Thursday, June 30, 2011

"ట్రాన్స్ఫార్మర్స్ - డార్క్ ఆఫ్ ద మూన్" - చూసానహో - రాసానహో

ట్రాన్స్ఫార్మర్స్ - డార్క్ ఆఫ్ ద మూన్

స్పీల్బర్గ్ - ఈ పేరు కనపడ్డదంటే ఆ సినిమా అలాస్కాదైనా, ఆర్జెంటీనాదైనా, ఆంధ్రదేశానిదైనా మొదటిరోజు మొదటిషో అంత కాకపోయినా, మొదటిరోజు మూడోషో మటుకు చూడటం జరుగుతుంది. అల్లాగే వెళ్ళా. చూసా. వచ్చా.

ఏ సినిమాకైనా వెళ్ళటం ఒకెత్తు కాకపోయినా, చూడటం ఒక ఎత్తు, తిరిగిరావటం ఒక ఎత్తు, వచ్చాక పరిస్థితి ఒక ఎత్తు. వెళ్ళటానికి ఎత్తులేమీ ఉండవు. టికెటు కవుంటర్లో డబ్బులిచ్చాక టికెట్ చేతిలో పడి హాల్లోకి వెళ్ళి సీట్లో కూర్చున్నాకా ఎత్తుల పర్వం మొదలవుతుంది. సినిమా అన్నాక ఏదో ఒక ఎత్తుకు తీసుకెళ్ళటం ఖాయమే. ఐతే ఆ పర్వం పూర్తయ్యేటప్పటికి అంత ఎత్తులో నిలబడి చిద్విలాసాలు చిందించటమో, అంత ఎత్తు నుంచి కిందకు పడిపోటంతో తీవ్రంగా గాయపడి కుయ్యో మొర్రో అనటమో, అటూ ఇటూ కాకుంటే మధ్యలోని త్రిశంకులోకి జారి వెర్రి నవ్వులు నవ్వుకోటమో - ఈ మూడిట్లో ఏదో ఒకటే - ఖచ్చితంగా ఒకటే సంభావనగా ప్రాప్తమయ్యేది. 

ఈ ట్రాన్స్ఫార్మర్స్ పరంపరలో రెండో సినిమా - కిలిమాంజరో పర్వతమంత ఎత్తులో తీసుకెళ్ళి అక్కడినుంచి పడెయ్యటంతో బోల్డు దెబ్బలు తగిలించుకొచ్చా....అయినా సరే హాలీవుడ్డు చక్రధారి స్పీలుబర్గంతటోడు అంత ఇదిగా మనకోసం కోట్లల్లో డబ్బులెట్టి దాదాపు మూడు గంటల సినిమా మూడో భాగంగా తీస్తే, మనకేం రోగమనిన్నీ, ఏక్ నిరంజన్ లా పర్సులో రెపరెపలాడుతూ బయటకు తియ్, బయటకు తియ్ అని ఓ రెచ్చిపోతూ కత్తి యుద్ధం చేసి పాంటు జేబుకు చిల్లు పొడిచేస్తున్న పది డాలర్ల నోటుని సంతోషపరుద్దామనిన్నీ, ధైర్యే సాహసే స్పీల్బర్గ్ లక్ష్మీ అని ప్రార్థించుకునిన్నీ హాల్లో సీట్లోకి శరీరాన్ని కూలదోసా.....

రాత్రి 8.30 షో - 8.25 అయ్యింది. హాలు సగం కూడా నిండలా....పిల్లలకు స్కూలు సెలవలున్నా ఇదేంటీ - హాలు ఇంత దీనావస్థలో ఉన్నది అనిపించింది. సరేలే హాలుతో మనకేం సంబంధం, స్పీల్బర్గుతో సంబంధం అనుకుని సరిపెట్టుకున్నా...ట్రైలర్లు మొదలైనాయి... గ్రీన్ లాంటెర్న్, హారీ పోటర్, ప్లానెట్ ఆఫ్ ఏప్స్ - ఈ మూడు ట్రైలర్లయ్యేటప్పటికి పొలోమంటు ఓ 70-80 మంది బిలబిల (పిల్లాడు), కిలకిల (పిల్ల) దూసుకుంటూ వచ్చారు...హాలు ఫుల్లు, కిల కిల - బిల బిల లతో కొద్దిసేపు గోల గోల.....ఆరో ట్రైలర్ అయ్యేప్పటికి గోల సద్దుమణిగింది....10, 8, 7.....అని నంబర్లు తెర మీద కనపడ్డంతో సూది కిందపడితే వినపడేంత నిశ్శబ్దం....సున్నాకొచ్చింది....సినిమా మొదలయ్యింది....

సరే ఇహ మిగతావి - అనగా లొల్లాయి ఆపేసి.....సినిమాలోకొచ్చేస్తే -

రెండు ముక్కల్లో - ఆటోబాట్స్ సైబర్ట్రాన్ గ్రహాన్ని రక్షించుకోటానికి చేసే యుద్ధం - ఆ కీలకాన్ని దాచుకున్న "ఆర్క్" అనే ఎయిర్ క్రాఫ్ట్ ను డిసెప్టికాన్స్ చేతిలో పడకుండా అడ్డుకోటం, ఆ అడ్డుకోటంలో భాగంగా తమవాడే అయిన ముసలి ఐన్ స్టీన్ లాటి సెంటినెల్ ప్రైం ను నమ్మటం, అది చెడటం, ఆప్టిమస్ ప్రైం వీరవిహారం చెయ్యటం - చివరకు ఆ గుంపులో "ఒకాయన" చెయ్యి పోగొట్టుకుని విజయం సాధించటం, ఆ విజయంలో భాగంగా భూమి రక్షింపబడటం , ఈటన్నిటికీ అమెరికనుల చంద్రమండల యాత్రతో ముడిపెట్టటం -  అదీ సంగతన్నమాట.....

మొదటి గంటన్నరలో గ్రాఫిక్స్ అదరహ! బెదరహ! కుదరహ! నదరహ! అబ్బోయహ! విశ్వరూపం చూపించేసాడు.........బూటకమో, నాటకమో , నిజమో- చంద్రమండల యాత్రలో పాలు పంచుకున్న బజ్ ఆల్డ్రిన్ సినిమాలో కనపడటంతో ఈలలూ, చప్పట్లు - నేను కూడా కొట్టాననుకో.... గ్రాఫిక్స్ ఆ తర్వాత బాలేదా? బాగున్నాయి - కాకుంటే అప్పటికి మీరే ఓ ఆటోబాటైపోతారన్నమాట.

ఇక్కడ ఒకటి చెప్పాలె - అమెరికనుల చంద్రమండల యాత్ర నాకు అంత ఉత్సాహం కలిగించకపోయినా, రష్యన్ వాళ్ళ రోదసి యాత్ర, అలా మొదటి మానవుడిగా - మన పురాణాల్లోవి వదిలేసి - అంతరిక్షంలోకి దూసుకెళ్ళిన యూరీ గగారిన్ అంటే పిచ్చి అభిమానం - ఎందుకో తెలియదు....ఆయనవి బోల్డు ఫోటోలు, ఆర్టికల్సూ ఉండేవి నా దగ్గర....

సరే మళ్ళీ సినిమాలోకొచ్చేస్తే - ఆటోబాట్స్ ఐన్ స్టీన్ - సెంటినెల్ ప్రైం ను చంద్రుడి మీద నుంచి భూమ్మీదకు తీసుకొచ్చేస్తాడు దర్శకుడు...సెంటినెల్ ప్రైం రూపు, రేఖలు - అదరహ! ఆప్టిమస్ ప్రైం రుపు రేఖలు కూడా కొద్దిగా మారిపోయి చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు....సెంటినెల్ ప్రైం ట్విస్టిచ్చి మెగాట్రాన్ తో కలిసిపోయే ప్లానేసి వెన్నుపోటు పొడుస్తాడు........సెంటినెల్ - ఆప్టిమస్ - ముఖ్యంగా ఆప్టిమస్ ప్రైం తను ఉన్న ప్రతి సీన్లోనూ బలమైన ముద్ర వేసేస్తాడు, మరీ ముఖ్యంగా యుద్ధ విన్యాసాల్ల్లో....ఇహ సినిమా గురించి ఇక్కడితో ఆపేస్తా....ఎక్కడికెళ్తున్నానో అర్థమైపోయిందనుకుంటా మీకు.....

సెంటినెల్ ప్రైంకు వాయిస్ ఇచ్చింది "స్టార్ ట్రెక్" టి.వి.సీరియల్లోని నా అభిమాన నటుడు లెనార్డ్ నిమో(మ్మో)య్ (మిస్టర్ స్పాక్) అని తర్వాత చూసి ఆశ్చర్యపోయా....జగ్గయ్య గారికన్నా భీకరంగా దంచి పారేశాడు....టెక్కునాలజీతో వాయిస్ మారుస్తారనుకో, అయినా కానీ ...

ఇక హీరోయిన్ను గురించి - మెగన్ ఫాక్స్ ఉన్నప్పుడు వచ్చినంత కళ, ఇప్పటి హీరోయిన్ను చూస్తే రాలా....అసలావిడ ఉన్నా లేకపోయినా ఒకటే ఆ సినిమాలో....

సంగీతం గురించి చెప్పనే అక్ఖరలా....హెవీ మెటల్, రాక్ కలిపి అదరగొట్టటంతో పాటు, లింకిన్ పార్క్ - స్టెయిండ్, గూ గూ డాల్స్ - ట్రాకులు వాడుకోటంతో బోల్డు శ్రవణానందం కలిగింది....డిసెప్టికాన్ షాక్ వేవ్ పాత్ర కూడా మంచి, బలమైన ముద్రవేస్తుంది - ఇంకొన్ని సీన్లు ఇచ్చి ఉంటే బాగుండేదేమో అని అనిపించింది....

మొత్తానికి ఎవరెష్టు కాదు కానీ కాంచనగంగ పర్వతం ఎక్కించి అక్కడే నిలబెట్టాడు నన్ను ....అదండీ సంగతి.....

మైకేల్ బే మహాశయుడు - ఈ మూడో భాగాన్ని - సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాడు...మూడు గంటల దృశ్య - విందుభోజనానికి నాదీ పూచీ....వెళ్ళి చూసొచ్చెయ్యండి.....చూసొచ్చాక ఓ కామెంటు ఇక్కడ పడెయ్యండి....

PS: The earlier post in the aggregators had the wrong TITLE of the movie... :) Woo Hoo! New thing learned - Excitement kills many things - including titles....So deleted that one and reposted this one!

5 comments:

 1. ఈ సినిమా గురించి ఇంగ్లీషు రివ్యూలు అంత గొప్పగా చెప్పకపోయినా ఈ సినిమా తప్పక ఈ వారాంతం చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ భాగం మా ఆఫీసుకి దగ్గర్లో చికాగో డవున్ టవునులో తీసారు. ఇంకెందుకంటే ఈ ఫిల్మ్ షూటింగ్ మూడుగంటలు పచార్లు చేసి కొంతసేపు చూడగలిగాను. అప్పుడు హీరో ఎవరితోనో ఫైటింగ్ చేస్తుంటాడు. ఆ సీన్ ఈ సినిమాలో ఎలా వచ్చిందో చూసెయ్యాలి కదా. మేగన్ ఫాక్స్ మిస్సవుతాను :(

  ReplyDelete
 2. నాకంత అద్భుతంగా ఏమీ అనిపించలేదండీ. అసలే అమెరికన్ల చంద్రమండల యాత్ర నిజమా కాదా అని సందేహములో ఉన్నాను. ఈ సినిమా చూశాక అవన్నీ కలిసి కిచిడి (రుచి అడుగవద్దే!)లా తయారయ్యింది. నాలుగు పుస్తకాలు తిరగేసి ఏది ఏమిటో మళ్ళీ రూఢి చేసుకోవాలి.

  ReplyDelete
 3. @అచంగ - :) ఆ మండల సందేహం పక్కనబెడితే ఇతరంగా మీకు ఏం నచ్చలేదో, ఎందుకు నచ్చలేదో ఓ ముక్క రాయండి.....

  ఈ భూప్రపంచకంలో మూడు గంటల సినిమా "అద్భుతం" అంటే ఒకటే ఒక్క సినిమా ఉన్నది - అదే "మాయాబజార్".....మిగిలినవన్నీ "ముద్ర"లేసేవే తప్ప "నిద్ర"లోకి కూడా రావు....అందుకే నేనెక్కడా అద్భుతం అనే మాట వాడలా.....అయితే ఈ ట్రాన్స్ఫార్మర్స్ సిరీసులో రెండవ దాని దెబ్బకు తట్టుకుని నిలబడి మరీ ఈ మూడో దానికి వెళ్ళటంతో బోల్డంత ఉపశమనం కలిగింది....ఆ దెబ్బ మర్చిపోయేలా చేసింది....

  మధ్యలో మైకేల్ బే కి ఓ ఇరవై నిముషాలు కథ ఇంకెలా చెప్పాలో అర్థం కాక "బే" "బే" అన్నాడు కానీ మొత్తమ్మీద "కాపరి" ఆయన "స్పీలు" ఈయన తోలు "పీలు" చెయ్యటంతో మళ్ళీ తిప్పుకున్నాడనిపించింది... ...

  కథాపరం ఎప్పుడోకానీ తెరమీదకు రాదు కానీ దృశ్యపరంగా మాంచి విందు భోజనమే......మూడుగంటలూ ! పోనీ రెండు గంటల ఇరవై నిముషాలు.... :)

  @శరత్ - చూసొచ్చాక చెప్పండి మీకు ఎలాగుందో! మా ఒకప్పటి డవుంటవున్ అచ్చుపోత పోసేసి అలాగ దింపేసాడు...ఒక్క బిల్డింగు కూడా తేడా రాకుండా....కాకుంటే అన్నీ డిసెప్టికానార్పణమస్తు చేసేసి కలుక్కుమనిపించాడు ......:)

  ReplyDelete
 4. మోహన్ గారూ,
  ఒక్క గ్రాఫిక్స్ మాయాజాలం తప్పించి ఎమి నచ్చిందో చెబుదామని ఉదయం నుండీ ప్రయత్నించాను. నావల్ల కాలేదు మరి! కథ ఏమన్నా బాగుందా అంటే యఫ్ ౧ రేసు ట్రాక్ మాదిరిగా ఎన్ని మలుపులు తిరిగిందో దానికే తెలియదు. పోనీ నటన బాగుంది అందామా అంటే డబ్బాలు, కార్లు తప్పించి మొహాలెక్కడ కనిపించాయని!! ఇదీ నా అవస్థ ఆ సినిమా చూస్తున్నంతసేపూ!

  ReplyDelete
 5. చూసి తీరాల్సిందే అని మా అబ్బాయి ఒకటే గోల చేస్తున్నాడు. పైగా ఫ్రెండ్స్ తో చూస్తేనే మజా వచ్చే సినిమా అంటున్నాడు. వేలు పోసి ( తికట్ లే వెయ్యి కి పైనే అవుతాయి.. ) ముగ్గురం వెళ్ళడమా, వాడిని ఫ్రెండ్స్ తో పంపడమా అని ఆలోచిస్తున్నాము. :)

  ReplyDelete