Thursday, March 17, 2011

పాత అడంగల్ లాగా ముఖం నువ్వూనూ, సర్వే గొలుసు బిళ్ళలా పళ్ళు ఇకిలిస్తోంది!

 కృష్ణా పత్రికతో పరిచయం వున్నవారిని శ్రీ రావూరు వెంకట సత్యనారాయణరావు గారెవరంటే ఇట్టే చెపుతారు. వడగళ్ళు రాసినాయనేగా అని. ఆయన 1938లో కృష్ణాపత్రిక సంపాదక వర్గంలో చేరారు.

దాదాపు పధ్నాలుగు సంవత్సరాలు పాటు హాస్యం వ్యంగ్యం జత కలిపి " వడగళ్ళు " శీర్షికతో పాఠకులకి వింతా - వినోదం పంచిన ధన్యజీవి.

ఒకటేమిటి - ఆనాటి రాజకీయాలు, అవకతవక ఉపన్యాసాలు, మారుతున్న సాంఘికాచారాలు, నవలోకం కోరుకునే మార్పులు, మతిమరుపు వ్యక్తుల విచిత్ర గాధలు, రాజకీయాలలో రగడలు, సంస్థలలో చెలరేగే దుమారాలు, కవుల కలాలు చిలికే మీగడ తరకలు, ఇలా ఎన్నో తళుకులు మెరిపించేవారు ప్రతి శనివారం విడుదల అయ్యే కృష్ణాపత్రికలోని వడగళ్ళు శీర్షికలో.

ఆ వడగళ్ళు వ్యాస పరంపరలోని ఒక వ్యాసం - కరణాల పరిభాష (1949 మే 24 - కృష్ణా పత్రిక) నుంచి గ్రహించబడింది....

శ్రీ రావూరు వారి ఇతర వ్యాసాలు, వడగళ్ళు - వెబ్సైటులో వ్యాసావళి సెక్షన్లో చూడవచ్చు...

******************************************************************

కరణాల పరిభాష

కరణాల భాషలోనుంచి కొన్ని టెక్నిక్  పదాలు తీసుకొని వాటి ప్రయోగాన్ని వివరిస్తాను. గ్రామ లెఖ్ఖలలో, దస్తావేజులు వగైరాలలో అనుశ్రుతంగా వచ్చే ఆచారాన్ని బట్టి ఒకే భాష వాడబడుతూ వుంటుందంతటా. వాటినే కరణాలు కొత్త అర్థాలతో ఎంత సొగసుగా వుపయోగిస్తారో చూడండి.

ఒరేయ్ ! మా బావమరిది వట్టి పోరంబోకు గదురా - అంటూ వుంటాడు ప్రక్క ప్రకరణంతో. అంటే అతగాడికి దస్కత్ చేయడం తప్ప ఏమీ చేతకాదనీ, వాడి బుర్ర వట్టి ఊసరక్షేత్రమని అర్థం. ఒక రివిన్యూ ఇనస్పెక్టరును చూచి ఒక యువకరణం ' హాల్కు నూతనం గాదరా ' అన్నాడుట. అంటే ఆ సంవత్సరమే ఉద్యోగంలోకి వచ్చాడనీ, పని బాగా తెలియదనీ అర్థం. పోరంబోకులు ఆక్రమించుకొని వరిపంట వేస్తూ వుంటారు.కరణాలు వాటిని లెక్కల్లో నమోదు చేస్తూ కొత్తసాగు అయితే హాల్కు నూతనమనీ, పాతసాగు అయితే గుజస్తా సాగు అనీ పేర్కొంటారు.

మరో కరణం ' అబ్బే! ఆయన వట్టి వెట్ పాడీ, జైప్లా ఆఫ్ కెనాల్ వాటర్ గదురా ' అన్నాడుట. కరణాలు వ్రాసే అడంగుల లెఖ్ఖలలో పైవాక్యం తరుచుగా దొర్లుతూ వుంటుంది. ఏమీ ఆలోచించకుండా, గుడ్డి ఎద్దు చేలో పడ్డట్టు త్రోసుకుపోయేవాడని చెప్పడానికి పైవాక్యం ఉపయోగించాడా కరణం.

వెనుకటి ప్రాంతంలో  Crop Cut  రివిన్యూ ఇనస్పెక్టరుగారని ఒకాయన వుండేవాడట. క్రొత్తసాగులు చేసినవాళ్ళందరూ ఆయన దర్శనం చేసేవాళ్ళు. ఆయన చెయ్యి పచ్చబడగానే - పైరు వున్నాసరే, లేకపోయినాసరే వెంటనే పుస్తకం తీసి Crop Cut అని వ్రాసేవాడట.

ఒకసారి తహసిల్దారు హఠాత్తుగా వెళ్ళి ఆ పొలం తనిఖీ చేశాడుట. పైరు పకపక నవ్వుతుందట. ఇనస్పెక్టరుగారిని పిలిచి ' ఏంఇటి, Crop Cut అని వ్రాశావు, ఆ రోజు నీ క్రాఫింగు ఏమైనా కత్తిరించుకొన్నావా? అని అడిగి మూడునెలలు సస్పెండు చేశాడుట.

దస్తావేజులలో కరణాలు వాడే భాష చాలామందికి తెలుసు. వాటిలోగల హాస్యాన్ని గమనిద్దాం. ఒక కరణంగారు స్నానానికి లేవబోయి భార్యను పిలిచి - సదరు దణ్ణెమ్మీదగల గుజస్తా కొల్లాయి ఇలా పారెయ్యి అన్నాడుట.

మరొక కరణంగారి భార్య కొంచెం గయ్యాళి కాబోలు...పిల్లల్ని పట్టుకొని కొట్టి విడిచింది. ఇంతలో తండ్రి వచ్చాడెక్కడినుంచో...పిల్లలు చుట్టిముట్టి ఏడ్చారుట. ఆయన భార్య దగ్గరికి వెళ్ళి గట్టిగా పోట్లాడాడు. ఆవిడ పిల్లల జోక్యం మీకెందుకు వెళ్ళమందిట. ' ఎందుకా! ఒకటి, రెండు, మూడు కుమారులు మైనరులైనందున గార్డియన్ తండ్రి రామకృష్ణయ్యను కాబట్టి ' అని గట్టిగా అరిచాడుట.

ఒక కరణం మిత్రుడు నాకొక డైరీ ప్రెజెంటు చేశాడు. దానిలో ఇలా వ్రాయబడి వుంది. " నీ పుత్రపౌత్రపారంపర్యంతం, దానాదమన విక్రయాది సమస్త హక్కులతో బహూకరించబడింది - కాంతారావు - కరణం '

ఒక కరణంగారిని ' మీకెందరు పిల్లలంటే' ' పరక మామిడి పండ్లు కొంటే మూడు పదులకు ఒకటి మిగులుతుంది - అదైనా ప్రస్తుత పరిస్థితి. ముందు సంగతి చెప్పలేం ' అన్నాడు.

నౌకర్ల మీద కరణాలకు కోపంవస్తే వాణ్ణి తిట్టేతిట్లు ఏమిటో తెలుసా - క్రాస్ స్టాఫ్ లాగా ముఖం నువ్వూనూ పో అవతలికి,  గైరుహాజరు ఘటం - బట్వాడా బడుద్దాయి. ఆ కరణంగారే భార్యను తిట్టవలసివస్తే - ' పాత అడంగల్ లాగా ముఖం  నువ్వూనూ, సర్వే గొలుసు బిళ్ళలా పళ్ళు ఇకిలిస్తోంది. ఫో...స్టోన్ లాగా అలా నిలబడతావేం...ఇత్యాదులు...వీరిలో హాస్యం వర్ణించాలంటే చాలావుంది.

క్రాస్ స్టాఫ్ - పొలాలు కొలిచేప్పుడు లైను సూటిగా చూసేందుకు వుపయోగించే సాధనం.

అడంగులు - ప్రతి సంవత్సరం సాగు వివరాలు, విస్తీర్ణం తెలియజేసే పుస్తకం.

(1949 మే 24 - కృష్ణా పత్రిక)

********************************************************************

1 comment:

  1. చాలా బాగుంది కరణాల భాష
    ఇలాగే ఇంకొన్ని వృత్తి మాండలీకాలు ఉదహరించండి.

    ReplyDelete