Monday, March 28, 2011

ఎవరి వద్దనైనా - పద్మ ప్రాభృతకము (సంస్కృత మహాకవి శూద్రక విరచితము) తెలుగుసేత ఉన్నదా?

ఎవరి వద్దనైనా - పద్మ ప్రాభృతకము (సంస్కృత మహాకవి శూద్రక విరచితము) తెలుగుసేత ఉన్నదా?

ఈ దశవిధ రూపకాన్ని శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు తెలుగులోకి  అనువాదం చేశారని విన్నాను..... వివరాలకు ముందస్తు ధన్యవాదాలు

Tuesday, March 22, 2011

ఇలాటి ప్రయోగాలు ఏమన్నా చేసారా? ఎవరికైనా తెలుసా?

ప్రతి సోమవారం "బుక్ వర్మ్" దినం. అనగా ఆ పుస్తకాల కొట్టు సందర్శన దినం. ఏం? ఏ శనివారమో, ఆదివారమో వెళ్ళొచ్చుగా? ఎబ్బే! ఆ రోజుల్లో జనాల తాకిడి బోల్డంత ఆ కొట్లో...

అంత తాకిడి ఉంటున్న కొట్లు కూడా ఉంటున్నాయా బాబూ? అవును సుబ్బారావూ - ఈ బుక్ వర్మ్ పుస్తకాల కొట్టుకు ఉంటుంది. ఎందుకంటే used books store కాబట్టిన్నూ, గుట్టలు గుట్టలు రాసులు రాసుల పాత, బాగా పాత, విపరీతమైన పాత పుస్తకాలు ఉండటం మూలాన్నూ, అత్యల్ప ధరలతో అమ్మటం మూలన్నూ - అనగా యాభై సెంట్ల నుంచి - ఆరు డాలర్ల వరకు అన్నమాట......

పైగా ఆ కొట్టాయన ప్రతి సోమవారం తట్టలు తట్టలు పుస్తకాలు మోసుకొచ్చి సద్దుతూ ఉండటం, ఒకరో ఇద్దరో జనాలు తప్ప ఎవరు ఉండకపోవడం లాభించే విషయం...అలా ఆరేళ్ళ నుంచి వీలు కుదిరినప్పుడల్లా సోమవారం సాయంత్రం వెళ్ళివస్తూ ఉంటానన్నమాట.

మరి పైనేమో ప్రతి సోమవారం పుస్తక సందర్శన దినం అన్నావు? ఓ అవునా! అలా అన్నానా? ఐతే పోస్టుకు కావలసినంత ఉంది మీ దగ్గర! ధన్యం!

సరే సోది ఆపి సంగతి చెప్పవయ్యా....

వెళ్ళా - జాక్ కూస్టో The Ocean World (1973) 20 వాల్యూంస్ కేవలం 50 డాలర్లకు అమ్ముతూంటే కసుక్కున ఎత్తుకొచ్చా....

అలాగే కాలిఫోర్నియా స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు 1951 లో ప్రచురించిన Folk Songs Of The United States అన్న పుస్తకం దొరికింది. చిత్రం ఇక్కడ...ఇంతకీ పుస్తకం ఎంత? 90 సెంట్లు....అదండీ....
హాచ్చర్యపోయా! తర్వాత ఆలోచించా - మనవాళ్ళు ఇలాటివి ఏమన్నా, ఎప్పుడన్నా చేసారేమో వివరం తెలిస్తే బాగుండునని! మన స్కూళ్ళలో ఇంత సీను ఉందని, పాఠ్యాంశాలు జానపదాల మీద ఉన్నాయని  అనుకోను కానీ , ఎక్కడో చిన్న ఆశ, ఎప్పుడైనా నేను పుట్టకముందు ఏమన్నా ఇలాటి ప్రయోగాలు చేసారేమోనని, తెలిసినవారు చెపుతారేమోనని...


ఆ పుస్తకం Preface లో లిల్లియన్ మోర్ ఫాక్స్ ఇలా అంటారు....ఓ రెండు పారాగ్రాఫులు మీ కోసం

Are the children in our schools identifying themselves with their own united states through the songs they sing? If our children of today, who will be the travelers of tomorrow, were asked by the people of some other country what songs are typical of the united states, could they give an answer, or sing even one song and be sure it was representative of our culture?

blah...blah...blah....blah...blah...blah...blah....blah...blah...blah...blah....blah...blah...blah...blah....blah...

The purpose of this book is to encourage spontaneous singing in school, home, church and community, with the hope that youth of our country may possess, appreciate and proudly enjoy a common stock of tradition and in turn become intelligent carriers of our culture to our own future generations and to people of other countriesఇందులో మొత్తం 48 పాటలు , స్వర సహితంగా ఉన్నాయి.

ఓ పాట మీరు చదూకోడానికి:

Making Maple Sugar
(Chippewa Indian Melody)


Let us go to the sugar camp
Make a fire in the sugar lodge
Cut a notch in the maple tree

While the snow lies on the ground
So that we may boil the sap
Set a pail on the ground below

Live in a birch-bark wig-wam
Bring all the wooden ladles
Soon will the sap be flowing

All the children and the older folk
Set the wooden trough for graining
From the tree it will be flowing

While the people are at work
All the people are at work
All the people are at work

In the snow see the rabbit tracks
Hear the note of the chickadee
We must not stop to follow them
"Tis the season of the sugar camp
All the people are at work

Bring the sap from the maple trees
Pour the sap in the iron pot
See how it streams and bubbles
May we have a little taste of it?
All the people are at work

Pour the sirup in the graining trough
Stir it slowly as it thicker grows
Now it has changed to sugar
We may eat it in a birch-bark dish
There is sugar for us all.


ఇది చదువుతుంటే అల్లా ఓ సారి చల్లపల్లి - వెంకటాపురం రోడ్లో బెల్లపు బట్టిల్లోకి తీసుకెళ్ళి ఓ రెండు గంటలు బెల్లపు తయారీలో పాలు పంచుకునేట్టు చేసిన వాసు మావయ్య, ఆ బెల్లం వాసన, రుచి అలా కదలాడిపోయినాయంతే.....

నమ్మండి...నమ్మండి...

మరి జాక్ కూస్టో పుస్తకాల బొమ్మలేవి? వేస్తా ఆటి మీద తీరిగ్గా రేపో ఎల్లుండో వచ్చే టపాలో...

జాక్ కూస్టో ఎవరా? జాక్ కూస్టో ఎవరా? ఆయన కూడా తెలీదా?

నీ ఖర్మ....ఇక్కడ చదూకో... ఇక్కడ చదూకో సుబ్బారావూ

http://www.nndb.com/people/250/000085992/


PS: చెప్పడం మరిచా - ఈ షాపు గొప్పతనం ఇంకోటి కూడా ఉందండోయ్....సపోసు, ఓ పుస్తకం బాగుంటుందని ఎత్తుకెళ్ళాం, చదివాం....డోకు వచ్చింది........పెద్ద ఎత్తున కక్కాం........ఛీ జీవితం తగలెయ్య అనుకుంటారనో, పుస్తకానికి మంటెట్ట అనో, పక్కన పడేద్దామనో అనుకుంటారనో......సరిగ్గా అలాటోరి కోసం ఆ కొట్టాయన చక్కగా రిటర్ను పాలసీ పెట్టాడు....ఐతే ఓ యాభై సెంట్లో, ఓ డాలరో తగ్గించి - స్టోరు క్రెడిటు ఇస్తాడన్నమాట...ఆ స్టోరు క్రెడిటుతో ఇంకో పుస్తకం కొనుక్కోవచ్చు భేషుగ్గా! 

PPS:  అచ్చంగా ఓ పుస్తకం సబ్జెక్టులో భాగం చేసి - అందులో ఉన్న 48 పాటల్లో ఖచ్చితంగా ఓ ఇరవై నాలుగు జానపదాలు పరీక్షల్లో ఇచ్చి పిల్లల చదువు సంధ్యల మీద ప్రయోగం చేసారనీ ఆ పుస్తకం చదివాక తెలిసిన విషయం - అదీ నా హాచ్చర్యానికీ, ఆ కొచ్చెనెయ్యడానికీ కారణం....ఇప్పుడు చేతులు కీబోర్డు మీద విదల్చండి...

#Post 430#

Thursday, March 17, 2011

పాత అడంగల్ లాగా ముఖం నువ్వూనూ, సర్వే గొలుసు బిళ్ళలా పళ్ళు ఇకిలిస్తోంది!

 కృష్ణా పత్రికతో పరిచయం వున్నవారిని శ్రీ రావూరు వెంకట సత్యనారాయణరావు గారెవరంటే ఇట్టే చెపుతారు. వడగళ్ళు రాసినాయనేగా అని. ఆయన 1938లో కృష్ణాపత్రిక సంపాదక వర్గంలో చేరారు.

దాదాపు పధ్నాలుగు సంవత్సరాలు పాటు హాస్యం వ్యంగ్యం జత కలిపి " వడగళ్ళు " శీర్షికతో పాఠకులకి వింతా - వినోదం పంచిన ధన్యజీవి.

ఒకటేమిటి - ఆనాటి రాజకీయాలు, అవకతవక ఉపన్యాసాలు, మారుతున్న సాంఘికాచారాలు, నవలోకం కోరుకునే మార్పులు, మతిమరుపు వ్యక్తుల విచిత్ర గాధలు, రాజకీయాలలో రగడలు, సంస్థలలో చెలరేగే దుమారాలు, కవుల కలాలు చిలికే మీగడ తరకలు, ఇలా ఎన్నో తళుకులు మెరిపించేవారు ప్రతి శనివారం విడుదల అయ్యే కృష్ణాపత్రికలోని వడగళ్ళు శీర్షికలో.

ఆ వడగళ్ళు వ్యాస పరంపరలోని ఒక వ్యాసం - కరణాల పరిభాష (1949 మే 24 - కృష్ణా పత్రిక) నుంచి గ్రహించబడింది....

శ్రీ రావూరు వారి ఇతర వ్యాసాలు, వడగళ్ళు - వెబ్సైటులో వ్యాసావళి సెక్షన్లో చూడవచ్చు...

******************************************************************

కరణాల పరిభాష

కరణాల భాషలోనుంచి కొన్ని టెక్నిక్  పదాలు తీసుకొని వాటి ప్రయోగాన్ని వివరిస్తాను. గ్రామ లెఖ్ఖలలో, దస్తావేజులు వగైరాలలో అనుశ్రుతంగా వచ్చే ఆచారాన్ని బట్టి ఒకే భాష వాడబడుతూ వుంటుందంతటా. వాటినే కరణాలు కొత్త అర్థాలతో ఎంత సొగసుగా వుపయోగిస్తారో చూడండి.

ఒరేయ్ ! మా బావమరిది వట్టి పోరంబోకు గదురా - అంటూ వుంటాడు ప్రక్క ప్రకరణంతో. అంటే అతగాడికి దస్కత్ చేయడం తప్ప ఏమీ చేతకాదనీ, వాడి బుర్ర వట్టి ఊసరక్షేత్రమని అర్థం. ఒక రివిన్యూ ఇనస్పెక్టరును చూచి ఒక యువకరణం ' హాల్కు నూతనం గాదరా ' అన్నాడుట. అంటే ఆ సంవత్సరమే ఉద్యోగంలోకి వచ్చాడనీ, పని బాగా తెలియదనీ అర్థం. పోరంబోకులు ఆక్రమించుకొని వరిపంట వేస్తూ వుంటారు.కరణాలు వాటిని లెక్కల్లో నమోదు చేస్తూ కొత్తసాగు అయితే హాల్కు నూతనమనీ, పాతసాగు అయితే గుజస్తా సాగు అనీ పేర్కొంటారు.

మరో కరణం ' అబ్బే! ఆయన వట్టి వెట్ పాడీ, జైప్లా ఆఫ్ కెనాల్ వాటర్ గదురా ' అన్నాడుట. కరణాలు వ్రాసే అడంగుల లెఖ్ఖలలో పైవాక్యం తరుచుగా దొర్లుతూ వుంటుంది. ఏమీ ఆలోచించకుండా, గుడ్డి ఎద్దు చేలో పడ్డట్టు త్రోసుకుపోయేవాడని చెప్పడానికి పైవాక్యం ఉపయోగించాడా కరణం.

వెనుకటి ప్రాంతంలో  Crop Cut  రివిన్యూ ఇనస్పెక్టరుగారని ఒకాయన వుండేవాడట. క్రొత్తసాగులు చేసినవాళ్ళందరూ ఆయన దర్శనం చేసేవాళ్ళు. ఆయన చెయ్యి పచ్చబడగానే - పైరు వున్నాసరే, లేకపోయినాసరే వెంటనే పుస్తకం తీసి Crop Cut అని వ్రాసేవాడట.

ఒకసారి తహసిల్దారు హఠాత్తుగా వెళ్ళి ఆ పొలం తనిఖీ చేశాడుట. పైరు పకపక నవ్వుతుందట. ఇనస్పెక్టరుగారిని పిలిచి ' ఏంఇటి, Crop Cut అని వ్రాశావు, ఆ రోజు నీ క్రాఫింగు ఏమైనా కత్తిరించుకొన్నావా? అని అడిగి మూడునెలలు సస్పెండు చేశాడుట.

దస్తావేజులలో కరణాలు వాడే భాష చాలామందికి తెలుసు. వాటిలోగల హాస్యాన్ని గమనిద్దాం. ఒక కరణంగారు స్నానానికి లేవబోయి భార్యను పిలిచి - సదరు దణ్ణెమ్మీదగల గుజస్తా కొల్లాయి ఇలా పారెయ్యి అన్నాడుట.

మరొక కరణంగారి భార్య కొంచెం గయ్యాళి కాబోలు...పిల్లల్ని పట్టుకొని కొట్టి విడిచింది. ఇంతలో తండ్రి వచ్చాడెక్కడినుంచో...పిల్లలు చుట్టిముట్టి ఏడ్చారుట. ఆయన భార్య దగ్గరికి వెళ్ళి గట్టిగా పోట్లాడాడు. ఆవిడ పిల్లల జోక్యం మీకెందుకు వెళ్ళమందిట. ' ఎందుకా! ఒకటి, రెండు, మూడు కుమారులు మైనరులైనందున గార్డియన్ తండ్రి రామకృష్ణయ్యను కాబట్టి ' అని గట్టిగా అరిచాడుట.

ఒక కరణం మిత్రుడు నాకొక డైరీ ప్రెజెంటు చేశాడు. దానిలో ఇలా వ్రాయబడి వుంది. " నీ పుత్రపౌత్రపారంపర్యంతం, దానాదమన విక్రయాది సమస్త హక్కులతో బహూకరించబడింది - కాంతారావు - కరణం '

ఒక కరణంగారిని ' మీకెందరు పిల్లలంటే' ' పరక మామిడి పండ్లు కొంటే మూడు పదులకు ఒకటి మిగులుతుంది - అదైనా ప్రస్తుత పరిస్థితి. ముందు సంగతి చెప్పలేం ' అన్నాడు.

నౌకర్ల మీద కరణాలకు కోపంవస్తే వాణ్ణి తిట్టేతిట్లు ఏమిటో తెలుసా - క్రాస్ స్టాఫ్ లాగా ముఖం నువ్వూనూ పో అవతలికి,  గైరుహాజరు ఘటం - బట్వాడా బడుద్దాయి. ఆ కరణంగారే భార్యను తిట్టవలసివస్తే - ' పాత అడంగల్ లాగా ముఖం  నువ్వూనూ, సర్వే గొలుసు బిళ్ళలా పళ్ళు ఇకిలిస్తోంది. ఫో...స్టోన్ లాగా అలా నిలబడతావేం...ఇత్యాదులు...వీరిలో హాస్యం వర్ణించాలంటే చాలావుంది.

క్రాస్ స్టాఫ్ - పొలాలు కొలిచేప్పుడు లైను సూటిగా చూసేందుకు వుపయోగించే సాధనం.

అడంగులు - ప్రతి సంవత్సరం సాగు వివరాలు, విస్తీర్ణం తెలియజేసే పుస్తకం.

(1949 మే 24 - కృష్ణా పత్రిక)

********************************************************************

Wednesday, March 16, 2011

తెలుగులో రాయించొచ్చుగా....ఓ అవునా, నాకు తట్టలేదు..తమరు భలే చెప్పారే!

ప్రతిరోజు లాగే ఓ కథ వినిపిస్తూ ఓ కాయితం ఇచ్చి ప్రయోగం చేసా....సఫలం అయినట్టే కనపడింది.... ఐదేళ్లకు ఫరవాలా అనిపించింది.... :) కూతురు పనులు బావున్నాయనిపించకపోతే ఇంకెవరివి బావుంటాయి?

ఆ కాయితం అయిపోగానే - నాన్నా, అయిపోయింది అంటే ఇంకో కాయితం ఇచ్చా, అది కూడా అయిపోయాక మూడోది ఇచ్చా! మూడో దాని మీద మూడు లైన్లు రాసాక, యెహ్హా ఇంకేం రాస్తాం అనుకుందో ఏమో That's the end of the story. Ok bye అని ఆ పేపర్లు, పెన్సిలు, రబ్బరు నా మీద పడేసి పోయింది...

తెలుగులో రాయించొచ్చుగా....ఓ అవునా, నాకు తట్టలేదు...తమరు భలే చెప్పారే!

అ నుంచి అః వరకే వచ్చు..."క చ ట త ప" లు రాయటం ఇంకా రాలా... అందుకు.... :)


సరే సోది ఆపుతా, కథ చదూకోండి...పై కాయితాల్లో తప్పులు పట్టుకుని, ఒప్పులు చెబితే వీరతాళ్లు బహూకరించబడతాయి...


నా సాయం ఈ మూడు పేజీల్లో రెండు పదాలు - Creaked , Squeaked - ఈ రెండూ నా నోట్టోనుంచి రాగానే తలెత్తి, కళ్లు చిన్నవి చేసి, చిరాగ్గా పెట్టి, పెన్సిలు నా వంక నిటారుగా చూపిచ్చి  - I don't know how to write it అనగానే , గుండె కరిగిపోయి .....పోయీ.....సాయం చేసానన్నమాట ...అదండీ....

ముందు - కథ తన చేతే సదివిచ్చండి, తర్వాత పుస్తకం తనకు కనపడకుండా బయటకు బిగ్గరగా మీరు సదవండి, పేపర్లిచ్చి రాయమనండి...

Sunday, March 6, 2011

"ఎన్నిక ఒక కళ" - అవును నిజం!

"ఎన్నిక ఒక కళ" - అవును నిజం!

"ద ఆర్ట్ ఆఫ్ ఛూసింగ్" అన్న పుస్తకం చదివి ఎంత అబ్బురపడ్డానో, టెడ్.కాం లో ఈ రోజు ఆ పుస్తక రచయిత్రి షీనా అయ్యంగార్ ప్రసంగం విని, చూసి అంతే అబ్బురపడ్డా. ఆ వీడియో చూడాలనుకున్నవాళ్లకి లంకె ఇక్కడ......

http://www.ted.com/talks/lang/eng/sheena_iyengar_on_the_art_of_choosing.html

చూసాక మీకు ఏమనిపించిందో ఓ ముక్క కామెంటుగా రాయండి

భవదీయుడు
వంశీ

PS: Sheena Iyengar is a psychoeconomist and professor at Columbia Business School. She is Research Director of the Chazen Institute and author of "The Art of Choosing." and BTW - she is blind!