Friday, May 27, 2011

హిందూ శబ్దం యొక్క అర్థం చాలా చెడ్డది!! - శ్రీమాన్ నండూరి కృష్ణమాచార్యులు

"మనము ఆర్యసమాజీయులము ఎందుకు కావలయును"

అని ఓ గోప్ప పుస్తకం తారసపడింది. అది చదివితే గోప్ప పుస్తకమెందుకు అయ్యిందో మీకే ఎరికలోకి వస్తుంది. లంకె ఇక్కడ.

http://www.archive.org/details/ManamuAryaSamaajulamEndukuKavalayunu


శ్రీమాన్ నండూరి కృష్ణమాచార్యులు అన్న పేరు కలవారు వ్రాసిన మణి అది. బంకనక్కిడికాయలా ఈయన ఆర్యసమాజాన్ని నూరేసి ఆరేసి మన మీద పారేసారు. ఇహ పొలోమంటూ ఆర్యులమైపోటం మిగిలింది.

ఆ పుస్తకంలోని ఒక ముత్యం -

"మన పేరు నిజానికి హిందువు కాదు. హిందూ శబ్దం యొక్క అర్థం చాలా చెడ్డది. దానికి అర్థం - దొంగ, బానిస, నల్లవాడు, పాషండుడు మున్నగునవి. అది ఫారసీ భాషలోని శబ్దం. ముసల్మానులు ద్వేషంతో మనకీ పేరు పెట్టినారు"....

వైదిక ధర్మం - విశిష్టత అని తనకు చేతనైనంతలో అరివీర భయంకరంగా రాసుకొచ్చారు. ఈ బొమ్మల మీద నొక్కి చదవండి.
సర్వేజనా స్సుఖినోభవంతు

భవదీయుడు
వంశీ

5 comments:

 1. కాలక్రమేణ వాడుకలో శబ్దాల వ్యుత్పత్తులు ఏవైనప్పటికీ అర్ధాలు స్థిరపడిపోతాయి. దుహిత అంటే కూతురని సంస్కృతంలో అర్ధం ఉండగా పాలు పితికేదని వ్యుత్పత్తి. పూర్వం కుటుంబంలో పాలు పితికే బాధ్యత కూతురుకి ఉన్ననాడు ఆ వ్యుత్పత్తి నుంచి వచ్చి ఉంటుంది. మరి మా అమ్మాయి పాలు పితకదు కనుక దుహిత అనే పదమే మార్చాలని ఎవరైనా అంటే???
  అలాగే హిందూ అన్న పదం వ్యుత్పత్తి ఎలాంటిదైనా వాడుకలో మన మతాన్ని సూచిస్తూ పవిత్రార్ధాన్ని సంతరించుకుందని నా అభిప్రాయం.

  ReplyDelete
 2. ఆర్యసమాజం అనే పేరులోనే ఒక అపార్థం, అవగాహనారాహిత్యం ఉంది. దాని మీద ఆంగ్లేయుల చరిత్రగ్రంథాల ప్రభావం కనిపిస్తోంది. ఆర్య-ద్రావిడభేదాలు వారి డిస్కవరీ అయినప్పుడు ఈ ఆర్యశబ్దాన్ని ఎలా స్వీకరించగలం ? ఇది హిందూమతాన్ని సూచించదు. జాతిని సూచిస్తుంది. అటువంటప్పుడు దక్షిణాదివారం, పంచద్రావిడులలో ఒకఱుగా చూడబడుతున్న మనం ఆర్యులం ఎలా అవుతాం ? ఆర్యశబ్దం మన పూర్వగ్రంథాల్లో పూజ్యుడనే అర్థంలో మాత్రమే వాడారు. అన్నీ వేదాల్లోంచే తీసుకోవాలని ఉద్ఘోషించే ఆర్యసామాజికులు ఈ వేదవిరుద్ధమైన అర్థాన్ని ఎలా ప్రచారం చేస్తున్నారు ?

  ఆర్యసామాజికులు యావత్తు హిందూమతాన్నీ కట్టగట్టి గంగలో పారేసి వేదాలూ, వాటికి తాము చెప్పే భాష్యాలూ మాత్రమే స్వీకరించాలని చెబుతారు. దేవుళ్ళందఱినీ వదిలేయమంటారు. శ్రాద్ధాలు లేవంటారు. జ్యోతిష్యం అబద్ధమంటారు. అలా వేదాల అనంతరం వచ్చిన Religious discoveries అన్నింటినీ త్రోసిపుచ్చుతారు. వాళ్ళని నమ్ముకుంటే సనాతనధర్మంలో 1% కూడా మిగలదు.

  వేదాలు - ఎంత పూజనీయం అయినప్పటికీ వాళ్ళు చెబుతున్నంత సర్వసమగ్రంగా లేవు, యావజ్జీవితానికీ దారి చూపించేటంత సీన్ వాటికి లేదు. వాటిలో లభ్యమయ్యే జ్ఞానం చాలా చాలా పరిమితం. వాటి పరిధే చాలా సీమితం. మఱోపక్క సామాజికంగా చూస్తే అవి బ్రాహ్మణులకు తప్ప ఎవ్వఱికీ ఉపయోగపడవు. వాటిని మాత్రమే ప్రచారం చేస్తే హిందూధర్మం కొద్ది తరాల్లోనే అదృశ్యమైపోతుంది. నా దృష్టిలో వాటి చారిత్రిక పాత్ర ఎప్పుడో ముగిసిపోయింది. వాటి స్థానంలో కొత్త ప్రామాణిక గ్రంథాలు చాలా వచ్చాయి. అవి కూడా వేదాలతో సమానమైనవి. బహుశా అంతకంటే గొప్పవేమో కూడా. వేదఋషుల కంటే గొప్పవాళ్ళు తదనంతరకాలంలో చాలామంది వచ్చారు, షిర్డీసాయిబాబా, రామకృష్ణపరమహంస, రమణమహర్షి, వివేకానందుడూ మొ|| వారు

  వేదాల్లో కూడా అవాంఛనీయాలు చాలా ఉన్నాయి. దీని గుఱించి నా బ్లాగులో ఎప్పుడైనా ఒక వ్యాసాల పరంపరని ప్రకటిస్తాను.

  పురాణమిత్యేవ న సాధు సర్వం
  న చాఽపి కావ్యం నవమిత్యవద్యమ్

  ReplyDelete
 3. తాడేపల్లి గారు

  ఇటువైపు వచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు....టపా శ్లేషార్థంలో ప్రచురించటమైనది....అర్థం చేసుకున్నారని ఆశిస్తూ...

  ప్రామాణిక గ్రంథాలు కాలాన్ని బట్టి, అన్నిట్లో కాకపోయినా కొన్నిట్లోనన్నా మారుతూ ఉండాలిగా....లేకుంటే మొత్తానికే ఎసరొచ్చే ప్రమాదమున్నది....మీ దృష్టిలో ప్రస్తుత సమాజిక పరిస్థితులకి, రాబోయే ఒకట్రెండు తరాలకు ప్రామాణికంగా నిలవగల గ్రంథాలేవో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నది...వీలు చూసుకుని తెలియచెయ్యగలరు....

  "వేదాల్లో అవాంచనీయాలు" - దీని మీద వ్యాసాల పరంపర కోసం ఎదురు చూస్తూ....

  ReplyDelete
 4. క్షమించాలి. వాక్యక్రమం విజ్జోడు పడడం వల్ల అపార్థానికి తావిచ్చింది. నేను వ్రాయాలనుకుంటున్నది వేదాల్లో అవాంఛనీయాల గుఱించి కాదు. ఆర్యసమాజపు సిద్ధాంతంలోని అవకతవకల గుఱించి !

  ReplyDelete
 5. పార్సీ లో మంచి పేరు వెతుక్కుని, పార్సీ సాంప్రదాయ రూమీ టోపి పెట్టుకుని ఈ మాట చెప్పివుంటే జనాలు నమ్మేసేవోళ్ళేమో, పాపం ఆచారి.

  ReplyDelete