Saturday, April 16, 2011

POLL - ఘంటసాల మాష్టారా? రజనీ గారా? ఈ దండకాలకు దండలు ఎవరికి?

ఏమిటీ హెడ్డింగు? బుద్ధుందా అసలు నీకు?

ఉంది కాబట్టే ........

ఇంతకీ సంగతేమిటి? కథా కమామీషు వివరించుకో!

ఘంటసాల మాష్టారు పాడిన శ్యామలా దండకం నభూతో నభవిష్యతి  అని అనుకుంటూ ఉండేవాడినా? నేనేమిటి ఈ భూప్రపంచకంలో పాటలు వినేవాడెవడైనా అలాగే అనుకుంటాడన్న సంగతి నీకు కూడా తెలుసుగా?  వేరే మాట లేకుండా పటాపంచలు అయిపోయింది.

ఏమిటి పటాపంచలయ్యింది? పాటా? నీ అభిప్రాయమా? నిన్ను తగలెయ్య! సరిగ్గా చెప్పు

అభిప్రాయం నాయనా! అభిప్రాయం.

ఎలా? ఘంటసాల మాష్టారుని మించినవారు లేరయ్యా ఈ సంగీత ప్రపంచంలో!

ఒప్పుకున్నా, కానీ ఈ దండకానికి కాదు...

మరి? ఎవరున్నారో చెప్పు!

బాలాంత్రపు రజనీకాంతరావు గారని ఒకాయన ఉన్నారు, తెలుసా నీకు? ఆయన ఘంటసాల మాష్టారు గాత్రాన్ని ఆవగింజంత చేసేసారేమో అన్న అనుమానం వచ్చేసింది.

ఎలా?

పరుచూరి శ్రీనివాస్ గారి దగ్గరినుంచి బాలాంత్రపు రజనీకాంతరావు గారి శ్యామలా దండకం ఆడియో వచ్చింది. విన్నా! ఆ దండకంలోని చివరి ఎనిమిది నిముషాల భాగం వింటూంటే , వెంటనే లేచి నించున్నాయి!

ఏమిటి నుంచున్నాయి?

ఒంటి మీద వెంట్రుకలు! సూదుల్లాగా, అంపశయ్య మీది బాణాల్లాగా నిక్కబొడుచుకుని పోయినాయి....దండకంలోని ఆ ఎనిమిది నిముషాల భాగం ఆగేంతవరకూ అలా నిటారుగానే ఉండిపోయినాయి.....

ఏదీ? నన్ను కూడా విననీ , చూద్దాం! ఏం నుంచుంటాయో?

సరే ఇక్కడ విను....

ఒక్కటే మాటయ్యా - ఈ నా అభిప్రాయంతో నీ అభిప్రాయాన్ని నా దారి పట్టిస్తున్నాననుకునేవు! నా సోది పక్కనబెట్టి సుమారు పధ్నాలుగు నిముషాల ఈ ఆడియో  తీరిగ్గా విని, కామెంటు రూపంలో చెప్పు .

మీలో చాలామందికి మొదటిసారి వినగానే "నుంచోకపోవచ్చు" కానీ, ఓ ఐదారు సార్లు విన్న తర్వాత "నుంచుంటాయి"....నాదీ పూచీ.....కొద్దిమందికి మొదటిసారి వినగానే నుంచుంటాయి...వారు ధన్యులు ***************************************************
***************************************************


ఈ క్రింది సూర్య దండకం ఘంటసాల మాష్టారు పాడితే ఎలాగుండేదో కానీ, ఇప్పటికీ ఎప్పటికీ ఈ దండకానికి రజనీకాంతరావు గారే నెంబర్ వన్ అని నా నమ్మకం! -

 సూర్య దండకం కూడా వినిపించు !

ఇదిగో ఇక్కడ వినుకో -I will say just one thing - Brilliant! Brilliant! Brilliant! Though I have been listening to this danDakam from Sri BR since ages - it MOVES me, every single time I listen to it

వైష్ణవికి నేర్పుదామని ఓ రెండు వారాల క్రితం ఆవిడకు వినిపించా! దండకం అయిపోగానే ఏమందో తెలుసా?

Daddy, I want to go to that thaata and sing with him

కదిలిపోయా! గుండెలకు హత్తుకుని ఓ ఐదు నిముషాలు వదిలిపెట్టలా చిన్నమ్మిని!

అదండీ సంగతి! 

దండకం ఈ క్రింద  :


శ్రీ సూర్యనారాయణా వేద పారాయణా లోక రక్షామణీ దైవ చూడామణీ

సూర్యనారాయణా వేద పారాయణా లోక రక్షామణీ దైవ చూడామణీ

ఆత్మ రక్షా నమః పాపశిక్షా నమో విశ్వకర్తా నమో విశ్వభర్తా నమో దేవతా చక్రవర్తీ పరబ్రహ్మమూర్తీ త్రిలోకైక నాధాధినాధా మహాభూత భేదంబులున్ నీవయై బ్రోవుమెల్లప్పుడున్ భాస్కరా హస్కరా

సూర్యనారాయణా వేద పారాయణా లోక రక్షామణీ దైవ చూడామణీ

పద్మినీ వల్లభా వల్లకీ గానలోలా త్రిమూర్తిస్వరూపా విరూపాక్షనేత్రా మహా దివ్యగాత్రా అచింత్యావతారా నిరాకారా ధీరా పరాకయ్య ఓయయ్య దుర్దాంత నిర్ధూత తాపత్రయా భీలదావాగ్ని రుద్రా తనూద్భూత నిస్సార గంభీర సంభావితానేక కామాద్య నీకంబులన్ దాటి యేకాకినై చిక్కి యే దిక్కునున్ గానగా లేక యున్నాడ నీవాడనో తండ్రీ

సూర్యనారాయణా వేద పారాయణా లోక రక్షామణీ దైవ చూడామణీ

జేగీయమానా కటాక్షంబునన్ నన్ గృపాదృష్టి వీక్షించి రక్షించు వేగన్ మునీంద్రాది వంద్యా జగన్నేత్ర మూర్తీ ప్రచండస్వరూపుండవై యుండి చండాంశు సారథ్యమన్ గొంటి ఆకుంటి యశ్వంబులేడింటి చక్రంబులున్ దాల్చి త్రోలంగ మార్తాండ రూపుండవై చెండవా రాక్షసాధీశులన్ కాంచి కర్మానుసారాగ్ర దోషంబులన్ ద్రుంచి కీర్తి ప్రతాపంబులన్ మించి నీ దాసులన్ గాంచి ఇష్టార్థముల్ కూర్తువో

సూర్యనారాయణా వేద పారాయణా లోక రక్షామణీ దైవ చూడామణీ

దృష్టివేల్పా మహా పాప కర్మాలకున్నాలయంబైన యీ దేహభారంభభారంబుగానీక శూరోత్తమా ఒప్పులన్ తప్పులన్ నేరముల్ మాని పాలింపవే పట్టి నీ కీర్తి కీర్తింప నేనేర్తునా ద్వాదశాత్మా దయాళుత్వమున్ తత్త్వమున్  జూపి నా ఆత్మ భేదంబులన్ బాపి పోషింప నీవంతు నిన్నున్ బ్రశంశింప నా వంతు ఆ శేషభాషాధిపుల్ కానగాలేరు నీ దివ్యరూప ప్రభావంబు కానంగ నేనెంత ఎల్లప్పుడున్ స్వల్పజీవుండనౌదున్ మహాకష్టుడన్ నిష్టయున్ లేదు నీ పాదపద్మంబులే సాక్షి దుశ్చింతలన్ బాపి నిశ్చింతుగన్ చేయవే కామితార్ధప్రదా

సూర్యనారాయణా వేద పారాయణా లోక రక్షామణీ దైవ చూడామణీ

శ్రీమహాదైవరాయా పరావస్తులైనట్టి మూడక్షరాలన్ స్వరూపంబు నీదండకంబిమ్మహిన్ వ్రాయ కీర్తించి విన్నన్ మహాజన్మ జన్మాంతరవ్యాధి దారిద్ర్యముల్ పోయి కామ్యార్ధముల్ కొంగు బంగారు తంగేడు జున్నై ఫలించున్ మహాదేవ దేవా నమస్తే నమస్తే నమస్తే నమహా 

12 comments:

 1. ధన్యులమయ్యామండీ, ఇవి విని :) పోస్ట్ చేసిన మీకు ధన్యవాదాలు.

  ఒక చిన్న విన్నపం: సోమవారం రోజు ప్రొద్దున్నే ఆకాశవాణి లో వచ్చే శివ స్తోత్రాలు (దారిద్ర్య దహన స్తోత్రం, శివ పంచాక్షరి స్తోత్రం ) ఎక్కడ లభించగలవో చెప్పగలరా?

  ధన్యవాదములతో-
  లలిత

  ReplyDelete
 2. Sorry - forgot to put my vote:

  Maybe it's my familiarity with Sr Ghantasala's Syamala Dandakam, I would like to vote for Ghantasala.

  But for Suryadandakam, I agree with you - Sri Balanthrapu varu is the Best.

  Mee chinnari Vaishnavi ki asheessulu.

  Regards,
  Lalitha

  ReplyDelete
 3. Comparing with Ghantasala?!! haa haa haa

  Not even comparable to Nagaiah.
  చక్కని బంగిన పల్లి మామిడిపండును, అడవి రేగు పండును పోల్చ సాహసించకూడదు. దేని కదే!

  ReplyDelete
 4. ఒప్పుకున్నామండి - ఈ విధంగా ధన్యత చెందామని. కాకపోతే కందులు మినుములు పోల్చకూడదని/కలబోయకూడదని మా నానమ్మ ఉవాచ - బహుశా ఇక్కడ యాపిల్స్ టూ ఆరంజెస్ వంటి మాట! :) ఇకపోతే, ఇంతే తాదాత్మ్యం చెందిన మరొక అనుభూతి కూడా దూసుకువచ్చింది. "నేను కాస్త ప్రక్కకి పోతున్నట్టున్నాను" అనుకుంటూనే చెప్పేస్తున్నాను. నాకు Chembai and Yesudas Shiva Shiva Shiva Enna - విన్నప్పుడూ ఇదే పరవశం. ముఖ్యంగా రెండో భాగం అయితే కొన్ని పదుల సార్లు ఆపి వెనక్కి జరిపి వింటుంటాను. మూడోభాగానికైతే మనసులోనే పాదాభివందనాలు సమర్పిస్తాను.

  http://www.youtube.com/watch?v=x9IEQGld7Gc

  http://www.youtube.com/watch?v=GHyUAl9Yaos

  http://www.youtube.com/watch?v=vr7LqH_dXyM

  ReplyDelete
 5. ఘంటశాల వారి కంఠం జలపాతపు హోరు అయితే రేడియో మామయ్య గారి కంఠం సెలయేరు. నాకు ఈ రోజు జలపాతపు హోరే బావుంది. :)) కాస్త వయసయిన తర్వాత మామయ్య గొంతు నచ్చుతుందేమో.

  అయితే ఘంటశాల వారు శ్యామలాదండకం పూర్తిగా పాడలేదు అనుకుంటాను. అదొక లేటు.

  ReplyDelete
 6. @లలిత గారూ - బయట ఎక్కడ దొరుకుతాయో నాకు తెలియదు కానీ...పరుచూరి గారి వద్ద సుమారు 25 + టేపులు - భక్తిరంజని పాటలతో ఉన్నాయని నాకు తెలిసిన విషయం. ఆ టేపుల్లో ఎక్కడో ఓ చోట, మీరడిగిన స్తోత్రాలు ఉంటాయి. ఆయనకు సమయమూ, తీరిక దొరకాలె కానీ బోల్డన్ని ముత్యాలు బయటకొచ్చేస్తాయి...ఆ ముత్యాల కోసం ఆయన్ని సతాయించే వంద మందిలో నేనూ ఒకణ్ణి......ప్రయత్నం ప్రయత్నేన ముత్యాల దర్శనం....మీ వోటుకు ధన్యవాదాలు

  @ఉష - అభిప్రాయానికి ధన్యవాదాలు. మీరిచ్చిన లింకులు తప్పక చూస్తాను

  @రవి - ఈ దండకానికి సంబంధించి మటుకే సుమా - జలపాతం హోరు రోజూ వినలేం, కానీ సెలయేరు గలగలలు ఏ రోజైనా ఏ సమయంలోననైనా విని ఆనందించొచ్చు.....సంగీత సింహాసనం మీద కూర్చునేది ఘంటసాలవారే ఏనాటికైనా....అది నిక్కమైన నిజం......ఐతే మామయ్యగారూ ఏ మాత్రం తీసిపోనివారే, ఆ సింహాసనానికి అర్హులే అని చెప్పటం ఉద్దేశం.... సూర్య దండక సింహాసనం మటుకు మామయ్యదే! ఏ మాత్రం సందేహం లేదు....

  @Snkr - హా హా! కళ్ళు తెరిపించారే! ఎంతటి విషయం చెప్పారు? :) - అభిప్రాయానికి ధన్యవాదాలు

  ReplyDelete
 7. సరిగ్గా చెప్పారు. మీరు పోస్టులో అన్నట్లు నాకూ కాస్త "నుంచున్నాయి" అయితే శ్యామలాదండకం మొదటనే. ఈ శ్రవ్యకాలకు దిగుమతి సౌకర్యం కల్పించగలరా మా వంటి దీనులకు? పెద్ద మామయ్య గురించి ఎలానూ చెప్పలేను, వంశీ మామయ్య సౌజన్యమని మా పాపకు చెప్పి స్తోత్రం నేర్పుతాను.

  ReplyDelete
 8. @రవి - మీకు ఏవి కావాలో చెప్పండి, అవి ఈమెయిలులో పంపుతాను. ఒక టెస్టు ఈమెయిలు contact@maganti.org కు కానీ, maganti.org@gmail.com కు కానీ పంపండి....దానికే రిప్లై ఇస్తాను

  ReplyDelete
 9. @కొత్త పాళీ....

  I'm in the US & don't know whom to check with. Is there a web site where I can check this.

  Regards,
  Lalitha

  ReplyDelete
 10. లలిత గారూ - మీరు ఓపిక పట్టగలిగితే పరుచూరి గారి వద్ద నుంచి తీసుకొచ్చే బాధ్యత నాది....లేకపోతే మీ అదృష్టం పరీక్షించుకోవచ్చు? ఎక్కడా? ఇంతకుముందు ఒక పోష్టులో చెప్పినట్టు http://voicevibes.net/ లో రేడియో వింటూ ఉండటమే....మీరు కోరుకున్న పాట వచ్చినప్పుడు ఏదైనా ఆడియో గ్రాబింగ్ సాఫ్ట్వేర్ పుచ్చుకుని రికార్డింగు చేసేసుకోటమే...Audacity బాగా పనికొస్తుంది చూడండి...

  ReplyDelete
 11. To avoid any confusion/misunderstanding ... లలితగారు అడిగిన దారిద్ర్య దహన స్తోత్రం, శివ పంచాక్షరి స్తోత్రం AIR వారి CD లపైన రాలేదు. నా దగ్గరున్నాయి. వీలునుబట్టి నా టేపులు వంశీగారికి పంపగలను. మిగిలిన పని ఆయన చూసుకుంటారు :).

  భక్తిరంజని కార్యక్రమాలు కొన్ని ఆరేడేళ్ళక్రితం CDలపైన వచ్చాయి (కొత్తవి వచ్చే సూచనలు ఏమాత్రము లేవు!) వచ్చినవి నాలుగు.
  1 నారాయణతీర్థ తరంగాలు,
  2 రామదాసు కీర్తనలు,
  3 సూర్యస్తుతి/సూర్యదండకం/ఆదిత్య హృదయం,
  4 శివస్తుతులు కొన్ని
  ఈ నాలుగు సిడిల వివరాలు నెట్‌లో తేలిగ్గా లభ్యమవుతాయి. లేకుంటే 3 రోజుల్లో నేనే ఇవ్వగలను.

  భవదీయుడు,
  శ్రీనివాస్

  ReplyDelete
 12. వంశీ గారు ...

  అయ్యో..ఓపిక పట్టలేకేమండీ- పరుచూరి శ్రీనివాస్ గారి నుంచి మీరు అందుకుని పోస్ట్ చేసే దాక వేచి వుంటాను.

  పరుచూరి శ్రీనివాస్ గారు...

  మీరు, వంశీ గారు చేస్తున్న ఈ సహాయానికి కృతజ్ఞతలు.

  ధన్యవాదాలతో....
  లలితా త్రిపుర సుందరి (అంతర్జాలంలో ఇంకో లలిత గారున్నందువల్ల నా పూర్తి పేరుతోనే వ్రాస్తాను ఇక నుంచి :) )

  ReplyDelete