Tuesday, April 26, 2011

మాలమ్మ నెత్తి మీద శనిదేవతలా కత్తుచ్చుకుని నాట్యమాడుతుంటే ఏం చేస్తాంలెమ్మని.......

జాన్ ఆంథోనీ బ్లేక్ / జాన్ లెవీన్ గురించి అప్పుడెప్పుడో ఓ పోష్టు రాసా...

ఎవరాయన? ఏమా కథ? ఎప్పుడు రాసావు?

ఇదిగో ఇక్కడ చదూకోవచ్చు....

అక్కడ కొంచెమే ఉందే? అవును...

అక్కడ కొంచెమే రాసా...ఇప్పుడు ఇక్కడ మరి కొంచెం రాస్తా!

మరి మొత్తం ఎప్పుడు రాస్తా?

ఏమో?

ఉపోద్ఘాతం అక్కడ చదివావుగా? ఇప్పుడు అసలు నేనెందుకు ఆయనకు నా పాంట్లు, షర్ట్లు ఇవ్వాల్సి వచ్చిందో సూక్ష్మంగా చెబుతా! ఆర్కన్సాస్ బెంటన్ విల్ లో పనిచేస్తున్నప్పుడు, పక్కనే ఓ రెండు గంటల దూరంలో ఉన్న ఓక్లహోమాలోని టల్సాకు క్లయింట్ పని మీద వచ్చి వారంలో మూడు రోజులు ఉండాల్సి వచ్చేది....అలా వచ్చినప్పుడు 31 / మెమోరియల్ ఇంటర్సెక్షన్ కు దగ్గర్లో ఉన్న క్వాలిటీ ఇన్ హోటల్లో బస అన్నమాట.

ఓ గురువారం సాయంత్రం వుడ్ లాండ్ హిల్ల్స్ మాల్లో అంతకు ముందు వారం సేల్ పెట్టారని మా దేశీ గొర్రెలు పొలో మని పరుగెత్తుకు పోయి గుట్టలు గుట్టలు కొనుక్కొచ్చిన విషయంతో నా బుర్ర వాయగొట్టటం, చిరాకు దొబ్బి వాళ్ళకు దొబ్బులు పెట్టి మెల్లగా ఆ పక్కనే ఉన్న పార్కులో షికారుకు బయల్దేరా!

అవునూ - ఎందుకు అలా మన గొర్రెలు జెమ్ము షోలకు, గుళ్ళో ప్రసాదాలకు, సేళ్ళకు ఎగబడిపోతారంటావు?

సేళ్ళంటే అందరూ ఎగబడతారనుకో! కానీ గొర్రెలందు దేశీ గొర్రెలు వేరయా! దిట్టంగా అన్నీ ఇంకిపోయిన రగతం......ఎక్కడో టమాటాలు పవుండు అర్థరూపాయకిస్తున్నారంటే, 10 రూపాయల గాసు తగలేసి కారెక్కి అక్కడికెళ్ళి, ఓ రెండు పవుండ్లు కొని, ఆ పైన వెళ్ళినందుకు అవసరం లేనివి ఇంకొన్ని కొని.....ఇలాగన్నమాటయ్యా! జెమ్ము షోలంటావా? అవి బతుకుందే మన గొర్రెల మీద....ప్రసాదాలంటావా? ఆ భగవంతుడికే తెలియాలె....

సరేలే ...అది అలా పక్కెనబెట్టి టపా సంగతికొస్తే - ఇంతలో మా మేనేజర్ గాడొచ్చి అలా బయటకెళ్దాం రా అని కారెక్కించి వాల్మార్టుకు తీసుకెళ్ళాడు...వీణ్ణి తగలెయ్య అనుకుంటూనే ఉన్నా, అలా అనుకుంటూ ఉంటూండగానే బాంబు పేల్చాడు. వుడ్ లాండ్ హిల్స్ మాలుకు వెళ్దామని...ఇప్పుడే ఆ గొడవ వదిలిచుకు వచ్చారా అని చెప్పా! ఉహూఁ వినలా!....

సరే మాలమ్మ నెత్తి మీద శనిదేవతలా కత్తుచ్చుకుని నాట్యమాడుతుంటే ఏం చేస్తాంలెమ్మని గుణుక్కుంటూ వాడితో బయల్దేరా! ( మాలమ్మ అనగా "మాలు" దేవత అని యర్థము )

వెళ్ళాక బైసన్ లాగున్న మా గున్న మేనేజరు ముట్టె ముందుకు పెట్టి మట్టి, గడ్డి ఎత్తవతల పారేసినట్టు బట్టల గుట్టల్లోంచి బట్టలు ఎత్తి పారేస్తూ, అందులో కొన్ని తీసుకుంటూ తన పయనం సాగిస్తున్నాడు. వాడికి - ఒరే నేనిప్పుడే వస్తా నువ్వు కుమ్ముకుంటూ ఉండు అని అలా పక్కనే ఉన్న పోలో రాల్ఫ్ లారెన్ కొట్లోకి వెళ్లా....

మాలమ్మ నన్ను చూసి నవ్వుకుంటూ మళ్ళీ నాట్యమాడిందేమో, ఆ పోలో వాడు కూడా భీకరమైన సేలు పెట్టాడు. నాకసలే పోలో షర్ట్లంటే విపరీతమైన అభిమానం. ఆ చొక్కాల మీద ఉండే గుర్రం బొమ్మల కోసం అన్నీ అవే కొనుక్కుంటూ ఉంటానన్నమాట. మా ఆవిడేమో ఎందుకు అంత డబ్బులు తగలేస్తారు, అదే డబ్బుతో ఐదు చొక్కాలొస్తాయి..చక్కగా ఒకటే పట్టుకు వెళ్ళాడకపోతే వరైటీ వరైటీ షర్ట్లు వేసుకోవచ్చుగా అంటు దెప్పేది. నేనేమో అలా కాదమ్మా, గుర్రాలు మనం ఎక్కలేకపోయినా, ఆ గుర్రాలెక్కి పోలో గేము ఆడకపోయినా, అల్లా ఓ గుర్రం బొమ్మ చొక్కా వేసుకుని ఆనందిస్తూ ఉండటం నాకిష్టం అని ఆ దెప్పుడు బాధ తప్పించుకునేవాడిని.

సరే సేలు పెట్టాడని ఓ ఆరు చొక్కాలు, ఐదు పాంట్లు కొన్నా...ఇంతలో మా బైసను గాడి కుమ్ముడైపోయి, ఈ కొట్లోకి కూడా తగలడి అబ్బో సేల్ పెట్టినా చాలా ఖరీదుగా ఉన్నాయే అని ఓ వెధవ నవ్వు నవ్వి - ఏమిటీ అన్ని తీసుకున్నావు అని అడిగాడు. ఓరే గున్నా, నేను కొనుక్కుంటే నీకొచ్చిన బాధేమిట్రా నాయనా అనుకుని, నాక్కాదులే ఇండియాలో ఉన్న మా జనాలకి అని సద్ది చెప్పి ఇహ బయటపడ్డాం....

మరి ఇప్పుడు నువ్వు కూడా కొన్నావుగా? సేలనగానే?

అవును - కొన్నా! ఐతే అవి సేలున్నా లేకున్నా కొనేవాడినే - మాలమ్మ మూలానా కొద్దిగా తక్కువలో వచ్చాయి....పెద్ద ఫరకు పడదయ్యా నాకు....

ఓహో అలాగా?

అవును అలాగే!

ఇహ కుమ్మటాలు అయిపోయాక - గున్న నన్ను హోటలు దగ్గర దింపేసి వాడింటికి వాడు ముట్టె ముందుకు పెట్టి ఆనంద బుసలు వదులుకుంటూ పోయాడు....

సరే ఈ బాగులుచ్చుకుని రూముకెళ్ళి ఆ బాగులు బెడ్డు మీద పారదొబ్బి పక్కనే ఉన్న చైనీసు హోటలుకెళ్ళి మేత మేసొద్దామని బయలుదేరా....రూము బయటకొచ్చేప్పటికి కారిడార్లో హాహాకారాలు వినపడుతున్నాయి....ఏమిటో ఏమయ్యిందో అనుకున్నా....ఒకాయన ఆ హోటలు మేనేజరును పట్టుకు దులిపేస్తున్నాడు...వాళ్ళావిడ హాహాకారాలు చేస్తోంది.....సరే మనకెందుకులే అని పక్కనుంచి వెళ్ళబోతూ ఉంటే ఆయన బట్టలు పెట్టిన లెదరు బాగు కనిపించట్లేదని, హోటలు సిబ్బంది దొబ్బేసారని, ఇంకో అరగంటలో టాక్ షో ఉందనీ నేనెలా వెళ్ళాలని మేనేజరుగాడిని ఎక్కటం వినపడి , అసలే జాలి గుండె కలవాడిని కావటంతోనూ, అప్పుడే కొనుక్కొచ్చిన మాలమ్మ కనపడటంతో ఆగి సంగతేమిటని అడిగా! ఆ మేనేజరు గాడికి చెప్పిందే నాకు చెప్పి - what a bunch of morons అని విసవిసలాడిపోతున్నాడు. ఆ హోటలుమేనేజరేమో బిక్కమొహం వేసుకుని చూస్తున్నాడు....ఆగురా నాయనా, నీకేమిటి ఇప్పుడు బట్టలు కావాలా? ఐతే నేను ఇప్పుడే పోలో షర్ట్లు, పాంట్లు కొనుక్కొచ్చా ఒకేళ నీకు సరిపోతే వేసుకుని పబ్బం గడుపుకో అని చెప్పా....

ఇహ వేరే దారి లేక, సరే పద అని రూములోకొచ్చి ఓ జత వేసుకుని చూసాడు. ఉరగా మరగాగా బట్టలు సరిపోయినాయి...నీ సహాయానికి బోల్డు ధన్యవాదాలు అని జేబులో చెయ్యి పెట్టి ఎంత అని అడిగాడు...

ఏమిటి అప్పుడే వేసుకున్న పాంటు ఝేబులో చెయ్యిపెట్టే అడిగాడా? పర్సులు, డబ్బులతో పాటూ కూడా వస్తాయన్న మాట పోలో పాంట్లు?...

అవును సుబ్బారావూ, నీకున్న తెలివి ఆ పోలో పాంట్లు తయారు చేసేవాడికి లేకపోయింది...

సరే......ఏమక్ఖరలేదులే, ముందు టాక్ షో చూసుకునిరా అనీ, నాకు ఆకలి అవుతోందనీ, ఆలస్యమైతే ఆ చైనీసు హోటలు వాడు మూసుకుపోతాడనీ , నేను ఈ రాత్రికి పస్తులుండాలనీ చెప్పి రూములోనుంచి బయటకు తరిమా....మళ్లీ రేప్పొద్దున్న వస్తా అని ఓ హగ్ ఇచ్చి పోయాడు....సరేనని నేనూ పోయి ఆ చైనీసు హోటల్లో ఫ్రైడ్ రైసు మెక్కి వచ్చి పక్కెక్కా....

బెల్లు మోగింది...చూస్తే హోటలు మేనేజరు - సాలా ధన్నోదాలండే - అనుకుంటూ....సరేరా నాయనా నాకు నిద్దరొస్తోంది అని తలుపేస్కొని పడుకున్నా....

ఏ కాలమైనా, ఏ వారమైనా, ఏ రోజైనా పొద్దున్నే ఐదింటికి లేవటం అలవాటుగా! అలానే లేచా......

కిందకెళ్లి బ్రేక్ ఫాస్టు చేద్దామని రూము బయటకొచ్చా.....మెట్ల దగ్గరకొచ్చేటప్పటికి ఓ పేద్ద అరుపు వినపడింది...వెన్ను చరుచుకుని  ఏమిటీ అని చూద్దును కదా, ఈయన - పరుగెత్తుకుంటూ వచ్చేసి కౌగిలించేసుకుని నా టాక్ షో నిలబెట్టావు నిన్న సాయంత్రం, చాలా సంతోషం - బోల్డు ఋణపడిపోయా నీకు అని గుమ్మడి గారిలా కళ్ళనీళ్లు పెట్టుకోలేదు కానీ అంత పనీ చేసాడు.....

సరేలే నాయానా....పని అయ్యిందిగా నాకూ సంతోషం...ఆకలేస్తోంది కిందకు పోయొస్తా అని బయల్దేరబోతుంటే ఉండు నేనూ వస్తా అని రూములోకి పోయి నైట్ డ్రస్సులోనుంచి మారి నిన్న నా దగ్గరనుంచి ఎత్తుకెళ్ళిన బట్టలేసుకొచ్చాడు...చేతిలో ఓ కవరు కూడా పట్టుకొచ్చాడు...కిందకొచ్చాక, పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ ఉంటే ఆ కవరు తీసి ఫోటో తీసి దాని మీద రాసేసి నా చేతిలో పెట్టాడు...

ఆ ఫోటోనే ఇది....


కళ్ళు దొబ్బిన వాళ్లకి, అనగా సంస్కృతంలో చెప్పవలెననగా కబోదులకు ఇదీ - ఆ ఫోటో మీద ఉన్నది...

Dear Vamsi, you exhibited deep common sense laced with great dignity. Thank you for the truth in a time of lies and wrong doings

Love and Peace

John Levene
Sgt Benton
Dr WHO
BBC London 2002

ఆ ఫోటో చూసాక అడిగా, ఈ ప్రోగ్రామేమిటీ? నీ సంగతేమిటని - వివరంగా చెప్పాడు....అప్పుడు తెలిసింది....ఈ కాండిడేటు ఎవరో, ఏమిటోనన్న సంగతి.....

సరే ఇహ ఇక్కడితో చెపుతానన్న "కొంచెం" ఆపేస్తా

ఆ తర్వాత ఓ కార్డు ఇచ్చి పోయాడు, నా అడ్రెస్సు తీసుకున్నాడు......ప్రతి సంవత్సరం ఓ కార్డు, ఉత్తరం రాసేవాడు....నేనూ ప్రతి జవాబు రాసేవాడిని...అలా ఓ ఐదేళ్ళు రాసాక ఉత్తరాలు బంద్ అయిపోయినాయి, నా జాబుకు ప్రతి జవాబూ లేదు...సరేనని ఇహ నేనూ ఊరకున్నా....

అదండీ సంగతి.....

అవునూ పాత టపాలో రెండు షర్ట్లు, రెండు పాంట్లూ దానం అన్నావు?

ఓ అలాగన్నానా? ఐతే మొత్తం చదివారన్నమాట....మంచిది...

అవును రెండో జతకు ఇంకో కథ ఉంది...

మరి ఆ ఉత్తరాలేవీ?

ఉన్నాయి - అవి ఈ సారి కథతో జత చేస్తా!

అది మళ్ళీ ఎప్పుడైనా...:)

PS: For those of you interested here is a link for Dr Who's info - http://en.wikipedia.org/wiki/Doctor_Who

And for those of you interested in John Levene - here is a link

http://en.wikipedia.org/wiki/John_Levene

BTW - the year on the photo was the year the incident happened....And John was an actor in Dr Who since 1967

No comments:

Post a Comment