Tuesday, June 28, 2011

హప్పుడే హారు నిండి హేడులోకొచ్చేసింది...హాచ్చర్యంగా!

21 జులై, 2005

భలే రోజయ్యా...

ఏం? భలేగవ్వటానికి ఆ రోజు ఏం జరిగింది?

మాగంటి.ఆర్గ్ వెబ్సైటు పుట్టినరోజయ్యా లింగయ్యా! హప్పుడే హారు నిండి హేడులోకొచ్చేసింది...హాచ్చర్యంగా!

హాచ్చర్యమేముంది అందులో?  పుట్టాక పెరగాలిగాల్సిందేగా - అడ్డంగానో, దిడ్డంగానో, నిలువుగానో?

అవుననుకో...అయినా నువ్వు మరీ మొహమాటం లేకుండా అట్టా అనేస్తే ఎట్టా లింగా?

అయ్యన్నీ నా దగ్గర జాన్తా నై ....అనిపించింది అనెయ్యటమే! అవునూ, ఇది అసలు ఎందుకు మొదలుపెట్టా?

ఏమిటి? ఈ వాగుడా?

కాదు - వెబ్సైటు

అదో పెద్ద కథ

అంత పెద్ద కథ వినే ఓపిక లేదు కానీ, ఓ నాలుగు ముక్కలు జెప్పు

కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది...ఏం జెప్పమంటా?

ఈ దిక్కుమాలిన కడుపుల గోలేంటి బాబోయ్...నువ్వూ వద్దు నీ కథ వద్దూ, కడుపూ వద్దూ కాళ్ళూ వద్దు
 
అప్పుడే ఇసిగిపొయ్యావా లింగా?

ఓ! బాగా ఇసిగిపోయా - నాలుగు ముక్కలు కక్కమంటే కడుపులు - కాళ్ళు అంటావు, అది సరే కానీ ఓ మాట జెప్పు - ఈ ఆరేళ్లలో నువ్వు చేసిన పని నీకు తృప్తినిచ్చిందా?

నేను చించుకోకుండా నువ్వే చించేసి అందరి కాళ్ళ మీద పడేసావుగా. నీకు తిరుగు లేదు లింగా...అయినా తృప్తి పావు పాలు, అసంతృప్తి ముప్పావు పాలు

తృప్తి దేనికి? అసంతృప్తి దేనికి?

తృప్తి - ఒక అడుగు ముందుకు పడిందనీ, అసంతృప్తి - ఇంకా కొన్ని మైళ్ళ ప్రయాణం మిగిలుందని...

అడుగు పడిందిగా, ఆ అడుగు కూడా వెయ్యనోళ్ళు లక్షల్లో ఉన్నారు.. అయినా నీ అసంతృప్తికి అంతే లేనట్టుగా కనపడుతోందే. ఒక్కటి గుర్తెట్టుకో...దేనికైనా ఓ అంతు ఉండాల్సిందే! ఉన్నదాంతో తృప్తి పడకపోతే బోల్డు కష్టాలొస్తాయి .

ఓసోస్ కష్టాలేగా....అయ్యొక లెక్కా డొక్కా మనకి ! 

మరింక ఏడుపెందుకు?

ఏడుపుకీ, అసంతృప్తికి బోల్డు తేడా ఉందిరా లింగా!

ఏంటి, ఏంటి...."ఏరా" లోకి వెళ్ళిపోయింది మాట....జాగ్రత్తగా మాట్లాడు..

నువ్వూ నేనూ ఒహటే గదరా! నిన్నంటే నన్ననుకున్నట్టే కాబట్టి ఇహ ముయ్యచ్చు తవరు

అంతేనంటావా?

అంతే...

సరే కానీ ఈ ఆరేళ్లలో పని అంతా నువ్వే చేసావా , ఇంకెవరన్నా సాయపడ్డారా? పడితే ఎంతమంది? వాళ్ళ కథా కమామీషు ఏమిటి? కొద్దిగా వివరమిచ్చుకో

మొదటి మూడున్నరేళ్ళు "ఓల్ అండ్ సోలు" గా పనిచేసా లింగా - ఆతర్వాత రెండున్నరేళ్లలో బోల్డంతమంది కాకపోయినా, అడిగిన వెంటనే కాదనకుండా సాయం చేసినవాళ్ళు చాలామందే ఉన్నారు. సర్వశ్రీ కొడవటిగంటి రోహిణీప్రసాద్, పరుచూరి శ్రీనివాస్, డాక్టర్ కె.బి.గోపాలం, సుధామ, తురగా జానకీరాణి, వాడపల్లి శేషతల్ప సాయి, కప్పగంతు శివరామ ప్రసాద్, రంజని, డాక్టర్ జెజ్జాల కృష్ణమోహన రావు, నిడదవోలు మాలతి, చంద్రలత, డింగరి దుర్గ, ఇన్నయ్య, ఇలియాస్ అహ్మద్, శ్యాం నారాయణ, కుప్పా రాజశేఖర్, బుర్రా రాంచంద్, కేశరాజు భాను కిరణ్, డాక్టర్ ఆర్.జయదేవ ,  డాక్టర్ పతంజలి , శ్రీ జె.మధుసూదన శర్మ, నూకల ప్రభాకర్ , మండా కృష్ణమోహన్, డాక్టర్ స్వరూప్ కృష్ణ, డాక్టర్ సరస్వతీ భట్టార్,  డాక్టర్ చల్లా విజయలక్ష్మి,  డాక్టర్ చెముటూరి నాగేంద్ర, మల్లిన నరసింహారావు, డాక్టర్ ద్వా.నా.శాస్త్రి,  వై.వి.కృష్ణ, కొల్లూరి భాస్కర రావు , వెంకట రమణ, నల్లాన్ చక్రవర్తి శేషాచార్య, ఆచార్య కొవ్వలి సత్యసాయి, డాక్టర్ వేమూరి వేంకటేశ్వర రావు, కిరణ్ ప్రభ, వారాల ఆనంద్, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, పింగళి ప్రభాకర రావు, చర్ల రత్నకుమారి, జె .జానకి , వీణా శ్రీనివాస్ , సరోజినీ మూర్తి, దేవరపల్లి రాజేంద్ర కుమార్, పప్పు అరుణ, మార్సియా, విమల, జ్యోతి వలబోజు, మాగంటి శివరామశర్మ, మాగంటి శ్రీదేవి, యానిమేటర్లు రవి, రాజేంద్ర, కృష్ణ, వాయిస్ ఓవర్ కళాకారులు (ప్రముఖ ఆకాశవాణి అనౌన్సర్లు ఇద్దరు - వీరి పేర్లు, వివరాలు ఇప్పటికి గోప్యమే)  - ఇలా ఇంత మంది మహానుభావులు / మహానుభావురాళ్లు సాయం చేసారు...ఇంకా ఒకరిద్దరినెవరినన్నా మరిచిపోయానేమో తెలియదు, ఒకవేళ మరచి ఉంటే వారికి హృదయ పూర్వక క్షమాపణలతో....

వీరిలో 95 శాతం మంది సూచనలు సలహాలు ఇచ్చి నాకు తెలియని విషయాలు నేర్చుకునే అరుదైన అవకాశం కల్పించినవారైతే, కొంతమంది నా సతాయింపు భరించలేక కోప్పడ్డవాళ్ళూ ఉన్నారు, మరికొంతమంది నేనొకటంటే వారొక అర్థం తీసుకుని కోపగించి అలిగి మాట్లాడకుండా వెళ్ళిపోయినవారూ ఉన్నారు....వీరి వివరాలు ఇక్కడ చెప్పటం మొదలుపెడితే అంతులేని కథే అవుతుంది....

లోకోభిన్న రుచిః కాబట్టి - పైన పేర్కొన్నవారు కాక మరికొంతమంది స్పందించిన విధంబెట్టిదనిన -
అ) నీకు సమాచారమిస్తే నాకేమిటి? 
ఆ) మీరు అమెరికాలో ఉంటున్నారు కాబట్టి, డబ్బులిస్తే కొంచెం "మెటీరియల్" ఇస్తాం
ఇ) అసలు ఈలాటి వెబ్సైటుతో ఎవడికి ఉపయోగం? నా టైము దండగ, మీ టైము దండగ. నన్ను మళ్ళీ అడగొద్దు.
ఈ) నేను చాలా బిజీ మనిషినండీ. అయినా నా పనులు మానుకుని మీకెందుకు ఇవ్వాలండీ? మీరేమన్నా చుట్టమా పక్కమా?
ఉ) మీకు ఇస్తాను కానీ , మీరు నాకో పని చేయ్యాలి. నా పుస్తకమేమన్నా అచ్చేయించి పెట్టటం సాధ్యమా? అది మీరైనా సరే, మీ స్నేహితులైనా సరే
ఊ) ఇస్తాను కానీ మీ సైటులో నేను చెప్పిన మార్పులు నేను చెప్పినట్టు చేస్తేనే
ఋ) మీ సైటు లుక్కు మార్చాలి, అప్పుడు ఆలోచిస్తా
ౠ) మీ సైటు గురించి వేరేవారేమనుకుంటున్నారో నాకు తెలుసు. అయినా మీకిప్పట్లో ఇవ్వటం సాధ్యపడకపోవచ్చు.
ఎ) నాదగ్గర బోల్డు సమాచారం ఉన్నది. కానీ నాకు టైము లేదు. మీకు పంపించడమూ కుదరదు.

ఇలా మరికొన్ని విచిత్రమైన కోరికలు కోరటమూ, వారికి నావద్ద పాతాళభైరవి లేదని చెప్పటం జరగటం, వారు విస విస లడటం - ఇల్లా కొన్ని కథాకళిలు జరగటం జరిగింది....మరికొంతమంది లౌక్యంగా  పొమ్మనకుండా పొగబెట్టటం, మరికొంతమంది పొగబెట్టి ముక్కులు ఘాటెక్కించడం, మరికొంతమంది అర్థం కాకుండా మాట్టాడటం.....

సరే ఇవన్నీ పక్కనబెట్టేసి....మాట్టాడకుండా పోయినవారంతా, నవ్వుకుని పక్కకు తొలగిపోయినవారంతా, సమాచారం ఇవ్వనివారంతా మంచోరే అనుకుని నా దారిలో నేను సాగిపోటం....అల్లాగన్నమాట... 


ఏదేమైనా , ఎటువంటి చిన్నపాటి సాయం చేసినవారికైన, అడిగినా సాయం చెయ్యనివారికైనా - అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలతో....మీ సాయం లేకుంటే ఈ చిన్ని వెబ్సైటులో ఇంత సమాచారం చేర్చగలిగేవాడినీ కానూ, ఇంతమందికి అందుబాటులోకి తెచ్చి ఉండగలిగేవాడినీ కాను.....వెబ్సైటు సందర్శకుల మెచ్చుకోళ్ళన్నీ వీరందరికే చెందుతాయి......

సందర్శకులు అంటున్నావు? ఎంత మంది చూస్తున్నారు ఈ వెబ్సైటు...

అడిగావా? అనుకుంటూనే ఉన్నా..... ఇదిగో నీ కోసం - క్రితం ఆగష్టు నుంచి ఈ రోజు అనగా - జూన్ 28వ తేదీ వరకూ వెబ్సైటు స్టాటిస్టిక్కులు ....

బాగుంది - ఈ 11 నెలల్లో దాదాపు 30 లక్షల హిట్లా? అవునూ ఇదేంటి - హిట్లు నవంబరు నుంచి తగ్గినాయే?

అవును - సమయాభావం వల్ల ఇంతకుముందులా వెబ్సైటు SEO Optimization మీద శ్రద్ధ పెట్టకపోటం మూలాన - వెబ్సైటుకు కొత్తరూపు తీసుకు రావటం, ఆ సమయంలో సెర్చ్ ఇంజన్స్ కు తగ్గట్టు సమాచారం పొందుపరచడం మిస్సవ్వడం వల్లనూ, ప్రచురించవలసిన సరంజామా ఎక్కువైపోవటం వల్లనూ - ఇలా మరికొన్ని కారణాలవల్ల పడిపోయింది.....ఇహ ఈ నెల నుంచి మళ్ళీ ఆ పని మీదే ఉంటున్నా కాబట్టి మళ్ళీ ఊపందుకోవచ్చు అని ఊహ....

బాగుంది బాగుంది....మరి కొత్త ప్రణాలికలేమిటి?

చిన్న పిల్లల కథలు ఒక వెయ్యి ఆడియో రూపంలో తయారు చేసే పని, ఒక 100 పిల్లల కథల యానిమేషన్ పని మొదలైనాయి ప్రస్తుతానికి.....ఇప్పటికి ఓ వంద ఆడియోలు, ఒక రెండు యానిమేషన్లు పూర్తయ్యాయి, మిగిలినవి పూర్తయ్యాక మిగతా వాటి మీద పడతానన్నమాట......

మిగిలినవంటే?

చాలానే ఉన్నాయి....చెప్పాగా మైళ్ళ ప్రయాణం మిగిలిపోయిందని......వివరాలు తర్వాతెప్పుడైనా....

శుభం....సర్వేజనాస్సుఖినోభవంతు!

13 comments:

 1. మీకు అభినందనలు, శుభాకాంక్షలు; మీ వెబ్సైటుకి పుట్టినరోజు శుభాకాంక్షలు, శుభమస్తు.

  ReplyDelete
 2. హేడునుంఢి హినిమిదికి కూడా వచ్చేస్తారుకాని హాశ్చర్యమేముంది. వంశీగారు, మాగంటి కోసం మీరు పడుతున్న శ్రమ మీకంటే మీ తర్వాతి తరానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. లాభాపేక్ష లేకుండా మీరు చేస్తున్న కృషికి అభినందనలు. కాస్త ఈ మాగంటికి పురుగు,పుట్రా రాకుండా, దొంగలు ఎత్తుకెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోండి. నాకే అప్పుడప్పుడు భయమేస్తుంది. ఇలా జరిగే అవకాశం ఉంది కదా. మళ్లీ అన్నీ పెట్టాలంటే ఎంత కష్టం కదా అని.. మీరు ఆ జాగ్రత్త ఎలాగూ తీసుకుంటారులెండి.

  ReplyDelete
 3. వంశీ మోహన్ గారు మీ వెబ్ సైట్ కి..పుట్టిన రోజు శుభాకాంక్షలు.మీకు శుభాభినందనలు. భగవంతుడు మీకు అన్ని రకాలుగా కృపని.. ప్రసాదించి.. సుదీర్గ బ్లాగ్ ప్రయాణ ప్రాప్తిరస్తుగా .. దీవించాలని.. ఆశిస్తూ..

  ReplyDelete
 4. శుభాకాంక్షలు!

  ReplyDelete
 5. ఎంతో సమయాన్ని వెచ్చించి సైటును నిర్వహిస్తున్న మీకు, మీ కుటుంబ సభ్యులకూ నా అభినందనలు.

  ReplyDelete
 6. ముందుగా మీ భగీరథ ప్రయత్నానికి అభినందనలు. మాగంటి.ఆర్గ్ వెబ్సైటుకి పుట్టినరోజు శుభాకాంక్షలు.

  ఎంతటి ప్రయాణమైనా చిరు చిరు అడుగులతో మొదలవ్వాల్సిందే! మీ అడుగులు..వడి వడి నడకలై..ఆపై పరుగులవ్వాలని..మీ ఈ ప్రయాణం మీరు కోరుకున్న విధంగా సాగాలని మనసారా కోరుకుంటున్నాను.

  ReplyDelete
 7. తెలుగువారి అభిరుచుల దర్పణమైన మాగంటి. ఆర్గ్ వెబ్ సైట్ Sweet 16 పూర్తి చేసుకున్న శుభ సందర్భపు శుభాకాంక్షలు అందుకోండి.

  ReplyDelete
 8. @పద్మ, వనజవనమాలి, ఆ.సౌమ్య, శివరామప్రసాద్, సిరిసిరిమువ్వ, సి.బి.రావ్ గార్లు - అభిమానానికి ధన్యవాద్

  @చదువరి గారు - బహుకాల దర్శనం. ధన్యవాదాలు..

  @ జ్యోతి గారు - :) ....అవును నిజం....జాగ్రత్త జాగ్రత్తే! భయం భయమే! అయినా అవకాశం ఉంది కాబట్టిన్నూ, మీరు హెచ్చరించారు కాబట్టిన్నూ మరింత జాగ్రత్తగా ఉంటా....ఈ ప్రయత్నం - అనగా ఎత్తుకెళ్ళే, చొరబడే ప్రణాలిక వేసుకున్న పురుగు, పుట్రా, దొంగలు గురించి ఏదన్నా సమాచారం ఉంటే కాస్త ఉప్పు అందించండి...ముందస్తు ధన్యవాదాలతో! ఈ హిట్సులో - వారపత్రికలో మీర్రాసిన వ్యాసాల పాలు బాగానే ఉన్నది - అందుకు కూడా ధన్యవాదాలు..

  ReplyDelete
 9. వంశీ గారు,

  మాగంటి.ఆర్గ్ కు జన్మ దిన శుభాకాంక్షలు. మీ కృషి చాలా అభినందనీయం. భగవంతుడు మిమ్మల్ని, మీ వెబ్సైటు ను చల్లగా చూడాలని కోరుకుంటున్నాను.

  -జవహర్

  ReplyDelete
 10. జన్మదిన శుభాకాంక్షలు .

  ReplyDelete
 11. @ జవహర్, మాలాకుమార్ గార్లు - ధన్యవాదాలు

  ReplyDelete
 12. మీ blog కు పుట్టినరోజు శుభాకాంక్షలు(belated), అయ్యబాబోయ్ 11 నెలల్లో 30లక్షల హిట్లా? ఏం రికార్డండీ బాబు?:)

  ReplyDelete