....

మళ్ళీ ఏదో డబ్బాలోకి, అదే - సొంత డబ్బాలోకి కుక్కుతున్నావేమిరా నాయనా....

అది కాదు సుబ్బయ్యా.....మన దగ్గిర కళ ఉన్నప్పుడు కలాపోసకులకు, ఇదిగో నాదగ్గర ఫలాన కళ ఉందయ్యా అని తెలియచెప్పాలి కదరా నాయనా....

అవుననుకో! అయినా నువ్వు ఔపోసన పట్టేస్తే దడ దడ ఎందుకయ్యింది జనాలకు?

ఓ - మంచి ప్రశ్నే - అయితే చిన్న సవరణ - ఆ దడ దడ నేను ఔపోసన పట్టే క్రమంలో జరిగింది అని ఓ చిన్న వివరణ....ఔపోసన పట్టేసాక వారితో పనిలేకుండా పోయింది.....

సరే....ఇంతకీ ఇప్పుడిదెందుకు చెపుతున్నావు?

మీలో ఎవరికన్నా దడ దడ లాడించుకోవాలనున్నదేమోనని....అయితే పరిణితి చెందాం కాబట్టి, సుతారంగా ఉంటుందయ్యా....ఖంగారు పడనఖ్ఖరలేదు....

నిన్న కూతురుతో కాన్వాస్లు మీద బొమ్మలేయించే పని పూర్తయ్యేటప్పటికి లోన కమ్మగా నిద్దరోతున్న "అబ్స్ట్రాంభకర్ణుడు" నిద్దర లేచాడయ్యా....ఇహ లేచాక చెప్పేదేముంది - ఊరుకోడుగా, కాన్వాసు దడ దడలాడించాడన్నమాట.....ఆ దడ దడే ఈ టపాకు కారణం.....

మనకి ఈ కళ కూడ ఉన్నదా మహానుభావా?

ఉన్నది ధనుంజయా.....ఉన్నది....నీకు తెలియనివి ఇంకా బోలెడు ఉన్నాయి నావద్ద....

సకల కళావల్లభులన్నమాట మీరు.....ఇందులో వేలు , అందులో వేలు అని లేకుండా అన్నిట్లో వేళ్ళేనన్నమాట....

అయితే ఓ మాట చెప్పాలె....అదేదో మహేశ్ బాబు సినిమాలో "ఫామిలీ ఫామిలీ అంతా ఉప్మా తిని బతికేస్తున్నార్రా" అన్నట్టు , ఈ బొమ్మల గోల చుసి "మీ ఇంట్లో అంతా బొమ్మలు గీసేస్తున్నార్రా?" అని కొంతమంది కుంకలు హాచ్చర్యపోతారని, ప్రశ్నలేస్తారనీ ముందే చెపుతున్నా...... అలా హాచ్చర్యపోవద్దనీ, ప్రశ్నలెయ్యొద్దనీ....

మరి పోనీ నువ్వు మనిషివా, ఎం.ఎఫ్.హుసేనువా అని అడుగుదామనుకుంటున్నావేమో - ఆ ఛాన్సు కూడా లేదబ్బాయ్...

అయితే మనది అలాటిలాటి ఆబ్స్ట్రాక్ట్ కాదయ్యోయ్.....చూడగానే తెలిసిపోయినట్టుంటుంది కానీ తెలీదు....అదీ లెక్కన్నమాట...ఇప్పుడు నువ్వు ఈ కింది బొమ్మలు చూసి ఏది ఏమిటో చెప్పు....చెప్పలేకపొయ్యావా - ఆయన్ని పంపిస్తా....

ఎవరిని పంపిస్తావు నాయనా?

ఆయనే.....

సరే కానీ.....చూసి చెప్పు.....అర్థమయ్యిందో లేదో....అర్థమైతే కామెంటు వెయ్....అవ్వకున్నా వెయ్.....ఏం?Saturday, August 20, 2011

పాత చొక్కా - కాన్వాస్ పానెల్సు - అక్రిలిక్ పెయింట్సు......ఇవాళ్టికి చాల్లే!!!

 నేను బొమ్మలేస్కోడానికి ఈసారి వెరైటీగా కాన్వాస్ పానెల్స్, అక్రిలిక్ పెయింట్స్ తీసుకొచ్చాడు...


 వేసుకోని ఓ పాత చొక్కా చేతులు చించి, నాకు వేసేసి పెయింటు ఇంకెక్కడా అంటించకుండా ఆ చొక్కా మీద పూసుకోమన్నాడు , పూస్తున్నా చూసారా?


మొదటి బొమ్మ ఇలా వేసా.....కాన్వాస్ అంతా గుడ్డగా, సరిగ్గా రాలేదు.... ఆ కాన్వాస్ పానెల్ పుచ్చుకుని దాని మీద మొట్టమొదటిగా గీసిన బొమ్మ - చేప బొమ్మ.

చాలా భయంకరంగా వచ్చిందన్నాడు నాన్న...అవును, నాకే నచ్చలేదు....నాన్నని అడిగా ఎలా వెయ్యాలని...రెండో కాన్వాస్ మీద ఇంకో బొమ్మ  వేసేప్పుడు చూపిస్తా అన్నాడు....సరే అని పైరేట్ బొమ్మ గీసా....ఫర్వాలా ఓ మాదిరిగా వచ్చింది....ఆ తర్వాత మెర్ మెయిడ్ గీసా.... మెర్ మెయిడ్ కి స్థలం సరిపోలా పైరేట్ ని పెద్దగా గీసేప్పటికి...ఈ సారి కొంచెం జాగ్రత్తగా రెండో కాన్వాస్ మీద మళ్ళీ మెర్ మెయిడ్, చేపలు, స్టార్ ఫిష్ గీసా....ఆ మధ్యలో బొద్దుగా ఉందే - ఆ చేప నాన్న గీసి చూపించాడు....మిగతావన్నీ నేనే వేసేసా....అయితే ఈ బొమ్మలో  ఒక విచిత్రం ఉంది...చెప్పుకోండి చూద్దాం....
రెండో కాన్వాస్ కి ఎరుపు బోర్డర్ వెయ్యమన్నాడు ...వేస్తున్నా....


బోర్డర్ ఇంకా వేస్తున్నా....అంతా గీసేసాక , హ హ అని నవ్వి - మెర్ మెయిడ్ చేతులేవి అని అడిగాడు నాన్న....ఊప్స్....చేతులు వెయ్యడం మర్చిపోయా.....అదే పైన చెప్పిన విచిత్రం....ఇప్పుడు వేసా....


చేతులు వెయ్యటం అయిపోయింది అని చెపుతున్నా నాన్నకి.....ఇవాళ్టికి చాల్లే, మళ్ళీ రేపో ఎల్లుండో ఇంకొన్ని బొమ్మలు గీద్దాం అన్నాడు.... 


Friday, August 19, 2011

ఘంటసాల మేష్టారు ఈ పాట పాడక పోయుంటే బాగుండేదా?

ప్రజలారా 

 • మీకు ఎప్పుడైనా శోకసముద్రంలో మునిగిపోవాలనిపించిందా? 
 • కంటికి మింటికి ధారగా ఏడవాలనిపించిందా? 
 • ఏడవటానికి కారణం కోసం ఎదురుచూపులు, కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారా?
 • పోనీ లోపల ఉన్న ఏడుపు బయటకు రావటానికి ఏదన్నా ఊతం దొరికితే బాగుండు అనిపించిందా? 
 • ఊతం దొరికిందే అనుకుందాం - ఆ దొరికిన ఊతాన్ని పట్టుకోని గంపలు గంగాళాలు నింపలేకపోయారా? 
 • అలా ఎందుకు అనిపిస్తుందిరా నాయనా? ఎవడైనా సంతోషంగా ఉండాలనుకుంటాడు కానీ - అనిపించిందా?

అయితే ఆగిపోండి - అక్కడే ఆగిపోండి.....

మీ సమస్యకు సమాధానం దొరికేసింది....

అదే అదే.......టడా ....ఠడా.....ఠఢా....


పుష్పవిలాపం - కరుణశ్రీ గారి రచన....

ఈ మాట వినగానే, ఒక బరువైన కంఠం ఎంతో విషాదం నింపుకుని ఆ బాధను వ్యక్తపరుస్తూ ఉంటే, ఆ బాధలో నేనూ ఓ భాగం అయిపోవాలని అనుకోని తెలుగువాడు ఉండడేమో అని అనుకుంటే అది మీ తప్పు కాదు....అలా అనిపించటానికి మూడు పాళ్ళు పాపయ్య శాస్త్రి గారి రచనా కౌశల్యం, ఒక పాలు మేష్టారు గాత్రం - ఇదే కారణం, మహత్యం...

కాదు కాదు, అటుదిటు వేసుకో అంటారా?

సరే మంచిది......వేసా బాబయ్యా! స్థిమితంగా ఉందా ఇప్పుడు?

ఇహ పోతే ఇందులో కొన్ని లైన్లు కరుణశ్రీ గారు, ఆ థీం తీసుకున్నందుకు అందరు కవులు వ్రాసినట్టే "బరువు" పెంచటానికి వ్రాసినట్టుంటుంది....అయితే గొప్ప విషయమేమంటే ఆ బరువు కొలిచే తూనికా తల్పంలో శయనం , తూనిక రాళ్ళ గోల లేకుండా, అన్ని పక్కలా పూల "బరువు" సరిపోయి మహదానంద రూపం ధరించింది......

ఆ తల్పాన్ని శయనానికి, సుఖనిద్రకు (ఇక్కడ దుఃఖ నిద్రకు) అనుకూలంగా మలచటం, సద్దటం ఆడవారంత సున్నితత్వం ఉంటే కానీ చెయ్యలేరు.......అయితే అందరు ఆడవారు తల్పాన్ని నిద్రకు తయారు చెయ్యటమంత చక్కటి పని చెయ్యలేరు కానీ, ఏడుపు మాత్రం పూలు కోసి పెట్టి గంపలకెత్తినంత సులభంగా చెయ్యగలరు.....అదేమి విచిత్రమో.....

ఆ తల్పం తయారు చేసుకుని, దాని మీద పడుకుని ఏడిస్తేనే ఏడుపా అని అడుగుతున్నారా? అవును - మీకా తయారింపు గోల లేకుండా చక్కగా మహాకవి చేతికి అందించారు కాబట్టి సంతోషించి ఆ ఏడుపు కొద్దిగా తగ్గించండి...... చదువుతుంటేనే ఏడుపొచ్చే కొందరికి ఊతంగా, ఆ ఏడుపు - గంపల నుండి గంగాళాల రూపం ధరించడానికి మేష్టారు గారు తనవంతు సహకారం అందిస్తూ "ఏడుపామృతకషాయం" కలిపి "అమరత్వం" ప్రసాదించారు....ఇహ తిరుగేముంది.....వందనములు వందనములు....

 • "బుట్టలందు చిదిమి అమ్ముకొందువె....... హృదయమే లేని నీ పూజలెందుకోయి"
 • "బండబారెనటోయి నీ గుండెకాయ"
 • "హాయిగ కన్ను మూసెదము ఆయమ కాలివ్రేళ్ళపై"
 • "త్రుంపబోవకుము, తల్లికి బిడ్డకు వేరు సేతువే"
 • "నెత్తురు చేతి పూజ విశ్వాత్ముడు స్వీకరించునె"
 • "గొంతుకురి బిగించి"
 • "గుండెలో నుండి సూదులు ...... దయలేని మీ ఆడువారు"
 • "పేద నెత్తురులును కంపు దేహాలపై గుమాయింపు కొరకు"
 • "పరిహరింతురు మమ్ముల పెంటదిబ్బపై"
 • "అందమును హత్యచేసెడి హంతకుండ"

ఇల్లాటి వాక్యాలతో  కాగితపు పడవ లాటి చాలా మంది హృదయాల మీద కాంచన గంగ  పర్వతాన్ని పెట్టి అదిమినట్టు అదిమే ప్రయత్నంలో కరుణశ్రీ గారు సఫలం అయ్యారు కాబట్టే ఆ రచన అట్లా నిలిచింది....

మేష్టారు పాడినా పాడకపోయినా అది అలా చరిత్రలో నిలిచిపోయేదే......అయితే ఆ బరువు తాను స్వయంగా మోసి, ఇతరులకు పంచటంలో మేష్టారు తనవంతు సాయం తాను చేసారు....అదండీ సంగతి.....

సరే ఇప్పుడు అసలు సంగతికి వస్తున్నా - అయితే ఇదే యే ఎం.ఎస్.రామారావు గారి చేతో, పి.బి.శ్రీనివాస్ గారి చేతో పాడించి ఉంటే -  పాటకు - అంత పేరు రాకపోయుండొచ్చు కానీ బోలెడంత బ్రహ్మాండంగా ఉండేది అని నా అభిప్రాయం, అనుకోలు....మీరేమన్నా నా అభిప్రాయం మారదు కానీ, నిర్మొహమాటంగా మీ మాట వ్రాసెయ్యండిక్కడ....నిర్మొహమాటం అన్నానని బభ్రాజమానం మాటలు వ్రాస్తే -  తెలుసుగా?

మాన్యులు క్షమింతురు గాక, అప్పుడప్పుడు - ఇదే పాట శ్రీ పువ్వుల సూరిబాబు గారు పాడి ఉంటే ఎలాగుండేదో అని అనిపించటం కూడా కద్దు....బాలుగారు పాడితే చాలా దారుణంగా ఉండేదనిన్నూ అనుమానం .....

ఇప్పుడు మీ కామెంట్లు బరువుగా పారించండి.....

బరువుగా ఎలా పారిస్తారు బాబూ?

శుభం.....

భవదీయుడు
వంశీ

Thursday, August 18, 2011

వైశంపాయనుని వృత్తాంతం - చిలుక చెప్పిన కథ - రచన: శ్రీ రెంటాల గోపాలకృష్ణ

బోషాణం వెతుకుతూంటే మే 18వ తారీకు, 2010 సంవత్సరంలో సేవ్ చేసుకున్న ఒక వర్డ్ డాక్యుమెంటు కనపడ్డది...

కనపడింది సరే - ఏముంది అందులో?

ఒక చిలుక చెప్పిన కథ ఉన్నది నాయనా....


చిలుక చెప్పిన కథా? ఎవరి గురించి చెప్పింది??

వైశంపాయనుడి గురించి....

వైశంపాయనుడి గురించా?

అవును వైశంపాయనుడి గురించే - నీకు శ్రీ రెంటాల గోపాలకృష్ణ గారు తెలుసా?

ఓ తెలియకేం? సర్పయాగం, పార్వతీశ శతకం మొదలైనవి వ్రాసినవారేగా?

అవును - ఆయన భట్టబాణుడు రచించిన "కాదంబరి" అనే సంస్కృత గద్య రచనకు అనువాదం కూడా చేసారు.....ఇప్పటి చిలుక కథ అందులోనుండి గ్రహింపబడిన కథ.... 

ఇంతకీ ఎక్కడ దొరికింది నీకిది?

తమిళనాడు ప్రభుత్వం వారు, పిల్లల పాఠ్య పుస్తకాలు ఆన్లైనులో పెట్టారు....అందులో తెలుగుకు సంబంధించినవన్నీ , తెలుగులో ఉన్నవన్నీ పి.డి.ఎఫ్ రూపంలో ఉండటంతో ,ఓ మూడేళ్ల నుండి కామోలు సేవ్ చేసుకుంటూ వస్తున్నా....ఆ ఫోల్డరులో నుండి బయటపడ్డది కాబట్టి, అక్కడిదే అని అనుమానం..... అరవ సోదరులను చూసన్నా నేర్చుకోరేమిరా మనవారు ? భగవంతుడా!! 

అదంతా సరే కానీ ఎక్కడ చదవాలి ఈ చిలుక కథ?

ఇదిగో ఇక్కడ.....ఆ పాత వర్డ్ డాక్యుమెంటును ఈవేళ పి.డి.ఎఫ్ గా చేసి పోష్టు చేసానయ్యా....

ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న సాహిత్య భండారము లంకె నొక్కి చూడవచ్చు 

కాపీరైటు ఉల్లంఘన ఉద్దేశమేమీ లేదని ముందుగానే తెలియచేసుకుంటూ....ఒకవేళ అభ్యంతరమెవరికైనా ఉంటే తెలియచెయ్యమనీ, తెలియపరచిన వెంటనే ఈ ఫైలు తొలగిస్తానని తెలియచేసుకుంటున్నాను....

కథ చదివాను కానీ అర్థం కాలా - కొద్దిగా గందరగోళంగా ఉన్నది.....అసలింతకీ వైశంపాయనుడి వృత్తాంతమేమిటో కొద్దిగా చెప్పు

వైశంపాయనుడిని మహాశ్వేత చిలుకగా మారమని శపిస్తుంది...ఆ చిలుకను మాతంగ కన్య ఒకతె తీసుకెళ్ళి శూద్రక మహారాజుకు కానుకగా ఇస్తుంది...ఆ శూద్రక మహారాజుకు చిలుక తన కథను వివరిస్తుందన్నమాట...అదీ క్లుప్తంగా కథ.... 


వీళ్లంతా ఎవరో ఏమిటో?

"కాదంబరి" - చదువు తెలుస్తుంది...లేకపోతే నీకు ఈ కథల జ్ఞానం ప్రసాదించమని మీ పెద్దవాళ్లను అడుగు.....వాళ్ళకు కూడా తెలియకపోతే నువ్వన్నా బుద్ధి తెచ్చుకుని, పుస్తకం కొనుక్కొని స్వయంగా చదివి మీ పిల్లలకు చెప్పు....వాళ్ళన్నా బాగుపడతారు...

***********************************
వైశంపాయనుని వృత్తాంతం
(చిలుక చెప్పిన కథ)
రచన: శ్రీ రెంటాల గోపాలకృష్ణ

భట్టబాణుడు రచించిన "కాదంబరి" అనే సంస్కృత గద్య రచనకు రెంటాల వారు చేసిన అనువాదం నుండి గ్రహింపడిన కథ....
***********************************

Wednesday, August 17, 2011

20 Lakh Telugu Pages Of Old Magazines And News Papers!!!

Eenadu Paper News....Woo Hoo! 

 Click The Link Below And Enjoy.....


 20 Lakh Telugu Pages Of Old Magazines And News Papers

If only the navigation and access to the material was good.....

Anyways - Very glad that these are in common man's reach!

I can spend a lot of time on these NOW...and less time bothering the "kanjUs" people.... :)

Thank you Press Academy - A million times


Just a sample of the treasures lying there......

Got these Images in the first two minutes of browsing the site (from Andhra Sahitya Parishat Patrika)
PS: Thing is that - most of the material available in this website is on DLI....but that website SUCKS - and when I say it SUCKS - it REALLY sucks.....Access to these gems has become somewhat easier with this one, so.....little happier.... :)

మంజీరా నీళ్ళు ఎంత తియ్యగా ఉంటాయిరా! కృష్ణమ్మను వదిలేసాక, నోటికి అంత రుచి తగిలేది మంజీరమ్మతోనే!!

."మంజీరా నీళ్ళు ఎంత తియ్యగా ఉంటాయిరా! కృష్ణమ్మను వదిలేసాక, నోటికి అంత రుచి తగిలేది మంజీరమ్మతోనే" - అని మా అమ్మ నోట,  దాదాపు నాలుగు దశాబ్దాల పైనే - అంతకాకపోయినా, నాకు ఊహ తెలిసినప్పటినుంచి  వింటూనే ఉన్న మాట....

ఆ మాటలో ఎంతో నిజముంది.....ఎప్పుడైనా అత్తయ్య వాళ్ళింటికో, పిన్ని వాళ్ళింటికో వెళ్ళినప్పుడు గండిపేట నీళ్ళు తాగితే, ఏదో తగ్గిందిరా ఈ నీళ్ళల్లో అనిపించేది....

హైదరాబాదులో అద్దెకున్న ఇళ్ళు కానివ్వండి, ఆ గోల వదిలి స్వంత ఇంట్లోకి మారిన తరువాత కానివ్వండి మేం తాగిందెప్పుడూ "మంజీర" నీళ్ళే ....ఈ శరీరాన్ని పెంచి, బుద్ధినిచ్చిన ఆ నదీమతల్లులు కృష్ణమ్మకు, మంజీరమ్మకు నమోన్నమహలతో  ...

సరే అది అలా పక్కనబెట్టి టపాలోకొస్తే "మహాంధ్రోదయం" - శ్రీ దాశరథి గారి రచన చదువుతున్నా....ఇందులో వారు "మంజీర" గురించి వ్రాసిన ఒక ముత్యం కంటపడమేమిటీ, చదవటమేమిటి, వారు వ్రాసిన విధానానికి ఒళ్ళు పులకించటేమిటి, ఈ టపా వ్రాయాలనిపించడమేమిటి - అన్నీ అలా ఒకదాని వెంబడి ఒకటి జరిగిపోయాయి....

"ఎంత బాగుందో" - అని అంటే ఆ రచనకు నేను చేసే మహాపరాధం అంతా ఇంతా కాదన్నమాట పచ్చి నిజం....చదువుకుని మీరే తెలుసుకోండి....

అయితే - శ్రీ దాశరథి ఇందులో వాడిన ఒకటి రెండు పదాలకు (క్రింద ఇచ్చాను) అర్థం తెలియలా.....తెలిసినవారెవరన్నా వివరిస్తే సంతోషం.....

మిసిమింతురాలు
హసంతిక  
కావ్యదుకూలము
"మంజీర" -  శ్రీ దాశరథి గారి ఖండిక

Tuesday, August 16, 2011

"నా తొలి రచన"- అక్టోబరు 1941లో విశ్వనాథ వారు వ్రాసిన వ్యాసం

చాలా రోజుల తరువాత , నిన్న - సాఫ్టువేరు బోషాణం, అనగా హార్డ్ డ్రైవును బయటకు తీసా... 

అందులో బయటపడిన "విమర్శిని - Annual Research Journal  విశ్వనాథ వాఙ్మయ జీవిత విశేష సంచిక - జనవరి 1977" పిడి.ఎఫ్ ఫైల్లో ఉన్న ఒక ముత్యం - "నా తొలి రచన" - అనగా "విశ్వనాథ వారి తొలి రచన" - పంచుకోవాలనిపించి......

వారు అక్టోబరు 1941లో వ్రాసిన వ్యాసం ఇది.....

ఇదిగో ఈ క్రింద చదువుకోండి........చక్కని చుఱకలు - ఇతరులకు వెయ్యటమే కాక తనమీద తాను వేసుకున్న చెణుకులు కూడా చూడండి

జ్ఞాపికానుబంధంలో ఉన్న జ్ఞాపకాలు, ముఖ్యంగా కొడాలి వారు, జలసూత్రం వారు, మల్లాది వారు - ఇలా ఎందరో మహామహులు అందించిన జ్ఞాపకాల జ్ఞాపికలు చాలా బావున్నవి....

వ్రాత, మాట, భాష - నమోన్నమః 

ఆచార్య కేతవరపు రామకోటి శాస్త్రి గారు ఎడిటరుగా, సుప్రసన్నాచార్య గారు అసొసియేట్ ఎడిటరుగా ఈ జర్నల్ నడిచిందని ఆ ఫైలులో ఉన్నది....ఈ జర్నల్ గురించిన ఇతర వివరాలు తెలిసినవారు, ఒకవేళ ఆ జర్నల్ యొక్క కాపీలేమన్నా మీ వద్ద ఉంటే పంచుకోగలరన్న ఆశతో.....

భవదీయుడు
వంశి.....


PS: ఆ Journal విషయసూచిక ఇదిగో ఇక్కడ....


Monday, August 8, 2011

ఆలస్యం చేసారో - మీ అంత దురదృష్టవంతులు ఉండరు....!

"ద టూ ఎస్కొబార్స్"

సౌత్ ఆఫ్రికా క్రికెట్టు జట్టు కెప్టెన్ హాన్సీ , సంజయ్ చావ్లా, అజహరుద్దిన్ వగైరా వగైరా - క్రికెట్టు మాచుల ఫిక్సింగు వార్త విని/చదివి ఆశ్చర్యంతో నోళ్ళు వెళ్ళబెట్టిన 2000వ సంవత్సరం నుంచి పదకొండేళ్ళు రీలు ముందుకు తిప్పితే మళ్ళీ అలా నోరు వెళ్ళబెట్టిన రోజు - ఆగస్టు ఏడో తారీకు, 2011....అయితే వినో/చదివో కాదు...చూసి ....

ఏం చూసి?

సినిమా చూసి....సినిమా అంటే సినిమా కాదనుకో...డాక్యుమెంటరీ....

వాల్దెర్రామా, ఆంద్రె ఎస్కొబార్ - ఈ పేర్లు 90వ దశకంలోని సాకర్ అభిమానులకు, సాకర్ ప్రపంచంలోకి తోకచుక్కలా దూసుకొచ్చేసిన కొలంబియా దేశాన్ని అభిమానించేసిన సాకర్ ప్రేమికులకు పరిచితమైన పేర్లు....ఆ తోకచుక్క అభిమానుల్లో నేనూ ఒకణ్ణి.....

ఆర్జెంటీనా మీద అంతవరకూ ఎవరూ సాధించని 5 - 0 స్కోరును నల్లబోర్డు మీద తెల్లగీతలా గీసేసినందుకు - ఆ మాచి హైలట్లు చూసి వీరాభిమానినైపోయా....  అప్పటికి ఆంద్రె అంటే చాలా మటుకు తెలుసు కానీ, పాబ్లో అంటే మన దావుద్ ఇబ్రహీం లా ఒక మంచి వ్యక్తి అని మాత్రమే తెలుసు.....కానీ ఇద్దరికీ బోల్డు లంకెలున్నాయని తెలియదు......

సరే "రింగులు" తిప్పటం ఆపేసి.... డాక్యుమెంటరీలోకొస్తే - పాబ్లో ఎస్కొబార్ , ఆంద్రె ఎస్కొబార్ (అసలైతే పాబ్లొ ఎస్కొవార్, ఆంద్రె ఎస్కొవార్ అని పలకాలి...) - ఈ ఇద్దరూ, నాణేనికి రెండు ముఖాలు ఎట్లా ఉంటవో అట్లా అన్నమాట.....ఆ నాణెం పేరు కొలంబియా అనుకుంటే ఒక ముఖం పాబ్లొ, ఇంకో ముఖం ఆంద్రె....

పాబ్లో పేరు చెబితే గడగడలాడేవారు ఎంతమందో, అభిమానించేవారు అంతమందే.....ఆంద్రె పేరు చెబితే అంతా అభిమానించేవారే......పేదరికం కష్టాలను సహించలేని పాబ్లొ రాబిన్ హుడ్ లా ధనికులను దోచుకోటం మొదలుపెట్టి, ఆ దోచుకున్న ధనం తనలాటి పేదవారికి పంచిపెట్టి, ఆ తర్వాత ఏ కారణానికో రక్తం రుచి మరిగిన పులిలా కాచుక్కూర్చుని దెబ్బ మీద దెబ్బ వేసి కొలంబియా అండర్ వరల్డ్ రారాజుగా వెలిగిపోతూ, గవర్నమెంటును శాసించే స్థాయికి ఎదిగిపోతాడు....డ్రగ్స్ బిజినెస్సుతో ఇహ తిరుగులేకుండా పోతుంది పాబ్లొకి....

అయితే ఈ డ్రగ్స్ బిజినెస్సును ఉత్తర అమెరికా ఖండానికి విపరీతంగా వ్యాపింపచేసేసిన పాబ్లో, మూలాలు మర్చిపోకుండా ఆ డ్రగ్స్ బిజినెస్సులో వచ్చిన ధనంతో పేదవారికి కొన్ని వేల  ఇళ్ళు, స్కూళ్ళు, హాస్పిటల్సు కట్టించి తన పని తను చేసుకుపోతూ ఉంటాడు......ఆ పనుల్లో భాగంగా సాకర్ టీములకు ఓనరుగా మారిపోటం కూడా ఒకటి.....డబ్బుల కోసం కానివ్వండి దేనికన్నా కానివ్వండి - విధివశాత్తు ఆంద్రె పాబ్లొ టీముకు ఆడవలసి వస్తుంది....

పాబ్లో చేస్తున్న ఈ డ్రగ్స్ గోల తట్టుకోలేని పెద్దన్న (అమెరికా) రంగంలోకి దిగగానే పాబ్లొ పరిస్థితి కొద్దిగా తారుమారవుతుంది.....ఆ పెద్దన్నను తట్టుకోటానికి, తనని అమెరికాకు అప్పగించెయ్యకుండా ఉండటానికి రాజకీయాల్లోకి ప్రవేశిస్తాడు ఈ మాఫియా కింగు......

ఆ తర్వాత ఆంద్రె పరంగా, పాబ్లొ పరంగా - జరిగింది చాలామందికి తెలిసిన విషయమే అయినా, తెర మీద చూస్తే ఓహో అసలు సంగతులు ఇవన్న మాట అని బహువిధాలుగా ఆలోచిస్తూ ఉండిపోతారు..... 

పాబ్లొ తన మాఫియా సామ్రాజ్యస్థాపనకు వేసిన అడుగులు, ఆంద్రె తన సాకర్ ప్రపంచ స్థానకు వేసిన అడుగులు చాలా హృద్యంగా చిత్రీకరించుకొచ్చారు దర్శకులు జెఫ్ జింబాలిస్ట్, మైకేల్ జింబాలిస్ట్..... అన్నీ నిజమైన పాత్రలు, వారికి సంబంధించిన నిజమైన క్లిప్పులు పెట్టడంతో ఒక "మాంఛి" ఉత్కంఠతో సాగింది సినిమా.....


పాబ్లొ తన ప్రస్థానంలో వేసిన అడుగులు , చేసిన పనులు తప్పా అన్న విషయానికి వస్తే ఈ డాక్యుమెంటరీ చూసి మీరే నిర్ణయించుకోవాలి.....కొద్ది రోజులు పోతే మన దేశంలో పాతుకుపోతున్న, పోయిన అవినీతి భూతాన్ని చూస్తే కొలంబియా పరిస్థితి మనకొస్తుందేమోరా నాయనా అన్న భయం ఒక్క లిప్తకాలం వెంటాడింది.....

డాక్యుమెంటరీ - ఆ మురికివాడలు, అందులోని బడుగు జీవాలు చూస్తే మన మురికివాడలు, రోడ్డు పక్క ప్లాస్టిక్కు కవర్ల టెంటులేసుకుని బతుకుతున్న మన ప్రజ గుర్తుకొచ్చి ఓ నిముషం కలుక్కుమన్నది....

అయితే నిత్యం సమస్యలతో కొట్టుమిట్టాడే ఆ బడుగు జీవాలకు - చిన్నపాటిదే అయినా - సాకర్ ఆటలో ఆణిముత్యాలని ఏరుకొచ్చి వాళ్ల ఆటను జనాలకు పరిచయం చేసి, ఆ ఆటను చూడ్డానికి వచ్చేట్టు చేసి, ఆ ఆటలో మునిగిపోయిన కొద్దిసేపు తమ తమ కష్టాలు మర్చిపోయేలా చేసి, ఇళ్ళు కట్టించి ఇవ్వటంతో, స్కూళ్ళు, హాస్పిటల్సు కట్టించి ఇవ్వటంతో- అసలు సంతోషం అంటే ఏమిటి అని తెలియచెప్పిన పాబ్లో అనే మనిషి గొప్పవాడా?

డ్రగ్స్ నుంచి వచ్చే ధనం కోసం, తన సర్కిల్ ను కాపాడుకోటం కోసం, చివరికి తన ఉనికిని కాపాడుకోవటం కోసం ఎంతటి కార్యానికైనా ఒడిగట్టిన పాబ్లో అనే మనిషి హీనుడా ?

- అన్న ప్రశ్నలే కాక ఇతరమైన అనేక ప్రశ్నలు బోల్డు కందిరీగల్లా మిమ్మల్ని చుట్టేస్తే అది ఆ డాక్యుమెంటరీ తప్పు కాదు........

ఒక మెరుపేమిటంటే - తన సామ్రాజ్యంలో "కిడ్నాప్" లకు తావు లేకుండా, ఇతరమైన నీతి నిబద్ధతలతో బతికిన మనిషి పాబ్లో అని తెలిసి ఆశ్చర్యమనిపించింది....

అదేమిటి - అంతా పాబ్లొ గురించే చెప్పావు , ఆంద్రె సంగతేమిటీ అని అడుగుతున్నారా?

అది మటుకు చూసి తెలుసుకోవాల్సిందే మేష్టారూ! చెప్పేది కాదు.... 

ఇతర వివరాలు కావాలనుకున్నవారు ఇక్కడ చూడవచ్చు

http://www.the2escobars.com/

తప్పక చూడవలసిన, తీరాల్సిన డాక్యుమెంటరీ ఇది......ఆలస్యం చేసారో - మీ అంత దురదృష్టవంతులు ఉండరు....

Finally - I will say that it's one of the most powerful documentaries ever made.........left a scar, a big one on my heart! 

AhA! Say what - Who cares about your scar? 

Watch this documentary and tell me - what did it do to you - YOU dumb, dumber, dumbest  !


భవదీయుడు
వంశి


PS: ఈ డాక్యుమెంటరీలో పాబ్లొను చూసాక, అనగా ఇతరంగా కాక ముఖారవిందం రీత్యా మాత్రమే  - మన ఆంధ్రదేశంలో "ఇప్పుడు" ఒక చక్రం తిప్పుతున్న వ్యక్తి గుర్తుకు రావట్లా? ఎవరో చెప్పుకోండి చూద్దాం.....పేరు అంత ప్రముఖంగా బయటకు వినపడకపోవచ్చు కానీ, చాలా చక్రాలున్న వ్యక్తి.....