Thursday, July 21, 2011

చించు, ఎందుకు చించామని ఆలోచించు, అలా ఆలోచించిన దాన్ని ఆచరించు!

నిన్న షష్టి.

సుబ్రహ్మణ్యస్వామి అభిషేకం.

రుద్రపారాయణం పూర్తి చేసా.

గుడి నుంచి ఇంటికి రావటానికి 20 నిముషాలు.

కారెక్కాక, బ్లాగులో నిన్న కొత్తపాళి గారు రాసిన కామెంటు - "ఇంకా బతికున్న మన గొప్ప ఆర్టిస్టులకి జాతీయ వేదిక మీదనూ, ప్రపంచ వేదికమీదనూ పెద్దపీట వెయ్యాలి. దానికి ఏవన్నా పథకం ఆలోచించండి. " - వేరు పురుగులా బుఱ్ఱను తొలవడం మొదలుపెట్టింది....ఆ కామెంటుకు జవాబుగా నేను రాసింది - న్యాయం చెయ్యలేదేమొ అనిపించింది.....

ఇంకెందుకు ఆలస్యం - చించు, ఎందుకు చించామని ఆలోచించు, అలా ఆలోచించిన దాన్ని ఆచరించు అని ఆ షడాననుడు తన వేలాయుధంతో ఓ పోటు పొడవటంతోనూ, ఆ పోటు సరిపోకపోతే ఆ వెనకనే నేనున్నానటూ దన్నుగా నిలబడ్డ శివయ్య త్రిశూలం కనపడ్డంతోనూ, ప్రస్తుతానికి పొడవనులే కానీ - సంస్థల మీద పడి ఏడవటం ఎందుకు నీకు నువ్వే ఆలోచించుకొని, ఏదో ఒకటి చెయ్యిరా పిచ్చికుంకా అని ఆ పెద్దాయన శివయ్య హెచ్చరించటంతోనూ తీవ్రమైన ఆలోచనలో పడిపోయా....అలా పడి - పోయి పోయి, ఒక నిశ్చయ తీరానికి చేరా.....ఇహ ఆచరణలో పెట్టటం మిగిలింది....

అదేమిటో కాస్త ఇక్కడ వివరించే ప్రయత్నం చేస్తా....

1) ఆ గొప్ప ఆర్టిష్టుల పేర్ల లిష్టు ఒకటి తయారు చేసుకోటం
2) అలా తయరుచేసుకున్న వారి పూర్తి వివరాలు సంపాదించటం
3) అలా సంపాదించిన వివరాలు పట్టుకొని వారిని స్వయంగా సంప్రదించటం
4) ఒక వెబ్సైటు తెరిచి ఆయా కళాకారుల వివరాలు పూర్తిగా ప్రచురించటం - ఫోటోలు / వీలున్న చోట ఆడియోలు
5) ఒక ఫండ్ లాటిది ఏర్పాటు చేసుకోటం
6) ఆ లిష్టులోని వారిలో - ప్రతి సంవత్సరం ఉగాదికి ఒక ముగ్గురిని అనగా త్రిమూర్తులను ఎంపిక చేసుకొని, ఉడతాభక్తిగా చెరో ఐదు వేల రూపాయల నగదు అందించటం.

ఇవే కాక మరికొన్ని ఆలోచనలు ఉన్నాయి....అవి ఒక పరిధి గీసుకున్నాక వివరిస్తాను...

నెంబర్లు 1, 4, 5, 6 సుళువైనవే.

వెబ్సైటు తెరవటం ఒక్క రెండు గంటల పని.

ఫండ్ సంగతికొస్తే ఈ రోజే ఒక 200 డాలర్లు పక్కనబెట్టా....అక్టోబరులో మరో 200 డాలర్లు పక్కనబెడతా...దానితో ఉడతాభక్తి నగదు సరిపోతుంది....

లిష్టులోని వారిని ఎంపిక ఎలా చేస్తారు అని అడుగుతున్నారా?

లిష్టులోని వారి వయసు ఆధారంగా....పెద్దవయసువారు ముందు, ఆ తరువాత పుట్టినవారు తర్వాత...అలాగన్నమాట.....

నగదు సమర్పించుకుంటే సరిపోతుందా? అదీ అంత చిన్న మొత్తంతోనా? సిగ్గుచేటు - కళామతల్లికి , ఆయా కళాకారులకి అవమానం అని అంటున్నారా?

ఆ ప్రశ్నకు సమాధానం మీ దగ్గరే ఉంది....అయినా నా సమాధానం వినాలనుకుంటే ఇదిగో - నాకున్న లక్ష్మీ కటాక్షం అంతవరకే కాబట్టి, ఉడతాభక్తి అని చెప్పుకొచ్చాను....

మరి సంస్థలాటిది ప్రారంభిస్తారా?

సంస్థ ఆలోచన లేదు, సర్వసంగ పరిత్యాగమూ లేదు..... అంతా స్వీయ సమర్పణే!

మరి నగదు తీసుకున్నవారికి టాక్సు గొడవలొస్తాయేమో...ఆలోచించావా?

ఆ దిశగా కొద్దిమందిని కదల్చటం జరిగింది.....వారి సమాధానం కోసం వేచి చూస్తున్నాను....

ఏమి చెప్పు - నువ్విచ్చే నగదు కన్నా - శాలువాలు, సత్కారాలు , జనాలు, చప్పట్లు ఉంటేనే శోభయ్యా...కళాకారుడికి తృప్తీనూ

ఆవైపు కూడా ఆలోచించాలి....కానీ ప్రస్తుతానికి "లక్ష్మమ్మ" నన్ను ఇంతవరకే అనుమతిస్తోంది....

మరి లిష్టు ఎవరితో మొదలుపెడదామనుకుంటున్నావు?

మొదలు ఆకాశవాణి కళాకారులతోనూ, ఆ తర్వాత నాటక రంగ కళాకారులతోనూ, ఆ తర్వాత జానపద కళాకారులతోనూ, ఆ తర్వాత శాస్త్రీయ సంగీత కళాకారులతోనూ, ఆ తర్వాత సాహితీవేత్తలతోనూ, ఆ తర్వాత మిగిలినవారితోనూ - ఇలాగన్నమాట

ఇవన్నీ ఎప్పటికయ్యేను?

ఎప్పటికైతే అప్పటికే స్వామీ......అడుగు వేసేసా, ఇహ వెనుదిరిగేది లేదు .....

సరే అది అలా పక్కనబెట్టెస్తే - ఒకవేళ ఈ నగదు కార్యక్రమంలో పాలుపంచుకోవాలనుకున్న వారెవరైనా ఉంటే ఇచ్చే నగదు పెంచుకోవచ్చు, లేదా కళాకారుల సంఖ్య పెంచుకోవచ్చు. అయితే కళాకారుల సంఖ్య ఐదుకు గానీ, పదికి గానీ పరిమితం చేస్తే బాగుంటుందని భవదీయుడి అభిప్రాయం.

ఇంకో విషయం - డబ్బుతో పని కాబట్టి అనుమానాలు రాకుండా, గొడవల్లేకుండా - పాలుపంచుకోవాలనుకున్నవారికి ఆయా కళాకారుల అడ్రసు వివరాలు, బాంకు వివరాలు ఇచ్చెయ్యటం జరుగుతుంది.

పాలుపంచుకోవాలనుకున్నవారే ఆ బాంక్ అక్కవుంటుకు ట్రాన్స్ఫర్ చెయ్యటమో, వేరే విధంగా అందేలా చూడటమో చేసుకోవచ్చు...

2, 3 నంబర్లకు సాయం చెయ్యాలని ఎవరికైనా అనిపిస్తే, అదే కాక ఇతరంగా ఆలోచనలు, సలహాలు ఇవ్వాలనిపించినవారు  దయచేసి ఇక్కడే ఒక కామెంటు కొట్టండి.....

అయినా ఒక వెర్రి ప్రశ్న - పైన కొత్తపాళి గారి కామెంటుకు దీనికి సంబంధమేమన్నా ఉన్నదా అసలు అన్న అనుమానం వచ్చిందయ్యా...

ఇదసలు పెద్దపీట ఎలా వేస్తుంది అన్న అనుమానం వచ్చిందా? శుభం

భవదీయుడు

మాగంటి వంశి

5 comments:

 1. శుభం భూయాత్.

  ఏమీ చేయలేకున్నా, కనీసం బాజాభజంత్రీలు వెనుకనుండి మోగించడానికి సిద్ధం. ఆరవ నంబరుకు ఏమైనా చేయగలను కానీ, ఉద్యోగం ఉన్నంతవరకే. హైదరాబాదులో అఘోరిస్తున్నాను కాబట్టి స్వయంగా నేనై నేను ఎవరినైనా కలవడం వంటి పనులు వీలువెంబడి చేయగలను, అలాంటివి నా ముఖాన కొడితే.

  ReplyDelete
 2. @ రవి - ధన్యవాదాలు...

  "ఎవరినైనా కలవడం వంటి పనులు" - తప్పక తెలియచేస్తాను / మీ సాయం తీసుకుంటాను....ఈ వచ్చే ఉగాది లోపల వీలుంటే, మీ ఊరు వెడితే మీ ఆకాశవాణి కేంద్రంలోని పాతతరం వారి వివరాలు, మీకెరికలో కానీ, మీవారికెవరికైనా ఎరికలో ఉన్న నాటకరంగ, జానపద కళాకారుల వివరాలు సేకరించగలిగితే, పంపించగలిగితే అమితమైన సంతోషం....

  ReplyDelete
 3. వంశీ మోహన్ గారు మీ ఆలోచన చాలా బాగుంది.కళలని ప్రేమించడమే కాకుండా కళా కారులని గుర్తించి వారికి..ఇతోదికంగా నగదు పురస్కారాలు అందించాలనుకోవడం అభినందనీయం. విజయవాడ లో..కళాకారుల వివరాల గురించిన డైరక్ట రీని ముద్రించిన వారు ఉన్నారు.వారి నుండి నేను ఆ ముద్రణా ప్రతిని..సేకరించి మీకు అందే ఏర్పాటు చేయగలను.మీ ప్రయత్నం సఫలవంతం కావాలని..ఆశిస్తూ.. వనజ.

  ReplyDelete
 4. భేషో. మనిషంటే మీరు!!
  పెద్ద పీట వెయ్యడం గురించి మనం వేరే మాటాడదాం.

  ReplyDelete
 5. @వనజ - మీరు అందించబోయే ఆ ఆణిముత్యం కోసం ఎదురుచూస్తూ ఉంటానండి. ధన్యవాదాలతో...

  ReplyDelete